[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]
[అది ముస్లిముల గోరీలగడ్డ బయట ఓ చిన్న గది. బొగ్గుల పొయ్యి మీద అన్నం ఉడుకుతూ ఉంటుంది. గదంతా పొగ. వరండాలో కూర్చుని సిగరెట్ తాగుతున్న సత్తార్ మియ్యా దూరంగా ఓ బండ మీద కూర్చుని స్నానం చేస్తున్న అమీనాని దొంగచూపులు చూస్తుంటాడు. అక్క స్నానానికి వెళ్ళిన సంగతి గ్రహించిన చున్నీ కావాలనే పొగ ఎక్కువ వచ్చేలా చేస్తుంది. అమీనా తల్లి రసీదన్ అనారోగ్యంతో పడుకుని ఉంటుంది. టీ ఇస్తావా అని అమీనాని అడుగుతాడు సత్తార్. మౌనంగా టీ చేసి ఓ కప్పు అతనికి ఇస్తుంది. మరో కప్పు అమ్మకి ఇస్తుంది. కాసేపయ్యాకా ఖాళీ కప్పుతో బయటకు వచ్చిన రసీదన్ – అక్కడ సత్తార్ని చూసి కోపగించుకుంటుంది. కూతురిని తిడుతుంది. సత్తార్ ఏదో చెప్పబోతే కోపం పట్టలేక అక్కడున్న ఓ ప్లాస్టిక్ బకెట్‌ను అతని మీదకి విసిరేస్తుంది. దాని దెబ్బకి సత్తార్ కుడి మోకాలు గీరుకుపోతుంది. అతన్ని బయటకు పొమ్మని అరుస్తుంది. ఫజ్లూని పంపితే మేక మాంసం పంపిస్తాను అని అమీనాకి చెప్పి వెళ్ళిపోతాడు సత్తార్. రసీదన్ వాళ్ళది ముస్లిముల కబ్రిస్తాన్లో కాటికాపరుల కుటుంబం. గోరీల నిర్మాణం, వాటిని చూసుకోవటమే వాళ్ళ వృత్తి. గోరీలగడ్డ లోని గోరీల వంశ వృక్షం వివరాలు తీసుకోవటం, చనిపోయిన వాళ్ళకోసం గుంతలు తవ్వటం, అంత్యక్రియలకోసం వచ్చిన వాళ్ళవసరాలు చూడటం, చనిపోయిన వారి అంతిమ యాత్ర కోసం ఏర్పాట్లు చేయటం వాళ్ళ పనులు. ఆ శ్మశానంలో ఉన్న ఒక సమాధి హజరత్ దాతా పీర్ మనిహారీది. ఆయన గొప్పగా పాటలు పాడుతూ గాజులు, ఆడవాళ్ళ బొట్టూ కాటుకా వంటి సౌందర్య సాధనాలూ అమ్ముకుంటూ బ్రతికేవాడట. ఆయన రూపసి. యవ్వనంలో ఓ హవేలీ లోని అమ్మాయిని ఇష్టపడతాడు, కానీ ఆ అమ్మాయికి వేరే అతనితో వివాహం నిశ్చయమైపోతుంది. ఆమె కోసం చక్కని పాట పాడతాడు దాతా పీర్. ఆమెని మరిచిపోలేక మతి తప్పి ఓ దర్గాలో ఆశ్రయం పొందుతాడు. అక్కడ మౌలానా సమీరుద్దీన్‌ను కలిసి ఆయనతో కటిహార్ లోని మనిహారీకి వెళ్ళి, అక్కడి మౌలానా వద్ద శిష్యరికం చేసి చదవటం వ్రాయటం నేర్చుకుంటాడు. సూఫీ సాహిత్యం అధ్యయనం చేస్తాడు. తర్వాత ఎన్నెన్నో ఊర్లు తిరిగి చివరికి యీ గోరీలగడ్డకు చేరి, చాలా సంవత్సరాలు బ్రతికి ఇక్కడి మట్టిలోనే కలిసిపోయాడు. రసీదన్ భర్త నసీర్ మియ్యా చనిపోయాకా, కుటుంబ బాధ్యతలు ఆమె పైనే పడతాయి. అమీనా తల్లికి సాయం చేస్తుంది. కొడుకు ఫజ్లూ వికలాంగుడు. సత్తార్ సహవాసం వల్ల వ్యసనాలకు లోనవుతాడు. చిన్న కూతురు చున్నీ బబ్లూ అనే వాడితో స్నేహం చేస్తుంది. వాడితో కలిసి కలకత్తా కు పారిపోయి కొత్త జీవితం గడపాలని ఆమె కోరిక. – ఇక చదవండి.]
