[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
టూత్ పిక్స్ & డెంటల్ ఫ్లాస్:
ప్ర: గురువుగారూ.. టూత్ పిక్స్ & డెంటల్ ఫ్లాస్ గురించి కాస్త విపులంగా చెబుతారా?
– సయ్యద్ ఖుర్షీద్, నాగార్జునసాగర్.
జ: ఖుర్షీద్ గారూ.. మీరు అందరికీ ఉపయోగపడే ప్రశ్నను అడిగారు. చాలా సంతోషం. నిజానికి ఇవి రెండూ కూడా పళ్ళ మధ్య గార లేదా ఇరుక్కున్న ఆహార పదార్థాలను శుభ్రం చేసుకునే విధానాలు. ముందుగా ‘టూత్ పిక్స్’ గురించి తెలుసుకుందాం.
టూత్ పిక్స్:
వీటిని పంటి పుల్లలు (పందుంపుల్ల కాదు) అని కూడా పిలవవచ్చు. అయితే ఇవి పళ్ళు తోముకోవడానికి కాకుండా, పళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇవి అగ్గి పుల్లల సైజులో గుండ్రంగా మృదువుగా వుండి, ఒక చివర సూదిగాను, మరొక చివర గుండుగాను ఉంటుంది. ఇవి సాధారణంగా ప్లాస్టిక్‌తో గాని, ఒక రకమైన మెత్తని కర్ర నుండి కాని తయారుచేస్తారు. ఒకప్పుడు ఇది స్టేటస్ సింబల్. పెద్దవాళ్ళ ఇళ్లల్లోనే లభ్యమయ్యేవి.
భోజనానంతరం ఒక పుల్ల తీసుకుని, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను మెల్లగా తొలగించుకుంటారు. కొందరు మాట్లాడుతూనే ఈ పని చేస్తుంటారు. ఇప్పుడు కొందరు ఇళ్లల్లో, హోటళ్లలో, భోజనానంతరం వీటిని సరఫరా చేస్తారు. ఇప్పుడు అది మామూలు విషయం అయిపోయింది. పళ్ళు శుభ్రత వరకూ ఫరవాలేదుగాని, దీనిని మాత్రం సున్నితంగా ఉపయోగించాలి. అశ్రద్దగా ఉపయోగిస్తే, చిగుళ్లు – పంటికుహరం (టూత్ సాకేట్) గాయమయ్యే ప్రమాదం వుంది. రక్తసంబంధమైన వ్యాధులు వున్నవారు (ల్యుకేమియా, హీమోఫీలియా, ఎనీమియా వగైరా) దీని వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిలో రక్తస్రావం మొదలైతే, చాలా ప్రమాదానికి దారితీస్తుంది. తరువాత, కాస్త ఖాళీలు వున్న పళ్ళ విషయం లోనే టూత్ పిక్స్ వాడాలి. లేకుంటే, మంచి పళ్ళ మధ్య కూడా ఖాళీలు ఏర్పడే ప్రమాదముంది. ఏదైనా దంతవైద్యుల సలహా/సూచనల మేరకే, వీటిని ఉపయోగించాలి.
పిల్లలను టూత్ పిక్స్ వాడకానికి ప్రోత్సహించకూడదు.
సాధ్యమయినంత వరకూ, పళ్ళ మధ్య చిక్కుకున్న ఆహారపు అణువులను, నోరు పలుమార్లు పుక్కిలించడం ద్వారా పోయేట్లు చూసుకోవాలి. దీనికి సాధ్యం కానప్పుడు మాత్రమే, టూత్ పిక్స్ ఉపయోగించే సాహసం చెయ్యాలి. ఒక సీనియర్ దంతవైద్యుడిగా నేను అప్పుడు వీటిని ప్రోత్సహించలేదు, ఇప్పుడు ప్రోత్సహించడం లేదు. నూరు శాతం దంతధావనం, నోరు పుక్కిలించడం సవ్యంగా జరిగితే, టూత్ పిక్‌లు ఉపయోగించవలసిన అవసరం రానేరాదు అని గమనించాలి.
డెంటల్ ఫ్లాస్:
ఇది సన్నని వదిపెట్టిన సిల్కు దారం లాంటిది. కాస్త గరుకుదనం కలిగి ఉంటుంది. ఇది పళ్ళమధ్య పాచి గట్టిగా మారి ‘గార’గా మారినప్పుడు దానిని స్వయంగా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరీ గార దళసరిగా ఏర్పడినప్పుడుగాక ఒకమాదిరి పలుచగా వున్నప్పుడే శుభ్రం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గట్టిపడిన గార శుభ్రం చేయాలంటే, అది స్వయంగా చేసుకోవడానికి వీలుపడదు. దంతవైద్య పరికరాలతో దంతవైద్యులు ‘స్కేలింగ్’ రూపంలో శుభ్రం చేయవలసిందే!
డెంటల్ ప్లాస్ అనుకున్నంత రీతిలో ప్రజలలో వాడుకలోనికి రాలేదు. దీని గురించి అధికంగా ప్రచారం చేయవలసిన అవసరం వుంది. ఇది దంతవైద్యులు మాత్రమే కాదు, ఇతర వైద్య/దంతవైద్య, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ప్రచారము చేయవచ్చును. కరపత్రాలు, బ్యానర్లు, రేడియో, టెలివిజన్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవచ్చును. నోటి పరిశుభ్రత-దంతసంరక్షణ విషయంలో, ‘డెంటల్ ప్లాస్’ అధిక ప్రాధాన్యతను కలిగివుంది.
~
స్కేలింగ్:
ప్ర: డాక్టర్ గారూ.. స్కేలింగ్ చేయించుకోవడానికి కాలపరిమితి ఏమైనా ఉందా?
– గంగిశెట్టి శ్యామల, కాకతీయనగర్, హైదరాబాద్.
జ: కాలపరిమితి అంటూ ఏమీ లేదండి! అవసరం అయినప్పుడు మాత్రమే చేయించుకోవాలి. చాలామంది అత్యుత్సాహవంతులు నెలకొకసారి దంతవైద్యులను దర్శించి స్కేలింగ్/క్లినింగ్ చేయమని అడుగుతుంటారు. అంత అప్రమత్తంగా ఉండడంలో తప్పులేదు గాని, అవసరమా? లేదా? అన్నది, అవసరాన్ని బట్టి దంతవైద్యులు నిర్ణయిస్తారు.
కొందరు విదేశీ పర్యటన చేయదలచుకున్నవారు కూడా స్వయంగా డెంటల్ క్లినిక్స్‌కు వెళ్లి స్కేలింగ్ చేయమని అడుగుతుంటారు. ఇలాంటప్పుడు కూడా అవసరం అయితేనే క్లినింగ్ చేయించుకోవాలి.
సంవత్సరానికి ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్టు, పూర్తి దంతవైద్య పరీక్షలు (ముందస్తు దంతవైద్య పరీక్షలు) చేయించుకున్నట్టయితే, దంతసంరక్షణకు అసలు ఢోకా ఉండదు.
సమస్య లేకుండా స్కేలింగ్ చేయించుకుంటే, ఇతర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. అశ్రద్ధ ఎంత తప్పో.. అత్యుత్సాహం కూడా అంతే తప్పు మరి!
‘నోటి పరిశుభ్రత –
ఆరోగ్యానికి భద్రత!’
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.