[22 జూలై 2025 శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ‘దాశరథి పాటలు’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. సిద్దెంకి యాదగిరి. ఇది రెండవ, చివరి భాగం]
భక్తి పాటలు:
దాశరథి బయటకి కమ్యూనిస్టుగా వ్యవహరించినా భక్తి పాటలకు ప్రాణంపోసాడు. వారిలోని ఆధ్యాత్మికత భక్తులందరినీ తాదాత్మ్యం చెందిస్తుంది. వారి భక్తిపాటలు ఇప్పటికీ ఆలపించబడుతున్నాయంటే ఆ పాటల విశిష్టత మనకు అర్థమవుతుంది. ‘అమాయకురాలు’(1971) చిత్రంలోని పాడెద నీ నామం అనే పాట వీణపాట.
పల్లవి:
పాడెద నీ నామమే గోపాలా! – హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా ॥పాడెద॥
చరణం:
మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా!
ఆశలతోనే హారతిచేసి పదములు పూజింతురారా ॥పాడెద॥
చరణం:
నీ మురళీగానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా
పొన్నలుపూచే బృందావనిలో వెన్నెల కురిసే వెన్నెల కురిసే యమునాతటిపై
నీ సన్నిధిలో జీవితమంతా
కానుక చేసేను రారా ॥
సంగీత సాహితీ విలువలు పుష్కలంగా వున్న గీతమిది. లలితంగా సాహిత్యంలో ‘వీణ’ శబ్దం లేనప్పటికీ తెరపైన ఇది వీణ పాటగానే చూపించారు. ‘పాడెద నీ నామమే’, ‘నీ మురళీ గానమే’ చరణానికి ముందు వీణపై వినిపించిన స్వరఖండికలు అలరిస్తాయి. మోహన, నటభైరవి రాగాలను అపురూపంగా వాడి, సాలూరి రాగరంజితం చేశారు. ‘పాడెద నీ నామమే’ నని గాంధారం నుండి పై స్థాయి గాంధారానికి నడిపించారు.
‘శివతత్వం:
దాశరథి వైష్ణవుడైనా శైవగీతాలు కూడా అద్భుతంగా రచించాడు. బాబు పిక్చర్స్, సంజీవిని ఫిలింస్, శ్రీరమణ చిత్ర, మట్టిలో మాణిక్యం (1971) చిత్రంలోని పాట.
పల్లవి:
శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీ శేషశైలవాసా ॥శరణం॥
చరణం:
భక్తుల బ్రోచే స్వామివి నీవే పేదల పాలిటి పెన్నిధి నీవే
సకల జీవులను చల్లగ చూచే కరుణామయుడవు నీవే॥శరణం॥
చరణం:
నీ ఆలయమే శాంతికి నిలయం నిను సేవించే బ్రతుకే ధన్యం తిరుమలవాసా
శ్రీ వెంకటేశా మా యిలవేలుపు నీవే ॥శరణం॥
తిక్కన చెప్పిన హరహరద్వైతంను ఈ పాటలో పాటించి సమన్యాయం చేసారు.
రామమయం:
జగమంతా రామమయం అని ఆలపించు భక్తులకు, రాముని గుణగణాలను కీర్తిస్తూ రాసిన పాటలో ఓర్పును ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన తత్త్వం నేటికీ ఆదర్శమే.
జగదభిరామా! రఘుకులసోమా! శరణము నీయవయా రామా! కరుణను జూపవయా!
కౌశికు యాగము కాచితివయ్యా! రాతిని నాతిగ జేసితివయ్యా
హరువిల్లు విరచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణరామా ॥శరణము॥
రాముని తత్త్వాన్ని, మనస్తత్వాన్ని, దృక్పథాన్ని, మహిమను, ఘనతను, స్వభావాన్ని సంక్షిప్తంగా రామాయణ సారంగా మలచిన గీతమిది. మారుమూల వల్లెల్లోని రామాలయాల్లో నేటికినీ భజనగీతంగా పాడుకోబడటం విశేషం.
కృష్ణ తత్వం:
దాశరథి స్వయాన వైష్ణవుడు కావడం వల్ల స్వామికార్యం, స్వకార్యం అన్న చందంగా రామ, కృష్ణ, వేంకటేశ్వరులను కొనియాడాడు. ‘శ్రీకృష్ణ విజయం’(1971) చిత్రంలోని పాట.
పల్లవి:
జయహే! నవనీలమేఘ శ్యామా! వనమాలికాభిరామా! – నీ గానమ్ములో ఈ లోకమ్ములే పులకించు దేవ దేవ ॥జయహే॥
చరణం:
వేదాల కొసలందు వెలుగొందు స్వామీ! వ్రేపల్లెవాడలో వెలసినా వేమీ!
మానవుని దేవునిగ మలచనే కాదా! ఔలె! సరేలె! భలే లీలలే!
చరణం:
ఇలలోన ధర్మమ్ము నెలకొల్పనెంచి యెన్నెన్నొ రూపాల యేతెంతు వీవు!
