[శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి శతజయంతి సందర్భంగా శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారి ‘దాశరథీ శతకం – కవిత్వ పరామర్శ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
అభ్యుదయ చైతన్య కవిత్వ శరథి దాశరథి రాసిన ‘దాశరథీ శతకం’ తెలుగులో ఆ పేరిట వెలసిన రెండవ శతకం. మొదటిది భద్రాచల రామదాసు రాసిన ‘దాశరథీ శతకం’. ఆ శతకం రాముడు వెలసిన భద్రాచలాన్నీ, రాముని వేడుకొన్న రామదాసునూ జగత్ ప్రసిద్ధం గావించింది. రామదాసు శతకం భక్తి ప్రధానమైనది. దాశరథి గారి శతకం వ్యంగ్య ప్రధానమైన సామాజిక శతకం.
దాశరథి గారు రచించిన శతకంలో స్వయంగా వారి పేరు కూడా యిమిడి ఉండడం విశేషం. కవి గారి మిత్రులైన శ్రీశ్రీ గారు శతక పద్యాల మకుటాన్ని ‘దాశరథీ కవితా పయోనిధీ’గా ఉంచమని సూచించారు. కాని ఆ మకుటం స్వోత్కర్షను చూపుతుందేమోనని, వినమ్ర బుద్ధితో దాశరథీ కరుణా పయోనిథీ గానే ఉంచారు. తమ శతకాన్ని భద్రాద్రి రామునికి అంకితం చేసారు.
దాశరథి గారు శతక పద్యాలను ఏ ఒక్క వ్యక్తినీ ఉద్దేశించి రాయకపోయినా, ఏ కొందరికైనా ఆత్మవిమర్శను కలిగించక మానవు. ఈ శతకం నేటి సమాజాన్ని సహేతుకంగా విమర్శిస్తుంది. వ్యక్తిగా కవికీ సంఘానికీ గల సామరస్యాన్ని నవ భావనా దృష్టితో వివేచిస్తుంది. సామాన్య మానవ స్వభావాకి నర్మగర్భంగా అన్వయిస్తూ కవిత్వ కళను గూర్చి పరామర్శిస్తుంది. దాశరథీ శతకంలో కవి గారు నిర్వచించిన కావ్యకల్పనా పద్ధతులను గురించి తెలుసుకోవడమే ఈ వ్యాస ఉద్దేశం.
దాశరథి గారు తమ శతకంలో కవిత్వ గుణ లాఘవాన్ని ఆద్యంతమూ ప్రశంసించారు. “వీధి భాగోతులకున్న గౌరవము గొప్ప కళావిదులకేది నేడు?” అని వాపోతూనే “చక్కెర కున్న తీపి చక్కెరదే, లవణానికున్న గుణం లవణానిదే” అని సమర్ధిస్తూ కళలన్నీ వాటి వాటికి తగిన రుచ్యాధిక్యతను కలిగి ఉంటాయని, సర్వ కళల సమాదరణను కావించారు. గానము మీద అందరూ మక్కువను చూపినట్లే తక్కిన సత్కళావళు లన్నింటినీ శిరోధార్యం కావించుకోవాలని విన్నవించారు. “కళావిదుని పెద్దగ చూచెడి మంచి కాలమున్ దబ్బున తెచ్చి పెట్టగదె” అని కాల ప్రతీక్షను కావించారు. ఎత్తులకు పై ఎత్తులను వేసి పదవులను పొందవచ్చు. డబ్బును సంపాదించవచ్చు. కాని సత్కవిత్వమును పొందలేం. రాజకీయం చేసి కళలను సాధించలేం అని నిర్ధారించారు.
దాశరథి గారికి కవిత్వం పుట్టుక తోనే సహజంగా అబ్బింది. “కవిత్వాన్ని కోటి రతనాల వీణగా మోగించి” తెలుగు దేశాన సాటి లేని కవిగా దీటుగా నిలిచారు. వారు కవిత్వ కళా రహస్యాన్ని గురించి ఇలా తెలిపారు – “లోకంలో, శాంతి, సౌమనస్యం అనేవి నామ మాత్రాన సాధ్యం కావు. చంద్రుని దరికి చేరడం తోనే శీతలత్వం సాధ్యం కాదు. మనుష్యులలో ‘సాంద్ర దయాగుణమ్ము, కడు శాంత మనస్కత, త్యాగ బుద్ధి నీరంధ్ర సుశీలతా గరిమ, రమ్య వచస్సు, కళా కలాప నిస్తంద్రతలు’ కలిగినప్పుడే చల్లదనం కలుగుతుంది” అని నిర్ధారించారు. కవి కళా కలాప ధ్యానం చేసినప్పుడే కవిత్వం అభ్యుదయానికి దారి చూపుతుందని స్పష్టంగా చెప్పారు.
