[22 జూలై 2025 శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ‘దాశరథి కవితాపయోనిధి’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
దాశరథి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య. ఇంటి పేరును పేరుగా మార్చుకున్న మహాత్ముడు. జులై 22 1925 నాటి ఖమ్మం జిల్లా నేటి మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు గ్రామంలో వెంకటాచార్యులుగారు, వెంకటమ్మ దంపతులకు పుత్రుడుగా జన్మించాడు. తండ్రి సంస్కృతాంధ్ర ద్రావిడభాషలలో గొప్ప పండితుడు. నాలాయిర్ ప్రబంధాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప కవి. వెంకటమ్మగారు తెలుగు కావ్యాలతో, ప్రబంధాలతో తెలుగు భాషను నేర్పించారు. మానవత మూర్తిభవించిన స్త్రీమూర్తి. విద్యాభ్యాసము ఉర్దూలోకూడా జరిగింది.
చిన్నతనం నుంచి స్వతంత్రభావాలున్న వ్యక్తి దాశరథి. ఆయన విద్యాభ్యాసం చిన్నగూడురు, ఖమ్మం, భోపాల్ లలో జరిగింది. చిన్నప్పటినుంచి ఇంగ్లీష్ వ్యాకరణము, ఉర్దూ ట్యూషన్లు చెప్పి ఆ డబ్బులతో పుస్తకాలు, పత్రికలు కొని చదివి భాషను గురించి తెలుసుకున్నాడు. తెలుగు, ఉర్దూ భాషలను నేర్చుకుని ఆ రెండు భాషలు తనకు రెండు కళ్ళు అన్నాడు. చిన్నతనంనుంచి నేర్చుకున్న ఉర్దూ భాష గాలిబ్ గీతాల అనువాద రచనకు దోహదమయింది. పిన్నవయసు నుండే పెద్దల ముందు పద్యాలను, కవితలను నిర్భయంగా చదివి బహుమతులను పొందాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్ స్పెక్టర్ గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. తండ్రి పాండితీ ప్రకర్ష, తల్లి మానవత దాశరథి ఎదలో ఒదిగిపోయినాయి.
కవయతీతి కవిః, వర్ణనా నిపుణః కవిః కదా!
‘నవనవోన్మేషశాలినీ ప్రతిభామతా!’ అన్నారు లాక్షణికులు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు మూడు కవితా లక్షణం. ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన కవి దాశరథి. ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పద్యం, గద్యం, వచనకవిత, గేయం, నాటకం, నవల, సినీగీతాలు మొదలుగాగల ప్రక్రియలన్నీ ఆయన సొంతం చేసుకున్నారు. అది దేశభక్తి ఉద్యమం జరుగుతున్న సమయం కవులు దేశభక్తి చాటిచెప్పే గేయాలు కవితలు వ్రాసేవారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కవులు ఉద్యమగీతాలు గానం చేశారు. దాశరథి జాతిని జాగృతం చేయడానికి కవిత్వాన్ని సాధనంగా చేసుకున్నాడు. తెలంగాణ వైభవాన్ని, ఔన్నత్యాన్ని తెలియ చెప్పే గీతాలను రచించారు. రుద్రవీణ, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, పునర్నవం, అగ్నిధార, గాలిబ్ గీతాలు అనువాదము, అమరశిల్పి జక్కన్న నాటకము మొదలుగా గల ఎన్నో పుస్తకాలను రచించారు. తన జ్ఞాపకాలను యాత్రాస్మృతి పేరున ఆత్మకథగా వెలువరించారు. ఇవేకాక ప్రేక్షకాదరణ పొందిన సినీ గీతాలను ఎన్నింటినో రచించిన కవిత పయోనిధి. దేశభక్తిని ప్రబోధించే ఉత్తేజ పరిచే గీతాలనేకాక నవరసాలను తన రచనలలో చొప్పించి వేల గీతాలను రచన గావించిన మహా మనీషి.
‘పడగొట్టి ప్రాణములొడ్డి ఘోర గహ
నాటవులన్ బడగొట్టి, మంచి
మాగాణములన్ సృజించి ఎముకల్
నుసిచేసి పొలాలుదున్ని, భో
షాణములన్ నవాబుకు స్వర్ణనునింపిన
రైతుదే తెలంగాణము రైతుదే
ముసలి నక్కకు రాజరికంబు దక్కునే?’
