[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా టామీ వైనెట్ పాడిన ‘స్టాండ్ బై యువర్ మ్యాన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- టామీ వైనెట్ – స్టాండ్ బై యువర్ మ్యాన్ (1968)
- ఆల్బమ్ – స్టాండ్ బై యువర్ మ్యాన్ (సింగిల్)
- రచన – బిల్లీ షెరిల్, టామీ వైనెట్
- ప్రొడ్యూసర్ – బిల్లీ షెరిల్
~
టామీ వైనెట్ (మే 5, 1942 – ఏప్రిల్ 6, 1998) అమెరికన్ కంట్రీ మ్యూజిక్‌లో గొప్ప విజయాలను అందుకున్న గాయని, పాటల రచయిత్రి కూడా. ఆమె పాడిన ఇరవై సింగిల్స్ బిల్బోర్డ్ కంట్రీ చార్టులో అగ్రస్థానంలో నిలిచాయి. ‘స్టాండ్ బై యువర్ మ్యాన్’ పాట సంగీత ప్రపంచంలో ఈమెను అగ్రస్థానంలో నిలబెట్టింది. వైనెట్ ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల రికార్డులను విక్రయించిందని అంచనా. ఆమె రెండు గ్రామీ అవార్డులు, మూడు కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డులు, రెండు అకాడమీ ఆఫ్ కంట్రీ మ్యూజిక్ అవార్డులను అందుకుంది. రికార్డింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా గోల్డ్, ప్లాటినం డిస్కలను సర్టిఫై చేసిన కంట్రీ మ్యూజిక్ మొదటి మహిళా ప్రదర్శకులలో వైనెట్ కూడా ఒకరు.
టామీ వైనెట్
వైనెట్ గాత్రం విలక్షణమైనది. ఆమె గొంతులో విషాదం అద్భుతంగా పలుకుతుంది. ఆమె శైలిని కన్నీటి బొట్టు గాత్ర శైలి (Tear Drop Vocal style) అని పిలిచేవారు. అంటే భావోద్వేగాలు అతి విషాదంగా ద్వనించవలసిన సందర్భంలో పాడుతున్న వాక్యం దగ్గర గొంతులో జీరను ఆమె అమోఘంగా పలికించేది. అందుకే కంట్రీ మ్యూజిక్ లో ఆమెను ‘హార్ట్ బ్రేక్ హీరోయిన్’ గా పిలిచేవారు.
భర్త భార్యను నిర్లక్ష్యం చేసినా, ఆమెను కష్టపెట్టినా సహించి సర్ధుకోమని, పెద్ద మనసుతో మన్నించి, అతనికి అన్ని వేళలా చేదోడువాదోడుగా ఉండడం స్త్రీ ధర్మం అనే మాటలు మన దేశంలో వింటూనే ఉంటాం. కాని ఈ మాటలను అమెరికా లాంటి దేశంలోనూ స్త్రీలు వినేవారని, ఆచరించేవారని తెలుసుకుంటే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి అన్ని దేశాలలోనూ స్త్రీల పాత్ర ఒకటే, వారి ఆలోచనలు, జీవితాలు అన్నీ ఒకేలా ఉంటాయి. భర్త తనను మోసం చేసినా ఆ బంధాన్ని తెంచుకోవాలని సాధారణంగా భార్య అనుకోదు. స్త్రీలో క్షమించే గుణం ఎక్కువ. వివాహ బంధంతో ఆమె భర్తను అతని అన్ని బలహీనతలతో పాటు స్వీకరిస్తుంది. మన దేశంలో దీన్నిపాతివ్రత్యం అంటూ ప్రచారం చేసినా, సహజంగా ప్రపంచవ్యాప్తంగా స్త్రీ భర్తకు దూరం అవ్వాలని కోరుకునేది కాదు. భర్త నిర్లక్ష్యాన్నిఏ దేశంలో స్త్రీ అయినా సరే క్షమించడం అలవాటు చేస్తుకుంటుంది. అందుకే ఈ పాట చాలా మందికి నచ్చింది. మధ్యతరగతి గృహిణులు ఈ పాటను తమ జీవిత ఆదర్శంగా స్వీకరించారు. 1960ల చివరలో-1970ల ప్రారంభంలో వచ్చిన ఈ పాట స్త్రీవాద ఉద్యమకారులకు మాత్రం కోపం తెప్పించింది. మహిళలను పురుషుల నియంతృత్వానికి బానిసలుగా మార్చే భావజాలం ఉన్న గీతం ఇది అని వాళ్లంతా దీన్ని తీవ్రంగా విమర్శించారు.
