[22 జూలై 2025 శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ‘దాశరథి పాటలు’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. సిద్దెంకి యాదగిరి. ఇది మొదటి భాగం]
“ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచి మా
గాణములన్ స్రుజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని భో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?”
అని నిజాంపై గర్జించిన దాశరథి ప్రజాకవి. దాశరథి వేడుకలో అక్షరాలను అందమైన అల్లికలు అల్లి పూలలా వెదజల్లలేదు. నియంతపై నిప్పులు కుమ్మరించాడు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెగించాడు. మరణానికి ఎదురేగి మహాగానము చేసిన ఉప్పెన, ఉపద్రవము. యుద్ధక్షేత్రంలో నిలబడి తగిలిన గాయాలను తడుముకుంటూ నిప్పులుచెరిగే ఈటెల్లాంటి పదాలను విసిరి, విజృంభణ చేయడమంటే మరణంపైన రణం చేయడమే. పద్యాలతో చైతన్యం రగిలించి, క్షిపణుల్లాంటి అక్షరాలతో ఆయుధాలు చేయడమూ, సమూహాన్ని సాయుధ చేయడమంటే మృత్యువుతో కలెబడడమే. భయపెట్టే చావును భయపెడుతూ ముసలినక్కకు రాజరికం దక్కునే అని నినదిస్తూ ముందకుసాగిన అక్షరశరధి, ఆశయరథి, ప్రజాకవి దాశరథి. దాశరథి కలము, గళం మిళితం చేసిన నిఖార్సయిన నిలువెత్తు తిరుగుబాటు భావుటా దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పండిత పామర జనరంజకంగా మలిచాడు. ఆ పద్యాలు ప్రజలనాలుకలపై ‘నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అని నినదించిన సామూహిక యుద్ధమంత్రమైంది. రణతంత్రమైంది.
గడ్డిపోచల్లాంటి ప్రజల్ని తల్వార్లుగా మలిచిన అక్షరకేతనం, ఆత్మవిశ్వాసం నింపిన అగ్నిధార. రుద్రవీణను పలికించిన కవిత్వధార దాశరథి పద్యంతోపాటు లలితగీతాలు, సినిమా పాటలు, నాటికలు, కథలు, గజళ్లు, అనువాదము, విమర్శ, మొదలైన ప్రక్రియలకు ప్రాణం పోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న ఖమ్మంజిల్లా చినగూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మంజిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషుసాహిత్యంలో బి. ఏ చదివాడు. అగ్నిమంటల పోరుబాటలోనే ప్రారంభమైన సాహిత్యయానం అనేక ప్రక్రియల గుండా వెళ్లింది.
దాశరథి లలిత గీతాలు:
సహజమైన భాష. మృదువైన భావాలు, సరళమైన శైలిలో, లయతో కూడి, వినటానికి హృద్యంగా ఉండే కవితను ‘లలిత గీతం’ అంటారు. “గళగళలాడే భావనలను గానముగా మార్చేకళే లిలిత గీతం. ఇది శ్రావ్యంగా, హృద్యంగా, సామాన్యుడి మనసును తాకేలా ఉండాలి. భావానికి పదాన్ని విశేషమైన ప్రజాదరణ పొందాయి. లలిత గీతాలను వివిధ వస్తు విభాగాలు మనం చూడవచ్చు. ప్రకృతి, ప్రణయం, ప్రబోధం, సంస్కృతి, దేశభక్తి మొదలైన విభాగాల్లో వస్తునవ్యతతో, వస్తు విస్తృతితో రచించిన భావకవి దాశరధి కృష్ణమాచార్యులు. వారి లలితగీతాలు ‘నవ మంజరి’1950, ‘తేనెపాటలు’1960, ‘వలపు పాటలు’ 1963 పేర్లతో ప్రచురితమయ్యాయి. దాశరథి లలిత గీతాలు ఆకాశవాణిలో దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.
1950-59 మధ్యకాలంలో 20 లలిత గీతాలతో ‘నవమంజరి’ ప్రచురితమైంది. ఈ సంపుటిలోని పాటలు మధుర గుళికలు. నూతన భావుకత, ఊహాజనిత కాల్పనికత కలబోతగా సాగింది.
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో – నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥
భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో- ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో – కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో ॥ఆ చల్లని॥
మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో – రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో – ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥
అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమదెంత దూరమో – కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో – గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥
1949లో ముద్రితమైన “అగ్నిధార’లో ఈ పాట ఉంది. ‘భరతావని బలి పరాక్రమం చెరవిడే దింకెన్నాళ్లకో’ అని రాసాడంటే ఆ పాట 1947కి ముందే రాశాడేమో అనుకోవాల్సి వస్తుందని దివి కుమార్ కుమార్ (సాక్షి పత్రిక, 15-04-2014) అభిప్రాయపడ్డాడు. ఈ పాటను మొదటిసారిగా 1991లో జరిగిన కర్నూలు ఉపఎన్నికల్లో పీవీ నరసింహారావుకి వ్యతిరేకంగా మండల సుబ్బారావు కమ్యూనిస్టు నాయకునికి మద్దతుగా ఈ పాట బాణికట్టి అరుణోదయ రామారావు ఆ సభలో పాడాడు. ఈ పాటను కార్యక్రమంలో అనేక విధాలుగా మార్చి గాయకులు ఆలపిస్తున్నారు. ‘కానరాని భానువులెందరో’ అని దాశరథి రాస్తే భాస్కరులందరో అని గాయకులు పాడుతున్నారు. ఈ పాట కవికి అజరామరమైన కీర్తిని తెచ్చి పెట్టింది. సజీవులుగా ఉంచింది.
లలిత గీతాలలో స్త్రీలను, ప్రకృతిని పొగిడే పాటలలో
తల నిండా పూదండ దాల్చిన రాణి – మొలక నవ్వులతోడ మురిపించబోకే
మాటల్లో మాటల్లో మరిపించబోకే ॥తలనిండ ॥
పూల వానలు కురియు మొయిలువో – మొగలిరేకులలోని సొగసువో! నా రాణి! ॥తలనిండ॥
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు – నీ నీలవేణి లో నిలిచే నాకాశాలు ॥తలనిండ॥
నన్ను చూచి నవ్వి – పున్నమి వెన్నెల కాచి నా కొరకు కన్నీరు కురిసి వర్షము తెచ్చి ॥తలనిండ॥
తల నిండా పూలు ధరించిన ఓ రాణి నవ్వులతో మురిపించబోకు మాటలతో మరిపించబోకు పూల వానలు కురిసే మేఘనివు అందాల మొగలిరేకులు నా రాణి అని ప్రేయసిని ఒక ప్రియుడు కోరుతున్న సందర్భాన్ని లలిత మనోహరంగా ఆవిష్కరించాడు.
