Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమెరికా జనహృదయ సంగీతం – కంట్రీమ్యూజిక్-19. కెన్నీ రోగర్స్ – ది గాంబ్లర్

[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్‌లో భాగంగా కెన్నీ రోగర్స్ పాడిన ‘ది గాంబ్లర్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

కెన్నీ రోగర్స్ పాటల్లో చాలా పాపులర్ అయి కెన్నీ సిగ్నేచర్ సాంగ్‌గా నిలిచిన గీతం ‘ది గాంబ్లర్’. దీన్ని డాన్ ష్లిట్జ్ రాశారు. కెన్నీ కన్నా ముందే ఈ పాటను ఆయన రికార్డ్ చేశారు. కాని కెన్నీ గానం ఈ పాటకు జీవం పోసి, ఈ పాటను పాపులర్ చేస్తూ గ్రామీ అవార్డును కూడా సంపాదించి పెట్టింది.

ష్లిట్జ్ ఈ పాటను ఆగస్టు 1976లో తన 23 సంవత్సరాల వయసులో రాశారు. దీన్ని 1976లోనే మరణించిన తన తండ్రి ప్రేరణతో రాసానని ఆయన చెప్పుకున్నారు. దీన్ని ముందు బాబీ బేర్ అనే గాయకుడు మొదటి సారి రికార్డ్ చేసారు. అది ప్రజలలోకి రాలేదు. అందుకని ష్లిట్జ్ దానిని స్వయంగా మళ్ళీ రికార్డ్ చేశాడు. కానీ ఆ పాట కూడా ప్రజాదరణకు నోచుకోలేదు. జానీ కాష్, ఇతర సంగీతకారులు కూడా దీన్ని తరువాతి రోజుల్లో రికార్డ్ చేశారు అయినా ఈ పాట ప్రజలను అలరించలేకపోయింది.

రోజర్స్ ఈ పాటను టేనస్సీ లోని నాష్‌విల్లేలో, జాక్ క్లెమెంట్ రికార్డింగ్ స్టూడియోలో నిర్మాత లారీ బట్లర్‌తో కలిసి రికార్డ్ చేశారు. రోజర్స్ ఆల్బమ్ ‘ది గ్యాంబ్లర్’ టైటిల్ ట్రాక్‌గా నవంబర్ 1978లో విడుదలైన ఈ పాట అపూర్వమైన విజయాన్ని సాధించింది. కంట్రీ పాటలు అరుదుగా నంబర్ వన్‌గా నిలిచే సమయంలో రోజర్స్ వెర్షన్ నంబర్ 1 కంట్రీ హిట్, పాప్ చార్ట్‌లలోకి ప్రవేశించింది. 1980లో అతనికి ఉత్తమ పురుష కంట్రీ వోకల్ పెర్ఫార్మెన్స్‌కు గ్రామీ అవార్డును అందించింది.

2006లో, రచయిత ష్లిట్జ్ రోజర్స్ తన కెరీర్ రెట్రోస్పెక్టివ్ డాక్యుమెంటరీ ‘ది జర్నీ’లో కనిపించాడు. ఈ పాట గురించి వివరిస్తూ, రోజర్స్, నిర్మాత లారీ బట్లర్ ఇద్దరూ ఈ పాటకు అందించిన సహకారాన్ని ప్రశంసించాడు, “వారు వారి సొంత ఆలోచనలను, బాణీని ఈ పాటకు జోడించారు. అందులో ఒకటి ఆ కొత్త గిటారును పరిచయం చేయడం” అంటూ ఈ పాట విజయంలో వారి పాత్ర ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుందని స్వయంగా ఒప్పుకున్నారు.

‘గాంబ్లర్’ అంటే జూదగాడని అర్థం. ఈ పాటలో ఓ జూదగాడు ఆటను ఎలా ఆడాలి, గెలుపును ఎలా స్వీకరించాలి, ఓటమిని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. పాట అంతా పేకాటలోని నియమాల చుట్టునే తిరుగుతుంది. కాని అది జీవిత సత్యాలను పేక ముక్కల ఉదాహరణతో బోధిస్తుంది. జూదగాడు ఈ పాటలో ప్రతి పరిస్థితిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో చెబుతున్నాడు. ఏ ముక్కని ఉంచుకోవాలి, దేన్ని వదిలేయాలి అన్న విషయాల మీదే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఆటను ఆడే ధైర్యం, కొన్నిసార్లు లాభ నష్టాలను పట్టించుకోకుండా ఉండడం జూదగాడికి ఉండవలసిన లక్షణాలు. పైగా గెలిచినప్పుడు అహకారంతో విర్రవీగకుండా, ఓడినప్పుడు క్రుంగిపోకుండా ఉండలగలవాడే జూదాన్ని ఆడే అర్హత సంపాదించుకుంటాడు. ఎక్కువ కాలం ఆటలో ఉండగలడు.

