[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
డెంటల్ ఫిల్లింగ్స్:
ప్ర: ఆర్యా, గతంలో పుచ్చిపోయిన పళ్లకు ఫిల్లింగ్స్ చేయడానికి ‘సిల్వర్’ ఉపయోగించేవారు కదా! ఇప్పుడు ఫిల్లింగ్ సిమెంట్గా దానిని ఎందుకు వాడడం లేదు?
-నరసింగ రావు, మౌలాలి, హైద్రాబాద్.
జ: చాలా మంచి సందేహాన్ని వెలిబుచ్చారు మీరు. ఎంతో ఆసక్తి, పరిశీలనా గుణం ఉంటే తప్ప ఇలాంటి సందేహాలు ఉద్భవించవు. దీనికి మిమ్ములను అభినందిస్తూ సంచిక – పాఠకుల పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సుమారు యాబై సంవత్సరాల క్రితం మేము చదువుకునేటప్పుడు వాడిన డెంటల్ ఫిల్లింగ్‌లు వేరు, ఇప్పుడు వాడుతున్న ఆధునిక ఫిల్లింగులు వేరు. ప్రతి అంశంలోనూ, పరిశోధనలు జరుగుతుండడంతో, వస్తున్న ఆధునిక ఫిల్లింగులు, ఎన్నోరకాలుగా సౌకర్యవంతంగా ఉంటున్నాయి.
మీరు గ్రహించినట్టుగా, ఒకప్పుడు రెండు రకాల ఫిల్లింగులు దంతవైద్య రంగంలో వెలుగు చూశాయి. అవి -తాత్కాలిక ఫిల్లింగ్‌లు, పర్మనెంట్ ఫిల్లింగులుగా ఉండేవి.
పిప్పి పన్ను వ్యాధి పింగాణీ పొర (ఎనామిల్) దాటి, డెంటీన్ను చేరుకుంటే, అలాంటి పంటికి తాత్కాలిక ఫిల్లింగ్ మాత్రమే చేసేవారు. దీనికి గానూ జింక్ ఆక్సయిడ్ + యుజినాల్ మిశ్రమాన్ని వాడేవారు. ఇది ఫిల్లింగ్ గానూ, గాయానికి డ్రెస్సింగ్ మాదిరిగానూ ఉపయోగపడేది. ఓ మాదిరిగా ఆహారపదార్థాలను నమలడానికి వీలుగా ఉండేది. ఇది పంటి ఎనామిల్ రంగులో కలవకుండా ప్రత్యేకంగా కనపడేది. కొన్ని నెలల వరకూ ఇది ఎలాంటి ఇబ్బందినీ కలిగించకుండా ఉంటే, ఫిల్లింగ్ పై భాగాన్ని కొంత తొలగించి, అక్కడ పర్మనెంట్ ఫిల్లింగ్ చేసేవారు.
ఇకపోతే, పిప్పిపన్నులోని పిప్పి కేవలం పింగాణీ పొరవరకూ మాత్రమే పరిమితమై ఉంటే, అలాంటి పన్నుకు స్వేచ్ఛగా పర్మనెంట్ ఫిల్లింగ్ చేసేవారు. ఆ పర్మనెంట్ ఫిల్లింగే సిల్వర్ ఫిల్లింగ్. సిల్వర్ ఫిల్లింగ్ అంటే కేవలం సిల్వర్‌తో ఫిల్లింగ్ చేయడంకాదు. అది సిల్వర్ పొడి +పాదరసము (మెర్క్యురీ)ల మిశ్రమం అన్నమాట! దీనినే ‘సిల్వర్ అమాల్గమ్’ అంటారు. ఈ ఫీలింగులతో ఎంతటి గట్టి పదార్దాన్నైనా నమలగలిగే అవకాశం ఉంటుంది. ఈ ఫిల్లింగ్ పదార్ధము గట్టిపడిపోయిన తర్వాత గట్టి రాయి మాదిరిగా అయిపోతుంది. అయితే పంటి పిప్పి డెంటీన్ పొరలోనికి ప్రవేశించినా, పల్ప్ భాగము లోనికి ప్రవేశించినా, ఇది ఫిల్లింగుకు ఉపయోగపడదు, ఉపయోగించరు కూడా! అయితే ఇది ఎంతటి మంచి ఫిల్లింగ్ అయినా తెల్లని పంటిమీద నల్లని రంగుగా ఇది కనిపించడం వల్ల, కాలక్రమంలో దీని వినియోగం తగ్గిపోయి నూతన ఆవిష్కరణలు మొదలయ్యాయి. తర్వాత ఫిల్లింగ్ కోసం సిల్వర్ అమాల్గమ్ వాడకం క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు పంటి రంగులో కలిసిపోయే ఫిల్లింగ్ పదార్ధాలు వెలుగులోనికి వచ్చాయి. గట్టిదనంలో కూడా,ఈ ఫిల్లింగులు సిల్వర్ అమాల్గమ్కు ధీటుగా ఉండడం గమనించవలసి ఉంటుంది. అలా ఆధునిక దంతవైద్య రంగంలో సిల్వర్ అమాల్గమ్ కనిపించకుండా పోయింది. పనితనంలో మాత్రం సిల్వర్ అమాల్గమ్ తర్వాతే ఏదైనా అని గ్రహించక తప్పదు.
~
ప్ర: గతంలో పళ్లకు బంగారు తొడుగులు వేయించుకునేవారు కదా! దీనివెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా? ఇప్పుడు అవి ఎందుకు కనుమరుగైనాయి?
జ: మీ జ్ఞాపకాలలో నిక్షిప్తమై వున్న ఈ విషయం గమనించదగ్గదే! ఇప్పటి జనానికి ఇది తెలియకపోవచ్చు. కాలంతో పాటు కొన్ని విషయాలలో మార్పులు రావడం సహజం. అలాంటిది ఈ బంగారు తొడుగుల విషయం కూడా! కాలగమనంలో కొన్ని అలా అంతరించి పోతుంటాయి.
ఒకప్పుడు కనపడే ఒక పంటికి బంగారు తొడుగు వేయించుకోవడం ఒక ఫ్యాషన్, ఒక హోదాకు సంకేతం. పంటితొడుగు మాదిరిగానే పంటిమీద ఒక చుక్క మాదిరిగా, లేదా ఏదైనా ఆకృతిలో కనిపించే విధంగా బంగారంతో చేయించుకునేవారు. కాల క్రమేణా కొన్ని కారణాల మూలంగా, ఈ అలవాటు మసకమారి కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత చికిత్స రీత్యా పంటి తొడుగులుగా (క్రౌన్స్) గట్టిదనం కోసం ఉపయోగించడం జరిగి, ఆ తర్వాత దంత సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్రమంగా ఇది కూడా కనుమరుగై పోయింది. ఇప్పుడు ఆధునికంగా గట్టిదనంతో పాటు పంటి ఎనామిల్ రంగుతో కలిసిపోయే డెంటల్ మెటీరియల్స్ అందుబాటులోనికి వస్తున్నాయి. ఇది ఒక మంచి గొప్ప మార్పు అనే చెప్పాలి.
పంటి పనితనంతోపాటు, అందంగా కనిపించడం ప్రస్తుతం అవసరం. దంత సౌందర్యాన్ని కాదనేవారు ఎవరు వుంటారు? ముఖ సౌందర్యంలో, దంత సౌందర్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు!
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.