వేడినవారిని విడనాడబోవు! నిజం.. నిజం.. ముమ్మాటికిది నిజం!
మధురం మధురం!
అధరం మధురం! అధరము సోకిన వేణువు మధురం! నామం మధురం! రూపం మధురం!
పిలుపే మధురం! తలపే మధురం! నీవే మధురం ॥జయహే॥
‘యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’ అని గీతలో తెలియజేసిన విధంగా, ధర్మానికి హాని జరిగినపుడల్లా శ్రీహరి ఏదో ఒక అవతార మెత్తుతుంటాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు వేద స్వరూపుడు. అందుకే వేదాల కొసలందు అని అన్నాడు.
‘మాతృదేవత’ 1979లో వచ్చిన చిత్రంలో కృష్ణున్ని కొలువడానికి తన మనసును కోవేల చేశాననీ సాగే పాటలో మా ఇరువురి ఆనందం కలకాలం మది నిండాలి అని సాగే అన్యోన్య దాంపత్యాన్ని కోరుకుంటుంది.
పల్లవి:
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా – నిన్నే కొలిచెదరా
ననెన్నడు మరువకురా.. కృష్ణా.. ఆ..ఆ..
చరణం:
ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
కలకాలం మదినిండాలీ కలలన్నీ పండాలి – మన కలలన్ని పండాలి॥మనసే॥
చరణం:
నీ చూపులలో చూపులతో.. నీ ఆశలలో ఆశలతో-
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై.. ఒకరికి ఒకరై బ్రతకాలి॥మనసే॥
నీ చూపులలో చూపులతో ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి అని కోరే ఈ పాటలో కృష్ణ భక్తి అపారంగా కనబడుతూ ఉంటుంది.
కైస్తవ గీతాలు:
తెలుగులో క్రైస్తవ భక్తిగీతాల రచనకో ప్రత్యేక పరిభాషను వాడుతుంటారు. ప్రభువు, దీనులు, కొలుచుట మొదలైనవి సాధారణంగా కానవచ్చే పదాలు. ‘మిస్సమ్మ’ చిత్రంలో పింగళి రాసిన ‘కరుణించు మేరి మాతా’ గీతం తర్వాత మళ్లీ అంత ఉదాత్తంగా దాశరథి రాసిన క్రైస్తవ భక్తి గీతం. ఈ పాట ఆ రోజుల్లో ప్రజాదరణ పొందింది. ‘ప్రేమజీవులు’ (1971) చిత్రంలో..
పల్లవి:
దయచూడు యేసు ప్రభువా నీ వారి కావరావా – నిన్నే తలిచేమూ – నిన్నే కొలిచేమూ ॥దయ॥
చరణం:
కనులైన లేని చీకటి బ్రతుకు వెలిగించు
జ్యోతి నీవే దివిలోనా – భువిలోనా – నీ రూపే నిండెనయ్యా మా తల్లి తండ్రి నీవేర్చాయి.
చరణం:
ఏ దారి లేని దీనులకోసం ॥దయ॥
లోకాన వెలసినావు – కరుణించీ – దీవించే నీ నామం ముక్తి మార్గం – నీవున్న చోటే స్వర్గం
కరుణ, ముక్తి మార్గం, స్వర్గ భావనలు హృదయాన్ని ఆకర్షిస్తాయి. యేసు దివ్యత్వం, దీనుల రక్షణ భావనలు ఆకట్టుకుంటాయి.
వీణపాటలు:
వీణపాటలకు పెట్టింది పేరు దాశరథి.
‘అంతా మనమంచికే’(1972), చిత్రంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరుని గురించి రాసిన పాట విందాం.
పల్లవి:
నీవేరా నా మదిలో – దేవా తిరుమలవాసా! ఓ శ్రీనివాసా! నీ పదదాసిని నేనేరా ॥నీవేరా॥
చ1:
యెంతో మధురం నీ శుభనామం జగతికి దీపం నీ దివ్యరూపం
ఆశలపూలే – దోసిట నింపి వేచే భాగ్యము – నాదేరా॥నీవేరా॥
చ2:
నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను
నీపదములపై వాలిన సుమమై నిలిచే భాగ్యము నాదేరా॥నీవేరా॥
చ3:
నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచాను స్వామీ
నీ సన్నిధియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదేరా ॥నీవేరా॥
నవవిధ భక్తి మార్గాలలో సమర్పణ మొకటి. స్వామివారి చరణాలపై పూవుగా ఉండాని, తన జీవితాన్నే హారతిగా అందించాలనుకునే ఆర్థ భక్తిని అందంగా ఆవిష్కరించారు.
