[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘డేటింగ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ పల్లెటూర్లో రామలింగేశ్వరరావు ఓ మోస్తరు రైతు. ఇద్దరు కూతుళ్లు. చంద్రిక, రాధిక, కొడుకు గణపతి. తల్లి భ్రమరాంబ. భార్య గౌరి.
గణపతికి చదువు వంటబట్టలేదు. తండ్రితో బాటు వ్యవసాయం చేసుకుంటూ.. దానితోపాటు ఊబకాయం కూడా పెంచేశాడు బుద్ధావతారంలా. రోజూ పక్కనున్న టౌన్ కెళ్ళి హోటళ్ళకి పాలు పోసివస్తుంటాడు. భ్రమరాంబ బామ్మకి మాత్రం వీర విధేయుడు.
చంద్రిక ఇంజనీరింగ్ చదివింది. జాబ్ ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్. రాధిక ఇంటర్ చదువుతోంది.
భ్రమరాంబకి వళ్ళంతా కళ్ళే. పాము చెవులు. మనుమరాళ్ళ ప్రతి మూమెంట్ గమనిస్తూనే ఉంటుంది. నోరు పెద్దది.
సెల్ఫోన్‌లో డేటింగ్ యాప్‌లో చూసిన కుర్రాళ్ళల్లో, తనకి ఇంజనీరింగ్‌లో సీనియర్ అయిన పక్క ఊరు రవితో.. సుదీర్ఘ చాటింగ్ అనంతరం.. డేటింగ్ ఫిక్స్ చేసుకుంది చంద్రిక.
మరో పక్క రామలింగేశ్వరరావు తల్లి బాధపడలేక పెద్ద కూతురు చంద్రికకి అడపా దడపా పెళ్ళిసంబంధాలు తీసుకొస్తున్నాడు.
***
బామ్మ డేగ చూపు, పాము చెవుల నుంచి తప్పించుకుని, ఆ రోజు పక్క ఊరు రవితో డేటింగ్‌కి బయటికెళ్ళింది చంద్రిక. అయినా బామ్మ పెట్టిన డిటెక్టివ్ నుండి తప్పించుకోలేకపోయింది.
చంద్రిక, రవి కలుసుకున్న రెస్టారెంట్‌కి పాలు పోయడానికి వెళ్ళిన డిటెక్టివ్ గణపతి కంట్లో బడ్డారు ఇద్దరూ.
ఎలాగైనా ఈ వార్త ఇంట్లో బామ్మ చెవికి చేరవేయాలని కడుపుబ్బరంతో గణపతి ఫిక్స్ అయిపోయాడు.
పొద్దున వెళ్ళిన చంద్రిక సాయంత్రం వరకూ ఇంటికి రాకపోయేసరికి వీధి అరుగు మీద కూర్చుంది భ్రమరాంబ.
మరో అరుగు మీద రాధిక కూర్చొని చదువుకుంటోంది.
“వెన్ ఇండియా గెట్ ఇండిపెండెన్స్?”
“హిస్టారికల్లీ ఇట్ వజ్ 1947. బట్ సైంటిఫికల్లీ వెన్ దిస్ ముస్లీస్ (ముసలాళ్ళు) డైడ్ ఓన్లీ.. ఇండియా విల్ గెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండిపెండెన్స్” అని చదువుతూ.. భ్రమరాంబ వైపు చూసింది.
“ఏంటే! ఏదో తేడాగా చదువుతున్నావు?”అంది కాలక్షేపం కోసం చేగోడీలు నవులుతున్న భ్రమరాంబ.
“అదేం లేదు బామ్స్, చేగోడీలు కొంచెం నాక్కూడా పెట్టొచ్చుగా” అంది.
“ముందు పుస్తకం చూసి సరిగ్గా చదువు” అని కసిరింది భ్రమరాంబ.
అంతలో రోడ్డుమీద “హేయ్.. హేయ్..” అని అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరో వస్తున్న శబ్దం విని రోడ్డు మీదకు వచ్చింది భ్రమరాంబ.
ఓ బైక్ భ్రమరాంబ దగ్గరికి రాగానే.. వెనుక కూర్చున్న అమ్మాయి చున్నీ తీసి భ్రమరాంబ మొహం మీద పడేసింది. బైక్ వేగంగా ముందుకు దూసుకెళ్లిపోయింది.
