Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దహనం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శింగరాజు శ్రీనివాసరావు గారి ‘దహనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఒరేయ్ ఈరిగా.. ఈరిగా” రంకెలు పెడుతూ వచ్చాడు సింగడు.

“ఏందిరా సింగా.. కాటిలో శవాలకు కంగారు పుట్టేలా ఆ కేకలు” అంటూ పూరి గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు వీరయ్య.

“నీతో సచ్చే సావొత్తున్నదిరా.. ఓ పోను కొనుక్కోరా అంటే ఇనవు. అడుక్కునేవోడికి కూడ ఇయాల సేతిలో సెల్లుంటది. నీ కాడేమో లేకపోయె. పెతిసారి మైలు నడిసొచ్చి నీకు ఇసయం సెప్పాలంటే కాల్లు రోల్లవుతున్నాయిరా” అన్నాడు రొప్పుతూ సింగడు.

“అడుక్కునేవోడికి పైసలు ఊరకనే వత్తాయి. ఆడు సెల్లేం కరమ.. ఇమానమే కొంటాడు. కట్టం తెలవదు గదా. ఆ సోదెందుగ్గానె, అసలు ఎందుకొచ్చినావో సెప్పు” అడిగాడు వీరయ్య.

“నిన్న రేతిరి మనూరి కామందు కొడుకు.. అదేరా శ్రీపతిరాయుడు ఇజయవాడ ఆసుపత్రిలో సచ్చిపోనాడంట. ఆల్ల అబ్బాయి పోను సేసిండు. ఇంకో గంటలో ఈడికి వత్తారంట. ఆయన శవాన్ని కాల్చనికి సితినంట పేర్సి పెట్టు. ఆయన్ను పాడె మీదెట్టినాక నేను డప్పు వాయించుకుంటూ రావాలె. ఊల్లోకి నడిసి పోయేలకు టైము సరిపోద్ది. కాసింత మంచి ఎండుకట్టెలు సూసి పేర్చు. ఆయనదసలే పాపపు శవం.. తొందరగా కాలి సావదు. ఒరేయ్.. నేనిట్టా అన్నానని ఎవురితో అనమాక. నన్ను కొరతెడతారు” అంటూ విషయం చెప్పి బయలుదేరబోయాడు సింగడు.

“ఒరేయ్ సింగా..ఆయన నిజంగా సచ్చినాడంటావా?” అనుమానంగా అన్నాడు వీరయ్య

“అదేంటిరా.. అట్టా అనేసినవు”

“పాపి సిరాయువు.. అంటారంట గదా. అందుకే అడగతున్నా”

“ఆయనే సచ్చినాడో.. అయ్య ఈరంగం సూడనేక కొడుకులే సంపినారో.. మనకెందుగ్గాని. ముందు నువ్వు నే సెప్పిన పని సూడు” అంటూ వెళ్ళిపోయాడు సింగడు.

“రంగే.. రంగే.. ఇదిన్నావంటే మన ఊరి కామందు రాయుడు సచ్చినాడంట. ఎన్నాల్లకెన్నాల్లకొచ్చిందే.. మనం ఎదురుసూసిన రోజు”

“ఏంది మావా.. నువ్వు సెప్పేది నిజమా”

“అవునే రంగే.. కాత్త ఆలిస్య మవుద్దేమో గాని, ఆ బగమంతుడు అందరికీ నేయం సేత్తాడే. ఆడి పాపం పండింది. నెల నించి కోమాలో ఉండి ఇయాల సచ్చిండట” వీరయ్య కళ్ళల్లో ఆనందం.

“వాళ్ళ అయ్య సచ్చి రెండేల్లు కూడ కాలేదు కదా మావా. అప్పుడే ఈయన కూడ సచ్చినాడా” కాసింత జాలిగా అన్నది రంగి.

“ఆడు సేసిన పాపానికి రామయ్య ఎప్పుడో సంపేటోడు. ఎందుకో ఆలిస్యం సేసిండు”. వీరయ్య మనసు గతాన్ని తొలిచింది.