‘ఆత్మీయులు’(1969), చిత్రంలో
పల్లవి:
మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నో – చెలరేగె కలనైన కనని ఆనందం
యిలలోన విరిసె ఈనాడే ॥మదిలో॥
చరణం1:
సిగ్గుచాటున నా లేతవలపు మొగ్గతొడిగింది
పాలవెన్నెల స్నానాలు చేసి పూలుపూసింది ॥మదిలో॥
చరణం2:
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను
అందాల తారయై మెరిసి చెలికాని చెంతచేరేను ॥మదిలో॥
చరణం3:
రాధ లోని అనురాగమంతా మాధవునిదేలే
వేణులోలుని రాగాలకోసం వేచియున్నదిలే ॥మదిలో॥
సంగీత, సాహిత్యాల పరంగా ఎంతో ప్రామాణిక గీతమిది. దాశరథి పాటలపై పుస్తకం రాసిన డా. వి.వి. రామారావు గ్రంథానికి ‘మదిలో వీణలు మ్రోగే’ శీర్షికగా, యీ పాట పల్లవిని తీసుకోవడం జరిగింది. పాట ఆద్యంతం కావ్యనిర్మాణ శిల్పంలో కవి సమయాలతో సాగి అలరిస్తుంది. మదిలో వీణలు మ్రోగడమంటే, మధురమైన ప్రణయరాగం ఎదలో రవళించిందన్న మాట. నాయికలో తొలిప్రేమ మొగ్గతొడిగి, పాలవెన్నెలతో పునీతమై వికసించి, సరసశృంగార సరస్సులో కలువగా పరిణమించినదన్న అభివ్యక్తిలో ఒక్కో దశను దాటిన ఆమె వలపు పరిణామం సూచించబడిరది. దాశరథి పాటలరాశిలో అమృత కలశం యీ గీతం.
‘జమీందారుగారి అమ్మాయి’(1975), సినిమాలో రాసిన పాటలో ‘సిరిమల్లె పువ్వు కురిసింది’ అంటూ సాగుతుంది.
పల్లవి:
మ్రోగింది వీణా! పదే, పదే హృదయాలలోనా..
ఆ దివ్యరాగం అనురాగమై – సాగిందిలే ॥మ్రోగింది॥
చరణం:
సిరిమల్లె పువ్వు- కురిసింది నవ్వు , నెలరాజు అందం – వేసింది బంధం
ఆ బంధమే మరీ, మరీ ఆనందమే ॥మ్రోగింది॥
దాశరథి వీణ పాటలలో, మరొక అమృత కలశం యీ గీతం. లలిత పదాలతో భావ బంధురంగా రాశారు. హీరో మనసు నిండా ఆమె రూపమే నిండి పోవడం వలన హృదయం అనుభూతుల సంద్రమైపోయింది. ‘ఆమె నవ్వింది’ అని వాచ్యం చేయకుండా, ‘సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు’ అని ప్రతీకాత్మకంగా (సింబాలిక్ గా) చెప్పడం విశేషం. ఈ పాటను చిత్రంలో వేర్వేరు సందర్భాలలో, పదాలలో చిన్న మార్పులతో, హీరో పరంగా, హీరోయిన్ పరంగా వాడారు.
ఈ పాట బాణీకి మూలం, తమిళంలో యస్.పి.బాలు పాడిన ‘తేన్ సిందుదే వానం, ఉనయ్, ఎనయ్ తాలాట్టి దే’ పాట. (చిత్రం- పొన్నుక్కు తంగమనసు) ఈ చిత్రానికి కూడా జి.కె. వెంకటేశ్ స్వరకర్త. అయితే బాణీని మాత్రం వారి వద్ద అసిస్టెంట్గా పనిచేసిన మాస్ట్రో ఇళయరాజా యిచ్చాకే కణ్ణదాసన్ రాశారు. కన్నడంలో కూడా యీ బాణీతో చేసిన పాట హిట్టయింది. వీణావాద్య విద్వాంసుడైన జి.కె. వెంకటేశ్ యమన్ రాగంలో, శిష్యుడు ఇళయరాజా చేసిన బాణీనే ఆమోదించి దాశరథితో పాట రాయించారు. జి.కె.గారి వీణానాదస్వర విన్యాసం నిజంగానే మన హృదయాలలో పదే పదే సరనాదాన్ని మ్రోగిస్తూనే వుంటుంది.
‘ఒకే కుటుంబం’ సినిమాలో ‘అందరికీ ఒక్కడే దేవుడ’ ని పాట ప్రారంభంలోనే రహీము, రాముడు, ఎవరైనా దేవుడొక్కడే అని పరమత సహనం బోధిస్తాడు. మతాలు ఏవైనా మంచి మనసు ఉంటేనే మనిషంటాము అని మనీషి తత్త్వాన్ని బోధించే ఈ చైతన్యవంతమైన పాటలో డప్పు మోగిస్తూ పాడడము చిత్రీకరించారు.
