[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్‌లో భాగంగా కెన్నీ రోగర్స్ పాడిన ‘ది కవర్డ్ ఆఫ్ ది కౌంటీ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- కెన్నీ రోగర్స్ – 2. ది కవర్డ్ ఆఫ్ ది కౌంటీ
- ఆల్బమ్ – కెన్నీ (1979)
- రచన – రోగర్ బౌలింగ్, బిల్లి ఎడ్ వీలర్
~
నెమ్మదిగా ఉంటూ గొడవలకు వివాదాలకు దూరంగా ఉండే వాళ్లని మనం పిరికివారిగా పరిగణిస్తాం. ఎవరెన్నివిధాలుగా రెచ్చగొట్టినా రెచ్చిపోక, ఎటువంటి గొడవలకూ వెళ్లక ఎవరిపై చేయి చేసుకోక మౌనంగా జీవించడానికే ఎంతో బలం కావాలి. కాని జీవితంలో అంత బలాన్ని ప్రదర్శించే నెమ్మదస్థులను ప్రపంచం పిరికివారిగానే చూస్తుంది. వారిని అపహాస్యం చేస్తుంది. వారి బలాన్ని గుర్తిస్తే హింసలోని ఆనందాన్ని రుచి చూడలేకపోతాం అన్న కోరిక మనిషిని అసలైన ధైర్యాన్ని చూడనివ్వని అంధత్వంలోకి నెడుతుంది. అలాంటి గుడ్డి లోకానికి బుద్ది చెప్పిన ఓ వ్యక్తి కథ ‘ది కవర్డ్ ఆఫ్ ది కౌంటీ’ అనే ఈ పాట.
కౌంటీ అంటే ప్రాంతం అని అర్థం. యు.ఎస్.లో మొత్తం యాభై రాష్ట్రాలుంటే, 3000కు పైగా కౌంటీలు ఉన్నాయంటారు. ఈ చిన్న చిన్న ప్రాంతాలన్నీ కూడా వాటి సంబంధిత నాయకుల అధీనంలో ఉంటాయి. కొన్ని జాతులకు సంబంధించిన చిన్న సమూహాలుగా కూడా వీటిని ఎంచవచ్చు. అలాంటి ఒక కౌంటీలోని ఓ యువకుని కథ ఇది.
Everyone considered him the coward of the county
He’d never stood one single time to prove the county wrong
His mama named him Tommy, but folks just called him Yellow
But something always told me, they were reading Tommy wrong
(అందరూ అతన్ని ఆ ప్రాంతంలోనే పిరికివాడిగా ఎంచేవారు. ఒక్క సారి కూడా జనం అభిప్రాయం తప్పని నిరూపిచడానికి అతనేమీ ప్రయత్నిచలేదు. అతని తల్లి అతనికి టామీ అని పేరు పెట్టింది. కాని జనం అతన్ని యెల్లో అని పిలిచేవారు. కాని నాకెప్పుడు అందరూ టామీని తప్పుగా చదువుతున్నారనిపించేది)
కథకుడు టామీ కథను మనకు చెప్తున్నాడు. ఊరంతా అతన్ని పిరికివాడిగా ముద్రించారు. తల్లి పెట్టిన పేరుతో గౌరవంగా ఎవరూ ఆ యువకుడిని పిలవరు. పైగా అతన్ని ఎల్లో అని వ్యంగంగా పిలిచేవారు. తన పై అందరికున్న అభిప్రాయం తప్పని ఎప్పుడూ నిరూపించుకోవాలనే ప్రయత్నం కూడా టామీ చేయలేదు. ఎవరినీ పట్టించుకోకుండా దేనికీ పెద్దగా ఆవేశపడకుండా తన దారిన తాను బతికేవాడు టామీ. కాని నాకు మాత్రం అతన్ని అందరూ సరిగ్గా అంచనా వేయట్లేదనే అనిపించేది అంటున్నాడు కథ చెప్తున్న గాయకుడు.