“వచ్చిన వాడు మీటు నెడ వల్లకి పాడును, రాని వాడు తా
లచ్చి మగండె యైనను, పురాంతకుడైనను, బ్రహ్మయైననున్
లొచ్చె, కళా మహాంబునిధి లోతులు చూచిన వాడు, దానినిన్
త్రచ్చిన వాడు కీర్తి గొను, దాశరథీ కరుణా పయోనిథీ”
అంటూ ‘కవిత్వ నిర్మాణ దక్షత’ను వీణను పలికించే నేర్పుతో, పోల్చి లలితంగా నిరూపించారు. “బలం అంటే కత్తులను పట్టి తలలను తెగ గొట్టటం కాదు. కలంతో ప్రజల మనోభావాలనే మరలించ వచ్చు”. కవిత్వం నవ వాక్సుధా బలంతో సమస్త ధారుణిని వశ్యం చేసుకుంటుంది, అని చతురోక్తులతో కలానికున్న బలాన్ని వివరించారు.
వేల జనులు చప్పట్లు కొట్టినంత మాత్రాన కవిత్వం ఘనత వహించదు. “దివ్య కావ్య రహస్యాన్ని తెలిసిన జనుడొక్కడు సెబాసనిన చాలు” అని కవిత్వ గుణ ప్రాధాన్యాన్ని సహితోక్తులతో చాటారు.
దాశరథి గారు కవిత్వ తత్వాన్ని గురించి వెల్లడిస్తూ ‘కవిత్వం’ గతమనే కాళ రాత్రిని తొలగ ద్రోసి చల్లని చంద్ర కిరణ ప్రభా శోభితం కావించాలి. చంద్రుని రాకతో వికసించిన వెచ్చని కలువలను మాలగా కట్టి. భారతి మెడలో వేయాలని ఆశించారు. అలాగే వారు తమ శతకాన్ని ఉత్పల చంపక మాలలతో అల్లి మాలగా గుచ్చారు. “యేవో గణముల నద్దినంత మాత్రాన కవిత్వం కాదని, సుకుమార కవిత్వ రమా వినోద సత్పాత్రతకు ప్రతిభ ఉండి తీరాలి” అని నొక్కి చెప్పారు. కృత్రిమమైన నేతిని భుజించాలంటే ఎలాగైతే రుచించదో, ఆ నేయి శక్తిని ఎలాగైతే ఇవ్వదో, అలాగే కవిత్వానికి సహజత్వం ప్రాణప్రదమని తలచారు. కవిత్వం గుండె అనే కొత్త మామిడికొమ్మ నుండి పాడిన కోకిల పాటలా ఉండాలి. కొత్త చివుళ్ళతో మధుమాసం శోభించినట్లు, నిరాశామయమైన విశ్వంలో శాంతరమణీయమైన వసంతాన్ని కొని తేవాలని ఆశించారు. ప్రేమము లేని కామము, కవిత్వము లేని పదాలు,శిక్షణా ధామము లేని గ్రామము, విధాన సభల్ కనరాని రాజ్యముల్, మతాలు, కులాలతో చరించు జాతి చింతా జనకంగా నశిస్తాయని చాటు పద్యశైలిలో ఆశువుగా పలికినట్లు చెప్పారు .
దాశరథి గారు కవిత్వంలో వెలుగును ఆకాంక్షించారు. కాని అర్థం లేని వింత పోకడలను హర్షించలేదు. నూతన కవులు కొందరు వాస్తవాలను రాస్తామని అంటారు. కాని అవన్నీ తాతకు దగ్గులు నేర్పే యత్నాలని పరిహసించారు. దాశరథిగారు సంప్రదాయమంటే నిశ్చల గౌరవాన్ని చూపారు. “రమ్యమైన పురాకథలను గ్రహించి సుకావ్య సంతతిని వెలయించాలి” అని తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. పాండిత్యంతో కూడిన ప్రతిభను హర్షిస్తూనే “పాతదనానికి కొత్త రంగు వేసినంత మాత్రాన అది కవిత్వం కాదు” అని నిక్కచ్చిగా తెలిపారు. అలాంటి ఉత్తుత్తి నాటకం కవిత్వం అనిపించుకోదని నిర్ధారించారు.