నసీర్ మియ్యా చనిపోయి పదేళ్ళయ్యింది. చిన్న వయసులోనే రసీదన్ నిక్కా అయ్యింది. బహుశా పదిహేడేళ్ళుంటాయేమో అప్పుడు!! తరువాత పంధొమ్మిది, ఇరవై ఏళ్ళు దాంపత్యం కొనసాగింది. మంచి యవ్వనంలో వైధవ్యం. చాలా రోజులవరకూ నసీర్ పచ్చటి బంగారు వన్నె ముఖమే కళ్ళెదుట ఉండేది ఇరవై నాలుగు గంటలూ! రసీదన్ మనసు రోదిస్తూ ఉండేది. రాత్రంతా ఆమె రాతి కళ్ళకు నిద్రే ఉండేది కాదు. నిద్రలో ఒళ్ళు మరచి పండుకుని ఉన్న పిల్లలను వదిలిపెట్టి, నసీర్ సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడేది. అడవి మొక్కలతో గడ్డితో కప్పబడి ఉండే ఆ సమాధి మీద, మేఘాలు లేని ఆకాశం నుండీ జాలువారే కాంతిలో ఆమె కళ్ళు నసీర్ ముఖం కనిపిస్తుందేమోనని వెదుక్కునేవి. గుంపులు గుంపులుగా మెరుస్తున్న నక్షత్రాల పూలనుంచీ రాలిపడే రెక్కలను తన కనురెప్పలతో ఏరుకునేది. నజీర్ సమాధి మీద పేర్చేది. చీకటి రాత్రులలో నజీర్ గోరీమీద గడ్డి తరంగాలమధ్య చిక్కని నలుపు కిందనుండి అతని ముఖం కనిపించేది. తన చేతులతో పట్టుకోవటానికి ప్రయత్నించేది రసీదన్ దాన్ని!! చలి గడ్డ కట్టే రోజులలో లేదా వర్షకాలపు తడి రాత్రులు, ఏవైనా మట్టి కింది పొరల్లో అణిగిపోయిన తన జీవితం గుండెచప్పుళ్ళను వెదికేందుకు రసీదన్ తప్పకుండా వెళ్ళేది. ఈ క్రమం చాలా సంవత్సరాలు నడిచింది, దాదాపు ఏడెనిమిదేళ్ళు!! మెల్లి మెల్లిగా ఆమె మనసును సమాధానపరచుకుంది. మనసును రాయి చేసుకుని బతుకుబండిని లాగటానికి పశువులా శ్రమించింది.
సత్తార్ మియ్యా రాకపోకలు నసీర్ బతికి ఉన్నప్పటినుంచే ఉన్నాయి. ఒక చెడ్డ ముహూర్తంలో రసీదన్, సత్తార్ మియ్యా మాయలో చిక్కుకుంది. సత్తార్ మియ్యాను ఇంట్లోకి రానిచ్చింది. కాజీ లేడు (పెళ్ళి పెద్ద) లేడు. నిక్కా నామా (పెళ్ళి సర్టిఫికెట్)లేదు. ఏ పెళ్ళి పద్ధతులూ లేకుండానే అతన్ని మెడలో డోలులా తగిలించుకుంది. రకరకాల సందేహాలతో ఆమె మనస్సు వణికిపోతూ ఉంది. అనుమానపు నీడలు తచ్చాడుతూనే వున్నాయి. కానీ ఇలా జరుగవలసి వుంటే దాన్ని ఎవరాపగలిగారు ఇప్పటిదాకా? అలా ఆమె కంటికి పొరలు కప్పేశాయి.
సత్తార్ మియ్యా చూపులు అమీనా నోరూరించే యౌవనం మీద పడ్డాయిప్పుడు!! కొన్ని నెలల కిందటే అమీనా స్తనాలు అతడు తడుముతుండగా చూసింది రసీదన్. అతన్ని అక్కడ హఠాత్తుగా చూసి అమీనా గావుకేక పెట్టింది. గబుక్కున పారిపోయింది. ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా అతగాడు రసీదన్ వైపు ఒకసారి చూసి, ఎద్దులాగా ధీమాగా బైటికి వెళ్ళిపోయాడు.
జీవితంలో మొట్టమొదటిసారి రసీదన్ అమీనా మీదికి చెయ్యెత్తింది. ఒక చేత్తో అమీనా తల పట్టుకుని, రెండో చేత్తో విరామం లేకుండా కొడుతూనే వుంది. అమీనా దారి లేని మేకపిల్లలా తన్నులు తింటూనే వుంది. కొట్టి కొట్టి అలసిపోయింది రసీదన్. మట్టిగోడలా తానూ కింద పడిపోయింది. కొన్ని గంటలలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు రాత్రే సత్తార్ మియ్యాతో సంబంధం తెగతెంపులు చేసుకుంది.
చున్నీ ఇంట్లోకి రాగానే రసీదన్ బైటికి వచ్చి, మసీదు దగ్గరకు వచ్చి కూచుంది. గోరీలగడ్డ గేట్, మసీదుకు మధ్యలో ఒక చోట బాగా ఎండ పడుతూ ఉంది. చలికాలంలో ఆమె తాత (మాతామహులు) మధ్యాహ్నం ఇక్కడే కూర్చునేవాడు. ఈ చోటే చాపమీద కూర్చుని భోజనం చేసేవాడు. తన చేతితో తన కంచం నుంచీ అన్నం ముద్దలు చేసి తన చేత్తో రసీదన్‌కు తినిపిస్తూ ఉండేవాడు.
