[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]
[సాబిర్ సుల్తాన్ గంజ్ చేరుకుంటాడు. అంతకు ముందు ఎన్నో సార్లు ఈ వీధిలోకి వచ్చినా అమ్మ పుట్టింటికో, తన స్నేహితులను కలుసుకోడానికి వెళ్ళాలనిపించలేదతనికి. తన మిత్రుడు నోమాన్ వాళ్ళ గురించి వాకబు చేస్తే, ఇక్కడ ఇల్లమ్మేసి మరో కాలనీకి మారిపోయారని తెలుస్తుంది. నూర్ మంజిల్ ఎక్కడుందని కనుక్కుని, అ భవంతి దగ్గరకు వెళ్తాడు. గేట్ మూసి ఉంటుంది. అక్కడే నిలబడి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాడు సాబిర్. చివరకు ధైర్యం చేసి అక్కడ ఉన్న కాలింగ్ బెల్ నొక్కుతాడు. మనసంతా భయం భయంగా ఉంటుంది. ఒక మధ్య వయసావిడ తలుపు తెరిచి, ఎవరు కావాలని అడుగుతుంది. షెహ్నాయీ వాయించే ఫహీం సాహబ్ ఇల్లు ఇదేనా అని అడుగుతాడు. అవునంటుంది. ఆయన్ని కలవాలని అంటే, లోపలి పిలిచి, అక్కడున్న వెదురు కుర్చీలో కూర్చోమంటుంది. ఆ పరిసరాలను పరిశీలుస్తూ కూర్చుంటాడు సాబిర్. కొద్ది సేపటి తర్వాత ఆమె వచ్చి పిలుస్తున్నారంటూ, లోపలికి తీసుకువెళ్తుంది. వరండాలో వెదురుతో చేసిన పెద్ద సోఫా ఉంది. అక్కడ కూర్చుని అక్కడున్న అనేక ఫోటోలలో తన తండ్రి ఫోటోని గుర్తుపట్టాలని ప్రయత్నిస్తాడు సాబిర్. ఇంతలో ఫహీం బఖ్ష్ అక్కడికి వస్తాడు. సాబిర్ నమస్కరించగానే, ఆయనా ప్రతినమస్కారం చేసి, ఎవరు, ఏం పని మీద వచ్చారని అడుగుతాడు. సాబిర్ తన పేరు చెప్పి, పీర్ ముహానీ నుంచి వచ్చాననీ, మదీహా బానో కొడుకునని చెప్పేస్తాడు. చాలా ఏళ్ళ తర్వాత ఇంట్లో చెల్లెలి పేరు వినబడేసరికి విస్తుపోతాడాయన. సాబిర్ని పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని వివరాలు తెలుసుకుంటాడు. ‘రుక్న్ బీ?’ అని ఫహీం బఖ్ష్ పిలవగానే ఇందాక వచ్చినావిడ వచ్చి ‘అయ్యా..’ అంటుంది. అందరికీ టీ చేసి తీసుకురమ్మని చెప్పి, అందరినీ పిలవమంటాడు. కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చి కూర్చుంటారు. మున్నా.. అంటే ఆయన తమ్ముడు ఆ సమయంలో అక్కడ ఉండడు. ఈలోపు రుక్న్ బీ తినుబండారాలు షర్బత్ తెచ్చి ఇస్తుంది. వాళ్ళందరికి సాబిర్ని పరిచయం చేసి, మదిహా బానో కొడుకు అని చెప్తాడు. మదీహా బానో అక్క, సాబిర్ పెద్దమ్మ ఫర్హత్ బానో – ఉన్నట్టుంది తాతయ్య ఇల్లు ఎందుకు గుర్తొచ్చింది అని సాబిర్ని అడుగుతుంది. చాలా రోజుల్నించి వచ్చి కలవాలని అనుకుంటున్నాననీ, కానీ భయం వేసిందనీ, గుర్తు పట్టరేమో అనుకున్నాననీ చెప్తాడు. ఒకటడగాలని వచ్చానని అంటాడు. ఆస్తిలో వాటానా అని పెద్దత్తయ్య అడుగుతుంది. కాదు మా అమ్మ ఫోటో అంటాడు సాబిర్. తాను అమ్మని అసలు చూడనే లేదంటాడు. అత్తలిద్దరూ కరిగిపోతారు. రుక్న్ బీ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఫర్హత్ బానో కోపంగా వెళ్ళిపోతుంది. వాటిని తింటూ ఉండు, ఈ లోపు నేను ఫోటోలు తెస్తాను అని లోపలికి వెళ్తాడు ఫహీం బఖ్ష్. కొద్ది సేపటి తర్వాత చేతిలో ఓ కవర్‌తో ఫహీం బఖ్ష్ వస్తాడు. ఆయన వెనకే సాబిర్ ఇద్దరు అత్తలూ వస్తారు. ‘ఇందులో రెండు ఫోటోలున్నాయి. ఒకదానిలో మీ అమ్మా, రెండో దానిలో షెహ్నాయి వాయిస్తున్న మీ నాన్నా ఉన్నారు. కానీ ఫోటోలు ఇంటికి వెళ్ళిన తరువాతే చూడు.’ అని చెప్తాడు మామయ్య. పెద్దత్త ఓ పాలిథిన్ బ్యాగ్ ఇస్తుంది. అత్తలిద్దరూ వీలున్నప్పుడల్లా రమ్మని అంటారు. ఫోటోల కవర్నీ, ఆ పాలిథిన్ బ్యాగ్‌ని గుండెకి హత్తుకుంటూ అమీనా ఇంటికి వెళ్తాడు. జరిగినదంతా అమీనాకి చెప్తాడు. కవర్ లోని తల్లిదండ్రుల ఫోటోలని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. ఆ పాలిథిన్ బ్యాగ్‌లో ఏముంది? అని అమీనా అడిగితే, చూడలేదు, నీ దగ్గరే ఉంచు అంటాడు. ఇందులో నీకు బట్టలున్నాయి అని చెప్తుంది అమీనా. కబ్రిస్తాన్లో సందడి మొదలవుతుంది. – ఇక చదవండి.]
