సంచిక – స్వాధ్యాయ – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రసిద్ధ రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘దత్త కథాలహరి’ పుస్తకావిష్కరణ 16 అక్టోబరు 2022 నాడు నారపల్లిలోని స్వాధ్యాయ లైబ్రరీ హాల్ లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది.
మొదటగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ రచయితలను, వక్తలను సభకు పరిచయం చేసి పుస్తక ప్రయోజనాన్ని వివరించారు.
ప్రముఖ రచయిత్రి శ్రీమతి తమిరిశ జానకి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కొన్ని కథలని ప్రస్తావించారు. శర్మ గారి రచనా శైలి సరళంగా ఉండి, ఆసక్తిగా చదివిస్తుందని అన్నారు.
అనంతరం కొల్లూరి సోమ శంకర్ ఈ పుస్తకంలోని 30 కథలను పరిచయం చేశారు.
తరువాత ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి నండూరి సుందరీ నాగమణి పుస్తకాన్ని సమీక్షించారు. తనకు నచ్చిన కథలని మెచ్చుకుంటూ, కొన్ని కథల లోని అంశాలతో తాను రచయితతో ఏకీభవించనని పేర్కొన్నారు. అయితే అవి తన అభిప్రాయాలనీ, కనుక వాటిని మంచి కథలు కావు అని అనలేనని అన్నారు. మొత్తం మీద ప్రయోజనాత్మక రచనలని విశ్లేషించారు. అయితే పుస్తకంలో వియష సూచిక లేకపోవడం ఆశ్చర్యపరిచిందని అన్నారు.
తదనంతరం రచయిత తన స్పందనని వెలిబుచ్చారు. ఈ కథలు వ్రాయడంలో తన ప్రేరణని వివరించారు. కొన్ని కథలకు తన జీవితంలోని సంఘటనలే ఆధారమని అన్నారు. కొన్ని కథలలో కథానాయకుడు తానేనని ముఖ్యంగా ‘వంటొచ్చిన మొగుడు’ కథలోని పాత్ర తానేనని.. తన శ్రీమతి తన వంటని మెచ్చుకుంటారని ఛలోక్తి విసిరారు. పుస్తకంలో విషయ సూచిక లేకపోవడం పొరపాటేననీ చెప్పారు. సమీక్షకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు తన సమాధానాలు చెప్పారు
శ్రీ కోవెల సంతోష్ కుమార్ సభికులకు ఆతిథ్యమిచ్చి, ఈ కార్యక్రమాన్నంతా రికార్డు చేశారు.
సభానంతరం రచయిత వక్తలకు శాలువా కప్పి సత్కరించారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.