[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్‌లో భాగంగా డాన్ విలియమ్స్, ఎమ్మిలో హారిస్ పాడిన ‘ఇఫ్ ఐ నీడెడ్ యూ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- డాన్ విలియమ్స్, ఎమ్మిలో హారిస్ – ఇఫ్ ఐ నీడెడ్ యూ
- ఆల్బమ్ – సిమర్రాన్ (1981)
- రచన – టౌన్స్ వాన్ జాండ్ట్
- నిర్మాతలు – బ్రయాన్ అహెం, డాన్ విలియమ్స్, గార్థ్ ఫండిస్
~
కంట్రీ గీతాలలో ఇప్పటిదాకా సోలో గీతాలను చూసాం. కాని ఈ జానర్‌లో డ్యూయేట్లకు ఓ ప్రత్యేక అందం ఉంది. ముఖ్యంగా జానపద శైలిని అనుకరిస్తూ వినిపించే ఈ గీతాలకు ఓ విశిష్టమైన మాధుర్యం ఉంది. అందుకనే ఒక్కో కళాకారుని మూడు సోలో గీతాలతో పాటు వారి ఓ డ్యూయెట్‌ని కూడా మనం ప్రస్తావించుకుంటూ కంట్రీ గీతాలను ఆస్వాదిద్దాం.
కంట్రీ సంగీతంలో నాకు అత్యంత ఇష్టమైన డాన్ విలియమ్స్ తోనే ఈ డ్యూయెట్ల ప్రస్తానం మొదలెడదాం. డాన్ గొంతు విన్న వారెవ్వరూ దానికి ముగ్ధులు కాకుండా ఉండలేరు. ఈ మధుర గాయకుడి గీతాలన్నీటిలోనూ మెలోడీ ప్రధానం. చాలా హాయిగా సాగుతాయి ఆయన పాటలు. అదే బాణిలో ఉంటుంది ‘ఇఫ్ ఐ నీడెడ్ యూ’ అనే ఈ పాట. దీనిలో డాన్‌తో పాటు గొంతు కలిపే గాయని పేరు ఎమ్మిలో హారిస్.
ఎమ్మిలో హారిస్ (జననం ఏప్రిల్ 2, 1947) అమెరికన్ గాయని, పాటల రచయిత, సంగీతకారురాలు, బ్యాండ్ లీడర్, కార్యకర్త. ఆమె 1970లలో కంట్రీ రాక్ శైలి వెనుక ఉన్న ప్రముఖ సంగీత కళాకారులలో ఒకరిగా పరిగణించబడుతుంది. ఈమె 1990లలో సంగీతంలో అమెరికానా శైలికి ప్రాచుర్యం తీసుకొచ్చిన గాయని కూడా. హారిస్ ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్లకు పైగా రికార్డులను విక్రయించినట్లు అంచనా. ఆమె 13 గ్రామీ అవార్డులను కూడా గెలుచుకుంది. US కంట్రీ చార్ట్‌లో టాప్ టెన్‌లో ఈమెవి 27 సింగిల్స్ ఉన్నాయి. ఆమె ఆల్బమ్‌లలో అనేకం USలో బంగారు ధృవపత్రాలను పొందాయి. ఆమె 2008లో కంట్రీ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించింది. 2022లో రోలింగ్ స్టోన్ 200 మంది గొప్ప గాయకుల జాబితాలో స్థానం పొందింది. డాన్ విలియమ్స్ ఎమ్మిలో హారిస్ గానం చేసిన ఈ డ్యూయెట్‌కు ఎందరో అభిమానులున్నారు.
‘ఇఫ్ ఐ నీడెడ్ యూ’ టౌన్స్ వాన్ జాండ్ట్ రాసిన ఒక ప్రసిద్ధ కంట్రీ పాట. దీనిని మొదట అతని 1972 ఆల్బమ్ ‘ది లేట్ గ్రేట్ టౌన్స్ వాన్ జాండ్ట్’లో రికార్డ్ చేశారు. 1981లో ఎమ్మిలో హారిస్, డాన్ విలియమ్స్ దీనిని యుగళగీతంగా ప్రదర్శించి, హారిస్ ఆల్బమ్ ‘సిమర్రాన్’ నుండి సింగిల్‌గా విడుదల చేసినప్పుడు ఇది విశేషమైన ప్రజాదరణ పొందింది. ఈ పాట బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సింగిల్స్ చార్టులో మూడవ స్థానంలో నిలిస్తే, కెనడాలో ప్రథమ స్థానానికి చేరుకుంది.
