[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా కిట్టీ వెల్స్ పాడిన ‘ఇట్ వాజంట్ గాడ్ హూ మేడ్ హాంకీ టాంక్ ఏంజెల్స్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
~
కిట్టీ వెల్స్ అసలు పేరు ఎల్లెన్ మురియెల్ డీసన్ (ఆగస్టు 30, 1919 – జూలై 16, 2012) కంట్రీ మ్యూజిక్ ప్రపంచంలో ఈమె కిట్టి వెల్స్‌గా పరిచితులు. వరుసగా 14 సంవత్సరాల పాటు అగ్రశ్రేణి గాయని అవార్డులు పొందిన ఏకైక కళాకారిణి వెల్స్. ఆమె చార్ట్-టాపింగ్ హిట్లు 1960ల మధ్యకాలం వరకు కొనసాగాయి. చరిత్రకారుడు జోయెల్ విట్బర్న్ పుస్తకం ‘ది టాప్ 40 కంట్రీ హిట్స్’ ప్రకారం, బిల్బోర్డ్ కంట్రీ చార్టుల చరిత్రలో వెల్స్ ఆరవ అత్యంత విజయవంతమైన గాయకురాలిగా నిలిచారు. ఈమె గ్రామీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న ఎనిమిదవ మహిళ. కంట్రీ మ్యూజిక్‌లో స్త్రీలకు దారి వేసిన తొలి తరం గాయని ఈమె. అందుకే ఈమెను ‘క్వీన్ ఆఫ్ కంట్రీ మ్యూజిక్’ గా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.
హాంక్ థాంప్సన్ ‘ది వైల్డ్ సైడ్ ఆఫ్ లైఫ్’ అనే పాటను స్వేచ్ఛ పేరుతో ప్రేమను కాదని, విచ్చలవిడిగా జీవించడానికి వెళ్లిపోయే ఆడవాళ్ళను విమర్శిస్తూ పాడారు. ఆ పాట పెద్ద సంచలనాన్ని సృష్టించింది. దానికి స్త్రీల తరుపున జవాబివ్వాలన్న ఆలోచన కలిగింది కొందరికి. అలా జవాబు పాటగా జే మిల్లర్ ‘ఇట్ వాస్ నాట్ గాడ్ హూ మేడ్ హాంకీ టోంక్ ఏంజిల్స్’ అనే పాటను రాసారు. అప్పటికి కిట్టీ వెల్స్కు పెద్ద హిట్లు లేవు. అయినా ఈ పాటను ఆమెతో పాడించారు. ఇది ఎలాంటి ప్రభంజనం సృష్టించిందంటే ఆ రోజుల్లో థామ్సన్ పాట పాడిన ప్రతీ స్టేజ్ పైన ఈ పాటను కూడా కలిపి పాడేవారు. ఫెమినిజం గురించి పెద్దగా చర్చ రాని ఆ రోజుల్లో ఈ పాటను ప్రజలు ఆదరించిన తీరు అమోఘం. అంతే కాకుండా ఇది కిట్టి వెల్స్‌ను ఒక పెద్ద గాయని స్థానానికి తీసుకెళ్ళింది. అప్పటి దాకా కంట్రీ సింగర్స్‌లో పురుషులదే హవా. స్తీలు పాడేవారు కాని వారికి పురుషులతో సమాన ప్రాధాన్యత ఉండేది కాదు. అలాంటి రోజుల్లో కిట్టీ వెల్స్ ఈ పాటతో స్త్రీ గాయనీమణులకు మార్గాన్ని సుస్థిరపరిచారు. ఒకొక్కరుగా కంట్రీ మ్యూజిక్ రంగంలో స్త్రీలు రావడం, పురుషులకు ధీటైన పోటీ ఇవ్వడం ఈ పాటతో మొదలయింది. అలా కిట్టీ వెల్స్ కంట్రీ మ్యూజిక్‌లో స్టార్డం పొందిన మొదటి గాయనిగా చరిత్రకెక్కారు.
As I sit here tonight, the jukebox’s playing The tune about the wild side of life As I listen to the words you are saying It brings mem’ries when I was a trusting wife
(ఇక్కడ ఈ రాత్రి కూర్చుని జూక్ బాక్స్ నుండి ‘ది వైల్డ్ సైడ్ ఆఫ్ లైఫ్’ పాటలో నువ్వు పలికిన పదాలను వింటుంటే నాకు నమ్మకమైన భార్యగా నేను గడిపిన ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి)
జూక్ బాక్స్‌లో డబ్బులు వేసి కావల్సిన పాటను ఆ రోజుల్లో మ్యూజిక్ షాప్ లలోను పబ్ లలోనూ వినేవారు. ఆమె జూక్ బాక్స్ ముందు కూర్చుని హాంక్ థంప్సన్ పాడిన ‘ది వైల్డ్ సైడ్ ఆఫ్ లైఫ్’ వింటుంది. అందులో తనను వదిలేసి విలాసవంతమన జీవితం కోసం వెళ్ళిపోయిన ఓ స్త్రీని ఆమె భర్త లేదా ప్రియుడు ఎవరయితేనేమీ ఓ మగవాడు విమర్శిస్తున్నాడు. ఇది వింటున్న ఆమెకు తన గత జీవితం గుర్తుకు వస్తుంది. ఆ రోజుల్లో ఆమె ఎంతో విధేయతతో ఓ భార్యగా జీవించింది.
