[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘దారిలో పడ్డాడు..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
ఆఫీస్ నుండి వస్తూనే, “లక్ష్మి లక్ష్మి” అంటూ బెడ్రూంలోకి, కిచెన్లోకి తొంగి చూస్తూ గట్టిగా పిలిచాడు శేఖరం.
అతని అరుపులు ఆమెకి కొత్త కాదు గనుక, నెమ్మదిగా వంట గదిలో నుండి హాల్లోకి వచ్చి, “ఏవిటండీ, ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా అరుస్తున్నారు. ఏమైంది” అడిగిందామె.
“ఏవీ అవలేదు గాని, నువ్వు ముందు ఒక్కసారి ఇలా వచ్చి నా పక్కన కూర్చో” అన్నాడు.
“సరే సరే కూర్చుంటాను, ఉండండి రెండు క్షణాల్లో టీ పట్టుకుని వస్తాను, ఇద్దరం తాగుతూ మాట్లాడుకుందాం” అంటూ ఆమె మళ్ళీ వంట గదిలోకి వెళ్ళబోయింది.
“అబ్బా లక్ష్మి, ఒకసారి ముందు నువ్ ఇలా సోఫాలో కూలబడు, అవేవీ అక్కర్లేదు”. అని ఓ క్షణం ఆగి, “అబ్బా ముందు రమ్మన్నానా” అన్నాడు కాస్త గట్టిగా.
సరే ఎందుకు వచ్చిందని ఆమె వచ్చి సోఫాలో అతను పక్కనే కూర్చుని “చెప్పండి ఏవిటి అంత ముఖ్యవైన విషయం?”
“ఏవీ లేదు, మన అబ్బాయి దారిలో పడ్డాడు” అని శేఖరం ఇంకేదో చెప్పేంతలో, ఆమె ఒక్కసారే లేచి నిలబడి, కాస్త ఆందోళనగా “దెబ్బలేవయినా తగిలాయా” అడిగింది.
“నీతో ఇదే వచ్చింది తంట. ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇలానే ఉంటుంది. నేను అంటోంది పడ్డాడు అంటే మామూలుగా పడిపోవడం కాదు, ఒక తోవలో పడ్డాడు. అంటే, బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తున్నాడని అర్థం” నెత్తి కొట్టుకున్నాడు.
“అలాగా, ఇంతకీ ఏం చేశాడట అంత బాధ్యతగా” సాగదీస్తూ అపనమ్మకంగా అడిగింది.
“ఏమీ లేదు, మనం వాడి బీటెక్ చదువుకి ఫీజు అదీ కడుతున్నాం కదా, మనకు భారం తగ్గిద్దామని, తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ అటుగా కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు చూశాను. బస్టాండ్ దగ్గరలో సాప్టు టాయ్స్ అమ్ముతున్నాడు. బొమ్మలు కొనడానికి వచ్చిన వారితో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడనీ, వాడు ఓపిగ్గా సమాధానం చెప్తూ మరీ అమ్ముతున్నాడు. వాడు ఇప్పటినుంచే పాకెట్ మనీ సంపాదించుకోవడం, అది కూడా కాలేజీ చదువుతూ, పార్ట్ టైంగా మిగిలిన సమయంలో వాడిలా బాధ్యతగా మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది” ఉబ్బితబ్బిబ్బైపోతూ చెప్పాడు.
లక్ష్మి కాస్త సందేహంగా శేఖరం వంక అనుమానపు చూపులు చూస్తూ, “మీరు మరీ అమాయకంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది. గోరంతలు కొండంతలుగా ఊహించుకుని మీ మనసుని మునగ చెట్టు ఎక్కించకండి. పడితే మీ మనసు ముక్కలు చెక్కలైపోతుంది. కనుక కొద్దిగా నిదానంగా ఉండండి. మీరు చెప్పింది నిజంగా నిజం అయితే అప్పుడు చంకలు గుద్దుకుని సంబర పడిపోదురు గాని” చెప్పింది తేలిగ్గా తీసి పారేస్తూ.
ఆమె మాటలకి కొంచెం ఆవదం తాగినట్టు మొహం పెట్టి, “నేను అంత ఇదిగా చెబితే, నువ్వేవిటీ ఇంత ఇదిగా నా గాలి తీసేసావ్. అయినా నీకు వాడికంటే మనమ్మాయంటేనే ఎక్కువ గురి. అందుకే వాడిని తగ్గించి మాట్లాడేస్తున్నావ్. అయినా జరిగింది జరిగినట్టు చెప్పాను. ఇందులో నువ్ అనుమానించాల్సింది ఏవుంది, పైగా ఆ వయసులోనే మనకి చెప్పకుండా వాడంతట వాడే ఇలా సంపాదన వైపు చూడటం మెచ్చుకోదగ్గ విషయం కాదా.” అని క్షణం ఆగి “అయినా నేను చెప్పింది నువ్ పూర్తిగా నమ్మకపోవడం ఎందుకో నాకైతే ఏం అర్థం కాలేదు.”