తెలంగాణ సాహిత్య అకాడమీ మలిముద్రణ గావించిన ‘పూల పాటలు’ అనే సంకలనం నుంచి దాశరధి పూల గురించి రాసిన పాట
ఓ మృణాళిని! ఓహో మృణాళిని – ఓ మృణాళిని! ఓహో మృణాళిని
నీ పుష్పవేదిపైని రమ నివాసమ్ము – నీ దివ్య వీధిలోన ఉషావిలాసమ్ము
నీ పూల పందిళ్ళలో లక్ష్మీ నృత్యమ్ము – నీయాకు పై నీటిచుక్క ఏ ముత్యమ్ము ॥ఓ మృణాళిని॥
ఓ తామరాకు నీ పుష్ప వేదికపై లక్ష్మీనివాసం, నీ దివ్య వీధులలో ఉషావిలాసం నీ పూలపందిళ్ళలో లక్ష్మి నృత్యం చేస్తుంది. నీ ఆకుపై నీటి చుక్క ఏ ముత్యం రూపము ధరిస్తుందో అని తామరాకును పొగుడుతుంటాడు.
అద్దమే చూచితినా అందులోన నీవేనే – పద్దెమే రాసితినా ప్రతి పదమూ నీవేనే
ఎందుకే అందముగా నన్ను చూసి నవ్వేవు – అంతలో కోపముగా పిడుగులను రువ్వేవు
మళ్లీ చల్లని నీ నయనాలు – నీడలా నీ వెంటే ఎన్నిసార్లు నడిచానే
మేడలా నా మదినే నీకోసం మలిచానే
అద్దం చూసిన అందులో అతని ప్రియురాలు రూపం కనబడుతుంది. కవికి పద్యం రాసిన ప్రతి పదంలో ఆమె కనబడుతుంది. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? అంతలోని కోపముగా చూపులు పిడుగులులా రువ్వుతున్నావు. నా గుండె పగిలిపోతుంది అని బాధపడుతూ నీవు నడిచొస్తే నా మది పువ్వులెన్నో పూస్తుంది. కోపమే చూపితే నా గుండె పగిలిపోతుందని తెలియజేస్తాడు.
నాలో చందమామ చిందు లేసే – చల్లనైన చందమామ చిందులేసే
నా మనసులో ఉన్న మధురమైన హాయి నిండెనే – కొమ్మపైన కోయిలమ్మ పాడే కమ్మగా
ఆ పాట విన్న మనసు నాలో పరవశించగా – మధురభావ లాహిరిలో తేలిపోతినే
వసంతాన్ని తెచ్చిన ఉగాదిని, నూతన సంవత్సర ఊహలను నిజం చేస్తూ ప్రకృతిని కలుపుతూ రాసిన దాశరథి పాటలో కనబడుతున్నది.
నిండుపున్నమి పండు వెన్నెలలో – నిను చేరగ నే నెటుల రాగలనో
నీలి నీలి ఆకసము నీడ – నే కాలి సవ్వడి లేక రాబోతే
మనసు నీకై పరుగు తీసెను – నా తనువు నీకై వేచెనురా
నిండుపున్నమి రోజున ప్రియుని చేరబోతుంటే ఆకాశము, తారలు, చంద్రుడు చూసిన విధానాన్ని, తెల్లని మల్లెలతో వెళుతుంటే నల్లని గండు తుమ్మెదలు అడ్డగించినా నా తనువు నీకై వేచియున్నదని అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న లలితగీతం.
ప్రభో మేలుకోరా ప్రభాతమైనది రా
బందీలైన తుమ్మెదలాన్ని ఇందీ వరముల విడిచెనురా – కిరణాలతో కమల నయనాలు కలిసే తరుణమాయరా మేలుకోరా
ప్రభువును మేలుకొమ్మని సుప్రభాతంలా కొలుస్తుంటాడు. బంధీలైన తుమ్మెదలు ఇందివరములను విడిచాయి. కిరణాలతో సూర్యుడు వస్తున్నా సమయం అవుతుంది. ప్రతి పువ్వులో పొంగుతున్న మధువును ఒలికించడానికి పువ్వులు విచ్చుకుంటున్నాయి మేలుకో ప్రభు మేలుకో అని ప్రభువును మేల్కొల్పుతాడు.
ఎవరిదో ఈ రేయి ఈ రేయి ఈ రేయి, నవ్వులు నవ్వే పువ్వులు రువ్వే జవ్వనిదోయి,
ఈ రేయి పువ్వు బోణిదే ఈ రేయి
వలరాజున కే గిలిగింత లేడే కలువ కంటి చలువ కంటిదే ఈ రేయి
ఈ రాత్రి ఎవరిదని ప్రశ్నిస్తాడు? నవ్వుల పువ్వులు రువ్వే జవ్వనిదని జవాబిస్తాడు. ఇది కన్నుకొసలతో కాంక్షలు రేపే కామిని రేయి భామిని రేయి అని రాత్రి శృంగారపరం చేస్తాడు.
మ్రోయింపుమూ నవవేణువు – తీయని వేణువు
నవజీవనరాగంతో – నాట్యమాడ ప్రతి రేణువు
నవ వసంతమే తేరగా – నెల బాలుడు దివి జేరగా
లోకము శోకమ్మువీడగా – జల రాశుల్లో దూరగా
కొత్తవి నువ్వు పలికించు నవజీవనరాగంతో నాట్యమాడడానికి ప్రతి రేణువు అనుకూలంగా ఉంది. వలపుల గంటలు మ్రోయుతుండగా వనమున కోయిలు కూయుచుండగా మదనుడు బాణముతో దూరుచుండగా మ్రోయుమని వేణువును వేడుకుంటాడు.
మానవతను ప్రేమించే మంచిరోజు రావాలి – మమతను సమతను పంచే సౌజన్యం కావాలి
భరతమాత బిడ్డలుగా ప్రజలందరూ బతకాలి – ప్రగతిని అవరోదించే వగతులను మార్చాలి
కులమతాలకు అతీతమవు గుణము పెంచుకోవాలి – మనమంతా కలిసి మెలిసి మనుగడ సాధించాలి
ఈ లలిత గీతములో మానవతను ప్రేమించే మంచి రోజురావాలనీ కోరుతాడు. మమతలు, సమతలు పెరుగాలనీ ఆకాంక్షిస్తాడు. తారతమ్యాలు లేకుండా భరతమాత బిడ్డలుగా బతకాలని వాంఛిస్తాడు. కులమతాల వ్యత్యాసాలు లేని గుణాలు పెంపొందించుకోవాలనీ, మనిషి సంఘజీవియని మరిచిపోకూడదనీ మరిమరి కోరుకుంటాడు.