నూర్ మంజిల్‌లో ఒకటే గందరగోళం.
మున్నా, ఉర్ఫ్ గులాం బఖ్ష్ బైటినుంచీ వచ్చి సాబిర్ వచ్చి వెళ్ళిన వార్త విని కంగారు పడ్డాడు. ఇన్ని సంవత్సరాల తరువాత, మదీహా కొడుకు ఇక్కడికి హఠాత్తుగా ఎందుకు వచ్చి వెళ్ళినట్టు? ఫోటో సాకుతో, యీ కుటుంబంలో కలిసిపోయి, ఏదైనా మోసం చేసేందుకు కుట్ర ప్రారంభమా? బిల్కీస్ బానో ఏదైనా ఎత్తుగడ వేస్తూందా? తన భార్యతో పాటూ, అన్న, వదినెల తెలివితక్కువ తనం గురించి మొదట అతనికి కోపం కలిగింది. కానీ మళ్ళీ అనుకున్నాడు, అల్లా తాలా తమ అన్నదమ్ములనిలా కరుణించాడా? అని! తమ చెల్లెల్ని చెట్టూ పుట్టా పట్టుకుని తిరిగేలా తామే చేశాము ఆ రోజుల్లో, బీదరికంలో బతికేలా చేశాము. అదెక్కడి మానవత్వం? పవిత్ర పరమాత్మ నుంచీ ఏదీ దాచి ఉంచలేము. ఆ అమానవీయ కృత్యం కారణంగా తామీనాడు, ఒక శిక్షలాగా అనుభవిస్తూ ఉన్నాం. దీన్నుంచీ బైటపడటం, అసాధ్యంగా ఉంది. పెద్దక్కకు పెళ్ళే కాలేదు. ఎంతో పొగరుగా ఉండేది. తండ్రి ఉన్నన్ని రోజులూ, వచ్చిన సంబంధాలన్నీ వద్దనేసింది. నాన్న పోయిన తరువాత కూడా ఆమె పద్ధతేమీ మారలేదు. ఇద్దరన్నదమ్ములూ పిల్లల కోసం తపించి పోయారు. పెద్దన్న రెండవ పెళ్ళి కూడా చేసుకున్నాడు. దురదృష్టమే ఆ రూపంలో వచ్చిందేమో అనాలి. అమె రాకతో ఇంటి రూపమే మారిపోయింది. ఒక శరీరంలో వెయ్యి జబ్బులు. పగలూ రాత్రీ డాక్టర్ దగ్గరికి పరుగులే! ఎన్నెన్నో ప్రయత్నాల తరువాత కూడా ఆమె ఓ రోజు చనిపోయింది. ఫహీం బఖ్ష్ తరువాత పెళ్ళి చేసుకోవాలనుకోనేలేదు. ఈ రోజుకీ వదినె ఆయన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోమని పోరుతూనే ఉంటుంది. గులాం బఖ్ష్‌కు అల్లా ఒక కుమార్తె నిచ్చాడు కానీ పాప పురుటి గదిలోనే పోయింది. మళ్ళీ తరువాతెప్పుడూ, భాగ్య ద్వారాలు తెరచుకోనేలేదు. ఈ కసాయికి ఇంక పిల్లలెందుకివ్వాలనుకున్నాడో ఏమో అల్లా!! చెల్లెలి లాగే తన జీవితాన్ని కూడా గూడు లేని పక్షిలా చేశాడు. చుట్టూ ఉన్నవాళ్ళెన్ని చెప్పినా తను రెండో పెళ్ళి చేసుకోనేలేదు. భార్యంటే ఎంతో ప్రేమ తనకు! బంధువులు మరీ గొడవ పెడితే అంటుంటాడు, ‘ముందే రెండు పెళ్ళిళ్ళు, ఒకటోది షెహ్నాయితో, రెండోది భార్యతో! మూడో పెళ్ళాం నాకొద్దు బాబోయ్! షెహ్నాయీ వాయిస్తూనే ఆఖరి శ్వాస వదిలితే చాలు!’ అని నవ్వేస్తాడు తను! రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గరి నుంచీ లేచిన తరువాత అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవటానికి కూర్చున్నారు. ఇద్దరూ అరవై దాటినవాళ్ళే. ఫహీం బఖ్ష్ తన భారీ దేహం వల్ల ఇబ్బంది పడుతున్నారు. షుగర్, బ్లడ్ ప్రెజర్ తో పాటూ మోకాళ్ళ నొప్పుల వల్ల తెగ ఇబ్బంది. షెహ్నాయ్లో ఊపిరి నింపేటప్పుడు లయ తప్పి పోతూంది. ఆయనదే పెద్ద పేరు. ఆయన లేకుండా వేదికమీద పని జరగదు. ఈలోగా గంటా గంటన్నర కచేరీలు కష్టమ్మీద చేస్తున్నాడు, తోడుగా కూర్చున్న గులాం బఖ్ష్ సహ వాయిద్యం సాయమే ఎక్కువ. ఆయనిప్పుడు కచేరీలో ఎక్కువ నైపుణ్యం ప్రదర్శించే చోట మాత్రమే షెహ్నాయ్ పడతాడు, తక్కినదంతా గులాం బక్షే చేస్తున్నాడు. తండ్రి హుజూర్ మర్హూం నూర్ బఖ్ష్ ఆశీర్వాదాల ప్రభావం, అల్లా దయా భిక్ష వల్ల ఇప్పటికీ సంగీత ప్రపంచంలో పేరూ ప్రతిష్ఠా నిలిచే ఉంది. ఈ నగరంలో వాళ్ళకు పోటీ వచ్చేవాళ్ళెవరూ లేరు. ఆదాయంలో ఎటువంటి లోటూ లేదు. అడగకుండానే డబ్బు వస్తూంది. వైభవంగా రోజులు గడిచిపోతున్నాయ్. కానీ అల్లా తాలా ఒకే ఒక్క బాధనిచ్చాడు, మెల్లిమెల్లిగా వయసు పెరుగుతుంది, దేహం బలహీనమౌతుంది. అప్పుడెవరు చూసుకుంటారు మరి? ఈ ప్రశ్న తొలుస్తూనే ఉంటుందెప్పుడూ! దగ్గరి బంధువుల్లో కూడా అంత నమ్మకస్థులెవరూ లేరు. సాబిర్ రావటం, ఏదో చిన్న ఆశాదీపంలా నమ్మకం రూపంలో వాళ్ళముందు వెలుగునిస్తున్నదిప్పుడు! కానీ పెద్దక్క యీ పరిణామాన్ని జీర్ణం చేసుకోగలదా అని! సాబిర్ వెళ్ళిపోగానే ఈమె తన ఆర్భాటాన్ని ప్రదర్శించటం మొదలెట్టింది. మదీహాతో ఈమెకీ శత్రుత్వమెలా వచ్చిందో కానీ ఇప్పటిదాకా మరచిపోలేకుండా ఉంది. అప్పుడు కూడా యీ గొడవ కంతా కేంద్రమీవిడే! ఇద్దరన్నదమ్ముల మనసుల్లో ద్వేషం నింపిందీ ఈవిడే! ఇద్దరూ మరీ పసిపిల్లలు కాక పోయినా, చెవుల్లో నింపే విషం చాలా ప్రమాదకరం. ఇద్దరన్నదమ్ములకూ, వాళ్ళ భార్యలకూ కూడా జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సరైన సమయమిదేననిపిస్తూ ఉంది.