జీవితం కూడా అచ్చంగా ఇలా ఆడాల్సిన ఆటే అన్నది మనకు తడుతూ ఉంటుంది. కెన్నీ పాటలలో చాలా భాగం దృశ్య వర్ణనతో నడుస్తాయి. ఇలాంటి పాటలకు ఆయన గొంతు అద్భుతంగా పలుకుతుంది. ‘ది గాంబ్లర్’ కెన్నీ పాడగా సూపర్ హిట్ అవడం వెనుక ఆయన గాత్ర విశిష్టత, పాటను పాడే విధానం కూడా ప్రధాన కారణాలు. ఇప్పుడు పాటను చూద్దాం.

On a warm summer’s evening
On a train bound for nowhere
I met up with the gambler
We were both too tired to sleep
So we took turns a-starin’
Out the window at the darkness

(ఒక్క వెచ్చని వేసవి సాయంత్రం ఏ గమ్యం లేకుండా సాగుతున్న రైలులో నేను ఓ జూదగాడిని కలిసాను. మేమిద్దరం అలసిపోయి ఉన్నామేమో నిద్ర పోలేకపోతున్నాం అందుకని వంతులవారిగా కీటికీ బైట చీకటిని చూస్తూ సమయం గడుపుతున్నాం.)

కెన్నీ పాటలు కథనంలా సాగుతూ ఉపోద్ఘాతంతో మొదలవడం ఇంతకు ముందు కూడా చూశాం. ఇక్కడ కవి తాను ఎప్పుడో చేసిన ఓ రైలు ప్రయాణం, అందులో పరిచయం అయిన ఓ అపరిచితుడితో చేసిన సంభాషణ గురించి చెప్తూ ఆ నాటి రాత్రిని గుర్తు చేసుకుంటున్నాడు.

The boredom overtook us
And he began to speak
He said, “Son, I’ve made a life
Out of readin’ people’s faces
Knowin’ what the cards were
By the way they held their eyes

(ఆ ప్రయాణం ఇద్దరిలోనూ విసుగు కలిగించింది. అప్పుడు అతను మాట్లాడడం మొదలెట్టాడు. బాబూ నేను మనుషుల ముఖాలను వారి కళ్ళ కదలికలను బట్టి చదవడం నేర్చుకుంటూ జీవితాన్ని గడిపాను.)

ఇక్కడ మాట్లాడుతున్నది ఓ జూదగాడు. అతనో గొప్ప స్థాయి ఉన్నవాడు కాదు. మామూలు మనిషి, కాని ఎందరినో చూసి వారి జీవిత కథలను తెలుసుకున్న అనుభవం అతని సొంతం. ఈ వాక్యాల ద్వారా ఆ వ్యక్తి సామాజిక స్థాయితో పాటు అనుభవ స్థాయినీ ముందే ప్రకటిస్తున్నాడు కవి.

So if you don’t mind my sayin’
I can see you’re out of aces
For a taste of your whiskey
I’ll give you some advice”

(అందుకని నువు ఒప్పుకుంటే నీ గురించి ఓ విషయం చెబుతాను. జీవితంలో ఆసులని పోగొట్టుకున్న ఆటగాడివని నిన్ను చూస్తే అర్థం అవుతుంది. అందుకని నాకు కొంత విస్కీ ఇస్తే నీకో సలహా ఇద్దాం అనుకుంటున్నాను.)