***

అటు దోర్నాలకు, ఇటు విజయవాడకు మధ్యస్తంగా ఉంటుంది ఆ పల్లె. కొండజాతి వారితో అక్కడి వారికి సహవాసం ఎక్కువగా ఉండడంతో నాగరికత అంతగా వంటబట్టలేదు ఆ పల్లెకు. ఎప్పుడో అరవై, డెబ్బై సంవత్సరాల క్రితం అక్కడ వృథాగా పడివున్న పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేయడానికని వచ్చాడు బాలరాయుడు. అతనిది విజయవాడకు సమీపంలో ఉండే పల్లె. కాస్తంత చదువుకున్నవాడు కావడం, నలుగురితో మమేకమై ఉండే తత్వం కావడంతో, అతి తక్కువ సమయంలోనే ఊరికి పెద్దగా మారాడు. బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టి పండ్ల తోటలను పెంచి ఆర్థికంగా ఎదిగాడు. రాజకీయంగా పలుకుబడి సంపాదించి ఆ ఊరికి మకుటం లేని మహరాజుగా ఎదిగాడు. ఆయన కొడుకు సింహాద్రి రాయుడు, బాలరాయుడి మరణానంతరం ఆ ఊరికి సర్పంచిగా ఎన్నికయ్యాడు. తండ్రి బ్రతికి ఉన్నంతవరకు బుద్ధిమంతుడులా పెరిగిన సింహాద్రి, ఆయన చనిపోయిన తరువాత తన నిజస్వరూపం బయట పెట్టాడు. ఆడవాళ్ళంటే ఉన్న పిచ్చి బయటపడింది. ఇద్దరు, ముగ్గురితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఊర్లో వాళ్ళకు తెలిసినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. దానికి కారణం వారికి సింహాద్రితో ఉన్న ఆర్థిక అవసరాలే. అతని కొడుకు శ్రీపతిరాయుడు తండ్రి కంటే ఒక ఆకు ఎక్కువే చదివాడు. కంటపడిన ఆడపిల్లను వదలడానికి ఇష్టపడేవాడు కాదు. ఎక్కడో ఏదో ఒక బలహీనతను అడ్డం పెట్టి వారిని వశపరచుకునే వాడు. ఎటుపోవడానికి దారిలేని జనం ఈ ఆగడాలను భరిస్తూ, అప్పుడప్పుడూ ఎదురు తిరుగుతూ ఉండేవారు. పరిస్థితి గాడి తప్పుతుందనుకున్న సింహాద్రి, శ్రీపతిని వ్యాపార నిమిత్తం నగరానికి పంపాడు. నగర వాతావరణానికి అలవాటు పడ్డ శ్రీపతి క్రమంగా పల్లెకు రావడం తగ్గించాడు. వయసు మీద పడడంతో సింహాద్రి కూడ తన దృష్టిని ఆధ్యాత్మికత మీదకు మళ్ళించాడు. చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవాలనుకున్నాడో ఏమో.. సింహాద్రి రాయుడు ఊర్లో రామాలయం కట్టించాడు. ఆ ఆలయానికి పూజారిగా గోదావరి జిల్లా అమలాపురం నుంచి విరూపాక్షయ్య అనే పూజారిని తీసుకుని వచ్చాడు. విరూపాక్షయ్య ఆ రామాలయంలోనే ఒక మూలగా కట్టిన ఇంటిలో కుటుంబంతో సహా ఉంటూ, ఎప్పుడు ఎవరు పూజాధికాలు నిర్వహించమని అడిగినా కాదనకుండా వచ్చి చేసేవాడు. ఒకరోజు పనిమీద రాయుడింటికి వెళ్ళిన వీరయ్య దారిలో రామాలయం దగ్గర ఆగాడు.

“అయ్యా.. నేను ఈరడిని. దూరం నుంచైనా ఆ రామయ్యను సూడొచ్చా”

“అదేంటి వీరయ్య. ఆయన రాముడైతే, నువ్వు శివుడివి. ఊరి చివరలో ఉన్నా, అందరి చివరిదశ నీ చేతులలోనే కడతేరాలి. మీ ఊరి కట్టుబాటు ఒప్పుకుంటే నువ్వు ఆలయంలోకి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అన్నాడు విరూపాక్షయ్య.