ఫహీం బఖ్ష్ అన్నాడు, ‘మున్నా! ఒక రోజు నువ్వు పీర్ ముహానీకి వెళ్ళి రా! బిల్కీస్ ఎక్కడుందో విచారించు! ఈ అబ్బాయినేనా ఇక్కడినుంచీ తీసుకెళ్ళింది అని అడుగు. ఆమెలా ఉందో కూడా తెలుసుకో! కళ్ళు మూసుకుని నమ్మలేం కదా! సబ్జీ బాగ్‌లో మిర్జా తౌఫీక్ అనే పెద్దాయనొకరున్నాడు. రహమనియా హోటల్ దగ్గర ఆయనకో పుస్తకాలూ, పత్రికల షాపుంది. నన్ను కలిసేవాడప్పుడప్పుడూ! ముందాయన పీర్ ముహానీలోనే ఉండేవాడు. ఆయన్ను కలు. ఆయనకేమైనా తెలిసే ఉండవచ్చు.’
దీనికి గులాం బఖ్ష్ సమాధానమిచ్చేంతలోపలే వదినె అంది, ‘మొబైల్ నంబర్ ఇచ్చి వెళ్ళాడు కదా! అన్నీ బాగుంటే అతన్ని పిలిచి కలుద్దాం ఇంకోసారి! మీరా అబ్బాయిని కలవనేలేదు కదా! చాలా సార్లు కలవటం వల్ల కూడా ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడన్న విషయాలూ తెలియవచ్చు, నిజమేదో తెలుసుకోనూవచ్చు.’
‘సరే! తెలుసుకుంటాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారా ప్రాంతంలో! కానీ యీ సంగతి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మేలు.’ గులాం బఖ్ష్ అన్నాడు.
‘అందరికీ ఇష్టమైతే ఒక చాయ్ తాగితే బాగుంటుందేమో’ తన ప్రత్యేకమైన శైలిలో రుక్న్ బీ అంది.
‘రుక్న్ బీ! నీకా అబ్బాయి ఎలా అనిపించాడు?’ గులాం బఖ్ష్ అడిగాడు.
‘అల్లా మీదొట్టు. చాలా చక్కని కుర్రాడు. నిజంగానే మంచబ్బాయిలా ఉన్నాడు.’ రుక్న్ బీ అంది. అందరినీ చూస్తూ, ‘చాయ్?’అని అడిగింది.
‘చెయ్. నీతోపాటీ మేమూ తాగుతాము.’ గులాం బఖ్ష్ నవ్వుతూ అన్నాడు.
రుక్న్ బీ లోపలికెళ్ళింది.
***
గులాం బఖ్ష్ ముందు, సబ్జీ బాగ్ లోనే ఉంటున్న అన్నగారి స్నేహితుడు మిర్జా తౌఫీక్తో మాట్లాడాడు. సాబిర్ గురించి అతని అభిప్రాయం సరిగ్గానే ఉంది. ‘చాలా రోజులయింది, పీర్ ముహానీ వదిలిపెట్టి! కానీ నాకా అబ్బాయి తెలుసు. తన పిన్నితో కలిసుండేవాడు. ఆవిడ పేరేమో నాకు గుర్తు లేదు. కానీ ఆ అబ్బాయిని తీసుకుని వేరే ప్రాంతం నుంచీ ఇక్కడికొచ్చింది. పేదవాళ్ళే! అక్కడ సత్తార్ మియ్యా అని ఒకతనున్నాడు. మేకల చర్మం వ్యాపారం చేస్తాడు. కబ్రిస్తాన్ లోనే ఒక మూల గోదాముంది అతనికి! ఆ సత్తార్ మియ్యా దగ్గరే యీ అబ్బాయి పనిచేస్తుండేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలీదు. సత్తార్ మియ్యా అప్పుడప్పుడు సబ్జీ బాగ్‌లో కనిపిస్తూనే ఉంటాడు. పలకరించుకుంటూనే ఉంటాం. ఇప్పుడెప్పుడైనా కలిస్తే అడుగుతాను. కానీ సంగతేంటి? ఎందుకీ వివరాలన్నీ?’
‘మా అన్నయ్య చెప్పాడు, మీతో మాట్లాడమని! విషయమేంటో వారికే తెలుసు. నాకేమీ చెప్పలేదండీ.’ గులాం బఖ్ష్ మాటలు తుంచేశాడు.
తనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మరింత సమాచారం సేకరించిన తరువాత, నాలుగైదు రోజులకు, పీర్ ముహానీకి చేరుకున్నాడు గులాం బఖ్ష్. కబ్రిస్తాన్కు దగ్గరలోనే సాబిర్ ఉంటాడని తెలిసింది.
సాబిర్, రాధే చాయ్ దుకాణం దగ్గర కూర్చుని చాయ్ తాగుతుండగా రసీదన్ ఫోన్ చేసి చెప్పింది, ఎవరో నీకోసం వెదుక్కుంటూ వచ్చారని! చేతిలో చాయ్ గ్లాస్ తీసుకుని కబ్రిస్తాన్ దగ్గరికి వచ్చేశాడు సాబిర్. గులాం బఖ్ష్ అక్కడే నిలుచుని ఉన్నాడు. చెప్పకుండానే సాబిర్కు ఆయన చిన్న మామయ్యేనని తెలిసిపోయింది. శరీరమంత భారీగా లేదు కానీ, పెద్ద మామయ్యకూ యీయనకూ పోలికలు చాలానే ఉన్నాయి. నమస్కారం చేసి ‘చాయ్ తాగుతారా?’ అనడిగాడు సాబిర్. గులాం బఖ్ష్‌కు ఇబ్బందిగా అనిపించినా, ఒప్పేసుకుని, రాధే దుకాణం దగ్గరే కూర్చుని చాయ్ తాగాడు. తరువాత, ‘ఎక్కడుంటున్నావ్?’ అని అడిగాడు.
‘ఇక్కడే దగ్గర, నాలుగో వీధిలో ఒక అద్దె గదిలో! పిన్ని ఉన్నప్పటినుండీ అక్కడే!’
‘పద వెళ్దాం నీ గదికి!’
‘ఆ.. పదండి.’ మొహమాటంగా అన్నాడు సాబిర్.
ఇద్దరూ లేచారు. రాధే పనిలో ఉన్నా అతని చెవులు మాత్రం యీ ఇద్దరి సంభాషణ మీదే ఉన్నాయి. అందుకే అన్నాడు, ‘సాబిర్! ఇంకా చాయ్ కావాలంటే మొబైల్లో మిస్డ్ కాల్ చేసేయ్, పంపేస్తాను..’
సాబిర్ రాధే వైపు చూసి నవ్వేందుకు ప్రయత్నం చేశాడు.
రాధే యీ గుణమంటే చాలా ఇష్టం సాబిర్కు! గదిలో కూర్చునేందుకు ఒక కుర్చీ కూడా లేదు, అన్ని వైపులా వస్తువులు పడేసి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో రాధే పనికొస్తాడు. మామయ్య చూడకుండా రాధేకి సైగ చేశాడు, ఒక కుర్చీనో, బల్లో గదికి పంపమని!
మామయ్యతో పాటూ గదికి వెళ్ళేందుకు మెట్లెక్కుతుండగానే, ఇల్లు గల ముసలావిడ అరిచింది, ‘ఎవర్రా అదీ?’ అని!
‘నేనే నానమ్మా!’
‘ఎవరితో పాటూ వచ్చావ్?’
‘మామయ్య నానమ్మా.’
‘నీకు మామయ్య ఎక్కణ్ణుంచీ పుట్టుకొచ్చాడు రా?’
‘మా సొంత మామయ్య. సుల్తాన్ గంజ్ నుంచీ వచ్చారు.’ సాబిర్ సమాధానం.
ముసలావిడకు నమ్మకం కుదరలేదు. అనుమానంగా వెనకే పైకొచ్చిందామె! ‘ఎవరా మామయ్య? మహతారీని ఇంట్లోనుంచీ వెళ్ళగొట్టిన మామయ్యేనా?’
బాణం లాగా ముసలావిడ కర్కశమైన మాట గులాం బఖ్ష్ గుండెలో నాటుకుని, గాయపరచింది.
‘నాన్నమ్మా! నువ్వొకటి! ఎప్పటిమాటో పట్టుకుని కూచున్నావ్! నేను మళ్ళీ మాట్లాడతాను నీతో!’ ఇప్పటికే ఆందోళనలో ఉన్న సాబిర్ మరింత ఆందోళనకు గురయ్యాడు. ముసలావిడెలా గైనా వెళ్ళిపోతే బాగుండు ననుకుంటున్నాడు.
‘నువ్వేం చెబుతావ్ బాబూ! నాకంతా తెలుసు. బిల్కీస్ నాకంతా చెప్పింది. చాయ్ చేస్తానుండు మీ మామయ్య కోసం!’ ముసలావిడ వెనక్కి తిరిగింది వెళ్ళిపోవడానికి!
‘వద్దులే నానమ్మా! రాధే భాయ్‌కి చెప్పే వచ్చా.’ బడబడ మాట్లాడుకుంటూ ముసలావిడ కిందకు దిగింది.
ఈలోగా రాధే పంపిన ఒకతను, ఒక ఫోల్డింగ్ కుర్చీ, చెక్క స్టూల్ పెట్టి వెళ్ళాడు.
గులాం బఖ్ష్ కుర్చీలోనూ, సాబిర్ స్టూల్ మీదా కూర్చున్నారు. ఇల్లుగలావిడ ఇక్కడికి రాగానే వేసిన బాణం దెబ్బ ఇంకా సలుపుతూనే ఉందతన్ని! కానీ ఏమీ అడగకుండానే సాబిర్ గురించిన సత్యం తెలిసి, బాధ కాస్త తగ్గింది కూడా!