అని నిజాం ప్రభువును నిరసించిన దేశభక్తిపరుడు. శ్రామికజనులపై జరుగు దోపిడీ వ్యవస్థకు ఎదురు తిరిగాడు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి ప్రజల బానిసత్వపు సంకెళ్ళను తొలగించాలని ఉద్యమించిన దాశరథిని జైల్లో బంధించారు. నిజాం సైన్యము ఆయనను అనేక చిత్రహింసలకు గురి చేసింది. జైల్లో పళ్ళు తోముకోవటానికి ఇచ్చిన బొగ్గుముక్కలతో జైలుగోడల మీద గీతాలు రచించారు. అలా రాసిన కవితలలో నా తెలంగాణమన్న కవితలో
‘కోటి తెలుగుల బంగారు కొండ క్రింద
పరుచుకొన్నట్టి సరసు లోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు
నా తెలంగాణ తల్లి కంజాతవల్లి
వేయిస్తంభాల గుడి నుండి చేయిసాచి
ఎల్లోరా గుహలందున పల్లవించి
శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి
నా తెలంగాణ కోటి పుణ్యాల జాణ
మూగవోయిన కోటితమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ముకూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నా తెలంగాణ కోటి రతనాల వీణ’
అన్నారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నమాట వేదమైంది. ఎప్పుడో దాశరథి కలం పలికిన ఈ మాట నేటి కవులందరూ కూడా తమ మాటల్లో తలుచుకుంటున్నారంటే కవి వాక్కు వేదవాక్కన్నమాట సత్యము కదా! “నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అన్న తిలక్ మాటలు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నమాట కూడా శక్తివంతమై ఎప్పటికీ కాలం, కవి మరువలేరు. మరిచిపోదు.
1956 నవంబర్ ఒకటో తేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణం జరిగింది. తెలుగు ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్నది దాశరథి ఆశయం.
“ఈనాడు మహాన్ద్రోదయమైంది
కోట్లాది ప్రజలు తెలుగు తల్లి
పాదాలకు పారాణి నిడిరి
తెలుగు తెలుగు వెలుగు వెలుగు”
అంటూ ‘మహాంధ్రోదయం’లో తెలుగు భాషాభిమానాన్ని చాటారు.
అంతేకాక ‘నవంబర్ 1’ అన్న గేయంలో
“తెలుగు జాతి ఒక్కటే భరత జాతి ఒక్కటే
ప్రపంచం ఒక్కటే శశిబింబం ఒక్కటే
రవిబింబం ఒక్కటే నవంబరు ఒక్కటి
మనమంతా ఒక్కటే”
అంటూ తెలుగు ప్రజలందరూ ఒక్కరే అన్న భావంతో కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని సూచించారు దాశరథి.
తిమిరంతో సమరం కవితా సంపుటిలో ‘రావమ్మా!శాంతమ్మ!’ అంటూ ప్రపంచ శాంతిని కోరుకున్నారు.
“కూడు లేని కోట్ల జనం గోడుగోడు మంటుంటే
కోట్లధనం ఆయుధాల కొరకు ఖర్చు చేసేరు”
అంటూ శాంతికి భంగం చేసే ఆయుధాల తయారీని, కొనుగోళ్ళను ఖండించారు. బతకడానికి తిండి కావాలి కాని ఆయుధాలు కాదు అని ఆవేదన చెందారు. ఆయన
“హింస నుండి సమ సమాజం
హంస ఉద్భవించుననే
అసత్యాన్ని నమ్మకు
హంతకుడవు కాబోకని”
యువతని హింస వైపు పోకూడదనే ప్రబోధాన్ని చేశారు కవి.
“మానవత్వం గెలుస్తున్నది
దానవత్వం ఓడుతున్నది
తిమిరంతో సమరం చేస్తూ
చీకటిని చీల్చుకువచ్చే
కిరణంలాగా వెలుగులోకి”
ప్రయాణం చెయ్యాలన్నారు.