“ఏవో సామి.. ఈ మద్దె కాలంలో నే ఈడ దాక రాలే. ఇయాలైనా ఆ కామందు గారికి సుస్తీ సేసిందని, ఆయనకు కసాయంలోకి కూసిని సెట్ల ఆకులు కావాలంటే తీసుకొచ్చినా. ఆడ ఇచ్చి పోతావుంటే రామయ్య గురుతొచ్చిండు. దూరం నుంచైనా సూసి పోదామని వచ్చినా. ఓ పాలి సూసి ఎలతా” అంటూ దూరం నుంచే చూడసాగాడు వీరయ్య.

ఊరి కట్టుబాటు తెలియకుండా లోపలికి రమ్మనడం సబబు కాదని, హారతి వెలిగించి గర్భగుడిలోకి వెళ్ళి, రామయ్య విగ్రహానికి దగ్గరగా ఉంచాడు విరూపాక్షయ్య, ఆ వెలుగులో రామయ్య రూపం కొంచెమైనా వీరయ్యకు కనిపించాలని.

“సామీ.. సానా బాగా కనిపించినాడయ్యా. దండాలు సామీ.. మీరు సల్లంగ ఉండాల” అని విరూపాక్షయ్యకు నమస్కరించి వెళ్ళబోయాడు వీరయ్య.

“తాతా.. ఉండు ప్రసాదం తీసుకుని వెళుదువు గాని. నాన్నా.. ఇదిగో పులిహోర. నైవేద్యం పెట్టి తాతకు, నాకు పెట్టు” అంటూ వచ్చింది విరూపాక్షయ్య కూతురు పది సంవత్సరాల నందన.

చక్రాలలాంటి కళ్ళు, అద్దంలా మెరిసిపోతున్న లేత బుగ్గలు, చందమామ లాంటి గుండ్రని ముఖం, ఒక్కమాటలో చెప్పాలంటే బంగారు బొమ్మలా ఉండే నందనను అలాగే గుడ్లప్పగించి చూస్తూ “సామీ.. ఈ పాప తవరి బిడ్డా” అని అడిగాడు వీరయ్య.

“అవును వీరయ్యా. నా ఒక్కగానొక్క కూతురు. అమలాపురంలో మా చెల్లెలు ఇంట్లో ఉండి చదువుకుంటున్నది”

“ఈ తల్లిని ఎప్పుడూ సూడలేదు సామీ. సీతమ్మ తల్లంత సక్కంగున్నది. తవరిలా మంచి మనసుగూడ ఉంది. ఆ సీతారామయ్యలు నిన్ను సల్లంగ సూడాలి తల్లీ”

“పొగడొద్దులే తాత.. ప్రసాదం ఎక్కువే పెడతాలే” అని వెన్నెల పువ్వులా నవ్వింది నందన.

“పెట్టు తల్లీ.. మల్లీ ఈడకు నేను వత్తానో.. రానో” అంటూ పాప నవ్వుతో, తన నవ్వు జత కలిపాడు వీరయ్య.

దేవుడికి నైవేద్యం పెట్టి తెచ్చి గిన్నెను బల్ల మీద పెట్టాడు విరూపాక్షయ్య. ఇంటినుంచి తెచ్చిన అరిటాకులో ప్రసాదాన్ని పెట్టి వీరయ్యకు ఇచ్చి “చాలా తాతా” అని అడిగింది.

“ఓయమ్మ.. ఇంత పెట్టిసినావేంటి తల్లీ. ఇది నాకు, మా రంగికి కూడ సరిపోద్ది. నూరేల్లు సల్లంగ ఉండు తల్లీ. వత్తా సామీ” అని ప్రసాదాన్ని తన కండువాలో మూటకట్టుకుని లేచాడు వీరయ్య.