“ఎవర్రా అది?! ఈ ఊర్లో నా మోహాన గుడ్డేసి తప్పించుకు వెళ్తోంది..” అని పెద్దగా అరుస్తూ బైక్ వెళ్లిన వైపు చూడసాగింది.
చదువుకుంటున్న రాధిక వేగంగా పరిగెత్తుకొచ్చి రోడ్డు మీద వేగంగా దూసుకొస్తున్న కారుని చూసుకోకుండా రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ భ్రమరాంబను స్పీడుగా వెనక్కి లాగింది.
అది గమనించని భ్రమరాంబ రాధిక గుంజున గుంజుడికి పడ్డది.
కోపంగా “ఓసి నీ మొహం మండ.. ఎందుకే నన్ను లాగుతున్నావు. నీకే పోయేకాలం”అంది.
“పోయేకాలం నాకు కాదు నీకు. క్షణంలో నేను రాకపోతే కారు కింద పడి పైకి పోయేదానివి.”
భ్రమరాంబ మూలుగుతూ లేచి నిలబడి..”అవునా,. ముందే చెప్పి చావచ్చుగా.. అమ్మా.. అబ్బా.. కాలు నొప్పి పుట్టింది”
“సర్లే.. రా వచ్చి అడుగు మీద కూర్చో”
అరుగు మీద కూర్చొని చేతిలో చున్నీ రాధిక చూపించి “ఇది మన చంద్రిక చున్నీలాగా లేదూ? అంటే.. బైక్ మీద వెళ్ళింది చంద్రికే అన్న మాట”
“అన్నమాటో.. ఉన్నమాటో.. నేను కొంచెం ఆలస్యంగా వచ్చుంటే నీ కోసం వచ్చిన యమ భటులు నిన్నీపాటికి నరకంలో యమధర్మరాజు ముందు నిలబెట్టేవాళ్లు”అంది రాధిక.
“నీకేం పోయేకాలం వచ్చిందే.. నరకానికి పొమ్మంటున్నావ్.. పాపిష్టి దానా?” విసుక్కుంది బామ్మ.
“బామ్మోయ్! ముందు నరకానికి పోయాకే తర్వాత స్వర్గంలోకి ఎంట్రీ దొరుకుతుంది. ఈమధ్య రూల్స్ మార్చారు.. తెలియదా?”
“పక్షీ! నువ్వేమన్నా వెళ్లి చూసి వచ్చావా?”
“ఆఁ.. యమగోల సినిమా చూడలా?” అంది వెటకారంగా రాధిక.
“నీతో నేను వాగలేను లేను కానీ.. ఈ చున్నీ మీ అక్కదే కదా? చంద్రిక నా కంట పడకుండా బైక్ మీద మగపిల్లలతో తిరుగుతోందన్నమాట. ఇంటికి రానీ! దాని పని చెప్తా!” కుంటుతూ లోపలికి వెళ్ళింది భ్రమరాంబ.
అప్పుడే వచ్చిన చంద్రిక ఇంట్లోకి వెళ్తుంటే..
“ఏయ్.. ఆగు. ఈ చున్నీ నీదే కదా!” అంది.
“నాదని ఎవరు చెప్పారు నీకు?”
“మరి నీ చున్నీ ఏది?”
“వేసుకెళ్లలేదు”
“చున్నీ లేకుండా బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఇది నీది కాకపోతే మరి ఎవరిది ? నాకా మాత్రం తెలియదనుకున్నావా?”
“నాది కాదంటే వినవేంటి బామ్మా!” విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది చంద్రిక.
రాధిక వేగంగా వచ్చి
“బామ్మోయ్! నీకు సైట్ పెరిగింది కానీ.. నిన్ను రేపు కంటాసుపత్రికి తీసుకెళ్తా. కళ్ళు టెస్ట్ చేయించుకుని.. లెన్స్ కార్ట్‌లో మంచి కళ్లద్దాలు వేయించుకో”అంది.
“నిన్ను చదువుకోమంటే, మాట్లాడితే నా వెనకే తిరుగుతావెందుకే? ఫో.. పోయి చదువుకో..” కసిరింది బామ్మ.