పేకాటలో ఆసు అతి పెద్ద ముక్క. ఆసులు అంటే లక్కీ కార్డ్ అని అర్థం. ఎన్ని ఆసులు సొంతం అయితే విజయం అంత దగ్గరకు వస్తుంది. ఇక్కడ మాట్లాడుతుంది ఓ జూదగాడు. జూదాన్ని పూర్తిగా అకళింపు చేసుకున్న వ్యక్తి అతను. అందుకే ఆ ప్రత్యేకమైన భాషలో సంభాషణ మొదలెట్టి, తన అనుభవంతో కవి జీవితంలో ఓటమితో పోరాడుతున్నవాడిగా తనకు కనిపిస్తున్నాడని, అతని జీవితంలో అదృష్ట రేఖలు లేకుండా పోయాయని తనకు అర్థం అయిందని చెప్పడానికి నువ్వు ఆసులు పోగొట్టుకున్న ఆటగాడిలా నాకు కనిపిస్తున్నావు అని చెప్తూ నేను నా అనుభవంతో నీకొక సలహా ఇవ్వగలను. దానికి బదులుగా నీ దగ్గరున్న విస్కే నాకు కొంత ఇవ్వు అని అడుగుతున్నాడు. ఈ మాటతో అతని వ్యక్తిత్వాన్ని మనకు కవి తెలియజేస్తున్నాడు.

So I handed him my bottle
And he drank down my last swallow
Then he bummed a cigarette
And asked me for a light
And the night got deathly quiet
And his face lost all expression

(అందుకని నేను అతనికి నా బాటిల్ అందించాను. నా దగ్గరున్న ఆఖరి మద్యం బొట్టును కూడా అతను తాగి సిగరెట్టు నోట పెట్టుకుని నన్ను అగ్గిపెట్టె అడిగాడు. రాత్రి నిశబ్దంలోకి జారుకున్నాక అతని ముఖం భావరహితంగా మారింది.)

ఈ వర్ణన ఆ జూదగాడి జీవన పంథాను, ఉన్న క్షణాలను తనకు అనుకూలంగా జీవించడానికి మలచుకుంటూ పొందిన ఉపకారానికి బదులు తీర్చుకోవాలనే అతని తత్వాన్ని కూడా వర్ణిస్తుంది. అతనికి తనపై తనకున్న నమ్మకాన్ని కూడా ఈ వాక్యలలో గుర్తించవచ్చు.

Said, “If you’re gonna play the game, boy
You gotta learn to play it right
You’ve got to know when to hold ‘em
Know when to fold ‘em
Know when to walk away
And know when to run
You never count your money
When you’re sittin’ at the table
There’ll be time enough for countin’
When the dealin’s done

(అతను ఇలా చెప్పడం మొదలెట్టాడు. బాబూ ఆటలో ముందుకు సాగాలంటే దాన్ని సరిగ్గా ఆడగలడం రావాలి. ఎప్పుడు ముక్కలని చేత పట్టుకోవాలి, ఎప్పుడు మడిచి క్రింద పడేయాలి, ఎప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోవాలి, ఎప్పుడు పరుగెత్తిపోవాలి, అనే విషయాలపై నీకు స్పష్టత ఉండాలి. ఆట స్థలంలోనే టేబుల్ ముందు కూర్చుని నీవు గెలుచుకున్న డబ్బును, నీ దగ్గర ఉన్న డబ్బును లెక్కపెట్టకూడదు. ఆట అయిపోయాక, పందం గడిచిపోయాక దానికి సమయం ఉంటుంది. ఓపిక పట్టు.)

జీవిత సారం అంతా రంగరించి చెప్పిన వాక్యాలు ఇవి. ఎప్పుడు ఆటలో ముందుకు సాగాలి. ఎప్పుడు ఆటను నిలిపివేయాలి తెలియకపోతే జీవితం అనే ఆటలో ఓటమి పాలు కాక తప్పదు. మన విజయాలను ప్రదర్శించుకోనక్కర్లేదు. మన ముందు ఓడిన వాళ్లలో అది కోపాన్ని పెంచుకుతుంది, అకారణ వైరానికి దారితీస్తుంది. మనలో అహంకారాన్ని పెంచుతుంది. ఆ తరువాత ఆడే ఆట అహం ప్రాతిపదికన సాగుతుంది. అది మనం ఎదో ఓ సమయంలో తప్పు చేయడానికి కారణం అవుతుంది. అలాంటి ఓ తప్పు చాలు ఆట తలక్రిందులవడానికి, గెలుపు ఓటమి లోకి దారి తీయడానికి.