పల్లవి:
అందరికీ ఒక్కడే దేవుడూ – కొందరికి రహీము కొందరికి రాముడు –
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే ॥అందరికీ॥
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు – మేడి పండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు – పక్కనున్న మానవుని ఎందుకు మరచేవు
మానవసేవే మాధవ సేవ బాధపడే సోదరులను ఆదుకొనేము –
మనుషులమై మనమంతా కలిసుంటాము ॥అందరికీ॥
చరణం:
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు దోచుకునే దొరగారికి తృప్తివుండదు
స్వార్థపరుల ఆట మనం కట్టిస్తాము శ్రమజీవుల కష్టఫలం యిప్పిస్తాము
అహంస బోధిస్తాం, ప్రశాంతి సాధిస్తాం లోకంలో ఆకలే లేకుండా చేస్తాము –
మనుషులమై మనమంతా కలిసుంటాము॥అందరికీ॥
మానవసేవవ బాధపడే సోదరులను ఆదుకుంటాము. మనుషులమై మనమంతా కలిసుంటాము. మత సామరస్యాన్ని బోధించే యీ గీతాన్ని స్వామి వివేకానంద బోధనల ప్పూర్తితో మానవతా విలువలతో రాశారు. ప్రబోధాత్మక గీతంగా ప్రజాదరణ పొందింది.
మానవ సంబంధాలు:
దాశరథి సినీగీతాలలో మానవ సంబంధాలను నిలబెట్టడానికి ప్రతి అక్షరాన్ని పేర్చి, కూర్చి ప్రేమలు ఉప్పొంగే విధంగా రచించారు. హృదయాలను కలకాలం నిలిచేదీ నిజమైన జన్మబంధమని తెలుపుతూ ‘రక్త సంబంధం’(1962) చిత్రంలో అన్నా చెల్లెల, కుటుంబం గురించి సవివరంగా వివరించాడు.
పల్లవి:
రక్త సంబంధం ఇదే రక్త సంబంధం – హృదయాలను కలిపేది
కలకాలం నిలిచేదీ నిజమైన జన్మబంధం ॥రక్త సంబంధం॥
చరణం:
చెల్లి సుఖమె తన సుఖమని యెంచును –
చెల్లి కొరకు గుండెలు కరగించును
తల్లి దండ్రి లేని లోపం తొలగించినాడు –
పాపం ఏనాటికైన గాని విడిపోని దివ్యబంధం.. ॥రక్త సంబంధం॥
చరణం:
ఒకే గూటిలోని చిన్నిపిల్లలు, ఒకరి విడిచి ఒకరు బ్రతుక నొల్లరు
దేహాలు వేరుగానీ హృదయాలు రెండు ఒకటే
సుడిగాలు లెన్ని రానీ తెగిపోని మధుర బంధం.. ॥రక్త సంబంధం॥
ఈ రక్త సంబంధం సినిమాకు టైటిల్ సాంగ్. అన్నాచెల్లెళ్ల బంధానికి దర్పణం పట్టి పాటను రాసారు. హృదయాలను కలిపేది, కలకాలం నిలిపేదే రక్తసంబంధమని నిర్వచించి, ఎలాంటి వైపరీత్యాలు ఎదురైనా శాశ్వతంగా నిలిచే దివ్యబంధమని పేర్కొన్నారు.
‘బుల్లెమ్మ బుల్లోడు’(1972) చిత్రంలో మాతృత్వాన్ని పతాక స్థాయిలో నిలిపిన పాట. ప్రతి ప్రాణికి అమ్మ అన్నది కమ్మని మాట, అంతులేని సొమ్ము హృద్యంగా సాగింది.
అమ్మ అన్నది ఒక కమ్మని మాట – అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు – అమ్మే లేదను వాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ॥2॥
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు॥అమ్మ అన్నది॥
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కతే – అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కతే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ నాదీ ॥అమ్మ అన్నది॥
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది లేదు. అందరికి ఇలవేల్పు అని వివరిస్తాడు.
అన్నా చెల్లెల అనుబంధాన్ని వింటుంటే మనసు ద్రవిస్తుంది. ఎన్నిసార్లు విన్నా తెలియకుండా మనసు మానేరు అవుతుంది. నేటికీ రాఖీ పౌర్ణమీ రోజున పాటను పదేపదే వినేవాళ్లు కూడా వున్నారు. అలాంటి అనుబంధాల్ని మనసు బంధాలుగా నిలపడం దాశరథికి వెన్నతో పెట్టిన ఉబికి వచ్చే పాటల ఊట. ‘చిట్టి చెల్లెల్లు’(1970) చిత్రంలో పాపాయి గురించి రాసిన పాటలో నీకన్నా నాకెవరే అని చెప్పె మాటలు మనల్ని అన్నతనంలో పెద్దరికాన్ని, బాధ్యతల్ని గుర్తుచేస్తాయి.
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప – బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే
నీకన్నా నాకెవరే – అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
ఆ చల్లని జాబిలి వెలుగు – ఆ చక్కని చుక్కల తళుకు – నీ మనుగడలో నిండాలమ్మా 2
మనకే లోటు రానీయదులే – అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది – నీ కొరకే నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప, ల ల
భవిష్యత్తు అంతా పసిపాపదేనని ప్రకటిస్తాడు ప్రజా కవి దాశరథి.
‘ఆడపడుచు’(1967) చిత్రంలోని పాట అన్నా చెల్లెల అనుబంధాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళింది.
పల్లవి:
అన్నా.. నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం – ఓ అన్నా నీ అనురాగం..