బాలాగేయాలు:
దాశరథి రచనల్లో ‘పిల్లలారా!’ గీతం ఓ ఆణిముత్యం. భారత ప్రభుత్వం వారి సౌజన్యంతో ఆకాశవాణి ద్వారా, ఎన్సీఈఆర్టీ వారి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ద్వారా అన్ని రాష్ట్రాలలోని స్కూళ్లలో పిల్లలకు నేర్పబడింది. పిల్లలు ఈ దేశపు భవితవ్యాన్ని నిర్దేశించే వారు కాబట్టి వారి వ్యక్తిత్వాలు తీర్చిదిద్దటానికి, జాతీయత పెంచటానికి ఈ గీతం ఎంతో ఉపయోగకరం. దాశరథి ముందు చూపుకు, విశాల హృదయానికి, ఈ గీతరచనా పటిమకు చేతులెత్తి మొక్కాల్సిందే.
పిల్లల్లారా పాపల్లారా.. రేపటి భారత పౌరుల్లారా..
పెద్దలకే ఒక దారిని చూపే.. పిన్నల్లారా పిల్లల్లారా..
మీ కన్నుల్లో పున్నమి జాబిలి – ఉన్నాడు.. ఉన్నాడు.. పొంచున్నాడు
మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు – ఉన్నాడు.. ఉన్నాడు.. అతడున్నాడు
భారత మాతకు ముద్దుల పాపలు – మీరేలే.. మీరేలే..
అమ్మకు మీపై అంతేలేని – ప్రేమేలే.. ప్రేమేలే.. “పిల్ల”
దేశభక్తి పరిఢవిల్లేలా జాతిపతాకాన్ని ఎగురవేసి జాతి గౌరవాన్ని కాపాడవలసిందిగా పిల్లలను కోరారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించేలా ఒక్క భారతీయతనే మన మతంగా ఎంచుకొని బడిలో కలసిమెలగాలని ఉద్బోధించారు. అఖండ భారతావనిలో కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచి వీడరాని బంధాలను పెంపొందించాలని చాటారు.
‘నీలో దీపం వెలిగించు – నీవే వెలుగై వ్యాపించు..’ అంటూ మనిషి సంస్కరించుకోవాలని సాగిన ఈ గీతాన్ని డా.ఎం.బాల మురళీకృష్ణ ఆకాశవాణి కోసం ఆలపించారు. ‘బృందావనమెందుకు ` యమునా తటమెందుకు, నా ముందుర నీవుంటే ` నందనవనముంటే’, ‘చెరకు విల్లు చేతబూని రా – అరవిందం బాణంగా రా, హృదయాలను గెలుచుకో – ప్రణయాలను పెంచుకో’ అనే పాటను ఎస్‌పి జానకి పాడిరది. దాశరథి లలిత గీతాలలో వస్తు నవ్యత ఎక్కువగా కనిపిస్తుంది.
దేశభక్తి గీతాలు:
దాశరథి స్వాతంత్య్ర సమరయోధులు. దేశభక్తి గీతాలు రాసాడు. వాటిని నేటికీ రaండా వందనం రోజున ర్యాలీలలో పాడుతుంటారు. నాటికీ నేటికీ వాటి విశ్వాసనీయత, సార్వజనీనత అమోఘం. అద్భుతం. అంతకుముందు ఆ తర్వాత వచ్చిన దేశభక్తి పాటలపూదోటలో పారిజాతమే. దాశరథి పాటల ప్రత్యేకతే అది.
విశాల భారత దేశం మనది – హిమాలయాలకు నిలయమిది
ఇలాంటి దేశంలో ప్రజలంతా – విశాల హృదయంతో మెలగాలి
మతాలు వేరైతేనేమి భాషలు వేరైతేనేమి – భారతీయులం అందరం భారతదేశం సుందరం ॥విశాల॥
ప్రేమపతాకం చేతగొని ఐక్యపథంపై పయనిద్దాం
త్యాగశక్తి మనమహాయుధంగా దేశశత్రువులనెదిరిద్దాం ॥విశాల॥
అని సాగే పాటలో విశాలభారతదేశంలో ప్రజలంతా ఒక్కటే హృదయంతో కలసి మెలసి మెలగాలి. దేశంలో అనేక కులాలు, మతాలు వేరైనా మనం భారతీయులం, భారతదేశం అందరిది అనే ఏకతాభావం కలిగి ఉండాలనే బోధిస్తుంది. ద్వేషం, రోషం తొలగించుకోవాలి. ప్రేమ విస్తరిల్లాలి. బుద్ధగాంధీ బోధనలతో ఐక్యపథంపై నిలబడాలి. జాతీయ సమైక్యతను పెంచుకోవాలనీ ప్రబోధిస్తుంది.
భారతీయ వీరులం -భరతమాత బిడ్డలం
మాతృదేశ గౌరవం – కాపాడే ధీరులం,
శాంతికోరు పాపలం – సమత పెంచు బాలలం
మనం భారతీయులం – ఒకే తల్లి పిల్లలం
ప్రపంచాన మన దేశం – ప్రతిభను నిలబెడదాం ప్రతిభను నిలబెడదాం అనే పాటరూపంలో ప్రతిజ్ఞ చేయించినట్లే ఉంటుంది. ఈ పాట నా బాల్యంలో పాడాను. ఇదే పాటను నా విద్యార్థులచే పాడిస్తున్నాను. ఈ పాట అత్యంత సుళువయిన పదాలతో విన్నంతనే అర్థమయ్యే విధంగా ఉంటుంది. పిల్లలకు కూడా కంఠతా వచ్చేస్తుంది.
1960లో ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు రికార్డు చేసిన పాట
‘స్వేచ్ఛ భారతి జోహారు స్వాతంత్ర భారతి జోహారు – హిమగిరీశము నుండి అమృత వారధిదాకా
అఖిల భారత జనుల నలరించు తల్లి – నదులతో గిరులతో మరుశాసనములతో’ అని స్వేచ్ఛా భారతికి జోహారులు స్వాతంత్య్ర భారతికి జోహారులు అర్పిస్తుంటారు.
ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి ప్రబోధ గీతం
‘ఎగరేతామా సొగసైనా మనజండా – దిగివచ్చి దేవతలు దీవెనెలిస్తుండా ॥ఎగరేతామా॥
మనదేశం మనజాతి అంతా మనదేనోయ్ – మనదేశపు సంపదంతా మనకేనోయ్ ॥ఎగరేతామా॥
సొగసైన మనభారత జండాను వినీలాకాశంలో ఎగరేద్దామా. దివినుంది దిగివచ్చి దేవతలు దీవెనలు ఇస్తారు. పల్లెలోన, ఢల్లిలోన ప్రజలదీ రాజ్యం, భయం లేని జీవితంతో సేద్యం చేద్దాం. మనదేశ సంపదంతా మనదే. సమిష్టిగా కృషిచేద్దామనే కర్తవ్యబోధ ఉంది. దాశరథి దేశభక్తి గీతాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో కానీ అవి ఇచ్చే ఆత్మవిశ్వాసం అనంతం.
