[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా డాలీ పార్టన్ పాడిన ‘జోలీన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
~
ఒకసారి వివాహం అయిన పురుషుడి ప్రేమలో పడి అతనితో జీవితం ప్రారంభించిన ఎందరో స్త్రీలు ప్రపంచం అంతా ఉన్నారు. ముఖ్యంగా పాశ్చాత్య జీవనంలో ఇలాంటివి చాలా సాధారణం అని, వివాహం విఫలం అయితే ఆ జంట జీవితంలో మరొకరి చేయి పట్టుకుని ముందుకు సాగిపోవచ్చని, ఈ స్వేచ్చ వారికి అవసరం అని ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. కాని ఇలాంటి త్రికోణ ప్రేమ కథలలో ఆ కొత్త ప్రేమను ఆసక్తిగా, ఆశగానూ చూసే వాళ్ళు ఆ భార్య కోణంలోంచి మాత్రం ఆలోచించరు. ఆమె పడే బాధ చాలా మంది ఆధునికులు పట్టించుకోరు. ఎవరితో తాను జీవితాన్ని నిర్మించుకుందో ఆ వ్యక్తి మరొకరి సొంతం అవుతున్నాడని తాను పరిత్యజితను అని ఆమెకు తెలిసాక ఆమె ఎంత వేదన పడుతుందో. ఈ వేదనే స్త్రీలను ఆగ్రహావేశాలకు గురి చేస్తుంది. ఆ ఆగ్రహంలో అసహాయత ఉంటుంది. అదే వారిని ఒంటరి చేస్తుంది. ప్రేమ గొప్పదే కాని కొన్ని జీవితాలను ఛిద్రం చేసి నిర్మించుకున్న ఆ ప్రేమ ఔన్నత్యం గురించి ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.
ఇలాంటి త్రికోణపు వివాహేతర ప్రేమలతో నిండి ఉన్న పాశ్చాత్య సమాజంలో ఓ పాట గత యాభై ఏళ్ళుగా సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ పాటలో తన భర్తను తనకు దూరం చేస్తున్న ఓ అందమైన యువతితో ఓ భార్య తనలోని వ్యథను విప్పి చెప్పుకుంటుంది. ఏ దేశంలోనయినా సంస్కృతిలోనయినా భార్య అనుభవించే అభద్రతా భావాన్ని ఈ గీతం ప్రదర్శిస్తుంది. మరో స్త్రీ కారణంగా భార్య స్థానంలో ఉన్న ఆమె ఎంతటి అనిశ్చిత ఎదుర్కోవలసి వస్తుందో ఆమె మనసు ఎలాంటి వ్యథకు లోనవుతుందో అర్థం చేసుకుంటే ఈ పాటలో ఆమె చేసే అభ్యర్థన కన్నీళ్లు తెప్పిస్తుంది.
