[వాణిశ్రీ నైనాల గారు రచించిన ‘దారి తప్పని ఏరు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
నిన్నటిదాకా..
హాయిగా సాగిన పయనాన్ని
ప్రళయంగా మార్చేసి
హృదయాన్ని భగ్నం చేసుకుంది ఏరు..
ఆగని చినుకుల అండ చూసుకుని
కోతపడ్డ నేల మద్దతీయగా..
ఏకప్రవాహమై తెగించింది ఏరు..
దగా పడ్డ ధారలా
దర్వాజాల్లో
రాత్రికి రాత్రే భైఠాయించి
ధర్నాకు దిగింది ఏరు
మనసిచ్చిన కన్యకలా
ఒంపుసొంపులతో ఓ మారు..
వలపించే కాంతాలలామ లా
కరుణను పారిస్తూ ఓ మారు..
గుక్కెడు అమృతమై
గొంతు నింపే అమ్మలా
లాలనతో ఓ మారు..
పొద్దమాపుల్లో
పసుపు కుంకుమలు దిద్దుకుని
వాయనాలిచ్చే
నిండుముత్తైదువులా ఓ మారు..
వెచ్చని ఆర్ద్రతయై
సిరులు పండించే..
రైతన్నలా మరో మారూ..
మారుకో రూపంలో..
మారి మారి కనుపట్టే మా ఏరు
ఈ ఏడు మనసు పగిలి
వెక్కి వెక్కి ఏడ్చింది..
గుండెను గునపాలతో త్రవ్వి
చనుబాలు తాగిన గుండెను
ఎగతాళిగా తన్నినందుకు..
ఓ ఆక్రోశమై..
వావీవరుసా మరచి
అన్యాయంగా ఆక్రమించిన
తన ఆడుతనాన్ని
ఓడుతనం చేసినందుకు..
ఓ రౌద్రమై
గుక్కపట్టి ఏడ్చింది.. ఏరు
కుమిలి కుమిలి ఏడ్చింది.. నీరు
ఏటి ఉసురుపోసుకున్న నగరం
ఇప్పుడు
ఆకలి కేకలతో..
తీతువు కూతలతో…
ఎటూ పాలుపోక
చుక్క పాలూ లేక
పసిపాపలా రోదిస్తుంది..
చూరులకంటుక సుక్కిపోయింది..
నాలుక అంగిలికి అంటి చిక్కిపోయింది..
ఎక్కడో ఎత్తులలో కూర్చుని
వినతులు వినిపించుకోని
దుర్గమ్మ ఉగ్రం ఉపశమించేలా..
ఏరు పొగిలింది..
ఊరు కుమిలింది..
(31-08-2024 బెజవాడ వరదల నేపథ్యంలో వ్రాసుకున్న కవిత)