ప్రజాకవి దాశరథి – సినీరంగ ప్రవేశం:
కవి స్వతంత్రుడు. ప్రజాకవికి ఎనలేని స్వేచ్ఛ ఉంటుంది. కాలాన్ని కలంతో శాసించిన కవే అయినా సినిమా నియమాలన్నీ వేరుగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాకవి అస్వతంత్రుడు. సినిమా పాట కొన్ని నిబంధనల సంకెల్ల మధ్యన బంధించబడి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, సన్నివేశం ఈ మూడిరటి మిళితమే సినిమా పాట. దర్శకుడు, సంగీత దర్శకుడు చెప్పే సన్నివేశానికి, దర్శక, నిర్మాతలను ఒప్పించేవిధంగా పాట రాయాల్సి ఉంటుంది. ఇదంతా దాశరథికి కొత్తదే అయినా కవిత్వంలో చేసిన ప్రయోగాలు ఎన్ని ఉన్నాయో సినిమా పాటలలోనూ అన్ని ప్రయోగాలున్నాయి. కవిత్వంలో సుదీర్ఘ సమాసాలు ‘సూర్యచంద్రాగ్ని వాయువు భూమి గగనములు’, ‘దినకరచంద్రరవికిరణజ్వాలామాలికలు’, మొదలైన ప్రయోగాలను వదిలి, అతి సుళువైన అలతి అలతి లలిత పదాలను కలిపి జనరంజకంగా సినిమా పాటలు రచించిన ప్రయోగశీలి, నైపుణ్యశాలి దాశరథి.
సుదీర్ఘ సమాసాలతో రచన చేస్తే ప్రేక్షకున్ని చేరకపోవచ్చు. అదే కవిత్వమయితే పుస్తకంలో పదేపదే చదివి అర్థం చేసుకునే నిదానంగా అవకాశం ఎక్కువ. ప్రేక్షకుడు, శ్రోత సినిమా పాట వింటాడు. పాడుకుంటాడు. పరవశిస్తాడు. విన్నంతనే అర్థమవ్వాలి. అలాంటి పాటల్ని అవలీలగా, అలవోకగా లలితమైన పదాలతో అద్భుతమైన భావకతను ప్రవేశపెట్టి దాశరథి రాశారు.
దాశరథి సినిమా రంగంలో ప్రవేశించేనాటికి లబ్ధ ప్రతిష్టులైన సముద్రాల, పింగళి, మల్లాది, శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర, ఆత్రేయ, కొసరాజు లాంటి కవులు వెండితెరపై వెలుగుతున్నా, దాశరథి సినిమా రంగంలో ప్రవేశించి ప్రయోగాలతో తనదైన ముద్రవేశాడు.
భాషాపరంగా దాశరథి ఎన్నో అవాంతరాలు అవలీలగా అధిగమించాడు. ఇంటో సంస్కృతం. వీధిలో ఉర్ధూ ప్రభావం ఉన్నా తెలుగులో విస్తృతమైన కృషిచేసాడు. సంస్కృత గ్రంథాలను ఒంటబట్టించుకున్నారు. గాలిబ్ గజళ్ళూ తెలుగులోకి అనువదించారు. మీరా అసదుల్లా ఖాన్ గాలీబ్ రాసిన గీతాలలో ‘ఇష్క్ పర్ జోర్ నహి `హై యే ఓ ఆతిష్ గాలీబ్, కి లగాయిన లగే, ఔర్ ముజాయిన బనే’ అనగా తెలుగు అనువాదం ‘ప్రణయమనగా అగ్గి వంటిది. అంటించిన అంటదు. ఆర్పినంతన ఆరబోదు” అనే గాలీబ్ తత్త్వాన్ని దాశరథి 1961లో ‘గాలిబ్ గీతాలు’ అనే పుస్తకం అనువదించి అక్కినేని నాగేశ్వరరావుకి అంకితం ఇచ్చారు. ఆ స్వేచ్ఛానువాదాన్ని, శైలిని గమనించిన నాగేశ్వరావు అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావుకి పుస్తకం ఇచ్చి, ఇది చాలా అద్భుతమైన అనువాదమని కొనియాడాడు. దాశరథి నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే మంచిదని ఒక చిన్న సలహా ఇచ్చారంట. నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు ఒప్పుకున్నారు. అక్కినేని తన సినిమాకి పాట రాయించుకున్నారు. అప్పటికే ఆత్రేయ తాను దర్శకత్వం వహిస్తున్న ‘వాగ్దానం’ సినిమాకి తాను గీతరచన చేస్తూనే లబ్ద ప్రతిష్టులైనటువంటి రచయితలతో పాటలు రాయించాలని శ్రీశ్రీని, ఆరుద్రని, దాశరథిని మద్రాసుకి పిలిపించారు. అప్పుడు దాశరథికి ఒక ప్రణయగీతం రాయమని స్వేచ్ఛా, భావగీతం రాయమని కోరారు. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని దాశరథి వదులుకోలేదు.
పల్లవి:
నా కంటిపాపలో నిలిచిపోరా – నీవెంట లోకాల గెలువనీరా
ఆమె:
ఈనాటి పున్నమి – ఏనాటి పున్నెమో- జాబిలి వెలిగేను మనకోసమే ॥ఈనాటి॥
అతడు:
నెయ్యాలలో తలపుటుయ్యాలలో – అందుకొందాము అందని ఆకాశమే
ఆమె:
ఈ పూలదారులు ఆ నీలితారలు – తీయనిస్వప్నాల తేలించగా
అతడు:
అందాలను తీపిబంధాలను అల్లుకొందాము డెందాలు పాలించగా ॥ఈనాటి॥
అని రాసిన ఈ పాట, ఇది ప్రేయసి ప్రియుల మధ్య ప్రణయాన్ని లాలిత్యమైన శృంగారాన్ని గురించి రాసిన అద్భుతమైన పాట కనిపిస్తుంది. ఆకాశాన్ని అందుకున్న ప్రేమికుల పరవశం వెన్నెల స్నానాలు చేయించింది. ఆ జంట తన్మయత్వము చెందిన పున్నమి బహుజన్మల పుణ్యం వలన సిద్ధించిందని సమీకరణ చేయడం కవి ప్రతిభకు పరాకాష్ట. జాబిలి, మేఘాలు, తారలు ద్వారా ప్రేమను అభివ్యక్తం చేస్తారు. వెన్నెల స్నానం, ఆకాశంలో వలపురాగాలు వంటి చిత్రాత్మక భావనలు. మొదటి పాటలో తన ప్రతిభ పాటవాలను ప్రదర్శించి విమర్శకుల మెప్పు పొందాడు. అయితే వాగ్దానం సినిమా విడుదల కాలేదు.