Jolene, Jolene, Jolene, Jolene I’m begging of you, please, don’t take my man Jolene, Jolene, Jolene, Jolene Please, don’t take him just because you can
(జోలీన్, జోలీన్, జోలీన్, జోలిన్ నేను నిన్ను వేడుకుంటున్నాను, నా మగవాడ్ని తీసుకెళ్లకు. జోలీన్ జీలీన్, జోలీన్, జోలీన్ నీకది సాధ్యం అవుతుందని మాత్రం దయచేసి ఆ పని చేయకు)
జోలీన్ ఆ ప్రియురాలి పేరు. ఆ పేరును నాలుగు సార్లు ఉచ్చరిస్తున్నప్పుడు డాలి పార్టన్ గొంతులో ఎన్నో భావోద్వేగాలు పలుకుతాయి. పాటలో కూడా నాలుగు విధాలుగా ఆమె ఈ పేరు ఉచ్చరిస్తుంది. అందులో బాధ, అర్థింపు తప్ప కోపం కనిపించదు. ఆమె ఆ ప్రియురాలిని ఓ బిచ్చగత్తెలా అడుక్కుంటుంది. అతను నా మగవాడు. అతన్ని నాకు దూరం చేయకు అంటూనే నీకది సాధ్యం అవుతుంది అని నాకు తెలుసు. కేవలం నీకా శక్తి ఉందన్న ఒకే ఆధారంతో మాత్రం అతన్ని నా నుంచి తీసికెళ్ళిపోకు అంటుంది. తన భర్త జోలిన్ మోజులోనో ప్రేమలోనో ఉన్నాడని ఆమెకు తెలుసు. అతన్ని ఆమె నుంచి విడదీయగల శక్తి జోలిన్కి ఉంది అని ముందే ఆమె అంగీకరిస్తుంది. అందుకే తన భర్తను తనకు దూరం చేయవద్దని ఆమెను వేడుకుంటుంది
Your beauty is beyond compare With flaming locks of auburn hair With ivory skin and eyes of emerald green Your smile is like a breath of spring Your voice is soft like summer rain And I cannot compete with you, Jolene
(నీ అందం పోల్చడానికి సాధ్యం కానిది. ఎర్రటి జుట్టుతో కాంతులీనుతున్న జడపాయలతో మెరిసిపోతుంటావు నువ్వు. పసుపు రంగు నిగనిగలాడే శరీరంతో పచ్చల రంగు ఉన్న కను దోయితో, అద్భుత సౌందర్యం నీ సొంతం. నీ నవ్వు వసంతకాలపు ఊపిరిని తోడ్కొని వస్తుంది. నీ గొంతు ఎండాకాలపు వర్షాన్ని మోసుకు వస్తుంది. నేను నీతో పోటీ పడలేను జోలీన్.)
ఈ చరణం ఆ ప్రియురాలి అద్భుత సౌందర్యాన్ని వర్ణిస్తున్నా ఇందులో అంతులేని విషాదం ఉంది. ఆమె జోలీన్ సౌందర్యానికి ముగ్ధురాలయింది. అదే జోలీన్ శక్తి అని కూడా అంగీకరిస్తుంది. తన భర్త ఆ సౌందర్యానికి దాసుడయ్యాడని ఆమెను తెలుసు. తానే విధంగానూ జోలీన్తో పోటీ పడలేదు. ఎందుకంటే ఆమె లాంటి సౌందర్యం తనకు లేదు. ఈ వాక్యం దగ్గర ఆమె అసహాయత గుండెను మెలిపెడుతుంది. తోటి స్త్రీ తనకన్నా ఎంతో అందమైంది. భర్త ఆమె ప్రభావంలో ఉన్నాడు. జోలిన్ సౌందర్యం ముందు తాను నిలువలేదు. ఎంత అసహాయ స్థితి ఆమెది.
He talks about you in his sleep And there’s nothing I can do to keep From cryin’ when he calls your name, Jolene And I can easily understand How you could easily take my man But you don’t know what he means to me, Jolene
(అతను నీ గురించి నిద్రలో కలవరిస్తున్నాడు. అది విన్నప్పుడు మౌనంగా ఏడవడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను జోలీన్. అతన్నినాకు కట్టిపడేసుకోవడానికి నా దగ్గర శక్తి లేదు. నాకు అర్థం అవుతుంది, నువ్వు నా మగవాడ్ని ఎంత సులువుగా తీసుకెళ్ళిపోగలవో. కాని అతను నాకెంత ముఖ్యమో నీకు తెలీదు జోలీన్)
కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు నమ్ముకున్న భర్త మరో స్త్రీని నిద్రలో కలవరిస్తుంటే ఆమె ఎంత నరకం అనుభవిస్తుందో. తాను అశక్తురాలిని అని ఆమెకు తెలుసు. జోలిన్ చాలా విషయాలలో తన కన్నామిన్న అన్నదీ అంగీకరిస్తుంది. అందుకే మౌనంగా కన్నీళ్లు కార్చడం తప్ప ఏం చేయలేకపోతుంది. తన భర్తను జోలిన్ లాగేసుకోగలదని ఆమెకు తెలుసు. అది ఆమెను ఇంకా భయపెడుతుంది. అంత భయంలోనూ తన భర్త తనకు చాలా ముఖ్యం అని ఆమె జాలిగా జోలిన్తో చెబుతుంది. అతనితోనే ఆమె జీవితం. అతన్ని కోల్పోవడం అంటే జీవితాన్ని కోల్పోవడమే. ఇది జోలిన్కు చెప్పడం అంటే తనను తాను చిన్నబర్చుకోవడం. ఆమె దానికి కూడా సిద్ధపడుతుంది.