ఈ మధ్య రసీదన్‌కు తన తాత బాగా గుర్తుకు వస్తున్నాడు. తన గతం గురించి గుర్తు చేసుకుంటూ కూర్చున్నప్పుడంతా ఆమెకు తన తాత ముఖమే గుర్తుకు వస్తుంది. ఎదుటివాళ్ళను ఆశీర్వదించి భిక్షమెత్తుకునే ఫకీర్ ఆయన. లోకం ఆయనను కాలే ఫకీర్ అని పిలిచేది. ఆయన అసలు పేరేదో ఇప్పుడెవ్వరికీ గుర్తే లేదు. ఆయనది మంచి తెలుపు. కానీ అందరూ ఆయన్ని కాలే ఫకీర్ అని పిలవటం, ఆయన వేసుకునే వస్త్రాల రంగును బట్టి మాత్రమే!! ఆయన నల్లటి జుబ్బా వేసుకునేవారు. ఆయన మెళ్ళో ఎన్నెన్నో రంగుల పూసల హారాలుండేవి. తలపైన నల్లటి టోపీ. నల్లటి కాటుక కళ్ళ నిండా!! ఒక చేతిలో రంధ్రాలున్న వంకర టింకర వెదురు కర్ర, దాని తలమీద వెండి గోళాకారపు పొన్ను, రెండవ చేతిలో భిక్షాపాత్ర. ఇందులో దాన ద్రవ్యం వేస్తే వరం లభిస్తుందని ప్రజలు అనుకుంటారు.
తాత చెప్పేవాడు, ఆ వెదురుకర్ర ఆయన గురువు ఉస్తాద్ రహమత్ ఫకీర్ దట!! భిక్షాపాత్ర చాలా పురాతనమైనదట!! రహమత్ ఫకీర్ దాని సంరక్షకులు, అతనికి యీ సంగతి చెప్పారట!! రహ్మత్ ఫకీర్, రసీదన్ వాళ్ళ తాత కాలే ఫకీర్ గారికి మధ్య ఒక ప్రేమానుబంధం వుండేదని జనాలు చెప్పుకునేవారు. ఫకీర్ చాకిరీ లోనే రోజంతా గడిపేవారు, ఆమె తాత. రహ్మత్ ఫకీర్ కాలధర్మం తరువాత, ఆయనకు దక్కినవి, యీ దండమూ, భిక్షాపాత్రలే!! కాలే ఫకీర్ చనిపోయిన తరువాత, రసీదన్ చాలా జాగ్రత్తగా తాత వాడిన దండాన్ని కాపాడుతూ వస్తూ ఉంది. భిక్షాపాత్ర, రంగుల పూసలహారాలూ కూడా దాచిపెట్టింది. అవి రెండూ ఉన్నాయి. కానీ దండం వెండి పొన్ను మాత్రం మాయమై పోయింది. గప్ చిప్‌గా ఫజ్లూ దాన్ని కాజేసి, అమ్ముకున్నాడు, డబ్బంతా ఖర్చుపెట్టేశాడు కూడా!!
తాత కాలే ఫకీర్ గారికి యీ ప్రాంతాలలో చాలా గౌరవ మర్యాదలుండేవి. తమ పిల్లలకోసం ప్రార్థనలు చేయించేందుకు చాలా మంది ఆడవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. దుఃఖము, భయాల వల్ల వాడిపోయిన వాళ్ళ ముఖాలను కాలే ఫకీర్ తన ప్రార్థనల వల్ల మార్చేసేవారు. ఏడుస్తూ వచ్చిన వాళ్ళు, తమ పిల్లల క్షేమం గురించి విశ్వాసంతో వెనక్కి వెళ్ళేవాళ్ళు. కాలే ఫకీర్ పెద్ద పెద్ద జోలెలు భుజాన వేసుకుని భిక్ష అడిగేందుకు వెళ్ళేవారు. పూర్తిగా నిండిన జోలెలతో టంటం (షేర్ ఆటో లాంటిది)లో ఇంటికి తిరిగి వచ్చేవారు. ఈ టంటంలు తిరగటం ఆగిపోయింది. వారి పొట్టి భారీ దేహం నడిచేందుకు సహకరించకుండా పోయింది. అప్పుడు రిక్షాలో కూర్చుని భిక్ష అడిగేందుకు వెళ్ళేవారు. ఒక రోజు మధ్యాహ్నం, భిక్ష కోసం వెళ్ళి, నిండిపోయిన జోలెలతో రిక్షా ఎక్కారు ఇంటికి వచ్చేందుకు! కానీ రిక్షా నుండి దిగనేలేదు. దారిలోనే మరణించారు. కదలనూ లేదు, మెదలనూ లేదు. రిక్షా వాడికి కూడా తెలియనేలేదు. తన తాతకు కూడా పక్కా మసీదు కట్టించాలని రసీదన్ చాలా ఆరాటపడింది. కానీ గోరీలగడ్డ కమిటీ పెద్దలు పడనీయలేదు.