“ఏరా వీరిగా.. వళ్ళు బలిసిందేంటిరా. నేరుగా గుడి గడపదాటి లోనికి వచ్చావు. ఊరి కట్టు మర్చిపోయినావా” అంటూ వీరయ్య చెంప ఛెళ్ళుమనిపించాడు శ్రీపతిరాయుడు.

ఎప్పుడు వచ్చాడో తెలియకుండానే మెరుపులా వచ్చి గూబ గుయ్ మనిపించిన శ్రీపతి దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మాయి వీరయ్యకు.

“ఏయ్.. ఎవరు నువ్వు. ఎందుకు తాతను కొడుతున్నావు” అన్న మాటలు విని అటువైపు చూసి, “ఏం పూజారిగారు. ఇదెప్పటి నుంచి జరుగుతున్నది. ఈ అలగా జనాన్ని గుడిలోకి రానివ్వద్దని నాన్నగారు చెప్పలేదా మీకు. ఊరి చివర ఉంటూ శవాలను కాల్చేవాడు, ఊరి మధ్య గుడిలోకి వస్తే, ఆ దేవుడు అపవిత్రమై పోతాడన్న జ్ఞానం లేదా మీకు” హూంకరించాడు శ్రీపతి.

“రాయుడు గారు.. అది.. అది.. మాకు ఊరి కట్టుబాటు తెలియక జరిగింది. ఇక భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరుగనివ్వను” అని చేతులెత్తి నమస్కరించాడు విరూపాక్షయ్య.

“అసలు మీరెవరు అంకుల్.. మా నాన్నను, తాతను అలా అరుస్తున్నారు. ఈ దేవాలయమేమన్నా మీ సొంతమా?” అడ్డువచ్చి అడిగింది నందన.

ఏదో గట్టిగా అనబోయి నందన వైపు చూసి ఆగిపోయాడు శ్రీపతి. లేత తమలపాకులా మెరిసిపోతున్న పసిదాని అందాన్ని కన్నార్పకుండా చూడసాగాడు. ‘ఎవరీ పిల్ల. ఏ సినిమా యాక్టరు కూడ ఈ పిల్ల అందంతో పోటీపడలేదు. అరె.. ఇది ఎప్పుడూ నా కంట పడలేదే’ అని తన సహజమైన కామపు చూపుతో ఆ పాపను చూస్తూ, “ఎవరమ్మాయి నువ్వు. చూడబోతే పట్నంలో పెరిగిన పిల్లలా ఉన్నావు. ఈ దేవాలయం మాదే. మా అయ్య కట్టించాడు. అందుకే గదమాయిస్తున్నా. అయినా వేలెడంత లేవు. ఏంటి నీ పొగరు? అసలు ఎవరు నువ్వు?” అంటూ ఆ పిల్లవైపుకు దూసుకు వచ్చాడు.

శ్రీపతి అలా వస్తుంటే భయపడి వెళ్ళి తండ్రిని పట్టుకుని “ఆలయం మీదైనా, దేవుడు అందరివాడే. మా అమలాపురం గుడిలోకి అందరూ వస్తారు. మీ ఊరిలో ఎందుకు రానీరు?” అని చిన్నగా అన్నది.

“ఎవరు పూజారి గారు.. ఈ చిలక. పుటకే కాదు మాట కూడ ముద్దొస్తున్నది” వెనకడుగు వేసి పూజారి వైపు చూసి అడిగాడు శ్రీపతి.

ఇక ఇక్కడ ఉంటే ఏమవుతుందోనని మెల్లగా జారుకున్నాడు వీరయ్య.

“నా కూతురు రాయుడు గారు. అమలాపురంలో చదువుకుంటున్నది. స్కూలుకు సెలవులు ఇస్తే వచ్చింది. ఇంతకూ తమరెందుకు వచ్చారు?” వినయంగా అడిగాడు విరూపాక్షయ్య.

