[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా డాన్ విలియమ్స్ పాడిన ‘లార్డ్, ఐ హోప్ దిస్ డే ఈజ్ గుడ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- డాన్ విలియమ్స్ – లార్డ్, ఐ హోప్ దిస్ డే ఈజ్ గుడ్ (1981)
- ఆల్బమ్ – ఎస్పెషల్లీ ఫర్ యూ
- రచన – డేవ్ హానర్
- ప్రొడ్యూసర్ – డాన్ విలియమ్స్, గార్త్ ఫండిస్
~
డాన్ విలియమ్స్ గొంతులో ద్వనించే ప్రశాంతతలో ఓ అందం ఉంటుంది. నేను ఎక్కువగా వినే కంట్రీ సింగర్ డాన్. ఆయన పాటలకు కంపోజ్ చేసిన మ్యూజిక్ మెడిటేటివ్గా అనిపిస్తుంది. కొంత మందికి ఆ పాటలన్నీ ఒకే శైలిలో ఉన్నట్లు, వైవిధ్యం లేనట్లు అనిపించినా డాన్ గొంతు ప్రతి ఒక్క పాటలో ప్రశాంతత వొలికిస్తూ మరో లోకంలోకి తీసుకెళుతుంది. ‘లార్డ్, ఐ హోప్ దిస్ డే ఈజ్ గుడ్’ పాటలో ఆయన గొంతులో వినిపించే ఆర్ద్రత నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. దీన్ని డేవ్ హానర్ రాసారు. ఇది నవంబర్ 1981లో ‘ఎస్పెషల్లీ ఫర్ యు’ ఆల్బమ్ మూడవ సింగిల్‌గా విడుదల అయింది. ఈ సింగిల్ ఒక వారం పాటు నంబర్ వన్ స్థానంలో నిలిచి, కంట్రీ మ్యూజిక్ చార్ట్‌లలో మొత్తం ఇరవై వారాలు గడిపింది. డాన్ 1974 నుండి 1991 మధ్య ప్రతి సంవత్సరం కనీసం ఒక ప్రధాన హిట్ గీతాన్ని కంట్రీ మ్యూజిక్ ప్రపంచానికి అందించారు.


Lord, I hope this day is good
I’m feelin’ empty and misunderstood
I should be thankful, Lord, I know I should
But Lord, I hope this day is good
(ప్రభూ ఈ రోజు బావుంటుందని ఆశిస్తున్నాను. నేను నాలో శూన్యాన్ని అనుభవిస్తున్నాను. నన్ను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను నా జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండాలి, ఇది నాకు తెలుసు అది కాని ప్రభూ నాకు ఈ రోజు బావుండాలని కోరుకుంటున్నాను నేను.)
ప్రతి మనిషి తన జీవితంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ప్రతి రోజుని ఆశతోనూ ఒకానొక భయంతోనూ ఆహ్వానిస్తాడు. చాలా మంది కన్నా అదృష్టవంతులుగా జీవిస్తున్నా అది ఎన్నాళ్ల అదృష్టమో మనకు తెలియదు. మనకు దక్కినవన్నీ ఎన్నాళ్లు మనతో ఉంటాయో చెప్పలేం. నిజానికి ఏదీ శాశ్వతం కాదు కదా. ఆ భయం జీవితం తెలిసిన వారికి వెన్నంటే ఉంటుంది. అందుకే ప్రతి రోజు కూడ ఈ రోజు నాకు బావుండాలి అని భగవంతుడ్ని కోరుకుంటాం. అదే చేస్తున్నాడు ఈ పాటలో డాన్.