కాలే ఫకీర్కి మొత్తం ముగ్గురు సంతానం. ముందు రసీదన్ వాళ్ళ అమ్మ. తరువాత రసీదన్ మామయ్య, తరువాత పిన్నమ్మ. రసీదన్ వాళ్ళమ్మా, పిన్నమ్మా చనిపోయి చాలా కాలమయింది. ముందు కుటుంబమంతా యీ గోరీలగడ్డలోనే కాపురముండేది. అమ్మమ్మ బతికి ఉన్నంతవరకూ, ఇంటి బాధ్యత ఎవరికీ పట్టేదే కాదు. ఆమె ఒళ్ళంతా బంగారమే!! కాస్త నిదానంగా ఇతరుల సహాయంతోనైనా, అవసరాలన్నీ సక్రమంగా పూర్తయేవి.
గర్భం నిలవని ఆడవాళ్ళు, హజ్రత్ దాతా పీర్ మనిహరీ మసీదు దగ్గరికి వచ్చి పూజలు చేస్తారు. తరువాత కాలే ఫకీర్ దగ్గరికి వచ్చి, ప్రార్థనలు చేయించి, తాయెత్తులూ, కట్టించుకుంటారు. పిల్లలు పుట్టినప్పుడు, మొక్కుబడి తీర్చుకునేందుకు నగలు పెడతారు. అవన్నీ అమ్మమ్మ ఒంటిమీదకు చేరుతాయి. ఆమె చనిపోయిన తరువాత, ఆమె నగలన్నీ పిన్ని మింగేసింది. ఆ నగలన్నీ అమ్మి, బాబాయ్ ఫుల్వారీ షరీఫ్ లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. గోరీలగడ్డ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ, ప్రతి నెలా వచ్చి పడతారు. ఆదాయం ఎంత వచ్చిందీ, తమ భాగమెంతో ఇమ్మనీ అడుగుతూ!! ఇక్కడ అటువంటి లెక్కా పత్రాలేవీ లేవు. ఐనా వాళ్ళకు మూట కట్టి ఇవ్వటానికి ఇక్కడ ఒక పద్ధతీ పాడూ ఏమీ వ్రాసి లేదు. ఇక్కడి గోరీలమీద ప్రతినెలా డబ్బు వర్షమేమీ పడదు కదా!! కానీ క్రమం తప్పక వస్తారు, దెబ్బలాడుతారు. ఉన్నంతసేపూ అరచుకోవటాలే!!వాళ్ళ కోపాన్ని తట్టుకోలేక, ప్రతిసారీ అమ్మ, ఏదో ఒకటి వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ బారినుండీ తప్పించుకునేది. ఆమె నాన్న మౌనంగా ఉండేవారు. అమ్మ చనిపోయిన తరువాత కూడా యీ పద్ధతి కొనసాగింది, చాలా రోజులవరకూ!! ఆమె బాబాయ్ కొడుకులు, బాబాయ్ కన్నా కూడా దుర్మార్గులు. ఇద్దరి మధ్యా శత్రుత్వమూ వుంది. ఇన్నీ ఉన్నా రసీదన్ దగ్గరికి డబ్బు వసూలు చేసేందుకు వచ్చినప్పుడు, ఇద్దరిదీ ఒకే మాట! ఎంతో కొంత తీసుకునే వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడి ఆదాయమంతా వీళ్ళకే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైనా తనదగ్గర డబ్బు లేకపోతే అప్పు తీసుకుని వాళ్ళకు ఇచ్చేది రసీదన్. ఫజ్లూ వయసులో చిన్నవాడే కానీ వాళ్ళను కొట్టేందుకు, కొట్టించుకోవటానికీ కూడా సిద్ధమైపోయేవాడు కోపంతో!! రసీదన్, ఫజ్లూను ఎలాగో నోరెత్తకుండా నియంత్రించేది. ఇప్పుడు వాళ్ళంతా రావటం లేదు. వాళ్ళ పిల్లలంతా బాగా చదువుకున్నారనీ, బైటి దేశాల్లో ఉంటున్నారనీ రసీదన్ విన్నది.
అబ్రార్ మామయ్య కూడా తన పెళ్ళై పోయిన తరువాత ఇక్కడినుంచీ వెళ్ళిపోయాడు. తను అమ్మమ్మ ముద్దుల కొడుకు. అందుకని, సమాధులు తవ్వమనకుండా, చదువుకోవటానికి స్కూల్‌కు పంపేది. ఎనిమిదవ తరగతి వరకూ చదువుకున్నాడు. తరువాత, చదువు వదిలిపెట్టి ఆ చిన్న వయసులోనే హోటళ్ళకు పచ్చి మాంసం, చేపలు సప్లై చేసే పని మొదలుపెట్టాడు. సబ్జీబాగ్లో ఒక హోటల్ యజమాని కుమార్తెను బుట్టలో వేసుకున్నాడు. అమ్మమ్మ, అతని వివాహ సమయంలో తమ తాహతుకు మించి ఖర్చు చేసింది. ఒక సంవత్సరం తరువాత మామయ్యకు కొడుకు పుట్టాడు. కొడుకు నామకరణ ఉత్సవానికి మామయ్య తన తల్లిని అక్కడికి రానివ్వలేదు. కారణం, ఆమె ( రసీదన్ అమ్మమ్మ) అక్కడి ఇళ్ళలో భిక్ష అడిగేందుకు వెళ్తూ ఉండేదట!! రసీదన్ వాళ్ళమ్మ చెబుతూ ఉండేది, ‘మామయ్య ఇలా చేయటం, అమ్మమ్మ మనసులో న్యూనతాభావాన్ని కలిగించింద’ట!! చాలా రోజులు ఏడ్చి, ఏడ్చి, ఆమె ఆరోగ్యం పాడైపోయిందట!! చాతీ మీద కొట్టుకుంటూ తెగ ఏడ్చేదట!! తాము ఉంటున్న ప్రాంతమంతా తిరుగుతూ, తానెంత కష్టపడి, తన కొడుకును పెంచి పెద్ద చేసిందో చెబుతూ, చివరికి దీనికోసమేనా? అని కథలు కథలుగా చెప్పేదట!! ఈ నిర్దయ ఆమెను మరణం దాకా తీసుకుని వెళ్ళింది.