సాబిర్ గదిలో అతనితో మాట్లాడుతూ చాలా సేపే కూర్చున్నాడాయన! చిన్నప్పటినుంచీ ఇప్పటిదాకా కథంతా సాబిర్ చెబుతున్నాడు, గులాం బఖ్ష్ వింటున్నాడు. మధ్య మధ్యలో ఆయనేదైనా అడిగితే చెబుతున్నాడు సాబిర్. ఏమీ దాచలేదు, అమీనాతో ప్రేమ విషయం తప్ప! మధ్యలో రాధేనే బిస్కెట్లతో చాయ్ తీసుకుని వచ్చాడు. అంతా బాగానే ఉందా అనే అనుమానం తోనే యీ సాకుతో వచ్చాడసలు! సైగ చేసి అడిగాడు, ఇంకా ఏమైనా కావాలా? అని. సాబిర్ కూడా సైగ చేసి చెప్పాడు, అక్ఖర్లేదని!
సాబిర్ ఎత్తుపల్లాల జీవితాన్ని వింటూ గులాం బఖ్ష్ గుండె గొంతులోకి వచ్చిందోసారి! కన్నీళ్ళు చెరువు లయ్యాయోసారి! లోపలినుండీ ఏదో వస్తువు తన్నుకుని ముక్కలై, బొడ్డును ఢీకొంటుందోసారి! శ్వాస ఆగి పోతుందోసారి! మదీహా మినుకుమినుకుమనే నీడ జ్ఞాపకాల ఊబిలో చిక్కుకుని, కూరుకుపోతూ కనిపిస్తుందోసారి! కంటి ముందు చీకటి పరచుకుంటుంది. ఏదో చీకటి గుహలో హఠాత్తుగా వెలుగు నిండుతుంది. మదీహా చిన్నప్పటి రూపం అతని కళ్ళ ముందు మిరుమిట్లు గొలుపుతుంది.
సాబిర్ పెట్టెలో నుంచీ, నాన్న షెహ్నాయీని తీసి, గులాం బఖ్ష్ ఒడిలో ఉంచాడు. గులాం బఖ్ష్ శరీరమంతా జలదరించింది. వణుకుతున్న చేతులతో షెహ్నాయీని తాకాడు. కాసేపు దాన్ని నిమురుతూ ఉండిపోయాడు. తరువాత దాన్ని నుదుటికి ఆనించుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. ఏదో వర్షాకాలపు పిచ్చి నది, తీరాలను ఢీకొంటూ ప్రవహిస్తున్నట్టు, వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్నాడు. చెప్పలేని పశ్చాత్తాపం బాధలో కూరుకు పోతున్నాడాయన! ఇంతవరకూ ఆయనను వెన్నాడుతూ ఉండిన అలీ బఖ్ష్ వాయించిన షెహ్నాయీ రాగాలు, అయన్ను చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయ్. ఆయన చెలికాడు అలీబఖ్ష్. ఆయనేమో మాటకారి. అలీబఖ్ష్కు మౌనమే ఆభరణం. ఉస్తాద్ నూర్ బఖ్ష్ గారి దృష్టంతా అలీ బఖ్ష్ మీదే ఉండేది. ఫహీం బఖ్ష్ వీరిద్దరికంటే పెద్దవాడు. అలీబఖ్ష్, ఫహీం బఖ్ష్ మధ్య పోటీ చాలా ఉండేది. రాగాలాపన విషయంలో అలీబఖ్ష్ ఎప్పుడూ ముందుండేవాడు. వేదిక మీద కూడా వాళ్ళిద్దరి మీదా గురువుగారి దృష్టెప్పుడూ ఉండేది. అప్పుడప్పుడు షెహ్నాయీ వాయిస్తున్నప్పుడు, గురువు గారిద్దరినీ అలా స్వేఛ్ఛగా వదిలేసేవారు. సంతోషించేవారు కూడా! అద్భుతమైన సన్నివేశ ఆవిష్కరణ జరిగేది. చూస్తున్న వింటున్న వాళ్ళ ప్రపంచమే మారిపోయేది.
వణుకుతున్న చేతులతో షహ్నాయీని తీసుకుని, దానిలో రాగాన్ని పలికించాడు గులాం బఖ్ష్. సాబిర్ గదిలో వెలుగు నిండిపోయింది, జగత్తులో నిండిన దిగులును తొలగిస్తూ, సూర్యుడు ఉదయించినట్టు! షహ్‌నాయీ సరిగ్గా పలకకున్నా సాబిర్ పరవశించిపోయాడు. అతడిప్పుడున్న పరిస్థితిలో అతని గదిలో వాళ్ళ నాన్న షహ్‌నాయీ మ్రోగటమే చాలా ఎక్కువతనికి! అతడనుకోనేలేదు, ఇలాంటి రోజొకటొస్తుందని! గోడ మీదున్న రాక్ మీద పెట్టిన నాన్న ఫోటో వైపు చూశాడు, నాన్న నవ్వుతున్నాడు.
‘నీకు షహ్‌నాయీ వాయించటం నేర్చుకోవాలనుందా?’ మెట్లు దిగుతూ అడిగాడు గులాం బఖ్ష్.
‘ఇష్టముంటే ఏమి లాభం? నా నొసటన రాసిపెట్టి ఉండాలిగా?’
‘నేర్చుకోవడానికి వయస్సుతో పనిలేదు. మనిషిలో పట్టుదలుంటే ఎప్పుడనుకుంటే అప్పుడు నేర్చుకోవచ్చు. నీకైతే ఇది చాలా సులభం. నీ రక్తంలో షహనాయీ ఉంది. నీకు శిక్షణ ఇచ్చేవాళ్ళూ ఉన్నారు.’ నెమ్మదిగా మెట్లు దిగుతూ వెనకున్న సాబిర్ వైపు చూశాడాయన.
‘నేర్చుకోవాలనుకుంటున్నానండీ!’
‘చాయ్ తాగించావా సాబిర్?’ ముసలావిడకు దిగుతున్న అడుగుల చప్పుడు వినిపించిందేమో, అడిగింది.
‘ఆ.. ఇచ్చాను నాన్నమ్మా!’ సాబిర్ వెంటనే చెప్పాడు.
ఇద్దరూ కిందికొచ్చారు. గులాం బఖ్ష్ అన్నాడు, ‘ఇల్లైతే హిందువులదున్నట్టుంది.’