సినీ ప్రజానీకానికి అది ఇంకా చేరకముందే నాగేశ్వరరావు ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో సాలూరి రాజేశ్వరరావు సంగీతబాణికి అనుగుణంగా రాయాలి. సాలూరు రాజేశ్వరరావు జగణాలున్న ఉన్న ట్యూన్ యిచ్చి ‘చాలా కష్టమండోయ్ రాయడం’ అని సవాలు చేశారు. సంగీత దర్శకులు కోరుకొనిన రీతిలో ఆ బాణీలో పాటను 15 నిమిషాలలో అందించాడు. బాణీ వెంట భావం వెళ్ళాలి. భావం వెంట బాణీ రాదు. అలా రచించిన ఆ పాటనే..
పల్లవి:
ఖుషీఖుషీగా నవ్వుతూ – చలాకి మాటలు రువ్వుతూ, హుషారు గొలిపేవెందుకే- నిషా కనులదానా’
చరణం:
ఆమె: మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలీ మీనా – నింగిదాటి ఆనందసాగరం పొంగిపొరలె నాలోనా
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ – హుషారు గొలిపే నిందుకే నిషా కనులవాడా!
చరణం:
అతడు: ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందమా నేడే
ఆమె: నీలినీలి మేఘాల రథముపై తేలిపోద మీనాడే
అతడు: చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా
ఆమె: నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా
ఇద్దరూ: ఖుషీఖుషీగా నవ్వుతూ – చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా వుందాములే – హమేషా మజాగా
ఖుషీఖు (జగణం – తనాన) షీగా నవ్వుతూ – చలాకి(జగణం – తనాన) మాటలు రువ్వుతూ, హుషారు(జగణం – తనాన)గొలిపే వెందుకే- నిషా క(జగణం – తనాన)కనులదానా, మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలీ మీనా, నింగిదాటి ఆనందసాగరం పొంగిపొరలె నాలోనా, “ఖుషీఖుషీగా”, “చలాకి మాటలు”, “హుషారు”, “మజ్నూ”, “లైలా” ఈ పదాలు ఉర్దూ శైలిని తెలుగులో కలిపి, ఒక కొత్త ధ్వని, ప్రాస, తీయదనాన్ని అందించాయి.
“ఇంద్రధనుస్సుపై ఆడుకుందామా”, “చంద్రుడు నేనై నీవు వెన్నెలూ కలసిపోవుదమా.. అని మనసును ఆవిష్కరించారు. ఇద్దరు మిత్రులు’లో ఎస్. రాజేశ్వర్రావు సంగీతంలో దాశరథి రాసిన రెండు పాటలూ గొప్పవే. మొదటిది ‘ఖుషీఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ’. రెండోది ఖవ్వాలి పాట. ఆ పాటతో తెలుగు సినిమాల్లో ఖవ్వాలి పాటలకు శ్రీకారం చుట్టారాయన.
ఆ రోజు మొదటి పాట ఓకే కాగానే దుక్కిపాటి మధుసూదన్ రావు “మాకు ఖవ్వాలి పాట కావాలి” అన్నారు. రెండు క్షణాలు ఆలోచించి “నవ్వాలి నవ్వాలి, నీ నవ్వులు నాకే ఇవ్వాలి” అని అన్నారు. అంతే, అందరు ఆశ్చర్యపోయారు. ట్యూన్‌కి ఆ పదాలు అల్లుకుపోయాయి. నిమిషాల్లో పాట పూర్తయ్యింది. “అమ్మో! హైదరాబాద్ దెబ్బ గట్టిదే” అనుకున్నారట అంతా. ఇలా మొదలైన దాశరథి సినిమా పాటల ప్రస్థానానికి తిరుగు లేకుండా పోయింది.
పల్లవి:
నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే యివ్వాలి
అందాల చిన్నవాడ బంగారు వన్నెకాడ నీకున్న చింతా వంతా యీనాడే తీరాలి॥నవ్వాలీ॥
చరణం1:
కలిమీ బలిమీ కలవాడవోయి – కలతలలో మునిగిపోనేలనోయి
మనసూ దోచుకొనీ ఏ చిన్నదో దాచినదా
నిన్ను కవ్వించీ నిన్ను నమ్మించీ – దగా చేసి పోయినదా॥నవ్వాలీ॥
చరణం:
మీ కోసమేనోయి నా విలాసము – మీ అందరిదేనోయి యీ వినోదము
పున్నమ చందురుడు చిందించే అందాలు – కలువల కన్నిటికీ కలిగించును సరదాలు ॥నవ్వాలీ॥
ఇద్దరూ :
ఖుషీఖుషీగా నవ్వుతూ – చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా వుందాములే – హమేషా మజాగా ॥నవ్వాలీ॥
దాశరథిగారి ఉర్దూ భాష ప్రావీణ్యం, తెలుగు సినీగీతాలను నవీనశిల్పంలో నిర్మించడానికి తోడ్పడిరది. ఈ నిర్మాణంలో వెలువడిన తొలి పదశిల్పమే యీ గీతం. నాయికా నాయకులు, తమ ప్రణయం, పరిణయంగా మారే పరిణామాన్ని ఊహించుకున్న తీరును దాశరథి చిత్రించారు.
అనుబంధం, ఒకరికొకరి అవసరం, ఆత్మీయత ప్రధానంగా వ్యక్తమవుతున్న పాటను బాబూ మూవీస్ (1962) చిత్రం కోసం రాశారు.
పల్లవి:
ఆమె: నన్ను వదలి నీవు పోలేవులే- అదీ నిజములే, పూవులేక తావి నిలువలేదులే లేదులే ॥నన్ను॥
అతడు: తావిలేని పూవు విలువలేదులే – ఇదీ నిజములే నేను లేని నీవు లేనెలేవులే లేవులే
చరణం1:
ఆమె: నా మనసే చిక్కుకునే నీ చూపులవలలో – నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే యీనాటికి నిజమాయె – దూరదూర తీరాలు చేరువై పోయె.. ఓ..
అతడు: తావిలేని పూవు విలువలేదులే – ఇదీ నిజములే, నేను లేని నీవు లేనెలేవులే లేవులే
చరణం3:
అతడు: తొలినాటి రేయి – తడబాటు పడుతూ, మెలమెల్లగా నీవు రాగా,
నీ మేని హొయలు – నీలోని వగలు నాలోన గిలిగింతలిడగ
ఆమె: హృదయాలు కలసి – ఉయ్యాల లూగి, ఆకాశమే అందుకొనగా,
పైపైకిసాగి మేఘాల దాటి – కనరాని లోకాలు కనగా..॥నన్ను॥
జీవితాన్ని శుభప్రయాణంగా చూపిస్తూ, ప్రేమను శుద్ధమైన, పరిపూర్ణమైన అనుభూతిగా నిలుపుతుంది. ఈ పాటలో నాయికానాయకుల ప్రణయ జీవనం, పూవుతావి వలె అవిభాజ్యంగా ఉండాలని, అంబరాన్ని దాటి ఆనందతీరాల వైపు సాగిపోవాలనే అంశాన్ని రసరమ్యంగా వర్ణించారు. లలిత పదాలతో దాశరథి మనసు మెలికలు పెట్టాడు. ‘చూపులవల’, వంటి పదబంధాలు కొత్తగా పరిచయమయ్యాయి.