మామయ్య అత్తింటి అల్లుడైపోయాడంతే!! సబ్జీబాగ్ లోనే స్థిరపడిపోయాడు. మామగారి హోటల్ మేనేజర్‌గా పనిచేస్తూ పనిచేస్తూ, తన మరిదినే మోసగించి, తానే హోటల్ యజమానీ అయ్యాడు. తన పెళ్ళైన తరువాత గోరీలగడ్డను వదిలి బైటికి వెళ్ళినవాడు తిరిగి మళ్ళీ తన తల్లి గురించి తెలుసుకునేందుకు కూడా రాలేదు. ఆయన మృత దేహం వచ్చింది, ఇక్కడే పాతిపెట్టించేందుకు!! నసీర్ స్వయంగా గొయ్యి తవ్వాడు. మామయ్య ముగ్గురు కొడుకులూ ఒకనాడైనా రసీదన్ గురించి వాకబు కూడా చెయ్యలేదు. మామయ్య పెద్ద కొడుకు హోటల్ పని చూసుకుంటున్నాడు. మధ్యలో వాడు బాంక్‌లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు హారున్ నగర్లో రెండంతస్తుల భవనం కట్టుకుని ఉంటున్నాడు. ఇక మూడవవాడు, కాలేజీలో చదువుకుంటు ఉండేవాడనీ, కానీ పిచ్చివాడై ఇంట్లోనుంచీ వెళ్ళీపోయాడనీ విన్నది. కానీ ఇటీవలే తెలిసింది, ఇప్పుడు పత్థర్ మస్జిద్ దగ్గర షాహ్ అర్జా దర్గాలో ఉంటున్నాడట!! ఒక పురాతన కబ్రిస్తాన్లో ఉన్నది యీ దర్గా! పోనీలే, ఆఖరికి ఎవడో ఒకడైనా దొరికాడు తాతగారి వంశంలో ఫకీర్ బాట పట్టటానికి! సంగతి తెలియగానే రసీదన్ మనసు కాస్త చల్లబడింది. తన తాతగారు కాలే ఫకీర్‌కు కూడా కాస్త శాంతి దొరికే ఉంటుందనిపించింది కూడా!! ‘ఎప్పుడైనా తీరిక చేసుకుని షాహ్ అర్జా దర్గాకు వెళ్ళి, తన మామ కొడుకును చూసి రావాల’ని రసీదన్ అనుకుంటూ ఉంటుంది.
అందరికీ వాళ్ళ వాళ్ళ బతుకులున్నాయి. అత్తా పోయింది, మామా పోయాడు, రసీదన్ వాళ్ళ నాన్న కూడా ఎవరికోసమో గొయ్యి తవ్వుతూ తవ్వుతూనే ఎండ వడ కొట్టి ఆ తవ్విన గోతిలోనే ప్రాణాలు వదిలేశాడు.
రసీదన్ వాళ్ళ నాన్న చాలా నిరాడాంబరుడు. మౌనంగా వుండేవాడు ఎక్కువగా!! మాట్లాడితే, తియ్యగా మాట్లాడేవాడు, అంతే!! ఆయన అదృష్టం బాగా లేక ఇలా కబ్రిస్తాన్లో గోతులు తవ్వాల్సి వచ్చింది. నిజానికి ఆయన పుట్టిన వంశం వేరు. గంగ ఒడ్డున చిమ్నీ ఘాట్‌లో మదర్సా మసీదు వెనుక వాళ్ళ సొంత ఇల్లు ఉండేదని, ఆయన చెబుతూ ఉండేవాడు. చిన్న ఇల్లట!! వాళ్ళ పెద్దవాళ్ళ జమానాలో అది చాలా పెద్ద ఇల్లేనట!! కుటుంబం పెద్దదవుతూ వచ్చింది. ఇంటి స్థలం, భాగాలు భాగాలుగా చీలిపోతూ వచ్చింది. పెద్ద పెరడు, ఎన్నెన్నో గదులూ ఉన్న ఇల్లు కాస్తా కుంచించుకుని పోయింది. ఇంట్లో తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ – అందరూ ఉంటే, అసలు ఊపిరి కూడా సరిగ్గా ఆడేది కాదట!! ఇలా ఉండగా ఒక రోజు – వాళ్ళ తాగుబోతు నాన్న, ఆ చిన్న స్థలం కూడా ఒక కల్లు దుకాణం వాడికే అమ్మిపారేశాడు. తన ఇద్దరు భార్యలూ, వాళ్ళ డజన్ల కొద్దీ పిల్లలకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడు. ఆయననేవాడు, ‘ఇవన్నీ జరిగి చాలా ఏళ్ళైపోయాయి. నాలుగు వందల సంవత్సరాల కిందట, వాళ్ళ పూర్వీకులు, మాలిక్ బానో పెళ్ళి తరువాత, ఆమె తో పాటు వచ్చేశార’ట, ఇక్కడికి! మాలిక్ బానో తాజ్‌మహల్ ముంతాజ్ ఉంది కదా, ఆమె చెల్లెలట!! ఇక్కడ ఒక పెద్దింటి కోడలై వచ్చింది. ఆమెతో వాళ్ళ పుట్టింటివాళ్ళూ కొంతమంది వచ్చారిక్కడికి!! ఆ గుంపులో వీళ్ళ పూర్వీకులూ వచ్చారట!!