సాధారణంగా తన భర్త మరో స్త్రీ వెంట పడుతున్నాడంటే భార్య స్థానంలో ఉన్న స్త్రీకి కోపం వస్తుంది. దానితో ఆమె విచక్షణ కోల్పోతుంది. కాని ఇక్కడ ఈమె జోలిన్ అందాన్ని, శక్తిని, తన భర్తపై ఆమెకున్న ప్రభావాన్ని ఒప్పుకుంటూ నేను నీతో ఏ వీషయంలో సమానం కాదు. కానీ అతను నా సర్వస్వం. అతన్ని కోల్పోవడం నాకెంత కష్టమో నీకు తెలియదు. అతను నా మనిషి అతన్ని నాకు దూరం చేయకు అని ఆమెను అర్థిస్తుంది. ఇందులో ఆమె అసహాయత, భర్త తనకే సొంతం అవ్వాలన్న కోరికతో పాటు ఆమె మంచితనం కూడా కనిపిస్తుంది.
You could have your choice of men But I could never love again He’s the only one for me, Jolene I had to have this talk with you My happiness depends on you And whatever you decide to do, Jolene
(నీవు కావలసిన మగవారిని ఎన్నుకోగలవు. కాని నేను మరెవరినీ ప్రేమించలేను. నాకు అతనొక్కడే జోలీన్. నీతో ఈ సంభాషణ నాకు చాలా అవసరం. నా ఆనందం నీ పై ఆధారపడి ఉంది. ఇక నువ్వేం నిశ్చయించుకుంటావో నీ యిష్టం జోలీన్)
జోలిన్ అందగత్తె, వివాహం కాలేదు. కాబట్తి ఆమెను కోరే ఎందరో మగవాళ్లు ఉంటారు. తన జీవిత భాగస్వామిని ఎన్నుకోగల అవకాశం ఆమెకు ఉంది. కాని ఈమెకు భర్త తప్ప మరెవ్వరూ లేరు. ఆమె మళ్ళీ వివాహం కూడా చేసుకోలేదు. అందుకే జోలిన్తో ఆమె మనసు విప్పి మాట్లాడుతుంది. ఈ సంభాషణ ఆమె జీవితానికి చాలా అవసరం. అంతా విని జోలిన్ తీసుకునే నిర్ణయం మీదే ఆమె జీవితం, ఆనందం ఆధారపడి ఉన్నాయి. ఆమె ఆనందం జోలిన్ తీసుకునే నిర్ణయంపై ఉంది.