Lord, have you forgotten me
I’ve been prayin’ to you faithfully
I’m not sayin’ I’m a righteous man
But Lord, I hope you understand
(ప్రభూ నువ్వు నన్ను మర్చిపోయావు. నేను నిన్ను ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను నీతిమంతుడినని చెప్పట్లేదు. కాని ప్రభు నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు అనుకుంటాను)
జీవితంలో కాస్త ఆందోళన కలిగినా మనకు భయం వేస్తుంది. ఆ దేవుడు మనల్ని మర్చిపోయాడా అని అనుమానం కలుగుతుంది. దైవం మీద విశ్వాసం మెండుగా ఉన్నా మన లోపాలు, మనం చేసిన తప్పులు మనకు గుర్తుకు వస్తూనే వుంటాయి. ప్రతి మనిషిలోనూ ఉండే మనస్సాక్షి మన గురించి నిజాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎంత అదృష్టంలో పొంగి పొర్లుతున్నా మన తప్పులకు ఆ దైవం ఎప్పుడో అప్పుడు శిక్షిస్తాడనే ఆలోచన మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అందుకే తను మంచివాడినని, నిజాయితీపరుడినని ఇతను అనట్లేదు కాని ఆ దైవం తనని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. “నేను బలహీనుడిని కాని చెడ్డవాడిని కాను. అందుకే నన్ను క్షమించు ఈ రోజు నాకు బావుండేలా చూడు,” అని ప్రభువును వేడుకొంటున్నాడు.
I don’t need fortune and I don’t need fame
Send down the thunder, Lord, send down the rain
But when you’re plannin’ just how it will be
Plan a good day for me
(నాకు పెద్ద అదృష్టమూ, కీర్తి ప్రతిష్ఠలు అక్కరలేదు. పై నుండి ఉరుములను మెరుపులను వర్షాన్ని కురిపించు, కాని నాకు దక్కవలసిందాన్ని నిర్ణయించేటప్పుడు మంచి రోజును మాత్రం నా కోసం ఇవ్వు)
అతి గొప్ప వాక్యాలు ఇవి. పెద్ద పెద్ద కోరికలు, జీవితాంతం కలిసి వచ్చే కాలం అత్యాశలే. అందుకే అతనికి అవి ఏవీ వద్దు. “కష్టాలు రానీవ్వు, సమస్యలను ఇవ్వు. కాని నా కోసం మంచి రోజులను అందించు” అని ప్రార్థిస్తున్నాడు అతను. కష్టాలను ఎదుర్కునే శక్తి, సమస్యలను పరిష్కరించుకునే యుక్తి ఉంటే ఆ రోజు బావున్నట్లే కదా. రోజు బావుండడం అంటే అదృష్టం నడిచి రావడం అయాచిత ఆనందం దొరకడం కాదు. అవరోధాలను నిబ్బరంతో అధిగమించడమే మంచి రోజుకు, మంచి జీవితానికి చిహ్నం. అందుకే నాకు కష్టాలు వద్దు అని అతను అడగట్లేదు. అవి జీవితంలో భాగం అని అతనికి తెలుసు. నా ప్రయత్నం బావుంటే, నా రోజు బావుంటే చాలు అని అతను అంటున్నాడు.
Lord, I hope this day is good
I’m feelin’ empty and misunderstood
I should be thankful, Lord, I know I should
But Lord, I hope this day is good


జీవితంలో మనకు ఎదురుపడే వాళ్లు ఎప్పుడూ మనల్ని పూర్తిగా అర్థం చేసుకోరు. చాలా సందర్భాలలో మన కోరికలు, మన ఆశలు ఇతరలకు తప్పుగానే అర్థం అవుతాయి. అప్పుడు మనిషి చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. ఎవరూ అర్థం చేసుకోరే అని బాధపడే సమయంలో దైవంపై నమ్మకం పెరుగుతుంది. అందుకే నేను చాలా విషయాలలో అదృష్టవంతుడినని నాకు తెలుసు కాని నా రోజు బావుండకపోతే అవేవీ నన్ను ఆదుకోవు. అందుకే నన్ను అర్థం చేసుకుని నా కోరిక మన్నించు అని అతను మరీ మరీ దేవుడ్ని వేడుకుంటున్నాడు.
You’ve been the King since the dawn of time
All that I’m asking is a little less crime
It might be hard for the devil to do
But it would be easy for You
(నువ్వు ప్రపంచం మొదలయినప్పటి నుండి రాజువి. నేను నిన్ను అడుగుతుంది కాస్త తక్కువ నా జీవితంలో తక్కువ తప్పుని, తక్కువ నేరాన్ని. ఇది దయ్యానికి కష్టం అయిన పని కాని నీకు సులువైన పనేగా.)