దాశరథి గారు కవికి అత్యున్నత స్థానం కలగాలని ఆశించారు. అందుకు గాను కవులు తమ ఆత్మగౌరవం నిలుపుకోవాలని
లోన లొటార మన్నటుల రుచ్య నవార్థము లేమి లేని ప
ద్యానకు దివ్య కావ్యతను తామసతన్ తగిలించుకొందురీ
పైన పటారమన్నటుల భాసిలు నేటి కవీశ్వరుల్, కవి
త్వానకు గానమా కొలత? దాశరథీ కరుణా పయోనిధీ
అంటూ లోకోక్తి యుతంగా చమత్కరించారు. పద్యాన్ని రాగంతో పాడి భేష్ అనిపించుకుంటారు. కవిత్వాన్ని సంగీతంతో కొలత చేయకూడదు అని విన్నవించారు. మరి కొందరు కవీశ్వరులున్నారు. వాళ్ళు కులాలు వద్దు వద్దు అంటూనే కులాల చాటుగా బలాలను చేకూర్చుకుంటారు. మరికొందరు, అన్యులు అసమానంగా రచించినా మెచ్చుకోరు. పలుకులను తూచి మాట్లాడుతారు. ఒకప్పుడు “ఒక ప్రేయసి ప్రియునితో చేసిన సంభాషణను చికిలి చేసి బాకులా మనస్సుకు గుచ్చుతారు. ఈ ప్రేమ కవుల వేదనా రభస మర్మం కొంత తీపి గానూ, కొంత కటువుగానూ అనిపిస్తుంది” అని ఒక ప్రణయ కవిని గూర్చి ప్రాసంగికంగా తెలిపారు.
“నిజమైన కవికి సహనం ఉండాలి. ఒక కవి ఉన్నాడు, వాడి పేరు ‘పున్నయ్య’. వాడికి నయా పైస సహనం లేదు. నన్నయ తిక్కనాది కవులను మింగినట్లు చూస్తాడు” అంటూ యెవరో పున్నయ కవిని పరోక్షంగా విమర్శించారు. కవులకు అహంభావం తగదని దయాగుణ సమన్వితమైనదే కవిత్వమని నిర్వచించారు. పెద్దరికం ఉన్నంత మాత్రాన పూజ్యత కలుగదు. వాక్కులో తీయదనం ఉండాలి. గుండెలో ప్రియ భావనలు లేనివాడు వృద్ధుడైతేనేం, అతని కవిత్వం గణనకు రాదు. అటువంటి వారిని చూస్తే మహా జఠర పన్నగాన్ని చూసినట్లుంటుంది.
కవి అనదగిన వాని గుణ ధర్మాలను గురించి చర్చిస్తూ, “అచ్చమైన కవి పండు లాంటి వాడని, మాగిన పండు చెట్టు కొమ్మ నుండి విడివడి తీయదనం నింపుకొన్నట్లు, పక్వ బుద్ధిని కలిగిన పండితుడు, ఇతర గ్రంథాలను, పత్రపుటాలను ఆశ్రయించడు. తానే పలువురకు, పాండిత్య రసాన్ని రసజ్ఞ రాజ వేదండకర ప్రకారాలతో పంచి ఇస్తాడు” అని వివరించారు.
“అసలు సిసలు జ్ఞానులు పిచ్చివారిలా ఉంటారు. సాధువులు బలహీనులుగా కనిపిస్తారు. కాని వారు సముద్రంలోని బడబాగ్ని లాంటి వారు. ఆ బడబాగ్ని ప్రకోపిస్తే ప్రాణి సంతానం భగ్గుమంటుంది” అని జ్ఞాన ప్రచండతను గూర్చి తార్కాణ సహితంగా వివరించారు.
కవులు పరిహరించవలసిన విషయాలను గూర్చి ఇలా విన్నవించారు. “భజనపరులు కవుల వెంట తిరుగుతూ, ఆ కవిని శివుని అవతారమని పొగుడుతుంటారు. ఆ స్తుతులను నమ్మిన కవి తానూ కంఠంలో కాలకూటాన్ని నిలుపుకోవాలని వేమును తిని వాక్కులను చేదు చేసుకుంటాడు. కవులు స్తుతులకు లోను కాకూడదు. చక్కని పూదోటను పురుగు చేరి సమస్తం మెక్కినట్లుగా, కీర్తి తలకెక్కి గర్వపడితే అతని ప్రతిభ కలుషితమైపోతుంది”. “కీర్తి కామనోదంతము భీతి దాయకము దాశరథీ కరుణాపయోనిథీ” అంటూ రాముని దయను కోరుకొంటారు.
