[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
కదిలే పళ్ళు:
ప్ర: డాక్టర్ గారూ.. దౌడల్లో కదిలే పళ్లు ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? దయ చేసి వివరించగలరు.
– ఝాన్సీ రాణి, హైద్రాబాద్.
జ: మీ ఉద్దేశం లేదా సందేహం – కదులుతున్న పళ్ళు దౌడల్లో ఉంటే, ఏమైనా సమస్యలు వస్తాయా? అని కావచ్చు. కదులుతున్న పళ్ళ గురించి చర్చించేటప్పుడు, ఈ సమస్యను, రెండు రకాలుగా ఆలోచించాలి. 1) పాలపళ్ళు 2) పర్మనెంట్ పళ్ళు.
పాలపళ్ళు:
పాలపళ్ళు కదలడం రెండు సందర్భాలలో మనం గమనించగలం. మొదటిది పిల్లల్లో ఆటాపాటలందు లేదా ఇతర ప్రమాదాల మూలంగా దెబ్బలు తగిలి పళ్ళు కదులుతాయి. అలాగే, దౌడలో స్థిరదంతాల రాకడ మొదలైనప్పుడు వాటికి సంబంధించిన పాలపళ్ళు కదులుతాయి. ఇలా కదిలే పళ్ళు దౌడలో ఉంటే ఆహరం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత సమస్యకు తక్షణ పరిష్కారం లేదా వైద్యం గురించి ఆలోచించాలి. అలాంటప్పుడు, దెబ్బలమూలంగా పళ్ళు కదిలినప్పుడు, దంతవైద్యులు చికిత్స ద్వారా పళ్ళు కదలకుండా చేసి, గట్టిపడేలా చేస్తారు. దీని వల్ల దౌడలో అవి వుండవలసినంత కాలం ఆరోగ్యంగా వుండి, తర్వాత కదిలి ఊడిపోతాయి. ఇలా కాకుండా, పర్మనెంట్ పళ్ళు వచ్చే సమయంలో వాటి స్థానంలోని పాలపళ్ళు కదులుతూ సకాలంలో ఊడకుంటే, దంతవైద్యులకు చూపించి అలాంటి పళ్ళను తీయించేసుకోవాలి. తద్వారా ఆహారం తీసుకునే విషయంలో గానీ, నోటి దుర్వాసన విషయంలో గానీ ఎలాంటి సమస్యలూ వుండవు. ఇది పాలపళ్లకు సంబంధించిన విషయం.
స్థిర దంతాలు లేదా పర్మనెంట్ టీత్:
పర్మనెంట్ టీత్ విషయంలో కూడా, రెండు సందర్భాలలో పళ్లల్లో కదలికలు ఏర్పడతాయి. 1) దౌడలకు దెబ్బలకు తగిలినప్పుడు 2) దంతాలు లేదా చిగుళ్లు వ్యాధిగ్రస్థం అయినప్పుడు పళ్ళు లేదా దంతాలు కదులుతాయి.
కొట్లాటల మూలంగా, లేదా ప్రమాదాల మూలంగా దౌడ విరిగిపోవడం, పళ్ళు కదలడం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితిలో నోరు తెరవలేని పరిస్థితితోపాటు, ఆహార పదార్ధాలు నమలలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తక్షణమే దంతవైద్యుని (ఓరల్ సర్జన్) పర్యవేక్షణలో చికిత్స జరిగితే ఎలాంటి సమస్య ఉండదు. అతి తక్కువ కాలంలోనే గట్టి పదార్ధాలు కూడా నమిలే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలా కాకుండా అనేక కారణాల వల్ల చిగుళ్ళు గాని, దంతాలుగానీ వ్యాధిగ్రస్థమైతే, చిగుళ్లు వాయడం, చిగుళ్ళ నుండి చీము నెత్తురు స్రవించడం, దౌడ వాపు, జ్వరం, ఆహారం నమలలేని పరిస్థితితో పాటు నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చును. ఒక్కొక్కసారి దౌడ మూసుకు పోవచ్చు (ట్రిస్‌మస్) కూడా! ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.
చిగుళ్లు – దంతాలు వ్యాధిగ్రస్థమై, తత్ఫలితంగా చీము-నెత్తురు స్రవిస్తే వీటికి సంబంధించిన విషక్రిములు రక్తంలో చేరి, శరీరంలో బలహీనంగా వున్న వైటల్ ఆర్గాన్స్ (ఉదా: గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కీళ్లు) ను చేరి, వాటిని మరింత బలహీనపరచి, అనేక శారీరక వ్యాధి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుచేత ఇలాంటి సందర్భాలలో తక్షణమే స్పందించి అవసరమైన చికిత్స చేయించుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక దశల్లో వాటిపై సరైన అవగాహనలేక నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే ప్రమాదాలు ఎదురౌతాయని గ్రహించాలి. అందుచేత దౌడలలోని పళ్ళ కదలికను ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ చేయకూడదు.
~
ప్ర: దౌడ కీళ్లు జారితే స్వయంగా సరిచేసుకోవచ్చునంటారా?
– గంగిశెట్టి శ్యామల, కాకతీయనగర్, హైదరాబాద్.
జ: క్రింది దౌడ (మాండిబుల్) పుర్రెకు ఇరువైపులా రెండు కీళ్ల (టెంపొరొ మాండిబ్యులార్ జాయింట్) సహకారంతో పైకి క్రిందికి, పక్కలకు కదులుతుంది. దీని కదలిక వల్లనే మనం పదార్ధాలు నమలగలుగుతాం. ఈ కీళ్లు జారినప్పుడు (మాట్లాడేటప్పుడు, ఆవులించినపుడు) నోరు తెరుచుకుని పోయి కదలకుండా అయిపోతుంది. మన ప్రమేయం లేకుండానే, లాలాజలం విపరీతంగా నోటి నుండి కారిపోతుంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం.
దీనిని దంతవైద్యులు మాత్రమే సరిచేస్తారు. కొందరు సరిచేసుకునే పద్ధతిని తెలుసుకుని స్వయంగా సరిచేసుకుంటారు. ఇది అందరికీ సాధ్యం కాని పనే అని చెప్పాలి. దౌడ కీలు రెండు ప్రక్కలా జారితే కొందరు సులభంగా స్వయంగా సరిచేసుకోగలుగుతారు. ఒక ప్రక్క జారితే, దంతవైద్యులను దర్శించక తప్పదు. ఇలా మొదటిసారి జరిగినప్పుడు మాత్రం స్వంత ప్రయోగాలు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు.
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.