దానవత్వం తిమిరమైతే మానవత వెలుగన్నది కవి అభిశంసనము. ఈ ఖండకావ్యం 1974లో కేంద్రసాహిత్య అకాడమి అవార్డును అందుకున్నది. తన జన్మకు, ఉన్నతికి మూలమైన తల్లికి అంకితమిచ్చారు ఈ కావ్యాన్ని.
స్నేహశీలి హృదయుడు అయిన దాశరథి ‘కవితా పుష్పకమ’నే ఖండకావ్యంలో స్నేహదీపమనే కవితలో స్నేహం యొక్క గొప్పతనాన్ని గురించి ఎంతో చక్కగా వర్ణించారు.
“తైలాలు లేకుండా వెలిగేటి దీపం
విద్యుత్తు లేకుండా వెలిగేటి దీపం
ఎప్పుడు నిలిచేటి దీపం
నిజమైన దీపం మా స్నేహ దీపం
మనసులో దీపం మలిపితే పాపం
దోస్తీని మించినది లేదు లోకాన
రత్నాల కంటే మిన్నఅది తూకాన
మిత్రుడే కావాలి సుఖాన/శోకాన
అతడు లేకున్నచో ఈ నగరమే కాన”
స్నేహానికి అసలైన, సిసలైన నిర్వచనాన్ని చెప్పిన స్నేహశీలి. స్నేహితుడు అనే తోడులేకపోతే నగరమైనా అడివితో సమానమన్నాడు. అంతేకాదు అలాంటి నగరాన్ని తను చూడలేనన్నాడు కవి. అది సత్యమేకదా!
‘నా దేశం-ఆదేశం’ అనే గేయంలో
“మతం మరిచిపోగలను
మతాన్ని గతాన్ని విడిచి పెట్టగలను
కానీ భారతీయుడనేనని పరవశించిపోతాను”
అంటాడు. మతం పేరుతో బతికే కాలం పోయి మానవతతో బతికే కాలం రావాలన్న ఆయన ఆశ ఆశయం నెరవేరాలని భావిద్దాం.
“మూగ పుస్తకాలలోన రాగాలను పాడుకో
గాలివోలె కనిపించే ఆలోచన వాడుకో”
అన్నాడు దాశరథి. పుస్తకం మనతో మాట్లాడదు. పుస్తకం మూగదే కానీ అది పంచే జ్ఞానం అనంతం.
అందులోని రాగాలు అంటే మాటలు మన నోట పలకమన్నాడు. అంటే పుస్తకం వలన మనకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకోమన్నాడు. కానీ గాలి లేకపోతే జీవనమే లేదు. అలాగని నీ మనసును తేలిక చేసుకో. నీ మనసును బాధించని, ఎదుటివారిని నొప్పించని ఆలోచనలను చేయమన్నది ఆయన మాట.
వచన కవితలు, గేయాలనే కాక లలితమైన, అందమైన భావాలతో చక్కని లలిత గీతాలు కూడా ఆయన కలంనుండి జాలువారినాయి. సున్నితమైన భావాలతో అమలిన శృంగారాన్ని కురిపిస్తూ ప్రణయానుభూతిని కలిగించే ‘నవమంజరి’ అనే లలితగీతం మనసులను కదిలించి ప్రతి వారిలో ప్రణయరాగాలను పలికిస్తుంది. ఆ పాటతెలియని వారు, ఆలపించని వారుండరు.
“తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వులతోడ మురిపించబోకే
నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు
నీ మేనిలో పచ్చచేమంతి అందాలు
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు”
అంటూ ప్రేయసి సొగసును, అందాన్ని, నవ్వులను ప్రియుని ముందు సాక్షాత్కరింప చేస్తాడు ప్రియురాలిని. ఈ పాట విన్న ప్రతివారు ప్రేమికులు కావలసినదే. తమ ప్రియురాలిని తలచుకోవలసినదే. మనోనేత్రంతో అందాన్ని చూసి సృష్టించిన నేర్పు దాశరథిది. ఈ పాటను వినిన ఘంటసాల తానుగా దాశరథి వద్దకు వచ్చి పాటను అడిగి మరీ తీసుకుని పాడడం విశేషం. అదీ దాశరథి కవితా శక్తి. ఈ లలిత గీతం ఎన్ని వందల సార్లు ప్రసారమయిందో, ఎందరు గాయకులు ఆలపించారో, ఎన్నిసార్లు విన్నామో చెప్పలేం. కానీ ఈ పాట ఇప్పుడు, ఎప్పుడు ఏ కాలానికైనా నవ్యాతి నవ్యంగా ఉంటుంది. మనసును రాగ రంజితం చేస్తుందీ గీతం. అంతగా ప్రసిధ్ధి పొందినదీ విరహగీతం.
