Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దంతవైద్య లహరి-27

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

పంటి నిర్మాణం:

ప్ర: ప్రతివారం మీరు నిర్వహిస్తున్న శీర్షిక దంతవైద్య లహరి చదువుతున్నాము. చాలా విజ్ఞానదాయకంగా ఉంటున్నాయి. పంటి నిర్మాణం గురించి కూడా వివరించగలరు.

-కుమారి కుసుమ కుమారి,ఒంగోలు.

జ: పంటినిర్మాణం గురించి తెలుసుకోవాలనే మీ అభిలాష అభినందనీయం. పన్ను గురించిన కనీస విజ్ఞానం అందరికీ అవసరమే! పర్మనెంట్ టీత్ గురించి స్థూలంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

 పళ్ళు పై దౌడ (మాగ్జిలా) లో పదహారు, క్రింది దౌడలో (మాండిబుల్)లో పదహారు మొత్తం ముప్పై రెండు పళ్ళు (పై దౌడలో రెండు – క్రింది దౌడలో రెండు, మొత్తం నాలుగు జ్ఞాన దంతాలతో సహా) ఉంటాయి. వీటిలో జ్ఞానదంతాలు తప్ప మిగతా పళ్ళన్నీ నమలడానికి (మాస్టికేషన్) ఉపయోగ పడతాయి. దౌడలో జ్ఞానదంతాలు అన్నింటికంటే ఆలస్యంగా (17-21 సంవత్సరాల మధ్య కాలంలో) వస్తాయి. ఇవి నమిలే విషయంలో అసలు ఉపయోగ పడవు. కారణం ఇవి ఒకదానికొకటి ఆనుకోవు.

పంటిని మామూలుగా మూడుభాగాలుగా విభజించవచ్చును 1. కిరీటం (క్రౌన్) 2. మెడ (నెక్) 3. మూలం (రూట్). కిరీటాన్ని -మూలాన్ని కలిపి వుంచేది మెడ. ఇది చిగురు దగ్గర రెంటినీ కలుపుతుంది. అందుచేత మూలం దౌడ భాగంలో కనిపించకుండా ఉంటుంది. కిరీటం పూర్తిగా పైకి కనపడుతుంది. కొరకడం, చీల్చడం, నమలడం వంటి పనులు ఇదే చేస్తుంది. పంటి కిరీటం ముందరి పళ్లకు ఒక రకంగానూ (ఇన్సిజార్స్), పక్క పళ్లకు (కెనైన్స్, ప్రీ -మోలార్స్) మరో రకంగానూ, వెనుక పళ్లకు (మోలార్స్) ఇంకోరకంగానూ ఉంటుంది. అవి చేసే విధులకు అనుకూలంగా వాటి నిర్మాణం ఉంటుంది.

ఒక పంటి అంతర్గత నిర్మాణాన్ని చూడాలంటే పంటి నిలువుకోతను చూడాల్సి ఉంటుంది. అలా పంటి నిలువుకోతను చూసినప్పుడు, ముఖ్యంగా మూడు భాగాలను గమనించవచ్చు. మొదటిది, పైకి కనిపించేది పింగాణీ పొర (ఎనామిల్), దాని క్రింది లోపలి పొర ‘డెంటీన్’. దాని తరువాతది ‘పల్ప్ కుహరం’. ఈ మూడు భాగాలు మూడు రకాల లక్షణాలను కలిగి ఉంటాయి.

పింగాణీ పొర (ఎనామిల్ ):

పైకి కనిపించే ఆరోగ్యకరమైన పింగాణీ పొర తెల్లగా వుంటుంది. నమలడంలో ప్రధాన పాత్ర దీనిది. దీనికి నరాల సరఫరా ఉండదు. అందుచేతనే, పిప్పిపన్ను వ్యాధి వల్ల ప్రాథమిక దశలో నొప్పి కలిగించదు. పిప్పిపన్ను వ్యాధిని ముందుగా గమనించకపోవడానికి ఇదొక ముఖ్యకారణంగా చెప్పవచ్చు. అరుగుదల గాని, పిప్పిపన్ను వ్యాధి గాని ఎనామిల్ స్థాయిలో ఎటువంటి ఇబ్బందిని కలిగించవు. కానీ వివిధ కారణాల మూలంగా పింగాణీ భాగం విరిగిపోతే, తిరిగి పెరిగే గుణాన్ని కలిగి ఉండదు.