పుట్టిన రోజున మీ దీవేనలే.. వెన్నెల కన్నా చల్లదనం ॥ఓ అన్నా॥
చరణం:
మల్లెలవంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి –
ఎల్లకాలము ఈ తీరుగానే చెల్లిని కాపాడాలి..
పుట్టిన రోజున మీ దీవేనలే.. వెన్నెల కన్నా చల్లదనం ॥ఓ అన్నా॥
చరణం:
ఇల్లాలినై నేనెచటికేగినా.. చెల్లిని మదిలో నింపాలి
ఆడపడచుకు అన్నివేళలా.. తోడూ నీడగా నిలవాలి
పుట్టిన రోజున మీ దీవేనలే.. వెన్నెల కన్నా చల్లదనం ॥ఓ అన్నా॥
అన్న గొప్పతనాన్ని వివరించింది. దొరబాబు చిత్రంలో ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే అన్నని చూపిస్తానని పాట ద్వారా వివరిస్తాడు.
ఊయలలూపుతున్న శిశువును చూసి తల్లి పాడుతున్న పాటలో నా చెంత నీ ఉంటే స్వర్గమే నాదౌనూ అని తల్లి మనసును స్వభావోక్తిలో పలికిస్తాడు. ‘భద్రకాళి’(1977) చిత్రంలోని కన్నయ్యపై పాడిన పాటలో ఉప్పొంగుతున్న మాతృహృదయావిష్కరణ చేసాడు.
చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా – నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ
ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ – జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ ॥చిన్ని చిన్ని కన్నయ్యా॥
గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే – కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ – ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ – లాలిపాట పాడేనూ జోలాలి..2,
తీయని కలలతో తన ఒడిలో నిద్రపోతున్న శిశువుని చూసి తల్లి జీవితార్థం పొంది మురిసిపోతుంది. ఈ బంధం ఏడేడు జన్మలకు చెదరని అని చెప్పే ఈ గీతం మాతృస్నేహానికి జీవితం ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆలంకారికంగా రసభరితంగా రచించిన ఈ పాట, మాతృత్వపు భావాల్ని సుస్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
‘చల్లని నీడ’(1968) చిత్రంలో పూల పరిమళం కన్నా, మమతల మల్లెలు పప్పు అని వాటిని గుమగుమలాడిరచిన మానవ సంబంధాలు పసిపాపే నేనీ చెప్పడం ఆదర్శంగా నిలిచింది.
పల్లవి:
మల్లెల కన్నా జాబిల్లి కన్నా ॥2॥ చల్లని పాపాయి లాలీజో॥2॥
చ.
లోకాలు నిదురించు వేళాయెరా – కలలందు విహరించ రావేలరా
తారలతో ఆడుకోవాలిరా – మేఘాలలో తేలిపోవాలిరా ॥మల్లెల కన్నా॥
చ.
నీ వారు లేరన్న భయమేలరా- నేనుండగా నీకు లోటేమిరా
కన్నులలో దాచుకుంటానురా కనుపాపలా చూచుకుంటానురా ॥మల్లెల కన్నా॥
జోల పాటలు పూల పరిమళంతో అలతి అలతి పదాల అల్లికలతో చంటి పాపం మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని మృదువుగా రాశాడు.
తొలి సంతానం అంటే దంపతులకు ఎంతో పరోక్షం ఉంటుంది వారి ఆరాటాలను అత్యద్భుతంగా చిత్రించిన పాట ‘నాది ఆడజన్మే’(1965) చిన్నారి పొన్నారి పువ్వా అని పొగడుతూ మన పొదరిందటి పువ్వూ నిను చూసి నను చూసి నవ్వు అని అనడంతో సహజత్వం ఉట్టిపడుతుంది.
అతడు.
చిన్నారి పొన్నారి పువ్వు – విరబూసి విరబూసి నవ్వు
ఆమె.
మన ఇంటి పొదరింటి పువ్వూ – నిను చూసి నను చూసి నవ్వూ ॥చిన్నారి పొన్నారి ॥
చ.
ఆమె.
హృదయాన కదలాడు బాబూ – రేపు ఉయ్యాల జంపాలలూగు
పసివాడు పలికేటి మాటా ముత్యాల రతనాల మూటా ॥చిన్నారి పొన్నారి ॥
చ.
ఆమె.
ఒడిలోన పవళించు వేళా – నేను పాడేను ఒక జోల పాటా
అతడు.
కనుమూసి నిదురించు బాబూ – కలలందు జోగాడగలడు ॥చిన్నారి పొన్నారి ॥
దాశరథి స్త్రీల పరంగా రచించిన పాటలు ఆత్మవిశ్వాసం నింపాయి. ‘ఆడదాన్ని ఆట బొమ్మ అనుకుంటారు’ అని అగ్ని పరీక్ష చిత్రంలో వివరించారు. వలచిన మనసే మనసు అనే పాట చదరంగం సినిమాలో స్త్రీలకు స్వాతంత్రం ఉంటేనే వలితాలకది స్వర్గమని వ్యక్తీకరించాడు.
‘భలే రంగడు’(1969), చిత్రంలో నిన్న నేడు నిరంతరం నాదే అని ప్రకటించుకున్న ఆత్మగౌరవ పతాకం కలిగిన పాట.