He was only ten years old when his daddy died in prison
I looked after Tommy, ‘cause he was my brother’s son
I still recall the final words my brother said to Tommy
“Son, my life is over, but yours has just begun”
(టామీ పదేళ్లవాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి జైలులో మరణించాడు. అప్పటి నుండి టామీ బాగోగులు నేనే చూసాను. ఎందుకంటే అతను నా అన్న కొడుకు. నా అన్న టామీకి చెప్పిన ఆఖరి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. “బాబు నా జీవితం అయిపోయింది. కాని నీది ఇప్పుడే మొదలవబోతుంది.”)
“Promise me, son, not to do the things I’ve done
Walk away from trouble if you can
Now it won’t mean you’re weak if you turn the other cheek
I hope you’re old enough to understand
Son, you don’t have to fight to be a man”
(నేను చేసిన పనులేవీ నువ్వు చేయనని నాకు మాట ఇవ్వు బాబు. నీకు కుదిరితే గొడవలను దాటుకుని వెళ్లిపో. మరో చెంప చూపించి దాటుకుని వెళ్లిపోవడం బలహీనత కాదు. నువ్వు దీన్ని అర్థం చేసుకోగలవని అంతటి వయసు నీకుందని నేను అనుకుంటున్నాను. బాబు మగవాడిని అని నిరూపించుకోవడానికి యుద్ధం చేయవలసిన అవసరమేమీ లేదు)
There’s someone for everyone and Tommy’s love was Becky
In her arms, he didn’t have to prove he was a man
One day while he was working, the Gatlin boys came calling
They took turns at Becky an’ there was three of them
(అందరికోసం ఎవరో ఒకరు ఉంటారు. అలాగే టామీకి బెకీ దొరికింది. ఆమె దగ్గర అతనికి ప్రేమ దొరికింది. ఆమె చేతుల్లో సేదతీరుతున్న టామికి తాను మగాడిని అని నిరూపించుకోవల్సిన అవసరం కలగలేదు. ఒక రోజు టామీ పని దగ్గర ఉండగా గాట్లిన్ సోదరులు అతనింటికి వచ్చారు. బెకీ పై వంతులువారిగా అత్యాచారం చేసిన వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు.)
కథను కొనసాగిస్తూ టామీ బెకీని ప్రేమించి వివాహం చేసుకున్నాడని, అతని స్వభావంలో మార్పు రావల్సిన అవసరం బెకీ సాంగత్యంలో కలగలేదని, వారిద్దరూ ఆనందంగా జీవిస్తున్నారని చెప్తున్నాడు కథకుడు. ఆ సమయంలో గాట్లిన్ సోదరులు ముగ్గురు టామి ఇంటికి వెళ్ళి మరీ బెకీపై అత్యాచారం చేస్తారు.
Tommy opened up the door and saw Becky crying
The torn dress, the shattered look was more than he could stand
He reached above the fireplace and took down his daddy’s picture
As his tears fell on his daddy’s face, he heard these words again
(ఇంటికి వచ్చి టామీ తలుపు తీసి చూస్తే అతనికి బెకీ ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె చిరిగిన బట్టలు, చెదిరిన రూపాన్ని అతను భరించలేకపోతాడు. ఫైర్ ప్లేస్ పైనున్న తన తండ్రి చిత్రాన్ని క్రిందకు దించాడు. తన తండ్రి ముఖంపై అతని కంటి నుండి జారిన కన్నీళ్ళూ రాలుతుండగా తండ్రి మాటలు అతనికి మరో సారి వినిపించాయి.
“Promise me, Son, not to do the things I’ve done
Walk away from trouble if you can
Now it won’t mean you’re weak if you turn the other cheek
I hope you’re old enough to understand
Son, you don’t have to fight to be a man”
(నేను చేసిన పనులేవీ నువ్వు చేయనని నాకు మాట ఇవ్వు బాబు. నీకు కుదిరితే గొడవలను దాటుకుని వెళ్లిపో. మరో చెంప చూపించి దాటుకుని వెళ్లిపోవడం బలహీనత కాదు. నువ్వు దీన్ని అర్థం చేసుకోగలవని అంతటి వయసు నీకుందని నేను అనుకుంటున్నాను. బాబు మగవాడిని అని నిరూపించుకోవడానికి యుద్ధం చేయవలసిన అవసరమేమీ లేదు)
టామీ తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి అన్ని రకాల అవమానాలను భరించి మౌనంగానే జీవిస్తున్నాడు. కాని అతని మౌనాన్ని ప్రపంచం చేతగానితనంగా ఎంచింది. అతని జీవితంతో ఆడుకోబోయింది. అతను ప్రేమించిన బెకీపై అత్యాచారం జరిగింది. మరి ఇప్పుడు అతని కర్త్యవ్యం ఏంటి అనే ఆలోచనలలో టామీ పడ్డాడు. తండ్రికిచ్చిన మాట జీవితపు అనుభవాలు అతన్ని ఇప్పుడు చుట్టుముట్టాయి. తన జీవన పంథాను ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చింది.