దొడ్లో భ్రమరాంబ తాడు మీద ఆరేసిన బట్టలు మడత పెట్టుకుంటోంది.
“బామ్మా! బామ్మా!! బామ్మోయ్” ఆయాస పడుతూ పెద్దగా అరుస్తూ బ్రమరాంబ దగ్గరకొచ్చాడు గణపతి.
“ఏంట్రా ఏమైందిరా? పిచ్చ సచ్చినోడా! నీ అరుపుకి భయపడి చచ్చాను గదరా! ఏమైందో చెప్పి తగలడు”
“బామ్మా! మరేమో.. మన చంద్రిక ఓ కుర్రాడితో డేటింగ్‌కి వెళ్ళటం.. ఈ రెండు కళ్ళతో చూశాను..” అన్నాడు కళ్ళు పెద్దవి చేసి.
“ముందా కళ్ళు చిన్నవి చేయరా బాబూ! దడుచుకు ఛస్తున్నాను.”
వెంటనే వేగంగా కళ్ళు చిన్నవి చేశాడు గణపతి.
“ఏంటో?!? ఇప్పుడు చెప్పు”
“డేటింగ్ బామ్మా!.. డేటింగ్”
“అంటే?!?”
“అదే బామ్మా! పెళ్లి కాకముందే అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి తిరగటం”
“డేటింగో.. మీటింగో.. పిల్ల భద్రంగా ఉంటే చాలు. అవునూ.. చంద్రిక ఎవరితో తిరిగిందో ఫోటో తీసావా” అంది.
వెంటనే సెల్ ఫోన్‌లో తీసిన రవి, చంద్రికలు రెస్టారెంట్‌లో కూర్చుని ఒకే కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసుకుని తాగుతున్న పిక్, బైక్ మీద వెళ్తున్న పిక్ చూపించాడు గణపతి.
అంతే! భగ్గుమంది భ్రమరాంబ.
“రేపే వాడిని, వాడి కుటుంబాన్ని మన ఊరి గుళ్లోకి తీసుకురా రా!” అని డిటెక్టివ్ గణపతికి ఆర్డర్ వేసింది తీవ్ర స్వరంతో భ్రమరాంబ.
“అలాగే..” అని వెళ్ళబోతున్న గణపతిని పిలిచి
“ఒరేయ్ డేటింగ్ అంటే ఏంటో మళ్లీ చెప్పరా?” అంది.
“రా చూపిస్తా! అని అని బామ్మని వెంటపెట్టుకుని ఇంటికి దగ్గరలో ఉన్న మొక్కజొన్న చేనుకి తీసుకెళ్లాడు.
అక్కడ ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేలో ఓచోట చెట్లు కదులుతుంటే ఆగి “ఇప్పుడు చూడు”అన్నాడు అసలు డిటెక్టివ్ లా.
భ్రమరాంబ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే లోపలి నుంచి తోట యజమాని మొక్కజొన్న చేలో నుంచి గొడ్లకి గడ్డిమోపు నెత్తిన పెట్టుకొని బయటికి వచ్చాడు.
“ఇదంట్రా!!! డేటింగ్ అంటే!? సచ్చినోడా!” అంది బామ్మ కోపంగా.
“ఇప్పుడంటే ఏదో గురి తప్పింది కానీ ఇంకో చోటుంది రా!” అని బామ్మ చేయి పట్టుకుని ఓ ఫర్లాంగ్ నడిపించి.. పంప్ షెడ్ ఉన్న పొలం దగ్గరికి తీసుకెళ్లాడు.
“ఇదేం డేటింగ్ రా! ఏదో చూపిస్తావని.. వస్తే మొక్కజొన్న చేను, పంపు షెడ్డూ.. చూపిస్తావేంట్రా? మైండ్ లేని ఎదవా?” అంది.
పంపు షెడ్ నే చూస్తూ.. ఒక్క సెకను ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్లి.. వేగంగా తిరిగి వచ్చి “ఓస్! ఇంతేనా డేటింగంటే.. ఆ కాలంలో..” ఏదో అనబోయి ఆగిపోయింది.
“ఆ కాలంలో నువ్వూ డేట్ చేసావా? ఏంటి? కొంపదీసి..” అని కంగారుగా అడిగాడు గణపతి.