రసీదన్ వాళ్ళ నాన్న, మారుఫ్ గంజ్ లోని కాంట్రాక్టర్ల దగ్గర హమాలీగా పని చేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఎవరి అంతిమ సంస్కారాల కోసమో యీ గోరీల గడ్డకు వచ్చాడట!! అప్పుడు కబ్రిస్తాన్లో అమ్మమ్మ ఆయన్ని ఎలా మంచి చేసుకుందో, లేక వాళ్ళ నాన్నే రసీదన్ వాళ్ళమ్మను చూసి ప్రేమలో పడిపోయాడో కానీ, తన పెద్ద బిడ్డనిచ్చి (రసీదన్ వాళ్ళమ్మ) పెళ్ళి చేసిందామె. ఆమె సంతానమే రసీదన్!! రసీదన్ పెళ్ళి, నసీర్ మియ్యాతో చేసింది అమ్మ. తాను తనువు చాలించింది. పెళ్ళికి ముందు నసీర్, రసీదన్ నాన్నతో పాటూ రోజు కూలీకి సమాధులు తవ్వే పని చేస్తూ ఉండేవాడు. రసీదన్ తండ్రి చనిపోయిన తరువాత ఆమె తల్లికి అతనెంతో సహాయం చేశాడు. పొడుగ్గా, తెల్లగా, అందంగా వుండేవాడతను! దృఢమైన శరీరం కూడా!! రసీదన్‌కు కూడా బాగా నచ్చేశాడు. ఇంటికి అల్లుడైపోయాడు. కానీ, తలరాత మరోలా ఉంది, ముగ్గురు పిల్లలనిచ్చి, రసీదన్ను ఆసరాలేని ఆడదాన్ని చేసి వెళ్ళిపోయాడు నసీర్ పైకి!! ఎవరికేమి చేసిందో తాను కానీ తన ముఖం వాడిపోయింది భర్త లేకుండా!! నసీర్‌కు ఎవరో విషమిచ్చారని చుట్టూ ఉన్నవాళ్ళన్నారు. ఎవరో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేశారు కూడా!! పోలీసువాళ్ళు వచ్చారు, పోయారు. ఈ రోజు వరకూ ఏమీ తెలీదు. డబ్బులుంటే అన్నీ తెలుస్తాయి. కోర్ట్, పోలీసు – అన్నీ డబ్బు చుట్టూతానే!! ఎవరినా యీ పని చేసి ఉంటే, ఆ హంతకుడికి శిక్షా పడుతుంది. కానీ బీదవాళ్ళకు న్యాయం, గగన కుసుమమే!! రసీదన్‌కు అప్పటికే ముగ్గురు పిల్లలు. తన కడుపు నింపుకోవటమే కాదు, పిల్లల కడుపులూ నింపాలి కదా!! ఒంటరిగా ఎన్నెన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది? ఎన్నెన్ని పనులు చేయాల్సి వచ్చింది తనకు? నుదుటిరాతకే వదిలిపెట్టింది తాను అంతా అప్పట్లో!! నసీర్ చావు వెనుక, సత్తార్ మియ్యా హస్తం గురించి ఊళ్ళోవాళ్ళు గుసగుసలు పోతున్నారని ఆమెకు తెలుసు. రసీదన్పై మనసుపడి సత్తార్ మియ్యా నసీర్ ఆహారంలో విషం కలిపాడని వాళ్ళూ అంటూ ఉంటారు.
***
కదం కువా నుండి రైల్వే స్టేషన్‌కు వెళ్ళే ముఖ్యమైన మార్గం నుండీ మరొక దారి, గోరీల గడ్డ గేట్ దగ్గరికి వెళ్తుంది.
ఇదే దారినుండీ చీలే నాలుగో రోడ్డే ఆఖరుది. గోరీల గడ్డను ఆనుకుని వుండే ఇళ్ళ ముందునుంచీ వెళ్ళే యీ సందు చాలా ఇరుకైనది. ఇళ్ళ పైకప్పులవల్ల పైన ఆకాశం అసలు కనిపించదు. కింద నడుస్తూ ఉంటే, ఏదో సొరంగ మార్గంలో నడుస్తున్నామా అనిపిస్తుంది. ఇటువంటివే మరో మూడు సందులున్నాయి. కానీ అవి దీనికన్నా కాస్త వెడల్పు. ఈ నాలుగు వీధులకూ మరో చివర మూసివేయబడి ఉంది. సత్తార్ మియ్యా, సాబిర్ యీ నాలుగో వీధిలో ఉంటారు.