“వెలిగించవే చిన్ని వలపు దీపం
ఎందుకే నా మీద ఇంత కోపం”
అంటూ ప్రియుడు తన ప్రియురాలిని బతిమిలాడే పాట ఇది.
“ఖుషీ ఖుషీగా నవ్వుతూ
చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలుపే వెందుకే
నిషా కనులదానా”
అన్న పాట కూడా అంతే ప్రసిద్ధిపొందింది. అయితే ముందుగా ‘ఇద్దరు మిత్రులు’ విడుదల అయినందువలన అదే మొదటి పాటగా పేరుపొందింది. ‘నన్ను దోచుకొందువటే’ అన్నపాట నారాయణరెడ్డిగారికి ఎంత పేరు తెచ్చిందో ‘ఖుషీఖుషీగా నవ్వుతూ’ అన్నపాట దాశరథికి అంతటి పేరున తెచ్చింది. నడిరేయి ఏ జాములో అని స్వామిని పిలిచినా, నను పాలింపగనొడచి వచ్చితివా అని స్వామిని వేడినా, ఒక పూలబాణం తగిలింది మదిలో అని పాడినా, వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట అని పులకించినా, ఏ దివిలో విరిసిన పారిజాతమో అని గుబాళించినా, గోదారి గట్టుంది గట్టుమీద సెట్టుంది అని యాసలో పాడినా, మదిలో వీణలు మ్రోగే అన్నా ఏ సందర్భానికి తగినట్లుగా ఆ సందర్భానికి వేల పాటలను రచించి ప్రేక్షకుల మనసులలో స్థిరజీవిగా నిలిచారు దాశరథి. మనసు పాటలకు ఆత్రేయ అయితే వీణ పాటలకు దాశరథి అన్న పేరును పొందారు. కత్తికి రెండు వైపులే పదును కాని దాశరథి కలానికి ఎన్ని గుబాళింపులో, ఎన్ని లాలింపులో కదా! ఆ పాటలను విని ఆ ఆనందం అనుభవించిన ప్రేక్షకులకు మాత్రమే తెలుస్తుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిన్ననాడు మదర్సాలో తాను నేర్చుకున్న ఉర్దూ భాషను సార్ధకం చేసుకుంటూ గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువదించిన మేధా సంపన్నుడు దాశరథి.
“బస్కే దుష్వార్ హై హర్ కాం కా ఆసాహోనా
ఆద్మీకోభి మయస్సర్ నహీ ఇన్సా హోనా”
అని గాలిబ్ రాసిన ఈ గీతాన్ని
“ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము”
అన్నారు. ఎన్ని జన్మములు గడిస్తేనో కాని నరజన్మము రాదు. ఆ జన్మను సార్థకం చేసుకోవాలన్నది కవి ఆలోచన.
దాశరథి అంటే శ్రీరాముడు. శ్రీరాముని బాణానికి ఎదురు లేనట్లుగా సాహిత్యమనే విల్లందుకొని, అక్షరాలను నారినిసంధించి ఆలోచనల శరపరంపరలతో నవరసాలతో పండిత పామర జన రంజకంగా సమాజ శ్రేయస్సును ఆశిస్తూ దేశభక్తి ప్రబోధకంగా వేల వచనకవితలను, పాటలను రచించిన దాశరథి వ్యక్తిత్వము మహోన్నతము.
వివిధ ప్రక్రియలలో సాహితీ సేద్యం చేసి కావ్యాలు వెలయించినా ఆయనలో ఏదో తెలియని అసంతృప్తి దాగి ఉన్నది. అదే అగ్నిధారలోని ఈ కవితలో మనకు కనబడుతుంది.
“ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో”
అని అన్నారంటే ఆయన మనసులోఎన్ని అమృత భాండాలు దాగున్నాయో, ఎన్ని అగ్నిగుండాలు రగులుతున్నాయో, ఎన్ని సుడిగుండాలు సుళ్ళు తిరుగుతున్నాయో ఎవరికీ ఎరుక. 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఉన్నారు.
ఆచార్య భావన్ గారు దాశరథి గురించి చెపుతూ “అతని కలం అగ్నిధార! అతని గళం రుద్రవీణ! అతడు తెలంగాణ వామనమూర్తి! అతడు లలిత గేయాల స్ఫూర్తి! అతడు దళిత కావ్యాల కీర్తి! విశ్వరక్షక విష్ణుదేవునికి విశ్వరూపం! ఇంటి పేరులో రాముణ్ణి తన పేరులో కృష్ణుణ్ణి నిలుపుకున్న రామకృష్ణఅవతారము”గా కీర్తించారు.
దాశరథి అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నతమైనటువంటి కవితా శక్తి!
ఆయన రచనలు ఎంత స్పూర్తిమంతమో ఆయన మరణాన్ని గురించి ఇలా ధైర్యంగా చెప్పారు.
ఒకసారి దాశరథి తన అత్తగారి ఊరైన పాలమూరుకు వస్తారు. అపుడు రజాకార్ల విప్లవం జరుగుతున్నది. విప్లవకారుల మీద ప్రత్యక్ష నిఘా ఉండేది. విప్లవంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని ఆ సమయంలో రజాకార్లు ఏమైనా చేయవచ్చు. అత్తవారింట భోజనం చేస్తున్న సమయంలో ఆయనను రజాకార్లు తీసుకువెళ్లి బాగా కొడతారు. ఆ దెబ్బలు తిన్న దాశరథి లేవలేదు. అప్పుడు వారు మరణించాడని అతనిని విడిచి వెళ్ళిపోయినారు. మరునాడు పత్రికలో కనబడీ కనబడకుండా దాశరథి ఫొటో వేసి ఆయన మరణవార్తను ప్రకటించారు. అపుడు శ్రీశ్రీ, ఆరుద్ర, నారాయణరెడ్డి మొదలగు అభ్యుదయ రచయితలు అందరూ ఆయనకు నివాళులు అర్పించడానికి సమావేశమైనారు. సమావేశం ముగించుకుని వారందరూ బయటకు రాగా ఒళ్ళంతా కట్లతో గుర్తుపట్టలేని విధంగా ఒక వ్యక్తి గుమ్మం బయట నిలబడి ఉన్నారు. వీరు తమరెవరని ప్రశ్నించగా ఇప్పటిదాకా మీరు నివాళులర్పించిన ఆ దాశరథిని నేనే అని చెప్పారు. అపుడాయన – వారు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక స్పృహతప్పిన పడిపోయిన నన్నుచూచి మరణించాననుకొని విడిచి వెళ్లారు. ఆ తరువాత కురిసిన వర్షానికి నేను లేచి ఇలా వచ్చానని చెప్పారు. వర్షం ఆయనకు పునర్జన్మ నిచ్చి ఆ మహాకవిని మనకిచ్చింది.
జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయినాక దాశరథిని ఆస్థానకవిగా నియమించారు. ఆనాటి నుండి ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణరెడ్డి మంచి మిత్రులుగా కలిసిమెలిసి ఉన్నారు. మరణాన్ని జయించిన దాశరథి మరణం గురించి అద్భుతంగా చెప్పారు.
“నిర్భయంగా వచ్చాను, నిర్భయంగా వెళతాను
ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను, నిశ్వసిస్తూ వెళతాను
మృత్యువు నృత్యం చూపి దడిపిస్తారెందుకు?
భయమెందుకు? నా ఇంటికి నేను వెళతాను.”
అంటూ గళమెత్తి చాటిన ధీశాలి దాశరథి.
1987నవంబరు 5వ తేదీన కార్తికపున్నమినాడు ఈ లోకానికి విషాదాన్ని పంచుతూ నిష్క్రమించారు.
“నీవెరుగవె నేను శ్రీరాముడ
నేను మానవుడ లెమ్ము
నిద్రాణాంధ్ర ధరా స్థలిని
నేడు మేలుకొల్పగలను”
అని ఎలుగెత్తి చాటిన ధైర్యశాలి దాశరథి.