ఇక్కడ గమనిస్తే మొదటి వాక్యాలలో ‘ది వైల్డ్ సైడ్ ఆఫ్ లైఫ్’ పాటను ఆమె ప్రస్తావించడంలో ఇది ఆ పాటకు ఓ స్త్రీ ఇచ్చిన జవాబు అని అర్థం అవుతుంది. అంటే ఈ పాటలో సూటిగా థాంసన్ పాటకు జవాబివ్వడం జరుగుతోంది. పిల్లి మీదో ఎలుకమీదో పెట్టి చెప్పీ చెప్పనట్లు అనీ అననట్లు ఆమె విమర్శ విసరట్లేదు లేదు. ఆ పాటలో ఓ పురుషుడు స్త్రీలలోని నమ్మించి మోసం చేసే గుణాన్ని చర్చిస్తూ ఇప్పుడు దేవుడు ఇలా మత్తులో ఊగిపోయే దేవదూతలను సృష్టించాడే అని వ్యంగ్య బాణాలను సంధించాడు. దానికి చాలా హుందాగా ధీటైన జవాబు ఇస్తుంది ఆమె.
It was’t God who made honky-tonk angels As you said in the words of your song Too many times married men think they’re still single That has caused many a good girl to go wrong
(మత్తుతో ఊగిపోయే దేవదూతలను నీ పాటలో నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు కాదు సృష్టించింది. చాలా సార్లు పెళ్ళయిన పురుషులు తమకు పెళ్ళయిందనే మర్చిపోతారు. కొందరు మంచి అమ్మాయిలు తప్పు దారి పట్టడానికి ఇదే కారణం)
హాంకీ టాంకీ అన్న పదం ఎలా ఏర్పడిందో థాంసన్ పాటలో చర్చించాం. అప్పట్లో కొన్న్ పబ్ లని ఈ పేరుతో పిలిచేవారు. అందులో తాగి నృత్యం చేసే స్త్రీలను హాంకీ టాంకీ గర్ల్స్ అని అనేవారు. థాంసన్ అలాంటి ఆడపిల్లలను దేవుడు తయారు చేస్తున్నాడే అని అంటే దానికి ఈ పాటలో కిట్టి వెల్స్ దేవుడు కాదు నీవు చెప్పిన ఆ హాంకీ టాంకీ (మత్తులో ఊగిపోయే) స్త్రీలను తయారు చేసేది. ఎన్నో సందర్భాలలో పెళ్ళి చేసుకున్నమగాళ్లు తమకు పెళ్ళయిందని తాము బాధ్యతగా వ్యవహరించాలన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తారు. దానికి విసిగిపోయిన మంచి అమ్మాయిలే తప్పు దోవ పడతారు అంటుంది.
పెళ్లి చేసుకుని తమ బాధ్యత మర్చిపోయి భార్యలను నిర్లక్షం చేసే భర్తలు, ఇంటిని నిర్లక్ష్యం చేసే తండ్రులు, పెళ్ళి సంగతి దాచిపెట్టి మరో స్త్రీ పొందు కోసం చొల్లు కార్చే మగవాళ్ళూ. వీరు కదా స్త్రీ మనసులతో ఆడుకునేది. ఆ అనుభవాలు ఆ స్త్రీల మనసుల్ని విరిచేస్తాయి. మానవ సంబంధాల పట్ల పురుష ప్రేమ పట్ల అపనమ్మకం కలగజేస్తాయి. జీవితాన్ని ఓటమి పాలు చేస్తాయి. అప్పుడే మంచి అమ్మాయిలు కూడా దారి తప్పుతారు అంటుంది ఆమె. ఎంత గంభీరమైన జవాబో వినండి.
It’s a shame that all the blame is on us women It’s not true that only you men feel the same From the start most every heart that’s ever broken Was because there always was a man to blame
(మొత్తం తప్పంతా స్త్రీదే అనడం సిగ్గుచేటు. మీ మగవాళ్ళే అలా బాధపడతారన్నది నిజం కాదు. మొదటి నుండి గమనిస్తే ముక్కలయిన ప్రతి గుండే వెనుకా ఎప్పుడూ నిందించడానికి ఓ పురుషుడే ఉంటాడన్నది నిజం.)