“అవునా.. ఎంత చక్కని కూతురిని కన్నావయ్యా పూజారి. మా ఇంటికి పంపుతుండు. నా కూతురు శ్రీదేవితో కలిసి ఆడుకుంటుంది. ఇదిగో పాప. ఇది అమలాపురం కాదు.. పల్లెటూరు.. అందుకని ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటి ప్రకారం నడుచుకోవాలి. తెలియక చేశావని మన్నించేస్తున్నా. ఇక నుంచి నువ్వు మా ఊరి అమ్మాయివి. భయపడుకు ఇలారా” అని ప్రేమగా పిలిచాడు.

శ్రీపతి మాటలతో భయం పోయి అతని దగ్గరికి పోయింది నందన. అతను ఆమెను దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దుపెట్టుకుని, “పాపను రేపు మా ఇంటికి పంపు, ఆడుకుంటుంది. ఇదిగో పూజారి గారు ఈ వెయ్యి రూపాయలు తీసుకుని, సాయంత్రం మా నాన్న పేరిట పూజ చెయ్యి. ఆయనకు ఒళ్ళు బాగవాలని గట్టిగా దేవుడిని అడుగు. పూజ పూర్తయాక నాకు ఫోను చెయ్యి. సూరిగాణ్ణి పంపుతాను, ప్రసాదం ఇచ్చి పంపు. వస్తాను పాప.. రేపు రా” అంటూ నందన బుగ్గ గిల్లి వెళ్ళిపోయాడు శ్రీపతి.

“ఎవరు నాన్నా ఈ అంకుల్.. అంతలా కోప్పడి అప్పుడే మళ్ళీ నన్ను దగ్గరికి పిలిచాడు” అని తండ్రి వద్దకు వచ్చి అడిగింది.

“ఈ ఊరికి పెద్దాయన కొడుకులేమ్మా. పద వెళ్దాం” అంటూ నందనను తీసుకుని ఇంటికి బయలుదేరాడు విరూపాక్షయ్య.

శ్రీపతి వీలున్నప్పుడల్లా సూరిని పంపి, నందనను తమ ఇంటికి తీసుకురమ్మనే వాడు. ఒకే వయసు పిల్లలు కావడంతో శ్రీదేవితో కలిసి ఆడుకుంటానని చెప్పి నందన, శ్రీపతి ఇంటికి రోజూ వెళ్ళసాగింది.

***

“రంగీ.. రాయుడు గారి తోపు కాడ తుమ్మ చెట్లు ఉన్నయి గదె. ఆటిని కొట్టుకొచ్చి ఆరబెట్టాలే. కొనుక్కొచ్చిన కట్టెలు అంటుకోట్లేదే. అయి అయితే తొందరగ అంటుకుంటయి. ఆటిని ఈటి మద్దెన పెట్టి కాలిత్తే పెద్ద మంట వసద్ది” అన్నాడు వీరయ్య రంగిని పిలిచి.

“సరె పద మావా.. పొద్దు ఇంకో గంట ఉండేట్టుందిలే పా” అని గొడ్డలిని, కత్తిని తీసుకుని వీరయ్యతోపాటు బయలుదేరింది రంగి.

చిన్నగా తోపుకు దగ్గరలో ఉంటే చెట్ల వద్దకు చేరి కత్తితో కొమ్మలు చెరగసాగింది రంగి. వీరయ్య కనిపించే తుమ్మ మానులను నరుకుతున్నాడు.

ఇంతలో ఎవరో “తాతా” అని పిలిచినట్లు వినిపించింది. చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. భ్రమ అనుకున్నాడు.

“మావా.. ఆగు. ఆ మూల నుంచి ఎవరిదో మూలుగు ఇనిపిత్తున్నాది. ఎవురో.. తాత.. తాత.. అని పిలత్తున్నారు. పద సూద్దాం” అని వీరయ్యను తీసుకుని శబ్దం వినిపిస్తున్న వైపు నడిచింది. నాలుగు అడుగులు వేశాక, “తాత.. దాహం” అనే శబ్దం దగ్గరగా వినిపించడంత పక్కకు తలతిప్పిన వీరయ్య, ఒక్కసారి ఉలిక్కిపడి “సీతమ్మ తల్లీ.. ఈడ పడిపోయినవేందమ్మా” అంటూ గొడ్డలి కింద పడేసి ఒక్క ఉదుటున వెళ్ళి నందనను ఒళ్ళోకి తీసుకున్నాడు. వళ్ళంతా రక్తం, పరికిణీ అంతా రక్తం, ముఖం నిండా ఎవరో రక్కిన గాట్లు, గుండె జారిపోయింది వీరయ్యకు.