‘అవును. పీర్ ముహానీలో ముస్లిముల ఇళ్ళిప్పుడు లేనే లేవు. అందరూ చాలా కాలం కిందటే ఇక్కణ్ణుంచీ వెళ్ళిపోయారు. ఉన్న ఒకరిద్దరూ కూడా వెళ్ళిపోయారు.’ అన్నాడు సాబిర్.
‘ఇల్లు దొరకటం కష్టమే కదా?’
‘ఈ ఇంట్లో పిన్ని ఉన్నప్పటినుంచే ఉంటున్నాం. ఎప్పుడు, ఎలా యీ ఇంటికి వచ్చామో గుర్తు కూడా లేదు నాకు! నాన్నమ్మ చాలా మంచిది. బడ బడ వాగుతుంది కానీ మనసు చాలా మంచిది. రాగానే మిమ్మల్నీ..!’సాబిర్ ముసలావిడ మాటలకు బాధ పడుతున్నాడు.
‘ఎప్పుడొస్తావు సుల్తాన్ గంజ్‌కి?’ గులాం బఖ్ష్ అడిగాడు.
‘మీరెప్పుడు రమ్మంటే..!’
‘శుక్రవారం రా. మధ్యాహ్నం భోజనమక్కడే చేద్దువుగాని!’ గులాం బఖ్ష్ సాబిర్ వైపు చూశాడు. అతడు తల వంచుకునున్నాడు.
‘అలాగే!’
‘ఫోన్ చెయ్యి. నంబరుందా?’
‘మీరిందాక చేశారు కదా, ఆ నంబర్ వచ్చింది ఫోన్లో!’
సాబిర్ రిక్షా ఆపి చిన్న మామయ్యను అందులో కూర్చోబెట్టి, నమస్కరించి, వీడ్కోలు తీసుకున్నాడు.
సైకిల్ రిక్షా మీద కూర్చుని గులాం బఖ్ష్, గాంధీ మైదాన్ వైపు వెళ్తున్నాడు. అక్కణ్ణించీ, సుల్తాన్ గంజ్‌కి ఆటో రిక్షా పట్టుకోవాలతను. గాంధీ మైదాన్ వలయాన్ని ఆనుకుని రిక్షా వెళ్తూంది. అప్పుడే ఆయనకు పాత పల్లవి ఒకటి గుర్తుకొచ్చింది. దీన్ని, చనిపోయిన తాతయ్య జహూర్ బఖ్ష్ దివంగత నాన్న నూర్ బఖ్ష్ కూడా పాడుతుండేవాళ్ళు.
ఎలా నిన్ను విప్పటం ఓ ముడీ!
నా ప్రియుని మనసులో పడ్డాక?
అమ్మో, నా ప్రియుని మనసులో పడ్డానే?
మపని ధ మమపని ధ రే ని ధ ప
అందరూ తమ ప్రియులతో ఉన్నారు
నేను ఒంటరిగా!!
ఈ గాంధీ మైదాన్ లోనే దసరా రోజుల్లో అలీ బఖ్ష్తో ఎన్నో సార్లు వారి యుగళ షహనాయీ కచ్చేరీ జరిగింది. అప్పుడు కచ్చేరీకి ఇద్దరి సాధన భలేగా జరిగేది. స్టేజ్ మీద వారిద్దరి సంగీత యుద్ధాల మజాయే వేరు. కౌశలం పరీక్షించే వాళ్ళముందు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే పోటీ తత్వం బాగుండేది. కానీ మనసులో కాస్త కూడా అసూయ ఉండేదే కాదు. గొప్పదనం ప్రభావమూ ఉండేది కాదు. నాన్నా, అన్నయ్యా, ఇద్దరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసేవారు. నవ్వుతూ చూస్తుండేవాళ్ళు. ప్రోగ్రాం తరువాత, ప్రతి తానమూ, గమకమూ గురించి చర్చలుండేవి. ఒకసారి స్టేజ్ పైకి వెళ్ళేముందే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. ఫహీం అన్నయ్యకు చాలా దిగులైంది, ఎలా గండం గడిచేదనీ, గురువుగారు లేకుండా కచ్చేరీ ఎవరు వింటారని! కానీ ఇద్దరూ కలిసి దుమ్ము రేపేశారు, అందరూ వాహ్ వాహ్ అనేవాళ్ళే!
మదీహా, అలీ బఖ్ష్ విషయంలో ఇన్ని రోజులూ పడిఉన్న ముడిని ఇప్పుడు విప్పివేయాల్సిన సమయం వచ్చిందని గులాం బఖ్ష్ అనుకోసాగాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడింక ఉండదు. ఈ ముడి విప్పనిదే జీవితంలో సుఖముండదు. సాబిర్ రూపంలో అల్లా యీ అవకాశమిచ్చాడు. దీన్ని పోగొట్టుకోవటం మన కాళ్ళను మనమే గొడ్డలితో నరుక్కోవడం లాంటిదే!
ఒకసారి మదీహా, మరో సారి అలీ బఖ్ష్, ఇప్పుడు సాబిర్ – వీళ్ళ సంగతులే గుర్తు చేసుకుంటూ గాంధీ మైదాన్ నుంచీ సుల్తాన్ గంజ్‌కు గులాం బఖ్ష్ చేరుకున్నాడు. గంగా తీరాన సూర్యోదయాన్ని చూసి వస్తున్నట్టుగా, పశ్చాత్తాపాగ్నిని గంగలో ఆర్పుకుని, మనసులో గంగా జలాన్ని నింపుకుని వచ్చినట్టుగా అనిపించిందతనికి! మాటిమాటికీ తన అరచేతులను చూసుకుంటున్నాడు. అవి నీటి బిందువులున్న పచ్చని ఆకుల్లాగా మారిపోయాయి.