ఈ వీధుల్లో రోజువారీ కూలీల మీద బతికే వాళ్ళే ఉండేవాళ్ళు. పాట్నా వీధుల్లో గుడ్లు, పళ్ళూ, కూరగాయలూ, జూసులూ, ఐస్ క్రీములూ, షర్బత్, లస్సీ, పానీపూరీ, చాట్ ఇటువంటివన్నీ అమ్మేవాళ్ళ ఇళ్ళన్నీ అన్నమాట! టిన్నులనుండీ, చాలా పెద్ద పెద్ద ఆకారాల పాత్రలు చేసే శ్రామికులూ, ఇటుకలు చేసేవాళ్ళు, వెల్ల వేసేవాళ్ళూ, పెళ్ళిల్లనుండీ శ్రాద్ధ కర్మల భోజనాలలో వంటలు చేసే వంటలవాళ్ళతో నిండిపోయి ఉంటాయా వీధులు. ఉద్దిపప్పు పిట్టీ, లేదా కాజూ పిట్టీలు, అగ్నిహోత్రం కోసం మామిడి ఎండు కొమ్మలు లేదా అగరొత్తులు, మద్యపాన కఠిన చట్టాలున్నా దేశీ సారాయి లేదా పౌచ్ లేదా దొంగతనంగా తెచ్చిన విదేశీ సరుకు – కన్ను మూసి తెరిచేంతలో ఏర్పాటు చేసే సామర్థ్యం ఉంటుందీ వీధుల్లో!! ఈ వీధుల లెవెలే వేరు. ఇక్కడ ఎటువంటి మోసమూ ఉండదని ప్రజలు నమ్ముతారు.
తెల్లవారిన వెంటనే, ఇక్కడినుంచీ గుంపులు గుంపులుగా ఆడవాళ్ళు బయలుదేరిపోతారందరూ నగరంలోకి!! బహుళ అంతస్తుల ఇళ్ళల్లో కాలింగ్ బెల్లులు మోగుతాయి. ఇల్లు ఊడవటం, పాత్రలు కడగటం, బట్టలుతకటం, వంట చేయటం, చిన్న పిల్లలను చూసుకోవటంలో నేర్పరులైన యీ ఆడవాళ్ళు యీ ఫ్లాట్ నుంచీ ఆ ఫ్లాట్, అటు తరువాత ఇంకొకటి – ఇలా ఇళ్ళల్లో పనులు చేస్తూ, వాళ్ళు తమ ఇళ్ళకు చేరుకునేసరికి మధ్యాహ్నమౌతుంది. మళ్ళీ తెల్లవారే బయలుదేరటం, రాత్రికి రావటం!! కొంతమంది పొద్దున్నే బయలుదేరి రాత్రి బాగా పొద్దుపోయిన తరువాతే ఇళ్ళకు వస్తారు. గోరీల గడ్డ, నూరానీ మసీదు గేట్ వరకూ వెళ్ళి కుడి వైపుకి తిరిగే యీ వీధి, ఉదయం నుండీ రాత్రి వరకూ మృదంగంలా, దీన్నుండీ వెళ్ళే నాలుగు వీధులూ తాళాల్లాగా మోగుతూనే ఉంటాయి.
సాబిర్, ఫజ్లూ స్నేహితులు. చిన్నప్పటి నుంచీ ఇద్దరూ ఆడుతూ పాడుతూ పెరిగారు. కుంటివాడైన ఫజ్లూకు ఆటంటే బీడీలు తాగటం, పేకాడటం. ఈ బీడీల పిచ్చి, పెద్దైన తరువాత, గంజాలో చిలుము పీల్చటం, సారా తాగటంలోకి మారింది. ఈ రెండింటిలో ఆరితేరినవాడు సత్తార్ మియ్యా. సత్తార్ మియ్యా డబ్బూ దస్కం బాగా ఉన్నవాడు. చాలా వ్యాపకాలున్నవాడు. నగరం నుంచీ మేకల చర్మం కొనటం, చర్మ పరిశ్రమల ఏజెంట్ లకు అమ్మటం ముఖ్యమైన వ్యాపారం. ఇది కాక మరో గొప్ప నైపుణ్యం ఉందాయన దగ్గర!! చిన్న చిన్న దొంగతనాలు, చెయ్యివాటుతనం ఉంది. చిన్నప్పుడు మోటర్ గరాజ్లో పనిచేసేవాడు. ఎటువంటి శబ్దమూ చేయకుండా బండ్ల భాగాలు మాయం చేసి అమ్ముకోవటం – సునాయాసంగా చేసేవాడు. ఒకే ఒక్క బలహీనత – ఆడది. ఈ ఒక్క బలహీనత వల్లే మాటి మాటికీ ఎదురు దెబ్బలు తిన్నాడు ఎన్నో సార్లు. ఇప్పుడాయన శిష్యుడు సాబిరే ఆయనకు అడ్డు తగులుతున్నాడు. అమీనా అంటే ప్రాణం సాబిర్కు!! రసీదన్‌కు తనంటే వల్లమాలిన అసహ్యమనీ, సాబిర్కు అమీనాకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నదనీ సత్తార్ మియ్యాకు తెలుసు.