Sometimes it’s hard to be a woman
Giving all your love to just one man
You’ll have bad times
And he’ll have good times
Doin’ things that you don’t understand
(ఒక్క మగాడికే నీ ప్రేమనంతా ఇచ్చే స్త్రీగా ఉండడం చాలా కష్టం. నీవు వ్యథను అనుభవిస్తుంటావు. అతను నీ కర్థం కాని పనులు చేస్తూ ఆనందాన్ని జుర్రుకొంటూ ఉంటాడు)
స్త్రీ ఇంటికి పరిమితం అయిపోతుంది. భర్త అవసరాలు చూడడం తన కర్త్యవ్యం అనుకుంటుంది. అన్ని పనులు సాఫీగా జరిగిపోతూ ఉంటే భర్త బైటి ప్రపంచంలో మునిగిపోతాడు. భార్య ఉనికినే మర్చిపోతాడు. తన జీవితాన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేస్తూ ఉంటాడు. చాలా సార్లు భర్త ఏం చేస్తున్నాడో, అతని వ్యాపకాలేంటో, అతని ప్రపంచం ఏంటో స్త్రీకి తెలియదు, అర్థం కాదు. అలాంటి సందర్భాలలో అతని ప్రపంచంలో ఆమె ఉనికి లేకుండానే జీవితం గడిచిపోతుంది. ఇది ఎలాంటి కష్టమయిన స్థితో ఓ స్త్రీకి మాత్రమే అర్థం అవుతుంది. ఆ భయంకరమైన ఒంటరితనాన్ని ఆమె భరిస్తూ భారంగా రోజులు వెళ్ళదీస్తుంది. ఆ బంధం, ఆ బాధ తనకు అవసరమా అన్న ప్రశ్న ఆమెలో రాకుండా ఉండదు. అందుకే ఈ పాటలో గాయని అంటుంది అలాంటి సందర్భాలలో కూడా ఆ మగవాడిని ప్రేమిస్తూ అతనికి భార్యగా ఉండడం చాలా కష్టం అయిన పని. నువ్వు బాధపడుతుంటే అతనికి అది అర్థం కాదు. అతని జీవితంలో ఆనందం, ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటాయి. కాని దాని వెనుక నీవు ఉన్నావన్నది అతను గుర్తించడు.
But if you love him you’ll forgive him
Even though he’s hard to understand
And if you love him, oh be proud of him
‘Cause after all he’s just a man
(కాని నీకు అతనిపై ప్రేమ ఉంటే అతన్ని క్షమిస్తావు. అతను నీకు అర్థం కాకపోయినా అతన్ని ప్రేమిస్తావు. నువ్వు అతన్ని ప్రేమిస్తే అతన్ని చూసి గర్వపడు. అతన్ని క్షమించు ఎందుకంటే అతను కేవలం ఓ మగాడు మాత్రమే)
అతను నిన్ను నిర్లక్ష్యం చేసినా అతన్ని నువ్వు ప్రేమిస్తే అతన్ని క్షమించు. అతను చాలా సందర్భాలలో నీకు అర్థం కాడు. నిన్ను అర్థం చేసుకోడు. అయినా సరే అతని విజయాలను చూసి గర్వపడు. అతను నువ్వు ప్రేమించిన వాడు కదా అందుకే అతని విజయాలను సంతోషించు. అతను కేవలం ఓ మగాడు, బలహీన మనస్కుడు అందుకే అతని నిర్లక్ష్యాన్ని క్షమించు. అతన్ని ప్రేమించు..
Stand by your man
Give him two arms to cling to
And something warm to come to
When nights are cold and lonely
(నీ మగవాడి పక్కన అన్నివేళలా నిలబడు, నీ రెండు చేతులను అతనికి ఆసరాగా అందించు. గడ్డకట్టే చలిలో ఒంటరిగా ఉన్నప్పుడు దగ్గర చేరగల వెచ్చని నేస్తంగా అతనికి తోడై ఉండు.)
Stand by your man
And show the world you love him
Keep giving all the love you can
Stand by your man
(నీ మగవాడి పక్కన నిలబడు. ఈ ప్రపంచానికి అతన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చూపించు. నీవు ఇవ్వగల ప్రేమనంతా ఇస్తూ అతనిపక్కనే నిలబడు.)
Stand by your man
And show the world you love him
Keep giving all the love you can
Stand by your man
(నీ మగాడిపక్కన నిలబడు, ప్రపంచానికి నువ్వతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో చూపించు. అతని పక్కనే ఉండు.)
మన పురాణాలలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనే శ్లోకం ఉంది కదా. ఈ పాట అదే అర్థాన్నిసూచిస్తుంది. భర్తను భార్య అన్ని వేళలా కనిపెట్టుకుని ఉండాలని, ప్రేమించాలనే సందేశం ఇస్తుంది. అతను ఓ మగాడు మాత్రమే అంటూ అతను బలహీనుడని, అతని వైఖరి ఎన్నో సందర్భాలలో కోపం తెప్పిస్తుంది, అయినా అతన్ని ప్రేమించే ఆమె అతనికి తోడుగా అన్నివేళలా నిలవాలన్నది ఈ పాట అర్థం.