ఆ పాటలో తప్పంతా స్త్రీదే అంటాడు అతను. అది నిజం కాదని అలా అనడం సిగ్గుచేటని జవాబిస్తుంది ఆమె. మీ మగవాళ్ళే మనసు విరిగి అంతలా బాధపడతారన్నది నిజం కాదు. మా హృదయాలలోనూ ఎన్నో గాయాలున్నాయి. మొదటి నుండి గాయపడిన హృదయాలను కదిపి చూడండి. వాటి వెనుక ఓ పురుషుడి హస్తం ఉంటుందన్న నిజాన్ని తెలుసుకోండి అంటుంది ఆమె.
(మత్తుతో ఊగిపోయే దేవదూతలను నీ పాటలో నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు కాదు సృష్టించింది. చాలా సార్లు పెళ్ళయిన పురుషులు తామకు పెళ్ళయిందనే మర్చిపోతారు. కొందరు మంచి అమ్మాయిలు తప్పు దారి పట్టడానికి ఇదే కారణం)
ఈ పాటను కంట్రీ గీతాలలో జవాబుపాటగా ఇప్పటి తరం దాకా అందరూ గుర్తుపెట్టుకోవడం వెనుక కొన్ని కారణాలు గమనించాలి. పాట మొదటి వాక్యంలోనే తాను ఏ పాటకు జవాబు ఇస్తుందో గాయని స్పష్టపరుస్తుంది. అంటే ఇది డైరెక్టుగా జవాబు పాటగానే వస్తుంది. తరువాత దీని ట్యూన్ కూడా థాంసన్ పాట ‘వైల్డ్ సైడ్ ఆప్ లైప్’కు వాడిందే. ఆ పాట పాత అమెరికన్ జానపద పాట బాణి తోనే తయారయిందని చెప్పుకున్నాం కదా. ఆ బాణీనే ఈ పాటకూ వాడుకున్నారు. అంటే ఈ రెండు పాటల ట్యూన్ ఒకటే. ఇక మొదటి పాట పురుష దృక్పథాన్ని సూచిస్తే ఇది స్త్రీ హృదయాన్ని ఆమె వాదాన్ని బలంగా వినిపిస్తుంది.
అయితే మనం గమనించవలసింది ఈ ప్రశ్నా జవాబులో ఎక్కడా దూషణ ఉండదు. పరస్పర గౌరవంతో ఈ రెండు పాటలకు స్త్రీలు పురుషులు కూడా అదే స్థాయిలో స్వీకరించారు. ఈ రెండు పాటలు కూడా ఒకే సంవత్సరం కొన్ని నెలల దూరంలో విడుదలయ్యాయి. ఆ తరువాత ప్రతి స్టేజీ ఫర్మామెన్స్ లలో ఈ రెండు పాటలను కలిపి ప్రదర్శించేవాళ్లు ఇతర గాయకులు. ఈ రెండూ కూడా అమ్మకాలలో రికార్డు సృష్టించాయి.
కిట్టీ వెల్స్ గానం ఈ పాటలో గమనించాలి. హుందాగా వినిపిస్తూనే ఒక విషాదాన్నిమోసుకొచ్చే పాట ఇది. తమను అర్థం చేసుకోలేని మనుషుల మధ్య తమ మనసు విప్పి చెప్పుకునే ఓ నిస్సహాయ స్త్రీ వేదన ఆమె గానంలో వినిపిస్తుంది. అది ఈ పాటలోని గాంభీర్యాన్ని పెంచింది. ఆమె గొంతులో ధ్వనించే ఫ్రస్ట్రేషన్ సమాజంలో స్త్రీల స్థితిని బహిర్గతం చేస్తుంది.
ఈ పాటలో బాస్ గిటార్ వాయించిన జానీ వ్రైట్ కిట్టీ వెల్స్ భర్త.
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్‌లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
You must be logged in to post a comment.
అలనాటి అపురూపాలు – 249
మై హూఁ యమధర్మరాజ్!
అన్నింట అంతరాత్మ-10: విశ్రాంతినిచ్చే మంచాన్ని నేను!
కైంకర్యము-52
‘కాంచన శిఖరం’ కొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన
మనల్ని మనకి చూపించే కథల సంపుటి ‘తల్లివేరు’
‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-27 – ముహబ్బత్ తర్క్ కీ
సిరికోన – శ్రీ జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ 2023 – ప్రకటన
అనురాగంతో కలిసిమెలిసుంటే ‘ఏం పోతుంది చెప్పు?’ అని ప్రశ్నించిన కవిత
సంబంధాలు
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®