“ఇందులో అంత వింతేం వుంది, ఇంత ఆశ్చర్య పోవడానికి. వాడిది అచ్చంగా అంతా మీ పోలిక, అందుకే వాడిలో ఆ మార్పుని నేను తేలిగ్గా నమ్మలేక పోతున్నాను. వాడి అమ్మగా నమ్మబుద్ధి కావడం లేదు. ఒకసారి వాడి కాలేజీ ప్రిన్సిపాల్‌కి ఫోన్ చేశారా! కొంపదీసి వాడు క్లాసులు అవీ ఎగ్గొట్టి, ఇలా ఆ జాబ్ చేస్తున్నాడేమో అనే అనుమానంగా ఉంది నాకు” అయోమయంగా చూస్తూ అడిగింది.
“నువ్ ఆ విషయంలో చింతాకంత కూడా చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే నేను నీ మొగుడ్ని. నీకంటే నేను రెండు ఆకులు ఎక్కువే చదివాను. నీకు వచ్చిన అనుమానవే నాకూ వచ్చి, వాడి ప్రిన్సిపాల్‌కి ఫోన్ చేశాను. అతను ‘మీ అబ్బాయి చాలా రెగ్యులర్‌గా క్లాసెస్‌కి వస్తుంటాడు. ఒక రోజు కూడా మానడు, చాలా మంచి స్టూడెంట్’ అంటూ వాడ్ని పొగిడి పారేసాడు. అప్పుడే అర్థమైంది, వాడు కేవలం వాడి పాకెట్ మనీ కోసమే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడని” చెప్పాడు మరింత మురిసిపోతూ.
అప్పటికీ లక్ష్మికి ఎందుకో నమ్మకం కుదరలేదు. శూన్యం లోకి చూస్తూ, ముక్కు మీద వేలేసుకుని, “ఏదో తిరకాసుగా ఉందే” అందామె.
“సరే నమ్మకు, నీ ఇష్టం. అయినా నీకు చెపడం నా బుద్ధి తక్కువ.” అని అక్కడినుండి లేచి వెళ్ళిపోయాడు శేఖరం.
తర్వాత రెండు రోజులకి శేఖరం కూతురు వచ్చి, “నాన్న చూడు, నీ కొడుకు ఏం చేశాడో” అంది కోపంతో ఊగిపోతూ.
“ఏవిటమ్మా, అంత కోపంగా ఉన్నావ్, ఏవైంది, ఇంతకీ అన్నయ్య ఏం చేశాడు” అడిగాడు కాస్త నిదానంగా.
“ఏం చేశాడా, ఇదిగో ఈ గోల్డ్ రింగ్ కొన్నాడు” అని తండ్రి చేతికి ఇచ్చింది
“ఆహా, మంచిదే కదమ్మా వాడు కష్టపడి సంపాదిస్తున్నాడు. దాంతో బంగారం లాంటి చెల్లికి ప్రేమతో ఓ గోల్డ్ రింగ్ కొని ఇచ్చాడు. ఉంచుకో, భద్రంగా దాచుకో. అయినా ఇందులో అంత కోప్పడాల్సిన విషయం ఏవుంది” అయోమయంగా అడిగాడు.
“అబ్బా నాన్నా, నీ ఈ అమాయకత్వం చూసే, వాడు నిన్ను ఇలా ఆడిస్తున్నాడు. ఇది ఇచ్చింది నాకు కాదు, నా ఫ్రెండ్ సుమలతకి. ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగు కదా, అందుకే ఆమె వెంటపడి మరీ, వద్దంటే ఈ గోల్డ్ రింగ్ ఇచ్చాడట. ఆమె నాతో చెప్పి తల బాదుకుంది. ‘ఇంకెప్పుడూ మీ ఇంటికి రాను’ అని నొక్కి మరీ చెప్పింది.”
“అలాగా!, అంటే ఇన్నాళ్లు వాడు కష్టపడిందీ, ఆ బొమ్మలమ్మిందీ, దీని కోసమా”, అంటూ తెల్ల మొహం వేశాడు శేఖరం.
“నేను అప్పటికీ చెప్పానా వాడిది మీ పోలికని” దెప్పి పొడిచింది లక్ష్మి.