“ఏటయింది తల్లీ నీకు. ఈ రకతమేంది.. ఈ గాట్లేంటి.. ఈడకెలా వచ్చినవమ్మా. రంగీ మన సామి కూతురే.. ముందు నీకాడున్న నీల్లు తల్లికి పట్టు” అని వీరయ్య అనగానే, తన బొడ్డుకు కట్టుకున్న సీసా తీసి నీల్లు నందనకు పట్టింది రంగి. నందన నీళ్ళు పూర్తిగా తాగలేక పోతున్నది. కళ్ళు తేలిపోతున్నాయి. మాట్లాడలేక పోతున్నది.

“ఇంకాసిని తాగు తల్లీ. అసలేటయిందమ్మా. నిన్నీడికి ఎవురు తెచ్చిండ్రు” అని అడుగుతున్న రంగికి సమాధానం చెప్పడానికి నోరు తెరిచింది నందన.

“అవ్వా.. నన్ను.. నన్ను.. అంకుల్.. అక్కడ..” అంటూ తోపు వైపు చూపించి ఏదో చెప్పబోయింది. కానీ మాట పెగలడం లేదు. ముఖాన నీళ్ళు చల్లాడు వీరయ్య. కానీ ఫలితం లేకపోయింది. నందన గుండె ఎగిరిపడసాగింది. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకుని నందనను భుజం మీద వేసుకుని ఊరిలోకి పరిగెత్తాడు వీరయ్య. వారితో పాటే రంగి కూడ. అలాగ పరుగెత్తేటప్పుడు నందిన చేతిలో నుంచి ఎర్రగుడ్డ పేలిక జారి కిందపడింది. దాన్ని చేతిలోకి తీసుకుని మరల పరిగెత్తసాగింది రంగి.

***

మనసులో ముద్ర వేసుకుపోయిన ఆ ఘటన తలచుకున్నప్పుడల్లా కన్నీరు మున్నీరు అవుతాడు వీరయ్య. ఇంతలో దూరంగా డప్పు మోతలు వినిపించసాగాయి. కళ్ళు తుడుచుకుని లేచాడు వీరయ్య. గబగబ వెళ్ళి కాటిలో మూలగా ఉన్న మట్టిగోడకు కాస్త ఇవతలగా కట్టెలు పేర్చడం మొదలు పెట్టాడు.

“ఏంది మావా.. ఈడంతా వదిలిపెట్టి కట్టెలు ఆడ పేరుత్తున్నావు” అడిగింది రంగి.

“ఆడు మడిసి కాదుగదే. అందుకే ఆడ్ని సెపరేటుగా కాల్చాల”

“నువ్వట్టా ఏరుగా ఎడితే ఆల్లు ఊరుకుంటరా మావా”

“ఆల్లకు సెప్పేదేదో నేను సెపతాగా. దా.. నువ్వు కూడ సాయం సెయ్యి. మన బంగారుతల్లిని పొట్టన ఎట్టుకున్నోడి శవాన్ని మనిద్దరం తనివితీరా కాల్సాలే. వందేల్లు బతకాల్సినోడు సగమేల్లకే సచ్చూరుకున్నాడు. ఆ సీతమ్మ తల్లి పాలిట రాచ్చసుడు. ఆ తల్లి ఉసురుకొట్టి సచ్చినాడు”

“అవును మావా.. ఆయాల ఆ పిల్లను సెరిపింది ఈడేననే సాచ్చికంగా మనం సిరిగిన ఆడి సొక్కా ముక్కను సూపించినా, ఊరు ఊరకుందే గానీ, పోలీసులకు సెప్పలా. పాప సేతిలో దొరికిందని మొత్తుకున్నా ఎవురూ పట్టించుకోలే.. ఎవురో పాడుసేసి ఆ నింద ఆయన మీదేత్తున్నారని నమ్మబలికిండ్రు. అదే ఎర్రసొక్కా రాములుగాడికి ఏయించి తెచ్చి, ఆడిని ఊరినుంచి ఎలేయించిండు”

