ఒకరి నుంచీ ఒకరం విడివడిన ప్రతిసారీ
మనమేం కోల్పోతున్నామో మాట్లాడుతాం
సముద్ర తీరంలో నడిచిన సూర్యాస్తమయాల్ని
కలిసి చూసిన చంద్రోదయాల్ని
చేతుల పూలలో ఎగిరెళ్ళి పోయిన
సీతాకోక చిలకల్నీ గుర్తుచేసుకుంటాం
పక్కపక్కనే నడుస్తూ
ఒకే దారిలో నడవలేని స్థితికి దుఃఖిస్తాం
ఎక్కడో ఒకచోట మాత్రమే కలవగల
ఎనిమిదంకె లాటి దారి మనది
కలిసిన ప్రతిసారీ
మనసో బుద్ధో వాదించమంటుంది
కోల్పోయిన క్షణాలు లెక్క పెట్టమంటుంది
తప్పులు ఎవరివో
ఒప్పులు ఎన్నో సరిచూడమంటుంది
కలవని దారులు కలిసే చోటు గురించి
జీరబోతున్న మనసు గొంతును గుప్పిట పట్టుకుంటూ
అద్దంలో చూసే సున్నాలాటి దారుల్లో
ఒకరి తలపుల్లో ఒకరం దగ్ధమౌతూనే
నీవోవైపు నేనోవైపు
ఎడ తెగని కలలాటి మన ప్రయాణం మళ్ళీ మొదలెడతాం
ఆక్రోశంతో,
నిశ్శబ్దంగా,
ఉద్విగ్నంగా..
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606