వెంటనే బామ్మ సంబాళించుకుని “నువ్వు నీ డేటింగూ.. నీ మొహం లాగే నీ తెలివితేటలు ఏడ్చాయి. చూపించింది చాల్లే.. ఇంటికి పద” అంది.
అంతలో పంపు షెడ్‌లో నుంచి ఓ నడి వయసు జంట.. వేగంగా బయటికి వచ్చి.. వెనకనుంచి పారిపోయారు.
బామ్మ అవాక్కై చూస్తూ.. పాత జ్ఞాపకాలని బలవంతంగా బయటికి నెట్టి..”చూసింది చాల్లే పద పద..” అంది
***
మరుసటి రోజు ఉదయం పది గంటలప్పుడు చంద్రిక బయటకు వెళ్లబోతుంటే.. బలవంతంగా ఆపింది భ్రమరాంబ.
“నువ్వెక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు. నీకోసం గుళ్లో పూజ చేస్తానని మొక్కుకున్నా..” అని అందరినీ తీసుకొని గుడికి వచ్చింది.
అప్పటికే అక్కడ గణపతి రవి కుటుంబాన్ని తీసుకొచ్చాడు.
“బామ్మా! వాడే – వీడు రవి. వీళ్ళు వాడి అమ్మా, నాన్న. వీళ్ళది మన పక్కూరు చక్రాపురం” అన్నాడు.
చక్రాపురం అనగానే బామ్మ ఆశ్చర్యంగా చూసింది. ఆమె మొహం ఎర్రబడ్డది.
వెంటనే సీను అర్ధమైన చంద్రిక, రవి అలర్టయ్యారు.
“బామ్మా! నేను కాలేజీకి వెళ్ళాలి. మార్క్స్ మెమో ఇస్తున్నారంట. వెళ్లి తెచ్చుకోవాలి” అంది.
అంతే! చంద్రిక చెంప మీద ఒక్కటేసింది బామ్మ.
“ఏయ్! చంద్రికా! నువ్వు వీడితోనే గదా! కలిసి తిరుగుతోంది” అని గణపతి వైపు తిరిగి “అదేంటిరా.. గణపతీ, డార్లింగా?”
“కాదే బామ్మా! డేటింగ్.. డేటింగ్..” బామ్మ చెవి దగ్గర పెద్దగా చెప్పాడు గణపతి.
“ఏం కర్మమో! నువ్వూ, వీడితో బైక్ మీద వెళ్ళటం నా కళ్ళతో చూశాను. వీడినే కదా! హోటల్లో కలిశావు. అందుకే వీడితోనే నీకు పెళ్లి” అని బామ్మ ఆవేశంగా అంటుంటే..
రవి తండ్రి ముందుకొచ్చి “ఏమైంది బామ్మ గారూ!” అన్నాడు ఇన్నోసెంట్‌గా.
“ఆఁ.. దొంగలు పడ్డ ఆరు నెలలకి ఏదో సౌండ్ వచ్చిందట.. కొడుకు ఏం చేస్తున్నాడో ఆ మాత్రం తెలీదా!?” అంది రాధిక వెటకారంగా.
“ఏయ్.. నువ్వాగవే..” అని రవి తండ్రి వేపు తిరిగి..
“ఏమైంది ఏంటి? వీళ్లిద్దరూ మన కళ్ళు కప్పి పెళ్లి కాకముందే అడ్డమైన తిరుగుతూ.. బైక్ మీద చక్కెర్లు కొడుతున్నారు! వీళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే న్యాయం. ఒకవేళ అలా జరగకపోతే.., దీనికి మరొకరితో పెళ్లయి, వీడికి మరో అమ్మాయితో పెళ్లి అయితే.. అక్కడ ఈ విషయాలు తెలిస్తే.. దీని బతుకేం గావాలి?” దీర్ఘం తీసింది బామ్మ
“ఏంట్రా! ఇందుకా నిన్ను చదివించింది?”అని చెంప మీద ఒక్కటెయ్యబోయాడు రవి తండ్రి.
తండ్రి చెయ్యి ఒంటిమీద పడకుండా గట్టిగా పట్టుకుని..