“పాపం పూజారి సామి.. తలెత్తుకు తిరగలేక.. ఊరొదిలెట్టి పోయిండు. అయినా ఆ పసిగుడ్డు కాడ ఏముంటదని అట్టా సేసిండే పాపిట్టోడు. తలుసుకుంటే గుండె తరుక్కుపోతున్నాదే” తన కోపాన్ని కట్టెలను పేర్చడంలో చూసిస్తున్నాడు వీరయ్య.

“అయినా ఎట్టా సనిపోయినాడంట మావా”

“అదేదో సైనా నుంచి వొచ్చిన రోగమంట.. మడిసిని పీల్చి పారేత్తదంట. ఎట్టయితేనేం సచ్చిండు.. ఊరి పీడ ఇరగడయింది”

ఇంతలోకి శ్రీపతి శవం రానే వచ్చింది. శవాన్ని దించి పంతులు గారు ఏదో కార్యక్రమం చేసి తరువాత వీరయ్యను పిలిచాడు.

“అయిందా వీరయ్యా”

“అయింది సామి. మీదే ఆలిస్యం”

“అదేందిరా.. పోయి పోయి ఆ మూల మట్టి గోడ పక్కన చితి పేర్చావు”

“అయ్యగోరు పెద్ద కామందు కదా సామి. అందరినీ కాల్చినకాడ ఎందుకని సెపరేటుగా ఎట్టినా”

“ఓరి నీ స్వామిభక్తి తగలెయ్య. సరే కానీ.. ఎత్తండిరా.. ఎత్తి శవాన్ని చితిమీద పెట్టండి” అని పంతులు గారు చెప్పగానే, శ్రీపతిని చితి మీదకు చేర్చారు. ఆయన కొడుకు తలకొరివి పెట్టగానే అందరూ వెళ్ళిపోవడానికి బయలుదేరారు.

“ఒరేయ్.. వీరయ్యా.. కాస్త జాగ్రత్తగా కాల్చు. అయ్యగారికి ఊరి మీద మక్కువ ఎక్కువ. మధ్యలో లేస్తాడు. వాళ్ళ నాన్నగారు పోయినప్పటి నుంచి ఊరిని ఏలాడు కదా” వ్యంగ్యతను జోడించి అన్నాడు పంతులు.

“మీకెందుకు సామీ.. శవం లెగవకుండా కొడతాగా. బూడిద కూడ మిగలకుండా సేత్తా” అందుకున్నాడు వీరయ్య.

“అదేందిరా”

“అదే సామీ.. శవం బూడిదయ్యే దాక ఈడనే ఉండి సూత్తా” అని సర్దాడు వీరయ్య.

అందరూ వెళ్ళిపోయారు. శ్రీపతి చితివైపుకు నడిచాడు వీరయ్య. అక్కడే కూర్చున్నాడు. సగం కాలిన తరువాత లేస్తున్న శవాన్ని కసితీరా కొట్టాడు. నిప్పురవ్వలు వంటి మీద పడుతున్నా లెక్క చేయడం లేదు. ఇక లాభం లేదనుకుని రంగి వెళ్ళి బలవంతంగా వీరయ్యను లాక్కువచ్చింది. వీరయ్య ఏడుస్తూ, రొప్పుతూనే ఉన్నాడు.