ఈ రోజుకీ కంట్రీ మ్యూజిక్ గీతాలలో ఈ పాటకు విశిష్ట స్థానం ఉంది. పాశ్చాత్య దేశాలలో ఒక గొప్పతనం గుర్తించాలి. వారిలో ఇప్పుడు కూడా సాంప్రదాయవాదం పట్ల అనవసర అసహనం కనిపించదు. ఇప్పుడు స్త్రీలు చాలా మంది ఈ పాటలోని బాధ్యతల స్థాయిని దాటేసారు. అయినా ఈ పాటలోని నిజాయితీని, ఇందులోని నిస్వార్థ ప్రేమను వాళ్లు ప్రేమిస్తారు. స్త్రీ సహజంగా పురుషుడి బలహీనతలను చాలా సందర్భాలలో క్షమిస్తుంది. ఆమెలో ఆ గొప్పతనం ఉంది. ఆ గుణాన్ని నేటికీ పాశ్చాత్య సమాజం గౌరవిస్తుంది. ఆధునికంగా జీవిస్తూనే సాంప్రదాయ జీవితంలోని గొప్పతనాన్ని, స్త్రీ త్యాగాన్ని తేలికగా చూడదు.
మన దేశంలో ప్రస్తుత పరిస్థితులలో సాంప్రదాయం, ఆధునికత్వం రెంటిలోనూ అతి కనిపిస్తుంది. ఈ రెండు ధృవాలకు ఒకరినికి మరొకరు గౌరవించుకోవడం రాదు. ఆధునికులకు సాంప్రదాయవాదంలోని ప్రతిదీ విమర్శకు అవకాశం ఇచ్చేదే. సాంప్రదాయులకు ఆధునికుల ప్రతి ఒక్క చర్య హేయమైనదే. ఎంతటి అసహనం ఈ రెండు ధృవాల మధ్య. ఏ సందర్భంలో నయినా పరస్పర గౌరవాన్ని ప్రదర్శించుకోవడం వీరికి బలహీనతగా అనిపిస్తుంది.
అలాంటి అసహనం మధ్య ఈ పాటను గుర్తు చేసుకోవాలి. పాశ్చాత్య సాంప్రదాయవాదం, ఆధునికతల మధ్య కనిపించే ఆ పరస్పర గౌరవానికి చిహ్నమే 2025 లలో కూడ ఈ పాట ఆధునికులనీ అలరించడం, దాన్ని వాళ్లు స్వీకరించడం, గౌరవించడం. ఈ గుణం మన దేశంలోకూడా పాకితే తప్ప మనం ఇప్పుడు అనుభవిస్తున్న అనిశ్చత ఒక కొలిక్కి రాదు.
ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినా అతన్ని ప్రేమిస్తూ అతని పక్కన నిలిచి ఉండడం మామూలు విషయం కాదు. దీని వెనుక పితృస్వామ్య వ్యవస్థ కుట్ర ఉన్నదన్న సత్యాన్ని ఒప్పుకుంటూనే, అంత కుట్రను కూడా నిస్వార్థంగా సహించి భరించి కొన్ని తరాలుగా ప్రేమను పంచుతూ పోయిన స్త్రీ జాతి ఎంత మహోన్నతమైనదో కదా. స్త్రీ తన శక్తిని తెలుసుకుని, దాన్నిఇంకా పెంపొందించుకుంటూ జీవితంలో ఎదుగుతూ ముందుకు సాగాల్సిన సమయంలో ఎలాంటి గందరగోళపు పరిస్థితుల నడుమ బందీ అయింది? దాని దాటుకుని ఆమె ఎప్పుడు ముందుకు అడుగేస్తుందో..
పాశ్చాత్య జీవితంలో ఓ వాదం చర్చకు వస్తే, దాన్ని మన లాగా కేవలం ద్వేషంతో ఖండించడం జరగదు. దాన్ని లాజిక్‌తో ఎదుర్కుంటారు. ఈ పాట విషయంలోనూ అదే జరిగింది. ఇది పితృస్వామ్య వ్యవ్యస్థ స్త్రీని ఓ మూసలో పోసి బంధించి ఉంచడానికి ప్రచారంలోకి తీసుకువచ్చే భావజాలం అని స్త్రీవాదం అంటున్నప్పుడు, పురుష కోణంలో రెండు విభిన్నమైన జవాబు పాటలు వచ్చాయి. వాటి గురించి మరో సారి చెప్పుకుందాం. కాని అన్ని వాదాలను పక్కన పెట్టి ‘స్టాండ్ బై యువర్ మాన్’ పాట వింటే ఇదో మంచి ప్రేమ గీతం అని అనిపించక మానదు. ప్రేమలో ఉండేది కూడా లోంగుబాటే కదా..
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)