పల్లవి:
నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే యెవరేమన్నా యెన్నటికైనా గెలుపు నాదేలే ॥నిన్న॥
చరణం:
కల్లాకపటం యెరగని వాణ్ణి గాలిపటంలా తిరిగే వాణ్ణి పెంకిఘటంలా నిలిచే వాణ్ణి నిండుగుండెతో బతికేవాణ్ణి ॥నిన్న॥
చరణం:
మంచివాళ్ళతో నేస్తం కడతా బడా చోరుల భరతం పడతా చీకూ చింతా లేకుండా సంతోషంగా జీవిస్తా..
స్వాభిమానం, ఆత్మవిశ్వాసం గల నాయకుని వ్యక్తిత్వానికి నిర్వచనంగా యీ గీతాన్ని రాశారు. భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతంగా నిలచే కవిత్వం సృష్టించే వాడే మహాకవి. ఈ పాట సినిమాపరంగా కాకుండా చూస్తే దాశరథి వ్యక్తిత్వం కూడా ధ్వనిస్తుంది. మంచి వాళ్లతో నేస్తంగా ఉంటానని బడాచోరుత భరతం పడతానని, చీకూ చింతా లేకుండా సంతోషంగా జీవిస్తానని చెప్పడం తన వ్యక్తిత్వాన్ని ప్రకటించడమే. తన దృక్పథాన్ని తెలియజేయడమే.
సామ్యవాద లక్షణం:
దాశరథి వ్యక్తిత్వం అందరూ బాగుండాలనే మనస్తత్వం. సమసమాజాన్ని కాంక్షించే మనసు కావడం మార్పు నిత్యపరిణామ క్రమమమని దాన్ని ఆహ్వానించాలి. ఆస్వాదించాలని అందులో మంచి కోరుతాడు. ‘నిలువు దోపిడి’(1968) చిత్రంలో లోకం మారుట సహజం. మారుతున్న పరిస్థితులపై కోపమెందుకు? అని ప్రశ్నిస్తూ సాగిన పాట చూడండి.
పల్లవి:
లోకం యిది లోకం మారుట దానికి సహజం మారితే ఎందుకుకోపం ॥లోకం॥
చరణం:
వసంతకాలం వచ్చిందంటే వనమంతా విరబూస్తుందీ – మదిలో వలపే వెలిగిందంటే
మనిషిలో మార్పే వస్తుందీ॥లోకం॥
చరణం:
పాతొక రోత కొత్తొక వింత వాటి కలయికే జగమంతా
అందానికి అంతేది ఆనందానికి హద్దేది ॥లోకం॥
చరణం:
ఎల్లోరా గుహ శిల్పాల్లో – శిల్పాల్లో పిల్లను చూసి మురిశారు మురిశారు
ఆ వొంపులను ఆ సొంపులను అనుకరించితే తిట్టారు తిట్టారు ॥లోకం॥
ప్రపంచంలో మార్పు అనేది సహజం. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. శిశిరం పోయి వసంతం వస్తుంది. అలాగే మనిషిలో, మనసులో కూడా మార్పు అనివార్యమని సూచించారు. కాబట్టి మారుతున్న సమాజం పట్ల కోపం కూడదనే భావంతో రాసిన పాట. ఈ పాటను సాంస్కృతిక ఉత్సవంలో ఒక నృత్యగీతంగా చిత్రీకరించారు.
వసంతకాలం రాగానే ప్రకృతిలో మార్పు వస్తుంది. అలాగే మనిషి హృదయంలో ప్రేమ చిగురించగానే, ఆత్మలో మార్పులు జరుగుతాయి. భాషలు ఏవైనా మన వేషం ఏదైనా మనసే మంచిది కావాలి. లోకం పోకడ తెలియాలి. ఈ లోకం పోకడ తెలియాలి.
దేశంలో విగ్రహాల పూజ ఎక్కువైంది. వ్యక్తి పూజ విస్తృతమైందని తెలుపుతూ నాయకుల స్ఫూర్తిని నింపుకోవాలనీ, వారిచ్చిన ఆచరణను మరిచి విగ్రహాలను ప్రతిష్టించడం వ్యర్థమని ‘కాలం మారింది’(1972) చిత్రంలో నిజం తెలుసుకొమ్మని తెలుపుతూ రాసిన పాట డప్పుచరిత్రలో ఒక మైలురాయి. నేతల విగ్రహాలు, వీధులకు పేర్లు పెట్టే వాళ్లకు చెంపపెట్టులాంటి హెచ్చరిక చేసిన పాట దాశరథి అందించారు.