దాశరథి గారు ఆధునిక కవుల పత్రికా దైన్యాన్ని గురించి దాపరికమన్నది లేక తెలిపారు. పత్రికలలో పేరు పడినంత మాత్రాన అనశ్వరులై ఉండిపోరని హెచ్చరించారు. నేటి సభలు వాటిని నిర్వహిచే విధానాన్ని గురించి హాస్యం మేళవిస్తూ “నేటి సభా నిర్వాహకులు, మంత్రుల చేతి జంత్రములుగా వ్యవహరిస్తారు. మనకు శిక్ష కనుక కావాలంటే చిన్న సభాస్థలానికి వెళ్ళాలి. అక్కడ సభాధ్యక్షుడు మనను మ్రింగజూస్తాడు. ఇక తదుపరి వక్త కక్షను పూనినట్లు యెముకలను నమలడానికి ఉద్యుక్తుడవుతాడు. ఈ సభాతక్షకదంష్ట్ర దుర్భరం అని హేళన చేసారు. సభలో చప్పట్లను విని మోసపోరాదు” అని జాగ్రతలను తెలిపారు.
దాశరథి గారు సహృదయులను గూర్చి కూడా వివేచించారు. “పూవులు పూయనట్టి తరువుల్, ఫలమీయని చెట్టులింక -నెత్తావులు లేని పూవులటు, దానము, ధర్మము, నీతి భీతియున్, – భావుకతల్, కళాభిరుచి మచ్చుకు లేని మనుషులున్నారు” అని తగిన ఉపమానాలతో పోల్చి చెప్పారు. మరొక చోట అందరకూ తమ స్వార్థమే తప్ప “నిజముగా ప్రతిభ యున్న కళావిదు మెచ్చు ధర్మ చింతకుడొకడైన లేడుకద” అని సామాన్య లోక ధర్మాన్ని చాటారు. కవుల ఆత్మోన్నతిని ప్రశంసిస్తూ “అరసికు డెంతగా ధనవంతుడైనకవీశ్వరుడేగి కొల్చునే” అని అన్నారు. కవులకు నిజముగా తమ కవిత్వమును తరచి చూసే రసికుని పెంపు కావాలి కాని. కళాభి రుచి లేని దాత ఆశ్రయం కాదు. “కవి క్షుదాగ్నిలో మాడినా సరేఅటువంటి వాని దరి చేరడు” అని విన్నవించారు.
దాశరథి కవిత్వ శైలిని గూర్చి ప్రస్తావించారు. కాకియు కోకిలమ్మొకటిగా కనిపించును గాని కాకపుం -గేకలు గుండె వంతలడగింపవు, – కోకిల చాన కూసెనా – లోకము నాకమై విరియు -రుచ్య వసంత వాసనల్ -తాకును తీయగానెదకు – అని లలిత మృదులమైన శైలీ విశిష్టతను గూర్చి తెలిపారు.
యిక కవిత్వ వస్తువును గూర్చి ప్రస్తావిస్తూ – జాత్యుద్ధరణకు పోరాడిన త్యాగమూర్తులను మరువరాదని “తెలుపుతూ పోయిరి జాతిని గూర్చి మృతి పొందిన వారలు -కాని జ్ఞప్తి రాదాయెను వారి గూర్చిన కథావళి యించుక గూడ” అని దిగులు చెంది అటువంటి వారి కథలను రాయాలని కోరారు.
తమ శతకాన్ని దాశరథి గారు గాంధీజీ స్తుతితో ఆరంభించారు. ‘జాతికిన్ శూరత గూర్చి, ఆత్మ పరిశోధన సల్పి అహింస -జాతికాధారముగా నిల్పి’ వంటి ప్రశంసలతో ఈ శతకం ద్వారా తాము కూర్పదలచిన ప్రయోజనాన్ని ప్రకటించారు. సామ్య వాదాన్ని ప్రతిపాదిస్తూ “కడుపుకు తిండి కల్గు నెడ కాస్త మనస్థిమితము కల్గు”. ముందు ఆకలి తీరాలి అటు తరువాతే ఆత్మ అనాత్మ అన్న వాదాలను చేయవచ్చు, మెతుకులను అందించడమే పరిపాలనాలక్ష్యం కావాలి. అని నిర్దేశించారు. అన్యాయాన్ని, నిష్కర్షగా ఖండించారు. దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఆశించారు.
“దివ్వెల పెట్టుడీ హృదయ దేహళి మీద, మహాంధకారముల్
దవ్వులకు పలాయనములై చనగా”
అని నిరామయమైన మనస్సులను ఆహ్వానించారు.
యెవరెది పల్కినన్ నిజమిదే అనెదన్ -నిరుపేద వాడె రా
జవును మహాప్రపంచమున కంతటికిన్ – ధనరాశి నాశమై
మివులును విల్వమానవుని మేధకు – వాని పరిశ్రమాన, కు
త్సవము కవీంద్ర కోటి కగు. దాశరథీ కరుణాపయోనిథీ.
అని కవులకు నిత్యోత్సవము కలిగే రోజు తప్పక రాగలదని విశ్వసించారు. ✒