Every gambler knows
That the secret to survivin’
Is knowin’ what to throw away
And knowin’ what to keep
‘Cause every hand’s a winner
And every hand’s a loser
And the best that you can hope for
Is to die in your sleep”

(ప్రతి జూదగాడికి తెలుసు ఆటలో నిలిచి ఉండాలంటే దేన్ని వదిలేయాలో ముందు తెలుసుకోవాలి, దేన్ని మన దగ్గర ఉంచుకోవాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి చేయి గెలవగలదు. గెలిచిన ప్రతి చేయి ఓడిపోనూ గలదు. అందుకని నువ్వు జీవితంలో కోరుకోగలిగే సుఖం ఒక్కటే నిద్రలో మరణించడం.)

జూదగాడికి తన పేక ముక్కల్లో ఎప్పుడు దేన్ని వదిలేయాలో దేన్ని చివరి దాకా ఉంచుకోవాలో తెలియకపోతే అతను ఆటలో ముందుకు సాగలేడు. ఎందుకంటే జయాపజయాలు శాశ్వతం కాదు. ఇప్పుడు లభించిన విజయం ఎప్పటికీ ఉండదు. ఓడిన చేయి గెలుపును అందిపుచ్చుకోకుండానూ ఉండదు. అందుకే మన ఎదుటి ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయక, మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోక జాగ్రత్తగా ముక్కలతో ఆలోచించగలిగితేనే ఆటలో చివరిదాకా ఉండగలుగుతాం. అన్నిటికన్న మనిషి కోరుకోవలసినది ప్రశాంతమైన నిష్క్రమణ మాత్రమే, అది జీవితం కావచ్చు, పేకాట కావచ్చు దానినుండి ప్రశాంతంగా నిష్క్రమించగలగడమే నిజమైన జూదగాడు పొందగలిగే ఆఖరి విజయం.

And when he’d finished speakin’
He turned back toward the window
Crushed out his cigarette
Faded off to sleep

(సిగరెట్టు పూర్తి చేసి కిటికీ పక్కకు తిరిగి దాన్ని బైటకు విసిరేసి నిద్రకుపక్రమించాడు అతను.)

And somewhere in the darkness
The gambler he broke even
But in his final words
I found an ace that I could keep

(ఆ నిశిధి రాత్రి చీకటిలో అతను కలిసిపోయాడు కాని అతని చివరి మాటల్లో నాకు ఎప్పటికీ దాచుకోగల ఓ ఆసు ముక్క దొరికింది.)

చెప్పవలసింది చెప్పి ఆ జూదగాడు అటు తిరిగి నిద్రపోయాడు. కాని ఆ రాత్రి జీవితాంతం తనతో ఉంచుకోవలసిన ఓ ఆసు ముక్క కవికి దొరికిందట. ఈ వర్ణన ఇక్కడ కవిలోని జూదగాడిని పరిచయం చేస్తుంది. జూదగాడికి ఆసు ముక్క చివరి దాకా దగ్గర ఉంచుకోవలసిన పెన్నిది అని తెలుసు, కాని జీవితం అనే జూదంలో తనకో ఆసు ముక్క అంటే చివరి దాకా దగ్గర ఉంచుకోవలసిన ముఖ్యమైన సూక్తి దొరికిందని కవి చెప్తునాడు. ఇలా చెప్తూ తానూ ఓ జూడగాడినని పరిచయం చేసుకుంటున్నాడు. తనకు అందిన ఆసు ముక్క బలం ఏంటో మరో సారి మనకు ఇలా వినిపిస్తున్నాడు.

You’ve got to know when to hold ‘em
Know when to fold ‘em
Know when to walk away
And know when to run
You never count your money
When you’re sittin’ at the table
There’ll be time enough for countin’
When the dealin’s done

(నీకు వాటిని ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలో ఎప్పుడు మడిచేయాలో, ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలో, ఎప్పుడు పారిపోవాలో తెలిసి ఉండాలి. నీ విజయాలని అందరి ముందు లెక్కపెట్టుకుంటూ ఉండకు. దానికి ఆట అయిపోయాక సమయం ఉంటుంది)

You’ve got to know when to hold ‘em (when to hold ‘em)
Know when to fold ‘em (when to fold ‘em)
Know when to walk away
And know when to run
You never count your money
When you’re sittin’ at the table
There’ll be time enough for countin’
When the dealin’s done
You’ve got to know when to hold ‘em
Know when to fold ‘em
Know when to walk away
And know when to run
You never count your money
When you’re sittin’ at the table
There’ll be time enough for countin’
When the dealin’s done