“నాన్నా! ఆపు.. నాన్నా!! ఒకే కాలేజీలో చదువుకున్నాం కాబట్టి కలిసి మాట్లాడుకున్నాం.. అంతే! ఆ బామ్మ అంటున్నట్టు మా మధ్య ఏం లేదూ!” అన్నాడు.
“రేయ్! నీకు మా చెల్లెలు కూతురితో పెళ్లి ఫిక్స్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎదవ్వేషాలు ఏంట్రా!” అని మళ్లీ చెయ్యెత్తాడు రవి తండ్రి.
“ఒరేయ్ గణపతి ఏంట్రా ఇది? వాడు.. ఏం లేదంటున్నాడు?” అర్థం కానట్టు అడిగింది బామ్మ.
“దీనికి ఇంకా డేటింగ్ బాయ్ ఫ్రెండ్స్, వీడికి ఇంకా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బామ్మా! వాళ్లను కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను.”
“ఆఁ..హా! స్వయంవరం జరగబోతుందన్నమాట. అయితే నేను కూడా రెడీ” అంది రాధిక తండ్రి భుజం మీద ఉన్న టవల్ తీసుకొని ఓణీలా వేసుకొని.
“నువ్వు నోరు మూసుకోవే” అంది భ్రమరాంబ కోపంగా.
బామ్మ బొట్లో నుంచి పసుపుతాడు తాళి తీస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా క్లోజప్‌లో చూస్తున్నారు.. ఎక్సెప్ట్ గణపతి.
చంద్రిక, రవి ఒకరినొకరు భయం భయంగా చూసుకుంటున్నారు.
“బా.. మ్మా!” పెద్దగా అరిచింది చంద్రిక.
“ఏంటే!.. ఆ కాలంలో మేము ఫలానావాడిని పెళ్లి చేసుకోమంటే నోరు మూసుకొని తాళి కట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు పెళ్లికి ముందే అన్నీ ముగించుకుని.. రేపు వాడు.. వీడు కాదంటే.. మరొకడితో తాళి కట్టించుకుంటావా?”
“అసలు ఈ సెల్ ఫోన్లు వచ్చాకే పిల్లలు ఇలా బ్రష్టు పట్టిపోతున్నారు బామ్మగారూ!” అన్నాడు రవి తండ్రి.
“ఆఁ.. ఫోన్ లేకపోతే ఈయన మన సాంప్రదాయానికి ఫెన్సింగ్ చేసి కాపలా కాసేవాడు” అంది రాధిక వ్యంగ్యంగా.
“నిన్ను నోరు మూసుకోమన్నానా?” బామ్మ గుడ్లురిమింది.
“బామ్మ గారూ! మేము ఊరికే మాట్లాడుకోవడానికే వెళ్లాం. తప్ప మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు. మాది మీరు అనుకునే లవ్ కాదు” మళ్లీ నొక్కి చెప్పాడు రవి.
“మాట్లాడితే చాలు కాబోయే బ్రదరిన్లా.. దీన్నే లవ్ అంటారు!.. ఇంజనీరింగ్ చదివిన నీకు ఇది కూడా తెలియదా!” గణపతి ఏదో ఫ్లో లో చెప్పేశాడు.
“వీడో పెద్ద న్యూరాలజిస్ట్. లవ్ కి డెఫినేషన్ చెప్పాడు అందరూ వినండి” అంది రాధిక.
“నిన్ను నోరు మూసుకోమన్నా!” రాధికని హెచ్చరించింది బామ్మ.
“బామ్మా! ప్రేమ వేరు. డేటింగ్ వేరు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.” అంది చంద్రిక.
“ఏది ఏరో, ఏది వాగో నాకు తెలుసు.”
‘ఆ కాలంలో మేము చూడని మొక్కజొన్న తోటలా! పంపు షెడ్డులా’ అనుకుంది మనసులో బామ్మ.
అంతలో రామలింగేశ్వరరావు ఏదో చెడ్డ మాట విన్నట్టు చెవులు మూసుకుని “దేవుడా! దేవుడా!!” అంటుంటే రాధిక తండ్రి దగ్గరికి వచ్చి
“నాన్నా! అవి బూతుమాటలు కావులే. మామూలుగానే నీకు వినికిడి తక్కువ. ఇంకా చెవులు మూసుకుంటే అసలేమీ వినపడదు”అంది.