పల్లవి:
విగ్రహాలను ప్రతిష్ఠించమని – వీధులకు తమ పేర్లు పెట్టమని
మన నాయకులెవరూ అనలేదండీ
అనుపల్లవి:
చరణం:
పేదలపాలిటి పెన్నిధి గాంధీ – దీనుల పాలిటి దేవుడు గాంధీ
అంటరానితనమై పీడించే – అంటు వ్యాధికే వైద్యుడు గాంధీ,
అతని దారిలో నడవండి-అతనికి శాంతిని చేకూర్చండీ ॥నిజం॥
స్వతంత్ర భారత సారధి నెహ్రూ –
తూర్పు పడమరల వారధి నెహ్రూ, శాంతి విధాత –
జాతికి నేత, సామ్యవాద సంధాత నెహ్రూ
అతని బాటలో నడవండి – అతని ఆశలూ తీర్చండీ ॥నిజం॥
కులమత బేధంలేని సమాజం – ధనికుడు పేదలేని సమాజం
దోపిడి రాపిడిలేని సమాజం – ద్రోహం మోసంలేని సమాజం
భారతదేశం ఒకటే ఒకటని ప్రపంచమంతా చాటాలి –
వీరనాయకుల వారసులమని పేరు ప్రతిష్ఠలు తేవాలి..
వారి కలలన్నీ నిజము కావాలీ..
ఈ అభ్యుదయాన్ని కోరుకుంటాడు. విగ్రహాలను పెట్టడం, వీధులకు నాయకుల పేర్లు నామకరణం చేయడం కాదు వారి ఆశయాలను ఆచరించాలని సాగుతుందీపాట. గాంధీ, నెహ్రూ, ఇందిరల నాయకత్వాన్ని కొనియాడుతాడు. భారతదేశంలో ధనిక పేద తేడాలేని సమాజం ఆవిష్కారం కావాలని కలలు కన్నాడు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అభ్యుదయ రచయిత, ప్రముఖ పత్రికారచయిత వాసిరాజు ప్రకాశం నిర్మించిన సామాజిక సందేశాత్మకచిత్రం ‘కాలం మారింది’. కథాపరంగా అంతర్ కళాశాల సాంస్కృతికోత్సవం సందర్భంగా హీరో నిర్వహించే నృత్యరూపకంగా దాశరథి రాసిన అభ్యుదయ గీతమిది. ఇందులో దాశరథి తన సామ్యవాద భావాలను వ్యక్తీకరించారు. విగ్రహాలను ప్రతిష్టించి, వీధులకు పేర్లుపెట్టి, రాజకీయ నేతల వ్యక్తి ఆరాధనకు స్వస్తి చెప్పాలన్న దాశరథి మాటలు నేటికీ శిరోధార్యాలు.
పల్లవి:
మారలేదులే యీ కాలం మారలేదులే
యీ లోకం దీనులకు హీనులకు తీరలేదులే యీ శోకం॥మారలేదులే॥
అందరిలో వుండేది ఒకే రక్తమైనా – అందరినీ సృష్టించింది ఒకే దైవమైనా
కులం పేరుతో మతం ముసుగులో ప్రాణమున్న మనిషినే సమాధిచేశారే.. ॥మారలేదులే॥
వారే నీవారు.. అనాధలు, అభాగ్యులు. వారే నీ బంధువులు –
బాధితులు, పీడితులు కంటినీటితోనే తమ కడుపులను నింపుకొనే అంటరాని వారు.. వారే నీవారు..
ఈ కోవెలలో యిక నీకు చోటు లేదమ్మా ఈ లోగిలిలో యిక నిలువనీడ లేదమ్మా!
దేశానికి మహమ్మారిలా సోకిన అంటరానితనాన్ని నిరసించిన గాంధీజీ సమసమాజం కోసం కృషి చేశారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ వర్ణ వ్యవస్థలో మార్పు రాలేదు. తరాలు మారినా దృక్పథాలు మారలేదు. అందుకే కాలం మారలేదు’ అని పల్లవితో ప్రారంభించారు.
అంటరాని వాడికి జన్మించిన బిడ్డ, అగ్రవర్ణాల వారింట పెరిగి పెద్దదవుతుంది. ఆమెను పెళ్లాడడానికి ముందుకు వచ్చిన తను, ఆమె జన్మరహస్యం తెలుసుకొని నిరాకరిస్తాడు. వాస్తవాన్ని తెలుసుకొన్న నాయిక దుఃఖిస్తుంది. ఈ సన్నివేశానికి నేపథ్యగీతంగా రాశారు.
చాలా కాలం తదుపరి రాజేశ్వరరావు స్వీయ సంగీతంలో పాడారు. ఈ పాటలో ముఖ్యంగా ‘కులం పేరుతో’ పంక్తి వద్ద యస్.డి.బర్మన్ స్వరపరచిన ‘రాధానే మాలా జపి’ (తేరే మేరే సప్ని -1971) గీతంలోని ‘ప్రీత్ క్యా జుడీ, డోర్ క్యా బంధి’ బాణీలను యధాతథంగా తీసుకోవడం గమనించవచ్చు.
లుప్తమవుతున్న విలువలు:
‘సమాజంలో లుప్తమవుతున్న విలువలను చూసి బాధపడుతూ సాగే పాటను ‘ఒకే కుటుంబం’(1970) కోసం రాసాడు. నేటి మానవుడు మంచిని మరిచిపోతున్నాడు. వంచనతో మనిషి పశువవుతున్నాడని తెలియజేస్తున్నాడు.