ప్రేమ అనే అనుభవం బంధంలోకి మారుతున్న క్రమంలో ప్రేమికులలో తమ భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలు ఉండడం సహజమే. కలిసి జీవించాలని అనుకునే సమయంలో కొన్ని వాగ్దానాలు చేసుకోవడం, ఒకరి నుండి మరొకరు ఏం ఆశిస్తున్నారో చర్చించుకోవడం సహజంగా జరిగేదే. ఆ చర్చల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటూనే తాము ఎటువంటి తోడు కావాలని ఆశిస్తున్నారో చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఓ చర్చలో ప్రతికూల పరిస్థితులలోనూ అచంచలమైన ప్రేమను, మద్దతును కోరుకుంటున్న ఓ జంట మనోగతాన్ని వినిపిస్తుంది ఈ పాట. ఏ బంధంలోనయినా పరస్పరం ఓర్పు సహకారం అవసరం అని ప్రేమలో పడడం గొప్ప కాదు, దాన్ని నిలిపి ఉంచుకోవడానికి నిరంతరం ప్రేమికులు ప్రయత్నిస్తూ ఉండాలని సందేశాన్ని ఇస్తుంది ఈ పాట.
If I needed you would you come to me?
Would you come to me for to ease my pain?
If you needed me I would come to you
I would swim the sea for to ease your pain
(నాకు నీ అవసరం ఉంటే నువ్వు నా కోసం వస్తావా? నా బాధను తగ్గించడం కోసం రాగలవా? నీకు నా అవసరం ఉంటే నేను తప్పకుండా వస్తాను. సముద్రాన్ని దాటయినా సరే నీ బాధను తగ్గించదానికి నీ కోసం వచ్చి తీరతాను)
జీవితం పూల పానుపు కాదు. అందులో కష్టాలు ఉండి తీరతాయి. ఒంటరితనం ఆవహించే క్షణాలు ఉంటాయి. ఆ సమయంలో కావలసిన ఓదార్పును నేనున్నాననే భరోసాను ఇవ్వగలిగే వారే నిజమైన సహచరులు. ఆ సాహచర్యాన్ని ఈ జంట ఒకరి నుండి మరొకరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వారి మనసులు ప్రేమతో నిండి ఉన్నాయి. కాని రేపటి రోజు ఇదే ప్రేమను వాళ్ళు నిలిపి ఉంచుకోవడానికి పరస్పర సహకారం కావాలి. దాన్ని కోరుతూ ఇద్దరూ కలిసి ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ, వాగ్దానాలు చేసుకుంటూ అవతలి వారి నుండి అదే వాగ్దానాన్ని కోరుకుంటూ, డాన్ ఎమ్మిలి కలిసి ఈ పాట పల్లవిని గానం చేస్తారు. ఆ ఇద్దరి గాయకుల కంఠంలోనుండి తొణికే ఆ నిజాయితీ పాటకు వింత అందాన్ని ఇస్తుంది.
Well, the night’s forlorn and the morning’s born
And the morning’s born with the lights of love
And you’ll miss sunrise if you close your eyes
And that would break my heart in two
(సరే, రాత్రి నిరాశాజనకంగా గడిచింది. కాని మళ్ళీ ఉదయం తన ప్రేమ కాంతులతో వచ్చింది. నువ్వు కళ్ళు మూసుకునే ఉంటే సూర్యోదయాన్ని కోల్పోతావు. అది నా హృదయాన్ని రెండుగా చీలుస్తుంది)
ఇది ఎమ్మిలి పాడే చరణం. ఆమె తన ప్రియుడికి తమ భవిష్యత్తు గురించి చెబుతూ నిరాశా నిస్పృహలు తమ జీవితంలో వచ్చి తీరతాయని అది వాస్తవం అని గుర్తు చేస్తుంది. అలాంటి నిరాశమయ రాత్రులు వచ్చి వెళ్తాయి. కాని అదే నిరాశలో ఆ తరువాత వచ్చే ప్రేమకాంతులతో నిండిన ఉదయాలను చూడడానికి నువ్వు సిద్ధంగా లేక కళ్ళు మూసుకుని ఉండిపోతే నా హృదయం ముక్కలయిపోతుంది. నేను అది భరించలేను అంటుంది.