నాలుగో సందు చివర గోరీలగడ్డ పెరడులోనే చర్మాలు పెట్టుకునేందుకు ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. బైటికి వెళ్ళేందుకు పెరడులో ఒక గేటు కూడా పెట్టాడు. రసీదన్ ఇంట్లో బైఠాయించిన తరువాత, ఎన్నో సార్లు కమిటీకి విన్నవించుకున్న తరువాత, యీ స్థలం ఇచ్చారతనికి!! కొన్ని నెలల తరువాత రసీదన్ అతన్ని ఇంట్లోనుంచీ తరిమేసింది, కానీ అతగాడీ స్థలాన్ని వదిలిపెట్టటం లేదు.
రసీదన్ కూడా అతన్ని ఇంట్లో నుంచీ పూర్తిగా వెళ్ళగొట్టలేదింకా! అమీనా, ఫజ్లూ మీద మంత్రమేదో వేశాడతను అనిపిస్తుందామెకు!! ఫజ్లూ అతని శిష్యరికం చేస్తూనే వున్నాడు. అమీనా కూడా తిండి మీద మమకారం వల్ల అతణ్ణి ఊరిస్తూనే వుంటుంది కాస్త!! కోపగించుకుంటూ ఉంటుంది. వెంట తిప్పుకుంటూనూ ఉంటుంది.
ఇదంతా సత్తార్ మియ్యాకు అర్థం కావటం లేదు. కానీ ఏనాటికైనా అమీనా మనసు కొవ్వొత్తిలా కరిగిపోతుందని నమ్మకముంది పాపం!! అలాగే ఐతే అమీనాతో పాటూ పీర్ ముహానీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాడతను!! అమీనా ఆయనతో ఎటువంటి ఆట ఆడుతోందో ఆ అల్లాకే తెలియాలి.
(సశేషం)
డా.పుట్టపర్తి నాగపద్మిని, ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి దంపతుల చతుర్థ పుత్రిక. విద్యాపరంగా హిందీ లో పీ.హెచ్ డీ, తెలుగు ఎం.ఏ. నాలుగైదు డిప్లొమోలు ఇప్పుడు, ఇప్పుడు సంస్కృతం ఎం.ఏ. చదువుతున్నారు. వారి అయ్య గారి స్ఫూర్తితో, సాహితీ వ్యాసంగం చేపట్టినప్పటినుంచీ, ఇప్పటిదాకా పద్య, వచన కవిత, నవల, కథ, గేయ, అనువాద ప్రక్రియల్లో ఇప్పటిదాకా అర్థ శతం దాకా ప్రచురితాలు. ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ అనువాద పురస్కారం, గోయెంకా జాతీయ ఉత్తమ అనువాద పురస్కారం, తమిళనాడు హిందీ అకాడమీ పురస్కారం, బిహార్ సాహిత్య సమ్మేళన్ విశిష్ట రచయిత్రి పురస్కారం అందుకున్నారు. విక్రం శిలా విద్యాపీఠ్ ద్వారా విద్యావాచస్పతి,అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ భోపాల్ వారిచే భారత్ భాషా భూషణ్ బిరుదులు వరించాయి. గత 20 సంవత్సరాలుగా తిరుమల వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యతగా వాక్సేవలందించటం, తమ అయ్యగారి శివతాండవాన్ని హిందీ లోకి అనువదించి పలువురు హిందీ సాహితీవేత్తల ప్రశంసలు అందుకోవటం మరపురాని అనుభుతులంటున్నారు. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ నుండి 2021- 2023, వరకు ప్రతిష్ఠాత్మక సీనియర్ ఫెలోషిప్ పొంది, ‘పుట్టపర్తి రచనల్లో భారతీయ సంస్కృతి’ అన్న పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ హిందీ నవల చదవగానే ఇతివృత్తం అద్భుతంగా తోచి అనువాదం చేపట్టి, ఎంతో ఇష్టంగా దీక్షతో చేశాననీ, తెలుగు పత్రికా రంగ క్షేత్రంలో తనదైన ప్రత్యేక ముద్ర కలిగిన సంచిక పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవటం, చాలా హర్షదాయకమని పేర్కొంటూ, సంపాదకులకు తన ధన్యవాదాలు తెలియజేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కె. విశ్వనాథ్ చిత్రాలలో వాస్తవికత
ఎవరు నీవు
పూచే పూల లోన-24
మహాభారత కథలు-32: పాండురాజు వివాహము-దిగ్విజయము
విశిష్ట వ్యక్తిత్వం – కీ.శే. శ్రీ సిహెచ్. లక్ష్మీ నారాయణ
దేశ విభజన విషవృక్షం-39
పూచే పూల లోన-15
గుంత
దాహం బాబయ్యా దాహం
అమ్మ ప్రేమ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®