The Gatlin boys just laughed at him when he walked into the bar room
One of them got up and met him half way cross the floor
When Tommy turned around they said, “Hey look! Old Yellow’s leaving”
But you could’ve heard a pin drop when Tommy stopped and locked the door
(బార్ రూం లోకి టామీ రాగానే గాట్లిన్ సోదరులు అతన్ని చూసి నవ్వారు. ఒకడు కూర్చున్న చోటునుండి లేచి టామీకి ఎదురెళ్లాడు. టామీ అతన్ని చూసి వెనక్కు తిరిగగానే వాళ్లు గట్టిగా అదిగో ముసలి ఎల్లో వెళ్ళిపోతున్నాడు అని పరిహాసం ఆడారు. కాని టామి ఆగి అటుతిరిగి తలుపు గడి పెడుతుంటే చుట్టూ సూది పడ్డా వినిపించని నిశ్శబ్దం ఆవరించింది)
టామీ గాట్లిన్ సోదరులను వెతుక్కుంటూ వెళ్ళాడు. అతని స్వభావం తెలిసిన వాళ్ళు అతనికి ఎదురెళ్లడమే కాదు అతను తమను చూసి తిరిగి వెళుతున్నాడనుకుని పరిహాసం ఆడారు. కాని బార్ నుండి ఎవరూ బైటికి వెళ్ళకుండా తలుపుకు గొళ్లెం పెడుతున్న టామిని చూసి గాట్లిన్ సోదరులే కాదు బార్ లో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. మౌనంగా జరిగేది చూడసాగారు.
Twenty years of crawling was bottled up inside him
He wasn’t holding nothing back, he let ‘em have it all
When Tommy left the bar room, not a Gatlin boy was standing
He said, “This one’s for Becky”, as he watched the last one fall
(ఇరవీ ఏళ్ళ కోపం కసి అతనిలో నిండి ఉన్నాయి. దేన్ని తనలో మిగల్చుకోకుండా అతను ఇవ్వవలసినదంతా అక్కడే వాళ్లకు ఇచ్చాడు. టామీ బార్ రూం నుండి వెళ్లిపోతుంటే ఒక్క గాట్లిన్ సోదరుడు కూడా నుంచొని లేడు. ఆఖరి వాడు నేలకొరుగుతుండగా “ఇది బెకీకి మీరు చేసిన దానికి” అని అతను అనడం అందరికీ వినిపించింది.)
ఇరవై ఏళ్లుగా అతన్ని అందరూ గేలిచేస్తుంటే తండ్రికిచ్చిన మాటను మౌనంగా ఉండి కోపాని దిగమింగి బతికిన టామీ ఇప్పుడు ఒకేసారి ఆ ఇరవై ఏళ్ళ కోపాన్ని కసిని వెళ్ళగక్కి గాట్లిన్ సోదరులను చితక్కొట్టాడు. అతని ధాటికి ఎవరూ ఆగలేకపోయారు. ఆఖరి వాడిని మట్టి కరిపిస్తూ ఇది బెకీకి మీరు చేసిన దానికి ఫలితం అని గట్టిగా చెబుతూ తన భార్యకు జరిగిన దానికి పగ తీర్చుకున్నాడు.