డెంటీన్ పొర:

పింగాణీ పొరను ఆనుకుని లోపల డెంటీన్ పొర ఉంటుంది. ఈ పొరకు పాక్షికంగా నరాల సదుపాయం ఉంటుంది. అందువల్లనే పిప్పిపన్ను వ్యాధి గాని, పంటి అరుగుదల గానీ, డెంటీన్ పొరస్థాయికి చేరుకోగానే నొప్పి పుడుతుంది. ప్రమాదాల వల్ల డెంటీన్ స్థాయిలో పన్ను విరిగినా నొప్పి పుడుతుంది. జాగ్రత్తపడమని మనకు హెచ్చరిక చేస్తుంది.

పల్ప్ కుహరం:

డెంటీన్ తర్వాత అతి ముఖ్యమైన భాగం ఇది. దీనినిండా నరాలు, రక్తనాళాలు ఉంటాయి. వ్యాధి గాని, పంటి అరుగుదలగానీ పల్ప్ కుహరం వరకూ చేరితే భరించలేని నొప్పి వస్తుంది. పంటి మూలం చివర పంటి కురుపు ఏర్పడే ప్రమాదం ఉంది. తర్వాత దౌడ వాచి, నోరు తెరవలేని పరిస్థితి (ట్రిస్‌మస్) ఏర్పడవచ్చు. దీనికి తోడు జ్వరం, ఆహరం మింగలేని పరిస్థితి ఏర్పడవచ్చు. పంటికి దెబ్బ తగిలినప్పుడు ఒకోసారి, నరాలు – రక్తనాళాలు చితికి పోవడం మూలాన కొన్నాళ్ళకు పన్ను స్పర్శ కోల్పోయి రంగు మారిపోతుంది. దీనినే సచ్చు పన్ను(నాన్ -వైటల్ టూత్) అంటారు. ఇలాంటి పళ్లకు మూలచికిత్స చేసి ఆ తర్వాత పంటి తొడుగు (కేప్) అమరుస్తారు. ఈ చికిత్స ఇష్టంలేనివారు పన్ను తీయించుకుంటారు. తర్వాత కట్టుడుపన్ను తప్పదు మరి!

~

దంతాలు లేకపోవడం:

ప్ర: అసలు పళ్ళురానివారు వుంటారా సర్?

గంగిశెట్టి శ్యామల, కాకతీయనగర్, హైదరాబాద్.

జ: అవును.. వుంటారు. ఇది జన్యుప్రధానమైన సమస్య. అతి తక్కువమందిలో ఇది కనిపిస్తుంది. వీరిలో పాలపళ్ళు కానీ, స్థిరదంతాలు కానీ వుండవు. ఈ పరిస్థితిని ‘అనో డాన్షియా’ అంటారు.

Anodontia

ఇలా కాకుండా ఒకటినుండి ఆరు పళ్ళు లేని పరిస్థితిని ‘హైపో డాన్షియా’ అంటారు. ఇది సాధారణంగా స్థిరదంతాలలో కనిపిస్తుంది.

హైపో డాన్షియా

ఆరు కంటే ఎక్కువ పళ్ళు రాకుంటే, ఆ పరిస్థితిని ‘ఒలిగో డాన్షియా’ అంటారు. ఇవన్నీ పుట్టుకతోనే లేకపోవడం అన్నమాట!

ఒలిగొ డాన్షియా

నేను చదువుకునే రోజుల్లో అసలు పళ్ళు రాని ఒకరిని మాత్రమే చూసాను. ఆ ఒక్కరూ అందమైన అమ్మాయి. పళ్ళు కట్టించుకోవడానికి ప్రభుత్వ దంతవైద్యశాలకు వచ్చింది. ఇంప్లాంట్ చికిత్సావిధానం అప్పటికి జనాదరణ పొందలేదు. తద్వారా ఈ ఇంప్లాంట్ వైద్యం అందుబాటులోనికి రాలేదు. తర్వాత నా 29 సంవత్సరాల ఉద్యోగకాలంలో ఇలాంటివారిని అసలు చూడలేదు మరి!

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

Exit mobile version