ప్రణయ గీతాలలో పేరేన్నికగన్న పాటగా నిలిచిపోయిన దాశరథి పాట ‘తోట రాముడు’(1975) సినిమాలోని అలక, ప్రేమ ఒలకపోస్తూ కమనీయంగా కలిపి రాసిన పాటగా నిలిచిపోయింది.
పల్లవి:
అతడు: ఓ బంగరు రంగుల చిలకా పలకవే –
ఆమె: ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
అతడు: నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ ॥ఓ అల్లరి॥
ఆమె. నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ
అతడు. పంజరాన్ని దాటుకునీ, బంధనాలు తెంచుకొని -నీ కోసం వచ్చా ఆశతో,
చరణం. అతడు. మేడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ – నిరుపేదను వలచావెందుకే
ఆమె: నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే ॥ఓ బంగరు॥
చరణం3. సన్నజాజి తీగుందీ, తీగమీద పువ్వుందీ – పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది – జుంటి తేనె కోరిందీ
అందించే భాగ్యం నాదిలే – ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ॥ఓ అల్లరి॥ ॥ఓ బంగరు॥
ఆధునిక భావాలు గల నవయువతీ హృదయ స్పందనను ఈ పాట ప్రతిబింబిస్తుంది. ప్రేమంటే ఆస్తులు, అంతస్తులు కావు. అంతరంగంలో దాగిన ఆత్మీయత, ఆప్యాయత కలగలిసిన జీవితకాలపు నమ్మకాన్ని అక్షరీకరించాడు. మేడ మీద చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలిచావెందుకు అని అడిగినప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కథ నిన్ను చేరడానికి నీ చేతులలో పులకించడానికి అని చెప్పడం ఎంత సహజంగా ఉందో, ఎంత మధురంగా ఉంటుందో ప్రేమలో ఉన్న నిచ్చలత తాలూకు స్పర్శ, ఆకాంక్షల మిశ్రమాన్ని చాలా సున్నితంగా అలతి అలతి పదాలతో కవితాత్మక గీతంగా మన హృదయాన్ని తాకుతాయి.
1970లో విడుదలైన ‘శ్రీదేవి’ సినిమాలో నాయికా నాయకులు పంపుకున్న ప్రేమలేఖల తీరు రమణీయంగా రచించాడు. వారి విరహవేదనను విపులీకరిస్తూ మనసుని ఇచ్చి పుచ్చుకున్నట్లు రాసిన తీరులో మాధుర్యం పొంగిపొరలింది.
పల్లవి:
రాశాను ప్రేమలేఖలెన్నో.. దాచాను ఆశలన్ని నీలో – భువిలోన మల్లియలాయే.. దివిలోన తారకలాయే నీ నవ్వులే ॥రాశాను॥
చరణం1:
కొమ్మల్లో కోయిలమ్మా.. కోయన్నది, కొమ్మల్లో కోయిలమ్మా కోయన్నది.. నా మనసు నిన్నే తలచీ ఓ యన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది.. చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది ॥రాశాను॥
చరణం2:
నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో.. ఊహూ.. – నీ చల్లని రూపం ఉందీ నా కనులలో..
నాలోని సోయగమంతా విరబూసెలే.. – నాలోని సోయగమంతా విరబూసెలే.. మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
చరణం3:
అందాలా పయ్యెద నేనై ఆటాడనా.. ఆ.. కురులందు కుసుమం నేనై చెలరేగనా.. ఆ..
నీ చేతుల వీణను నేనై పాట పాడనా.. నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా ॥రాశాను॥
ఉప్పొంగే ప్రేమ భావాలను ఎత్తిపోసిన లోతైన గాఢత గలిగిన భావోద్వేగ సంబంధాన్ని ఈ పాట వ్యక్తీకరిస్తుంది. ఆమె నవ్వుల్ని దివిలోని తారకలాయే నీ నవ్వులే అనడం వినీలాకాశంలో నక్షత్ర శోభలా ఉందని చెబుతుంది. నీ చేతుల వీణను నేనైపాట పాడనా అని తన ప్రియురాలు చేతుల్లో వీణగా ఊహించుకుంటాడు. ఆమె చేతులు ఆ స్పర్శ సంగీతం రాగాలుగా పలుకుతుందని ఊహిస్తాడు. కురులందు కుసుమం నేనే అనగా జడలో పువ్వును నేనే అని వివరిస్తాడు. ఎన్నో భావాలను ప్రేమలేఖలో రాశానని వివరిస్తాడు.
జీవితంలో పెళ్లి గొప్ప వేడుక. ఆ పెళ్లి గురించి ఊహించుకుంటారు. అలాంటి ఊహల గురించి ‘శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ (1976) చిత్రంలో అద్భుతంగా రాశారు.
పల్లవి:
ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా ॥2॥
అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంటా – దీవనలు ఇస్తారంటా ॥ఆకాశ॥
- తళుకు బెళుకు నక్షత్రాలు – తలంబ్రాలు తెస్తారంటా ॥2॥
మెరుపు తీగ తోరణాలు – మెరిసి మురిసి పోయేనంటా – మరపు రాని.. వేడుకలంటా॥ఆకాశ॥
- పిల్ల గాలి మేళ గాళ్ళు పెళ్ళిపాట పాడేరంటా ॥2॥
రాజహంస జంట చేరీ రత్న హారతిచ్చేరంటా ` రాసకేళి..జరిపేరంటా.. ॥ఆకాశ॥
- వన్నె చిన్నెలా ఇంధ్రధనసు పై వెన్నెల పానుపు వేసేనంట ॥2॥
మబ్బులు తలుపులు మూసేనంటా..ఆ..ఆ..ఆ..- మబ్బులు తలుపులు మూసేనంటా..
మగువలు తొంగి చూసేరంటా – మనలను.. గేలి.. చేసేరంటా.. ॥ఆకాశ॥
వారి పెళ్లి ఆకాశంలో లేదా స్వర్గంలో జరుగుతుందని ఊహాలోకంలో వివరిస్తారు. ఆ పెళ్ళికి ఆకాశమే పందిరి. తళుకు బెలుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట అనడం ఖగోళశోభ జోడిరపు. మెరుపుతీగలే తోరణాలుగా ఊహించటం పెళ్లి వేడుకతో శోభాయమానంగా అలంకరించినట్లుగా ఉంది.