“బామ్మ గారూ! చంద్రికతో పది నిమిషాలు మాట్లాడొచ్చా?” అడిగాడు రవి.
“పది నిమిషాలు ఏంటి?!? పది గంటలైనా మాట్లాడుకో”
“బామ్మోయ్.. వాళ్లని నువ్వే డేటింగ్‌కి పంపిస్తున్నావే.. ఇప్పుడు.. ఇప్పుడు మోడరన్ బామ్మవి అయ్యావు” అంది రాధిక.
“ఇదిగో అబ్బాయ్! ముందు తాళి కట్టు.. ఆ తర్వాత రోజులేంటి.. జీవితాంతం మాట్లాడుకోండి..” అని మెలిక పెట్టింది బామ్మ.
“డేటింగ్.. డేటింగ్..” ఏదో వినకూడనిది విన్నట్టు అని మళ్ళీ చెవులు మూసుకుని రామలింగేశ్వర రావు ప్రదక్షిణ తిరుగుతూ.. “అర్జునా, ఫల్గుణా, పార్థా, కిరీటీ..” అంటుంటే..
“డాడీ! ఓ లూజ్ డాడీ!! అది ఉరుములు మెరుపులు వస్తే అనే మాటలు. డేటింగ్ అంటే మేటింగేం కాదు” అంది చిరాగ్గా చంద్రిక.
“అయ్యో! అయ్యో!! అయ్యయ్యో!!! కాలానికి తగ్గట్టు అప్డేట్ జ్ఞానం లేని కుటుంబంలో నన్నెందుకు పుట్టించావు దేవుడా!” అంది రాధిక దీర్ఘం తీస్తూ.
“రేయ్ గణపతీ! ముందు దీని నోరు కట్టెయ్యరా!” అంది బామ్మ.
వెంటనే గణపతి భుజం మీద తుండుతో రాధిక చేతుల్ని, కర్చీఫ్ తో నోటిని కట్టేశాడు.
“రేయ్ గణపతీ, చంద్రికని, ఆ అబ్బాయిని ముందుకు లాగరా!” బామ్మ అనగానే..
అటు రవిని, ఇటు చంద్రికని ముందుకు లాగుతుంటే.. వాళ్ళు గింజుకుంటున్నారు.
చంద్రిక విదిలించుకుని, “ప్రదక్షిణాలు తిరిగింది చాలు డాడీ! ఆపు. అసలు నీకు బ్రెయిన్ ఉందా? డేటింగ్ అంటే ఏంటో తెలియకుండా ఇంత లొల్లి చేస్తుంటే పట్టించుకోకుండా ప్రదక్షిణాలు చేస్తావేంటి”అంది.
“చంద్రికా! తండ్రినని గౌరవం కూడా లేకుండా నాకు లేని దానిని గురించి అందరి ముందూ ఇలా.. అవమానిస్తావా?” అన్నాడు చిన్న బుచ్చుకుని.
“డాడీ! నువ్వు రోజుకో పెళ్లి సంబంధం చూస్తున్నావే ఇదీ అలాంటిదే. వారానికో సంబంధాన్ని ఇంటికి తీసుకొచ్చి ‘చంద్రికా! అబ్బాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే.. డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకోండి!’ అంటావే.. ఇదీ అలాంటిదే” అంది కోపంగా
“అంకుల్! మీరు పెళ్లిచూపులు చూస్తున్నారే.. దానికి అడ్వాన్స్డ్ వెర్షనే డేటింగ్. పెళ్లిచూపుల్లోలా స్వీట్లూ, పూలూ, పళ్ళు ఉండవు అంతే తేడా!” అన్నాడు రవి.
“ఓ! అంతేనా! నేను ఇంకేంటో అనుకుని గాభరా పడ్డా!”
అంతలో.. అక్కడికి ఓ ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి పాతకాలపు పంచె కట్టులో హుందాగా వస్తున్న రవి తాత చలపతిని చూడగానే.. గుర్తుపట్టింది భ్రమరాంబ. అప్పటిదాకా చేసిన ఆర్భాటం, హడావుడి ఒక్కసారిగా మ్యూట్ అయిపోయి, ఆయనను చూడగానే నోటికి ప్లాస్టరేసినట్టు ఆగిపోయింది.