పల్లవి:
మంచిని మరచీ – వంచన నేర్చీ మంచిని మరచీ –
వంచన నేర్చి నరుడే యీనాడూ – వానరుడైనాడూ వానరుడైనాడూ ॥మంచిని॥
చరణం1:
చదువూ, తెలివీ పెంచాడూ – చంద్రలోకము జయించాడూ
నీతులు చెప్పీ, గోతులు తవ్వీ పాతాళానికి జారాడూ
మెదడే పెరిగీ హృదయం తరిగీ – నరుడే యీనాడూ
వానరుడైనాడూ – వానరుడైనాడూ
చరణం2:
అందరి చెమటా చిందించాడూ – సంపద ఎంతో పెంచాడూ
పంపక మంటూ వచ్చే సరికీ అంతా తనదే అన్నాడూ –
ధనమే హెచ్చీ గుణమే చచ్చీ – నరుడే యీనాడూ
వానరుడైనాడూ – వానరుడైనాడూ
సైన్స్, టెక్నాలజి సాధించిన అభివృద్ధిలో మానవుడు చంద్రునిపై కాలుపెట్టాడు. విశ్వాంతరాళాల రహస్యాల్ని ఛేదించాడు. కానీ అంతర్ముఖీనుడు కాలేకపోతున్నాడు. దిగజారిన విలువలతో స్వార్థపరుడైనాడు. అందుకే తిరోగమనం చెందుతున్నాడని ఆవేదనతో వర్ణించాడు. డార్విన్ పరిణామ సిద్ధాంతం కోతి నుండి మనిషి ఆవిర్భవించాడని చెబుతుంది. ఈ జీవశాస్త్ర అంశాన్ని తీసుకొని ‘నరుడు వానరుడైనాడని’ వ్యంగ్యంగా రాశాడు.
ఆకలిని మరిపించడానికి మానసికంగా మురిపించడానికి దాశరథి రాసిన గేయం ‘మానవుడు దానవుడు’లో ఉంది.
దాశరథి పాటలలో మల్లెలు గులాబీలు పారిజాతాలు మొదలైన పూలపరిమళాన్ని ఘుమఘుమలు వెదజల్లాడు. వెన్నెల, తుమ్మెద, చిలకా, గోరింకలు, చీకటి, పారిజాతం,.. మొదలైనవి విరివిగా ప్రయోగించాడు. చైతన్యానికి ప్రతీకలుగా దీపాలు వాడుకున్నాడు.
దాశరధి పాటలలో వస్తునవ్యత, వస్తు విస్తృతి ఎంతగానో కనబడుతుంది. రసావేశం ఎక్కువే అని చెప్పాలి. ‘మనసు మాంగల్యం’ అనే చిత్రంలో గుండెలోని గాయాలే మండించే గేయాలని పాట పుట్టుకకు కవి పడే అంతర్మథనాన్ని వివరించారు. దాశరధి పాట వల్ల ఆ సినిమాకు సన్నివేశ బలం లేకున్నా సినిమాకి బలం కలిగిందన్న ప్రశంసలు పొందుకున్నారు.
దాశరథి రెండు దశాబ్దాల సినీగేయ సాహిత్య ప్రయాణం ‘నువ్వు చల్లంగా ఉండాలి’ అని దీవిస్తూ ‘బంగారు బాట’(1982) చిత్రంతో ముగిసింది. దాదాపు 650 పైగా పాటలు రాసిన దాశరధి సినీకవిగా ప్రఖ్యాతిగాంచాడు.
1977లో ఆస్థాన కవిగా నియమించబడ్డ దాశరథి 1984లో నిర్దాక్షిణ్యంగా ఎన్టీఆర్ ప్రభుత్వంచే తొలగించబడ్డాడు. ఆ అవమాన భారంతో కృంగి కృషించి, నశించి గుండెపోటుతో మరణించాడు. ‘నా గీతావళి ఎంతదూరం ప్రయాణంబౌనో అంతదాక ఈ భూగోళంబునకు అగ్గిపెట్టెద’ అని ప్రకటించిన విధంగా పద్యాలు, పాటలు, సాహిత్యమంతా తెలుగువాడి హృదయంలోకి ప్రవేశిస్తుంది. తెలుగు ప్రజల నాలుకలపై ధ్వని శబ్దమై నాట్యమాడుతాడు. పాఠకులకు, శ్రోతలకు తన అక్షరాలతోనే కాదు. తన ఆచరణద్వారా టన్నుల కొద్దీ ఆత్మ విశ్వాసం నింపుతూనే ఉంటాడు. సాహిత్యాకాశంలో నిత్యం ప్రజ్వలించే తార దాశరథి.
ఆధార గ్రంథాలు:
- అగ్నిధార
- నవమంజరి
- యాత్రాస్మృతి
- మదిలో వీణలు మ్రోగే
- దాశరథి సినిమా పాటలు
- సాహిత్య ప్రపంచంలో దాశరథి
- వివిధ పత్రికలు, యూట్యూబ్, ఆకాశవాణి
- ఇతరములు..
(సమాప్తం)