***

రాత్రి మొదలైన వాన తెల్లవారి ఏడు గంటలకు తగ్గింది. పక్కనున్న మట్టిగోడ కూలడంతో శ్రీపతిని కాల్చిన ప్రదేశమంతా మట్టితో, నీటితో కప్పబడి పోయి కాల్చిన ఆనవాలు మిగలకుండా పోయింది. అంతలోకి వచ్చారు పంతులుతో పాటు శ్రీపతి కొడుకులు. అక్కడ చితి ప్రదేశం అంతా మట్టితో కప్పబడి ఉండడంతో పంతులు కోపంతో

“ఏరా వీరయ్యా.. రాత్రి శవదహనం కాగానే కాస్త బూడిద తీసి ఒక ముంతలో పెట్టకూడదటరా. ఇప్పుడు చూడు రాత్రి వానకు గోడ పడిపోయి అంతా కప్పబడి పోయింది” అన్నాడు.

“సామీ.. పెద్దోల్ల బూడిద ముట్టుకోకూడదని తాకలేదయ్యా. రాత్రి వానొచ్చి తెల్లారేసరికి గోడ కూలిపోయి చితంతా కప్పేసి బూడిదను మాయం సేత్తుందనుకోలే” భయపడినట్లు నటిస్తూ చెప్పాడు వీరయ్య.

“ఇప్పుడెలా చినరాయుడు.. మీ నాన్నగారి బూడిదను, అస్థికలను గంగలో కలపాలనుకున్నాం. కనీసం రెండు ఎముక ముక్కలైనా దొరుకుతాయేమో వెదకండి” అని శ్రీపతి కొడుకులకు చెప్పాడు పూజారి.

“ఏంటి పంతులు గారు వెదికేది. అటుచూడండి చితిమీద మట్టి అడుగు మేర పేరుకుంది. నీళ్ళతో తడిసి రొచ్చు రొచ్చుగా ఉంది. బూడిద లేదు, ఎముకలు లేవు. అవి ఎప్పుడో పాతాళంలోకి జారిపోయి ఉంటాయి. ఆయనకు ప్రాప్తం లేదు. పదండి పూజారి గారు” అని అక్కడి నుంచి కదిలారు శ్రీపతి కొడుకులు.

“ఆయన అస్థికలను గంగలో కలిపితే ఆయన పాపాలు కొంచెమైనా పోతాయనుకున్నాను. ఆయనకు ప్రాప్తం లేకుండా పోయింది” అంటూ వారిని అనుసరించాడు పంతులు.

‘ఆయన అస్థికలెవడికి కావాలి. ఆస్తులు దక్కాయి. అది చాలు’ అనుకున్నారు కొడుకులు.

వారు కనుమరుగయ్యాక వీరయ్య ఆనందంతో గంతులు వేయసాగాడు.

“ఈ పాపిట్టోడి బూడిద, అత్తికలు గంగలో కలిపితే ఈడికి పున్నెం వసద్ది. అది ఆడికి రాకూడదు. ఈడి అత్తికలు కలిపితే గంగమ్మ తల్లికి కూడ పాపం అంటుతది. సీతమ్మ తల్లిని సెరిసి సంపినోడు సొరగానికి పోకూడదు. నరకంలో పడి సావాల. పిశాచమై చెట్లట్టుకు తిరగాల. అందుకే రేతిరి చితినుంచి బూడిదను, ఎముకలను ఎత్తి బురదగుంటలో పోసినా, గడ్డపారెట్టి మట్టిగోడ కూల్సినా, మోటారెట్టి నీల్లు కుమ్మరించినా. బూడిద కూడ మిగలకుండ సేసినా. నాను సేత్తున్నాది మంచిపననుకున్నాడేమో రామయ్య సామి.. కుండపోత వాన కురిపించి సాయంసేసిండు. సామే.. నీ సాయం మరిసిపోనయ్యా. నీ బిడ్డను పొట్టనెట్టుకున్నోడిని సూత్తా నువు మాతరం ఊరకుంటవా.. వాన కురిపించి చితి ఆనవాలు లేకుండ సేసినవు. సాలయ్యా.. ఏడున్నా ఇప్పుడా సిట్టితల్లి సంతోసంగా ఉంటది. నాను బతికున్నని దినాలు నీ పేరు జపిత్తూ బతుకుతా.. దండాలు సామీ” అంటూ ‘రామ.. రామ.. రామ’ అని చిందులు వేస్తున్నాడు వీరయ్య.

Exit mobile version