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే..’
ఆ రోజుల్లో పాడుకున్న పాతకాలపు పాట, మొక్కజొన్న తోట, పంపు షెడ్డు.. ఎన్నో ఏళ్లుగా ముడుచుకు పోయిన జ్ఞాపకాల మొగ్గలు ఒక్కొక్కటిగా భ్రమరాంబ మనసులో విచ్చుకోసాగాయి.
చలపతి కూడా భ్రమరాంబను చూసిన సంతోషంతో.. ముసి ముసిగా నవ్వి..”నువ్వా !? భ్రమరం.. ఎవరో అనుకుని వచ్చాను. ఎలా ఉన్నావు? ఎన్నేళ్ళ తర్వాత చూశాను నిన్ను” అన్నాడు ఆ కాలపు ప్రేమనంతా గొంతులో పలికించి.
అంతే! భ్రమరాంబ మొహం ఒక్కసారిగా వంద ఫ్లడ్లైట్లు వెలిగినట్టు కాంతితో వెలిగిపోయింది.
“మీరు బాగున్నారా?” అంది సిగ్గు.. సిగ్గుగా..
మేటర్ పసిగట్టిన రాధిక “బామ్మోయ్! డేటింగ్ అంటే ఇప్పుడు అర్థమైందా? ‘మొక్కజొన్న తోట, పంపుషెడ్డేగా!’ అని నువ్వనగానే.. నీకూ ఏదో సంథింగ్.. సంథింగ్ ఉందని అర్థం అయిపోయింది” అంది.
“నోరు ముయ్యి. నిన్నూ!” అంది చలపతి ముందు సిగ్గుపడుతూ.
అక్కడున్న వాళ్లంతా చలపతిని భ్రమరాంబని వింతగా చూస్తుంటే.. గణపతి గాభరాగా “బామ్మా! బామ్మా!! చంద్రిక, రవి మళ్ళీ బైక్ మీద జంపయ్యారే” అని పెద్దగా అరిచాడు.
భ్రమరాంబ వేగంగా మళ్ళీ రోడ్డు మీదకు పరిగెత్తింది.
రెండు నిమిషాల తర్వాత అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టి.. వేగంగా భ్రమరాంబ దగ్గరికి పరిగెత్తారు.
రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ భ్రమరాంబని స్పీడుగా వస్తున్న బైక్ గుద్ది వెళ్ళింది.
“దెబ్బలు ఏమైనా తగిలాయా భ్రమరం” అని చలపతి పరామర్శించగానే.. ఆ కాలంలో వాళ్ళిద్దరి మధ్య పెళ్లికి ముందు సాగిన ప్రేమాయణం పేరే ఇవ్వాళ డేటింగ్ అంటున్నారని అర్థమైన భ్రమరాంబ సిగ్గుగా, ముభావంగా..
“లేదు” అని లేవలేక లేవబోతుంటే.. చెయ్యందించబోయాడు చలపతి.
వద్దని పక్కనున్న రాధిక సాయంతో లేచి నుంచుంది భ్రమరాంబ.
“వెళ్ళొస్తాను” అని చెప్పి మరీ చలపతి వెళుతుంటే.. మౌనంగా తల ఊపింది భ్రమరాంబ.
పక్కనే ఉన్న రాధిక బామ్మని పట్టుకొని..
“సంథింగ్.. సంథింగ్.. సంథింగ్.. సంథింగ్. సంథింగ్ దేరీజ్ సంథింగ్..” అంటూ ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా!’ సినిమాలో పాట అందుకునేసరికి..
“నోరు ముయ్యివే చిచ్చర పిడుగా” అంది భ్రమరాంబ ఇంటి వైపు నడుస్తూ.
ఎం. వెంకటేశ్వర రావు చక్కని కథా రచయిత. మంచి నవలా రచయిత. “అదివో… అల్లదివో!” వీరి కథా సంపుటి. ఇటీవలి కాలంలో “విజయ విలాసం” పేరిట వ్యక్తిత్వ వికాసం సంబంధిత వ్యాసాలు కూడా రాస్తున్నారు.