జన్మజన్మాల బంధాన్ని విశ్లేషిస్తూ రాసిన పాట ‘పూజ’(1975) చిత్రంలో ప్రేక్షకులపై చెదరని ముద్రవేసింది. ఈ చిత్రంలో అన్ని పాటలు దాశరథి రాసినవే. దాశరథి మంచి అనువాదకుడు. సంగీత దర్శకులై రాజ్ నాగేంద్రలు కన్నడంలో తీసిన ‘పూజ’ సినిమాలోని ‘ఎందెందు నిన్నను మరెదు’ బాణీనే యథాతదంగా తీసుకున్నారు. అనువాదంలా గాకుండా ఇక్కడి స్థానీయతని జొప్పించి అద్భుతంగా తెలుగు పాటలా రాసాడు. ఈ పాట దాశరథిó ఖ్యాతినందించిన ఆల్ టైం హిట్ గా నిలిచింది.
పల్లవి:
అతడు. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ – ఆమె. ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
అతడు. ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను – ఆమె. ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ॥ఎన్నెన్నో॥
ఆడనా.. పాడనా.. ఆడనా..
చరణం:
కోటి జన్మలకైనా కోరేదొకటే – నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి
ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా – ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ. ఉండనీ.. ఉండనీ..
“నీలో సగమై ఎపుడూ నేనుండాలి”, “నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా” ఈ వాక్యాలు ప్రేమికుల “జీవితసాఫల్యాన్ని”, “పరిపూర్ణతను” ప్రేమికుల ఏకత్వాన్ని తెలియజేస్తాయి. “విరిసిన కుసుమం నీవై”, “జాబిలి నే”, “మేఘం నీవై నెమలిని నేనై” మొదలైన పోలికలు చాలా బాగున్నాయి. ఈ పాట ఈనాటికీ ప్రతి వివాహవేదికలపైనా, ఆర్కెస్ట్రాలో గాయనీ గాయకులు పాడుతుండడం మనం చూడవచ్చు.
‘గూడుపుఠాణి’(1972) చిత్రంలో తన తనివి తీరలేదే పాట వెంట శ్రోతలను పరిగెత్తిస్తాడు. వారి మనసే ఆవిష్కరణ చేసాడా అని అనిపిస్తుంది.
పల్లవి:
తనివి తీరలేదే – నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం
చరణం:
ఎన్నో వసంతవేళలలో – వలపుల ఊయలలూగామే ॥ఎన్నో॥
ఎన్నో పున్నమిరాత్రులలో – వెన్నెల జలకాలాడామే ॥2॥
అందని అందాల అంచుకే చేరిననూ ॥2॥
విరిసిన పరువాల – లోతులే చూసిననూ॥తనివి॥
చరణం:
ఎప్పుడు నీవే నాతో ఉంటే.. – ఎన్ని వసంతాలైతేనేమి
ఎన్ని వసంతాలైతేనేమి – కన్నుల నీవే కనబడుతుంటే..
ఎన్ని పున్నమలు వస్తేనేమి – వెచ్చని కౌగిలిలో
హాయిగా కరిగించిననూ – వెచ్చని కౌగిలిలో ॥తనివి॥
ప్రేయసి ప్రియులు తనివి తీరలేదని ఎంతసేపు గడిపిన మనసుకు తృప్తికలగలేదనీ, పరస్పరం తమభావాల్ని పంచుకుంటున్నటువంటి సందర్భంలో అంతరంగాలను ఆవిష్కరించిన మనసుల సునాదం. ఇందులో ‘వలపుల ఊయల’, ‘వెన్నెల జలకాలు’, చంద్రుని కాంతితో పోల్చడం వల్ల శృంగార రసానికి ఒక దృశ్యరూపాన్ని ఆపాదించింది. అందని అందాల అంచు అందలేదని తృప్తి చెందలేదని సూచిస్తుంది. తేనెల కురిపించు హృదయం అనే పంక్తులు అద్భుతంగా దాశరధి చిత్రించారు.
సంగీతమే జీవితంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ చెళ్ళపిళ్ళ సత్యం ఒకరు. ఆయన తెలుగు, కన్నడ భాషలలో దాదాపు అరవై వరకు చిత్రాలకు సంగీత దర్శకబాధ్యతలను నిర్వహించారు. తెలుగు చిత్రరంగంలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన మొదటి చిత్రం 1973లో వచ్చిన ‘కన్నె వయసు’. అందులోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో..’ పాట ఆయన స్వరపరచిన పాటల్లో ఆయనకు ఇష్టమైనదిగా చెప్పవచ్చు. ఆపైన ఆయన ఎన్నో మధురమైన పాటలకు స్వరకల్పన అందించారు. అలాగే, దాశరథి గారంటే చిత్రరంగంలో ఒక ఉన్నతమైన అంచనాలతో కూడిన గుర్తింపు ఉంది. ఆయన వ్రాసిన ఏ ప్రణయ రాగమైనా అది వినూత్నమై మనసును ఆకట్టుకుంటుంది. కారణం దాశరథి కలం నుండి జాలువారే భావ ప్రకటన అంత మధురంగా ఉంటుంది.
ఏ దివిలో విరిసిన పారిజాతమో – ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో – నా మదిలో నీవై నిండిపోయెనే ॥ఏ దివిలో॥
నీ రూపమె దివ్య దీపమై నీ నవ్వులె నవ్య తారలై – నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
- పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే – నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే – నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన – కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే॥ఏ దివిలో॥
- నిదుర మబ్బులను మెరుపుతీగవై – కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు – ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవైరావే ॥ఏ దివిలో॥
దాశరథి పాటల పూదోటలో విరిసిన పారిజాతం. ఈ పాటతో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సినీ స్వరజీవితాన్ని మలుపుతిప్పిన మధురగీతంగా నిలిచిపోయింది. ఈ పాట నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. లేత సిగ్గులు పల్లవించగా రావే. రాజహంసలా రావే అని ప్రేయసిని పిలుస్తాడు. బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలకించినది నీవే. పదము పదములో మధువులూరగా కావ్య కన్యకవై రావే అని పిలువడం ఆహర్యాన్ని వర్ణిస్తూ ఆహ్వానించడం ఎంతో సముచితంగా ఉంది.
దేశభక్తి గీతాలు:
దాశరథి దేశభక్తి గీతాలు దేశభక్తిని నూరిపోసాయి. వారి తొలి సినీగీతం. గాంధీజి ఉప్పు సత్యాగ్రహం నాటిది. బ్రిటిష్ వారు పన్నుల పేరిట రైతుల నెత్తురు పీల్చినారు. వాటి నేపథ్యంగా వచ్చిన ‘పదండి ముందుకు!’(1962) చిత్రంలోని పాటలు.