చిన్న మామయ్యను రిక్షాలో కూర్చోబెట్టిన తరువాత, సాబిర్, రాధే దుకాణానికి చేరుకున్నాడు. రసీదన్ కూడా అక్కడే ఉంది. సాబిర్ మామయ్యొచ్చాడని రాధే అంతకు ముందే ఆవిడకు చెప్పాడు. సాబిర్ను చూడగానే ఇద్దరూ ఏమైందని కళ్ళతోనే అడిగారు. అతని ముఖంలో ఆనందపు తరకలు. నాన్న షహనాయీ నుండి వెలువడిన ఆ ఒక్క రాగ వీచిక, కలకండలా, అతని అస్తిత్వమంతటా మిళితమై పోతూంది. ఆ రాగం, అతని పాలిట ఒక కల వంటిది. అతని మదిలో ఋతువు మారుతోంది. అతని హృదయంలోని ప్రతి కణం ఉత్సాహపడుతూ ఉంది. కలల్లో నడుస్తూనే రాధే దుకాణం దగ్గరికొచ్చాడతను.
‘వెళ్ళిపోయారా?’ రాధే అడిగాడు.
‘ఆ..’ ఒక సంతోషపు నిట్టూర్పుతో పాటు చెప్పి కూర్చున్నాడు సాబిర్.
‘మంచి జరిగింది నీకు సాబిర్, పోయిన తాతయ్యా వాళ్ళిల్లు తిరిగి చేతి కందింది. అన్ని సమయాలూ ఒకేలా ఉండవు కదా! ఏమి మాట్లాడుకున్నారు?’ రాధే ప్రశ్న. రసీదన్ మౌనంగా ఉంది. ఆమెకు బిల్కీస్ బానో గుర్తుకు వస్తూంది. ఎటువంటి పరిస్థితిలో బానో ఇక్కడికి వచ్చింది? కారుతున్న ముక్కుతో, సాబిర్ ఆమె కొంగు చివర్లు పట్టుకుని రోజంతా ఆమెనే అతుక్కుని ఉండేవాడు! ఇవన్నీ గుర్తొస్తున్నాయి.
‘షహనాయీ నేర్చుకోవడం గురించి అడిగారు.’ సాబిర్ అన్నాడు. ఇది తప్ప చెప్పేందుకతని దగ్గరేమీ లేదు.
‘చాలా మంచిది సాబిర్! నేర్చుకో! సత్తార్ మియ్యా వ్యాపారంలో ఇరుక్కునే దానికన్నా నూరు శాతం మంచిది. మజా వస్తుంది. మంచి హోదా గలవాళ్ళతో ఉండటం, కలవటం ఇవన్నీ! చూడు సాబిర్! జీవితంలో అవకాశాలు మాటి మాటికీ రావు. నేనన్నది నిజమా కాదా అత్తా?’ రాధే సలహా ఇస్తూ, రసీదన్నూ అడిగాడు.
‘ఇప్పుడు నేనేమి చెప్పగలను నాయనా? మాకు గోరీలు, శవాలు మాత్రమే తెలుసు. నీవన్నమాట నిజమే, సాన్నిహిత్యాలు మారతాయి, కానీ ఫజ్లూతో మందూ, గిందూ తాగేందుకు టైం దొరకదు.’ రసీదన్ మెల్లిగా గాయపరచింది సాబిర్ను!
‘మందూ, గంజాయీ చెడ్డవే కానీ, అంత ఎక్కువేమీ కాదులే.. ..కానీ ..పోనీలే అత్తా!! చాలా సంవత్సరాల తరువాత తాతగారింటినుంచీ రమ్మని ఆహ్వానం వచ్చింది సాబిర్కు! ఇప్పుడు నువ్వతని ఉత్సాహం మీద నీళ్ళు చిలకరించకు.’ రాధే మాట్లాడుతూ ఉంటే, సాబిర్ మౌనంగా ఉన్నాడు. నిజానికిప్పటివరకూ రసీదన్ ఏ మాటకూ సాబిర్ ఎదురు సమాధానమివ్వనేలేదు. అతని మనసులో రసీదన్ అంటే ఎంతో ప్రేమున్నది. బిల్కీస్ పిన్ని ఉండేటప్పుడూ, వెళ్ళీపోయిన తరువాత కూడా రసీదనే అతణ్ణి చూసుకుంది. బిల్కీస్‌ను పోగొట్టుకున్న తరువాత, రసీదన్ అతనికి ఆసరాగా నిలిచింది.
‘నేను ఉత్సాహం మీద నీళ్ళు చిలకరించటం లేదు. నిజమేమిటో చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఫజ్లూ సంగతే చూడు. ముందులా ఉందా వాడి ఒళ్ళు, బండ రాయిలాగా అయిపోయింది. ముందైతే ఒకే రోజు మూడు మూడు గోతులు తవ్వేవాడు. ఇప్పుడో? ఒకటే ఆయాసం..! సాయానికి ఒకతన్ని పెట్టుకోవలసి వచ్చిందిప్పుడు! వాడి దగ్గర మిగిలిన డబ్బులు ఇదిగో వీడి కోసం సరిపోతున్నాయి.’ రసీదన్ బాధ విసుగ్గా మారి బైటపడింది. ఆమెకేమి తెలుసు, సాబిర్ దృష్టిలో షహ్‌నాయీ వాయించటమంటే అర్థమేమిటో? సాబిర్ కళ్ళల్లో ఊపిరి పోసుకుంటున్న కలలేమిటో ఆమెకు తెలీదు. ఇరవై నాలుగు గంటలూ అతని మనసులో సలుపుతున్న గాయం గురించి ఆమెకు తెలియనే తెలియదు.
తన రెండు మోకాళ్ళమీద చేతులు వేసి భారంగా లేచింది రసీదన్. కాళ్ళ నొప్పులతో విసుగొచ్చిందావిడకు!
‘శవంగా బ్రతకాలని రాసి పెట్టినట్టుంది నాకు! లేవటం, కూర్చోవటం, చాలా కష్టమైపోయింది.’