And I heard him say
“I promised you, Dad, not to do the things you’ve done
I walk away from trouble when I can
Now please don’t think I’m weak, I didn’t turn the other cheek
And Papa, I should hope you understand
Sometimes you gotta fight when you’re a man”
(నాకు ఆ తరువాత అతను ఇలా అనడం వినిపించింది. నాన్నా నువ్వు చేసిన పనులేవీ నేను చేయనని నీకు మాటిచ్చాను. గొడవలలో దూరనని, అన్నీటిని దాటుకుని పట్టించుకోకుండా వెళ్లిపోతానన్నాను. కాని దయచేసి నేను బలహీనుడినని అనుకోవద్దు. నేను ఈసారి మరో చెంప చూపలేకపోయాయి. కాని నాన్నా నీకు అర్థం అవుతుందనుకుంటాను. కొన్ని సార్లు మగాడిగా నిరూపించుకోవడానికి యుద్ధం తప్పని సరి అవుతుంది)
ఈ పాట సారం అంతా ఈ చివరి చరణంలో వస్తుంది. తండ్రికి ఇచ్చిన మాటను తాను గుర్తు పెట్టుకున్నా జీవితంలో అన్నిటికీ మౌనంగా ఉండడం సరి కాదని, ప్రతి అన్యాయానికి మౌనంగా ఉండిపోవడం తప్పని, కొని సార్లు మగాడిగా నిలబడాలంటే ప్రతీకారం తప్పదని యుద్ధాన్ని యుద్దంతోనే జయించాలని తాను నేర్చుకున్న జీవిత పాఠాన్ని తండ్రి అర్థం చేసుకోవాలని, తాను ఏ పరిస్థితుల్లో తండ్రికిచ్చిన మాటను మీరాడో తండ్రి తెలుసుకోవాలని టామీ కోరుకుంటాడు.
Everyone considered him the coward of the county
(అందరూ అతన్ని ఆ ప్రాంతంలో పిరికివాడనే అనుకున్నారు)
అంతటి విజ్ఞత ఉన్నవాడు, మాటకు కట్టుబడి నిలబడ్డవాడు, తండ్రిని ప్రేమించగలిగినవాడిని ఆ ప్రాంతం అంతా ఆప్పటిదాకా పిరికివాడిగా అనుకున్నారు.
జీవితంలో ఓపిక, మౌనం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, అలాగే శాంత స్వభావులను పిరికివారిగా ఎంచడమూ తప్పనే సందేశంతో వచ్చిన ఈ పాట కెన్న రోగర్స్ హిట్ పాటలలో ఒకటి. కంట్రీ పాటలన్నీ జానపద గీతాలుగా, కథనాలుగా వనిపిస్తాయి. వీటిలో ఉపయోగించే వాద్య పరికరాలు కూడా సాంప్రదాయ పరికరాలు కాబట్టి ఈ పాటలలో జనజీవన పాళ్ళు ఎక్కువ వుంటాయి.
ఈ పాట బిల్‌బోర్డ్ కంట్రీ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచి, హాట్ 100 చార్ట్‌లో మూడవ స్థానానికి చేరుకుంది. ఇది క్యాష్ బాక్స్ సింగిల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలలో టాప్ 10 హిట్‌గా నిలిచింది, కెనడా, UK, ఐర్లాండ్‌లలో చార్ట్‌లో అగ్రస్థానంలో వరుసగా ఆరు వారాల పాటు మొదటి స్థానంలో నిలిచిన పాట ఇది. అంతే కాదు ఈ పాటలోని కథ స్పూర్తితో 1981లో ఓ టెలీఫిలిం తీసారంటే దీనికున్న క్రేజ్ అర్థం అవుతుంది.
ఏమైనా కథను పాట రూపంలో చెప్పడంలో కెన్నీ రోగర్స్ ప్రత్యేకత వేరు. ఆయన తన గొంతుతో ఆ కథ అసాంతం పలికించే హావభావాలు వినడంలో ఓ థ్రిల్ ఉంటుంది. ఆయన గొంతులో వినిపీంచే ఆ జీర, పలికే భావాలు, పదాలను పలికే తీరు వీటన్నిటి మధ్య పదాల విరుపులు గమ్మత్తుగా ఉంటాయి. పాశ్చాత్య సంగీతాన్ని పెద్దగా విననివారికి కూడా ఈయన పాటలు అందంగానూ ఆసక్తికరంగా ఉంటాయి.
ఈ పాటని యూట్యూబ్‍లో ఈ లింక్‍లో చూడవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)