పల్లవి:
మేలుకో సాగిపో – బంధనాలు తెంచుకో ॥2॥ – బరువులూ బాధలూ అందరితో పంచుకో ॥మేలుకో॥
చరణం:
పల్లెనకా, పట్నమనక అందరమూ కలసి – కులమనకా మతమనకా మనం కలిసిమెలసి
దేశాన్ని దోచుకునే తెల్లవాణ్ణి తరిమీ – జైళ్లలోని వీరులను నేడే విడిపించుకో ॥మేలుకో॥
చరణం:
తలయెత్తుకు తిరగలేని బతుకు లెందుకోయ్ – పరదేశపువాడు పెట్టు మెతుకులెందుకోయ్
భరత జాతి గౌరవాన్ని కాపాడవోయ్ – తెల్లవాడు వెళ్లువరకు వెంటాడవోయ్
దాశరథిగారి తొలి సినీ ప్రబోధగీతమిది. ఈ పాటకు మరో ప్రత్యేకత మహమ్మద్ రఫి తెలుగు తెరకు పరిచయమయ్యారు. సినిమా కథాకాలం గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం నాటిది. బ్రిటిష్ వారు పాలన పేరుతో రైతుల నెత్తురు పీల్చినారు. ఎదురించిన దేశభక్తులను బంధించారు. సమస్త ప్రజలు ఉద్యామించాలనీ సాగిన గీతం. ఈ పాట ఒక ఉద్రేకభరితమైన జాగరణ గీతం సామాజిక చైతన్యం, జాతి గౌరవం, పేదల శ్రమ, బ్రిటిష్ పాలన కీచకత్వం.. ఇవన్నీ కలగలిసిన సారవంతమైన సందేశం.
ప్రకృతి సంబంధిత పాటలు:
‘పిట్టే’ కదా అని తేలిక భావంతో చూడవద్దని ఆ చిన్ని మననులో ప్రపంచమంతా దాచుకొన్నదని చెప్పారు.
పల్లవి:
గోదారి గట్టుంది – గట్టుమీద సెట్టుంది. సెట్టుకొమ్మన పిట్టుంది – పిట్టమనసులో ఏముంది? ఓ.. ॥గోదారి॥
చరణం:
ఒగరు ఒగరుగా పొగరుంది – పొగరుకుతగ్గ బిగువుంది,
తియ్యతియ్యగా సొగసుంది – సొగసునుమించే మంచుంది॥గోదారి॥
చరణం:
పిట్టమనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది. అంతు దొరకని నిండుగుండెలో.
ఈ పాటకు ప్రేరణ తమిళ పాట “తనయన్” (1962)లోని కణ్ణదాసన్ రచించిన “కావేరి కరై ఇరుక్కు..” పాట నుండి తీసుకున్నదని దాశరథి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడ కావేరి నది తీరపు సౌందర్యం వర్ణన కాగా, ఇక్కడ గోదావరి గట్టు, పిట్ట, ప్రకృతి సౌందర్యం, మానసిక భావాలు ప్రాధాన్యంగా ఉన్నాయి.
గోదారి గట్టుపై కూర్చుండి పిట్ట మనసు గురించి ఆలోచించడం మనసులో కలిగే అనుభూతి ప్రకృతి ప్రేమ జీవన రహస్యాల సంఘమే ఈ పాటలో కనబడుతుంది. మనిషి గుండెలో ఉండే అనుభూతులు ఆశలు ప్రేమలు వాటి కొలతలు ఉండవు. పిట్ట ప్రతీక చిన్నది. అది సూచించే భావాలు నూతనమైనవి. ఎండా పువ్వు ముళ్ళు మొదనవి జీవితంలోని సుఖదుఃఖాలు. పిట్టమనసు అంతర్గత స్థితిని, అంతులేని లోతులను వెల్లడిపరిచే, వెల్లడిపరచని అంశాలుగా చిత్రీకరించారు.
లేడీ ఓరియెంటెడ్ పాటలు:
దాశరథి స్త్రీలపై సహానుభూతి కలిగి, పక్షపాతిగారాసిన పాటలు చాలా ఉన్నాయి. స్త్రీ అంతరంగ ఆవిష్కరణ ఆ పాటలలో మనకు దర్శనమిస్తుంది. వేదన, విరహము, బాధలు మొలైనవన్నీ కూడా అందులో కనిపిస్తాయి.
‘పూలరంగడు’ సినిమా (1967)లో ఒంటరితనం ఏ విధంగా బాధిస్తుందో తెలిపిన విరహవేదన.
పల్లవి :
నీవురావు నిదురరాదు – నిలిచిపోయీ రేయి ॥నీవు॥
చరణం:
తారా జాబిలి ఒకటై సరసమాడె – ఆ రేయి చింతా చీకటి ఒకటే చిన్నబోయే ఈ రేయీ
చరణం:
కౌగిలిలో ఒదిగిపోయి, కలలుగనే వేళాయె ఎదురుచూసి, ఎదురుచూసి కన్నుదోయి అలసిపోయె ॥నీవు॥
విరహగీతాల రచనలో దాశరథి విలక్షణతను వివరించే గీతమిది. నాయకుడు రానందుకు, నిదురే రావడం లేదా నాయికకు. అందులో విశేషమేమిలేదు, కానీ రేయే నిలిచిపోయిందని చమత్కరించారు దాశరథి.
ఆ రేయి రెండు రకాల అనుభూతులనందిస్తుంది. తారాచంద్రుల సరససల్లాపాలకు అనుకూలమే కాని నాయికలోని విరహవేదనకు ప్రతికూలమయిందట. ఆమె విచారాన్ని (చింత) చీకటితో పోల్చారు.
‘మనుషులు మమతలు’(1965)సినిమాలో ముక్తపదగ్రస్తంతో రాసిన పాట ఆపాతమధురం. వెన్నెల మేఘాలలో శృంగార రసోద్దీపితల వస్తువులు. చల్లని వెన్నెలరాత్రిలో నాయిక చేతిలో మ్లెల పరిమళాలను ఆస్వాదిస్తూ భర్తను కలగంటున్న సందర్భంలో రాసిన పాట
పల్లవి:
రాధ:
వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమఘుమలు – వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమఘుమలు
ఘుమ ఘుమలో..ఓఓ..గుస గుసలు – ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు
చరణం:
నీ హృదయంలో..నిలవాలని..ఈఈఈఈ – నీ కౌగిలిలో..కరగాలని..ఈఈ
నీ హృదయంలో..నిలవాలని..ఈఈఈఈ – నీ కౌగిలిలో..కరగాలని..ఈఈ
నీవే నీవే..కావాలని..ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు ॥ వెన్నెలలో ॥
ఈ పాట, నీ హృదయంలో నిలవాలని.. నీ కౌగిలిలో కరగాలని”, “హృదయంలో నిలవడం”, “పూల పల్లకిలోన తేలిపోయే సమయాన”, ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలను, కోరికలను, సన్నిహిత క్షణాలను చాలా అందంగా వ్యక్తం చేస్తాయి. “వెన్నెల”, “మల్లెలు”, “పూల పల్లకి” వంటి పదాలతో రసరమ్య శృంగార కావ్య దృశ్యాన్ని సృష్టించాయి.
(ఇంకా ఉంది)