జీవితంలో కష్టాలు వస్తాయి. కొన్ని నిరాశలూ కలుగుతాయి. కాని వాటినే అంటిపెట్టుకుని ఉండి ఆనందాల దిశగా ప్రయాణించడానికి నిరాకరిస్తే జీవితం నిస్సారమయిపోతుంది. అది మనసుల్లోని ప్రేమను చంపేస్తుంది. ఆ స్థితి వారి మధ్య రాకూడదని ఆమె కోరుకుంటూ అదే విషయాన్ని ఎంతో ప్రేమగా అతనికి వినిపిస్తుంది. ఎందుకంటె నిరాశా నిస్పృహల కన్నా ఆనందాలను పంచుకోవడానికి అతని సాంగత్యం ఆమెకు కావాలి. ఆ ఆనంద సమయాల్లో అతను ఆమె పక్కన లేకపోతే, ఆమె ఆ లోటును భరించలేదు. దుఖంలో కన్నా ఆనందంలో ఒంటరి అవడం అతి విషాదం అన్న నిజాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంది ఈ గీతం. ఒకరి సాంగత్యాన్ని ఆనందపు క్షణాల్లో మరీ మరీ కోరడమే కదా ప్రేమంటే.
If I needed you would you come to me?
Would you come to me for to ease my pain?
If you needed me I would come to you
I would swim the sea for to ease your pain
(నాకు నీ అవసరం ఉందని తెలిసినప్పుడు నువ్వు నా కోసం వస్తావా? నేను నీ కోసం సముద్రాలని దాటి వస్తాను మరి)
Baby’s with me now since I showed her how
To lay her lilly hand in mine
Who could you’ll agree, she’s a sight to see
A treasure for the poor to find
(లిల్లీ పూలలాంటి ఆ లేత చేతుల్ని నా చేతులతో కలిపి ఉంచడం ఎలా అన్నది నేను చూపించినప్పటి నుండి నా ప్రేయసి చేయి నన్ను వీడి పోలేదు. మీకెంతమందికి అర్ధం అవుతుంది ఇదో అద్బుతమైన దృశ్యం అని, పేదవాళ్లకు ఇంతకు మించిన నిధి మరొకటి దొరకబోదని)
ఆమె ఎంతో సున్నితమైన స్త్రీ, కాని అంతటి సున్నితత్వాన్ని తనతో కలిపి ఉంచుకోవడంలో అతనికి ఆమె సహకారమూ అవసరమే. దాన్ని ఆమెకు వివరించిన నాటి నుండి ఆమె చేయి అతని చేతిని వీడి పోలేదు. ఇంతకు మించిన అందమైన మరో దృశ్యం మరొకటి ఉండదు. ఎంతటి పేదవాడికయినా ఇంతకు మించిన నిధి దొరకబోదు కూడా. ప్రేమించిన వ్యక్తి తనను అర్థం చేసుకుని ఎల్లవేళలా తన చేయి పట్టుకుని జీవితపు ప్రయాణంలో భాగం అవడాన్ని మించిన అదృష్టం మరొకటి ఉండదు. ఈ చరణం డాన్ గొంతులో అద్భుతంగా పలుకుతుంది.
If I needed you would you come to me?
Would you come to me for to ease my pain?
If you needed me I would come to you
I would swim the sea for to ease your pain
(నాకు నీ అవసరం ఉందని తెలిసినప్పుడు నా చెంత నుంటావు కదా. నేను నీకై సముద్రాలు దాటగలను. నువ్వు నా పక్కన అన్నివేళలా ఉంటావు కదా)
పాట ముగింపులో ఇద్దరూ కలిసి ఇచ్చే హమ్మింగ్ ఓ మధురానుభూతి. కంట్రీ యుగళగీతాలలో ఈ పాటను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇదో చక్కని ప్రేమ గీతం, భాష రాని వారిని సైతం ఆకట్టుకునే మధుర గీతం. డాన్ గొంతుకు జత కలిసిన హారిస్ కంఠం ఈ పాటకు ప్రాణం పోసింది. ఆ మాధుర్యాన్ని ఎవరికి వారు ఆస్వాదించవలసిందే.
ఈ పాటని యూట్యూబ్‍లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)