మళ్ళీ మళ్ళీ వినిపించే ఈ జీవన సూక్తి మన జీవితాలకు చాలా అవసరం. జూదగాడు జీవితం అనే జూదాన్ని ఆడడానికి కావల్సిన శక్తిని కవికి ఇస్తే అతను ఆ శక్తిని ఈ పాట రూపంలోకి మార్చి, మనకూ ఓ ఆసు ముక్కను బహుమతిగా ఇస్తున్నాడు.

ఈ పాటలోని సాహిత్యం, జీవితాన్ని జూదంతో పోల్చిన విధానం, జీవితాన్ని ఓ ఆటగా చూస్తూ దాన్ని ఆడడానికి మనకుండవలసిన లక్షణాలను వర్ణించిన తీరు, ముఖ్యంగా ఈ పాటను కెన్నీ పాడిన విధానం నాకు, నాలాంటి చాలా మంది కెన్నీ అభిమానులకు ఓ గొప్ప అనుభవం. ఇది వీడియోగా చూస్తుంటే అందులో కెన్నీ మనకు బాగా నచ్చుతాడు. అతని వేష భాషలు, పాటను గానం చేసిన పద్ధతి అతను మనతో జరిపే గంభీరమైన సంభాషణలా అనిపించి కెన్నీ మన మనసుల్లో నిలిచిపోతాడు.

ఈ పాట రోజర్స్ సిగ్నేచర్ పాటగా, అతని శాశ్వత హిట్‌గా నిలిచింది. బిల్బోర్డ్ కంట్రీ మ్యూజిక్ చార్ట్లలో నంబర్ 1 స్థానంలో నిలిచిన రోజర్స్ వరుసగా ఐదు పాటలలో ఇది ఒకటి. పాప్ చార్ట్లో, ఈ పాట 16వ స్థానంలో, ఈజీ లిజనింగ్ చార్ట్లో 3వ స్థానంలో నిలిచింది. ఈ పాట ఓల్డ్ వెస్ట్‌లో సెట్ చేయబడిన కొన్ని టీవీ సినిమాలకు ప్రేరణనిచ్చింది, కెన్నీ రోజర్స్ ది గ్యాంబ్లర్ (1980)గా ప్రారంభించి, ఆ తర్వాత కెన్నీ రోజర్స్ ది గ్యాంబ్లర్: ది అడ్వెంచర్ కంటిన్యూస్ (1983), కెన్నీ రోజర్స్ ది గ్యాంబ్లర్, పార్ట్ III: ది లెజెండ్ కంటిన్యూస్ (1987), ది గ్యాంబ్లర్ రిటర్న్స్: ది లక్ ఆఫ్ ది డ్రా (1991), గ్యాంబ్లర్ V: ప్లేయింగ్ ఫర్ కీప్స్ (1994)గా ఇవి తెరకెక్కాయి.

నవంబర్ 13, 2013 నాటికి, ఈ సింగిల్ డిజిటల్ అమ్మకాలు 798,000 కాపీలు అమ్ముడుపోయాయి. 2018లో, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ దీనిని నేషనల్ రికార్డింగ్ రిజిస్ట్రీలో ‘సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా లేదా సౌందర్యపరంగా’ ముఖ్యమైన పాటగా ఎంపిక చేసింది. ఇంటర్నెట్ రేడియో స్టేషన్ WDDF రేడియో వారి 2016 కౌంట్డౌన్లో 1970లలోని టాప్ 76 పాటలలో ఈ పాట 18వ స్థానంలో నిలిచింది. మార్చి 20, 2020న రోజర్స్ మరణించిన తర్వాత, ‘ది గ్యాంబ్లర్’ బిల్బోర్డ్ డిజిటల్ సాంగ్ సేల్స్ చార్టులో మళ్ళీ నంబర్ 1కి చేరుకుంది. కొన్ని స్పోర్శ్ క్లబ్ లు కూడా ఈ పాటను తమ సిగ్నేచర్ పాటగా స్వీకరించాయి.

ఈ పాటని యూట్యూబ్‍లో ఈ లింక్‍ లో వినవచ్చు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version