ఈ ప్రపంచం మొదలయినప్పటి నుండి ఆయనే రాజు అని ఈ భక్తుడు ఒప్పుకుంటున్నాడు. తన జీవితంలో కాస్త తక్కువ కష్టాన్ని, తక్కువ తప్పుల్ని, తక్కువ నేరాలనే ఇతను కోరుకుంటున్నాడు. ఇది దయ్యానికి ఇవ్వడం కష్టం. అది ఆవహిస్తే పాపం హెచ్చు స్థాయిలో జరిగిపోతుంది. కాని దేవునికి అసాధ్యమయినది ఏదీ లేదు.
ఈ చరణం చాలా ఆలోచనలను కలిగిస్తుంది. జీవితంలో మనిషి కష్టపడకుండా చిన్నా పెద్దా తప్పులు చేయకుండా ఉండడు. కాని దైవాన్ని నమ్మినవాడు, మంచిని నమ్మినవాడు జీవిత మార్గంలో తక్కువ తప్పులతోనూ, పాపాలతోనూ, నేరాలతోనూ బైటపడతాడు. ఈయన అదే కోరుకుంటున్నాడు. క్రిస్టియానిటిలో దైవానికి దెయ్యానికి నడుమ పోటీ ఎప్పుడూ ఉంటుంది. దైవానికి దూరం జరిగితే దెయ్యం ఆవహిస్తుంది. అది మనిషిని కొంచెం నేరంతో వదిలిపెట్టదు. కాని దైవం చెడుదారి పట్టిన వాడిని కూడా తక్కువ నష్టంతో బైటపడేస్తాడు. అలా జరిగితే చాలు కదా, జీవితానికి అంత కన్నా ఇంకేం కావాలి.
Lord, I hope this day is good
I’m feelin’ empty and misunderstood
I should be thankful, Lord, I know I should
But Lord, I hope this day is good
(ప్రభూ ఈ రోజు బావుంటుందని ఆశిస్తున్నాను. నేను లోన శూన్యాన్ని అనుభవిస్తున్నాను. నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కృతజ్ఞతతో ఉండాలి నాకు తెలుసు కాని ప్రభూ నేను మంచి రోజు కోసం ఆశపడుతున్నాను)
కంట్రీ మ్యూజిక్‌లో గాస్పెల్ మ్యూజిక్ ఓ ప్రత్యేకమైన భాగం. ఇది భక్తిసంగీతం అని చెప్పవచ్చు. అయితే ఆ పాటల్లో కూడా గొప్ప దార్శనికత, జీవితం పట్ల ఎరుక, విశ్లేషణ ఉంటాయి. గాస్పెల్ మ్యూజిక్‌లో గొప్ప పాటలున్నాయి. చాలా పాటలు కేవలం క్రిస్టియానిటీ భోధించవు. భక్తునికి దైవానికి నడుమ ఉండవలసిన సంబంధాన్ని ప్రస్తావిస్తాయి. దీన్ని పూర్తి గాస్పెల్ గీతంగానూ చూడవచ్చు. కాని ఈ పాటలో మతానికి అతీతంగా ఉండే మనిషితనం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పాట సంగీతం డాన్ పదాలను పలికే తీరు, ఆ పాటను గానం చేసేటప్పుడు అతని గొంతులోపలికే నిజాయితీ ఓ చెమ్మను మన మనసుల్లోకి మోసుకు వస్తుంది. ఒక్క సారి ఈ పాటను విన్న వాళ్లు దాని ఆకర్షణలో పడకుండా ఉండలేరు.
మీరొకసారి విని అదిచ్చే అనుభూతిని ఆస్వాదించి చూడండి. ఇందులో క్రీస్తూ, అల్లా, రాముడు కాదు కేవలం ఓ భక్తుడి దైవభక్తిని మాత్రమే దర్శిస్తారు.
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