వణుకుతున్న ఆమెకు ఆసరా ఇవ్వాలని సాబిర్ ముందుకు నడిచాడు. రసీదన్ అన్నది, ‘అమీనా సగౌతీ(మాంసం వంట) వండుతూంది, తినేసి, వెళ్ళు సాబిర్!’
‘సాబిర్ లాభం లేదత్తా!! నేనే సరైనవాణ్ణి దానికి, నాక్కూడా సగౌతీ తినిపించత్తా!’ సరదాగా అన్నాడు రాధే.
‘తినిపిస్తా.. కానీ నీ మతం దారి తప్పుతుంది మరి. నా కోడలు ఇంట్లోకి రానీయదు.’ రసీదన్ కబ్రిస్తాన్ గేట్ దగ్గరికి నడిచింది.
కాసేపటి తరువాత, సాబిర్, ఫజ్లూ ఇద్దరూ కలిసి, ముంగిట్లో భోజనం చేశారు, అమీనా వడ్డిస్తూ ఉంటే! వరండాలో కూర్చుని ఉన్న చున్నీ, కొసరి కొసరి వడ్డిస్తున్న అమీనాను చూస్తూ సాబిర్ ఉన్న చోట బబ్లూ ఉన్నట్టూ, తానే అతనికి వడ్డిస్తున్నట్టూ ఊహించుకుంటూ ఉంది. సాబిర్కేమో యీ ఇంటి తలుపులెప్పుడూ తెరిచే ఉండటం, కానీ బబ్లూకు కాపలా ఉండటం పట్ల చున్నీకి చాలా ఈర్ష్యగా ఉంది.
సాబిర్ తన మామయ్య ఎలా వచ్చాడు, ఏమేమి అడిగాడు, తానేమేమి జవాబులు చెప్పాడు ఇవన్నీ పూస గుచ్చినట్టు చెబుతున్నాడు. వచ్చే శుక్రవారం తాను మళ్ళీ సుల్తాన్ గంజ్ వెళ్తున్నట్టు కూడా చెప్పాడు. అన్నీ బాగుంటే, అక్కడి వాతావరణమూ నచ్చితే, షహనాయి కూడా నేర్చుకునే ప్రయత్నం కూడా చేద్దామనుకుంటున్నాడు సాబిర్. అతని మాటలన్నీ జాగ్రత్తగా వింటున్న అమీనా అడిగింది, ‘మరి ఏదో వ్యాపారం చేద్దామను కున్నావ్ కదా? దాని సంగతేంటి?’ అనడిగింది.
సాబిర్ అన్నాడు, ‘వ్యాపారం ఎలాగైనా చేయాల్సిందే! కానీ హడావిడి పడకూడదు. బాగా ఆలోచించి, మళ్ళీ వెనక్కి తగ్గనవసరం లేకుండా చేయాలి.’
భోజనం చేసేసి, ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. చిలుం తయారు చేసి, దమ్ము పీల్చి, నిద్రపోయారిద్దరూ! ఫజ్లూ గుర్రు మొదలైంది.
(సశేషం)
డా.పుట్టపర్తి నాగపద్మిని, ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి దంపతుల చతుర్థ పుత్రిక. విద్యాపరంగా హిందీ లో పీ.హెచ్ డీ, తెలుగు ఎం.ఏ. నాలుగైదు డిప్లొమోలు ఇప్పుడు, ఇప్పుడు సంస్కృతం ఎం.ఏ. చదువుతున్నారు. వారి అయ్య గారి స్ఫూర్తితో, సాహితీ వ్యాసంగం చేపట్టినప్పటినుంచీ, ఇప్పటిదాకా పద్య, వచన కవిత, నవల, కథ, గేయ, అనువాద ప్రక్రియల్లో ఇప్పటిదాకా అర్థ శతం దాకా ప్రచురితాలు. ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ అనువాద పురస్కారం, గోయెంకా జాతీయ ఉత్తమ అనువాద పురస్కారం, తమిళనాడు హిందీ అకాడమీ పురస్కారం, బిహార్ సాహిత్య సమ్మేళన్ విశిష్ట రచయిత్రి పురస్కారం అందుకున్నారు. విక్రం శిలా విద్యాపీఠ్ ద్వారా విద్యావాచస్పతి,అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ భోపాల్ వారిచే భారత్ భాషా భూషణ్ బిరుదులు వరించాయి. గత 20 సంవత్సరాలుగా తిరుమల వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యతగా వాక్సేవలందించటం, తమ అయ్యగారి శివతాండవాన్ని హిందీ లోకి అనువదించి పలువురు హిందీ సాహితీవేత్తల ప్రశంసలు అందుకోవటం మరపురాని అనుభుతులంటున్నారు. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ నుండి 2021- 2023, వరకు ప్రతిష్ఠాత్మక సీనియర్ ఫెలోషిప్ పొంది, ‘పుట్టపర్తి రచనల్లో భారతీయ సంస్కృతి’ అన్న పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ హిందీ నవల చదవగానే ఇతివృత్తం అద్భుతంగా తోచి అనువాదం చేపట్టి, ఎంతో ఇష్టంగా దీక్షతో చేశాననీ, తెలుగు పత్రికా రంగ క్షేత్రంలో తనదైన ప్రత్యేక ముద్ర కలిగిన సంచిక పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవటం, చాలా హర్షదాయకమని పేర్కొంటూ, సంపాదకులకు తన ధన్యవాదాలు తెలియజేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
యువతరానికి చక్కని కానుక
ఆకాశవాణి పరిమళాలు-5
అనంత యాత్ర
‘నెల్లూరు జిల్లా రచయితల సంఘం’ వారి 2023 ఉగాది పురస్కారాలు – ప్రెస్ నోట్
కొత్త పదసంచిక-4
జ్ఞాపకాల పందిరి-60
మరువరాని మంచిమాటలు – పుస్తక పరిచయం
కల్పిత బేతాళ కథ-6 మొదటికే మోసం
మనోనేత్రం
యద్భావం తద్భవతి!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®