Jolene, Jolene, Jolene, Jolene I’m begging of you, please, don’t take my man Jolene, Jolene, Jolene, Jolene Please, don’t take him even though you can
ఈ పాట ఎన్నో విషయాలను చర్చకు తీసుకొస్తుంది. భర్తతో కట్టుబడి ఉన్న స్త్రీ అసహాయత. అతని ఎంపికపై ఆధారపడి ఉన్న ఆమె సుఖం. వివాహంలో ఆకర్షణ తగ్గి పురుషుడు మరో స్త్రీ వెంటపడితే దాని వల్ల కుదేలయ్యేది భార్య పరిస్థితే. ఆమె జీవన పునాదులు కదిలిపోతాయి. అప్పటి దాకా ఒక గాడిలో నడిచిన ఆమె జీవితం హఠాత్తుగా మారిపోతుంది. పైగా ఆమె పెట్టుబడి పెట్టిన జీవితకాలం, మనసు, భావోద్వేగాలు అన్నీ పనికిరానివిగా మారిపోతాయి. భర్తని మరో స్త్రీతో పంచుకోవడం ఒక స్థితి, అతను పూర్తిగా మరో స్త్రీ అధీనం అవుతూ ఉంటే ఒంటరిగా మిగిలిపోవడం ఇంకో స్థితి. రెంటిలోనూ జీవితకాలం గాయాల పాలయ్యేది ఆ భార్యే. జోలీన్ పరంగా ఆమె కారణాలు ఆమెకు ఉండవచ్చు. ఆ భర్తకుండే కారణాలు అతనికి ఉండవచ్చు. కాని ఇందులో పూర్తిగా నష్టపోయేది ఆ భార్య. ఆమె అనుభవించే ఆ అసహాయతను చాలా గొప్పగా గానం చేసింది డాలీ పార్టన్.
ఈ పాట వెనుక ఒక నిజ జీవిత గాథ ఉంది. ఒక ఎర్ర జుట్టు ఉన్న అమ్మాయి డాలీ పార్టన్ భర్త కార్ల్ డీన్‌తో చనువుగా ఉండేదట. అది కలిగించిన బాధలోనించి ఈ గీతం పుట్టింది. అయితే ఒకసారి డాలీ ఆటోగ్రాఫ్ కోసం వేదికపైకి వచ్చిన ఓ యువ అభిమాని తన పేరు జోలిన్ అని చెప్పినప్పుడు డాలికి ఆ పేరు నచ్చి దాన్ని గుర్తుపెట్టుకుంది. తరువాత ఈ పాట రాస్తున్నప్పుడు ఓ పేరు అవసరం అయి జోలిన్ అనే పేరుతో పాట పూర్తిగా ఒక సిటింగ్‌లో రాసుకుంది.
సంగీత విమర్శకులు ఈ పాటను కంట్రీ గీతాలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా చెప్తారు. ఇది 2004లో రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ ‘ఆల్ టైమ్ 500 గ్రేటెస్ట్ సాంగ్స్’ జాబితాలో 217వ స్థానంలో నిల్చింది. 2021లో ఈ జాబితాను సవరించగా ఇది 63వ స్థానంలో చేరింది. ఇది UKలో కూడా సింగిల్‌గా విడుదలయి, పార్టన్ మొదటి టాప్ టెన్ హిట్ సాంగ్‌గా నిలిచింది, ఇది 1976లో UK సింగిల్స్ చార్ట్‌లో ఏడవ స్థానానికి చేరుకుంది. 2014లో గ్లాస్టన్బరీ ఉత్సవంలో పార్టన్ ప్రదర్శన ఇచ్చినప్పుడు కూడా ఈ పాట చార్ట్ లోకి తిరిగి ప్రవేశించింది. జనవరి 2017 నాటికి యుకెలోనే ఈ పాట 255,300 డిజిటల్ కాపీలు అమ్ముడయ్యాయి. దీన్ని ఇంగ్లీషు స్పానిష్ భాషల్లోనూ ఎందరో తరువాతి తరం గాయకులు గానం చేసారు. వివాహేతర సంబంధాలు అతి సాధారణం అవుతున్న ఈ రోజుల్లో కూడా అంతర్జాతీయంగా ఈ పాట చాలా మంది ఇష్టపడే గీతంగా నమోదయింది.
డాలీ పార్టన్ ప్రదర్శనలలో ఈ పాట లేకుండా ఉండదు. అంతగా జనం మెచ్చిన ఈ గీతంలోని విషాదానికి కనెక్ట్ కాని స్త్రీలు ఉండరేమో.
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
You must be logged in to post a comment.
ఓ అద్భుత లోకంలోకి ప్రయాణం – ‘పాడుతా… తీయగా’ పఠనం!
కలయో వైష్ణవ మాయో???
నీలమత పురాణం – 17
సంచిక – పదప్రహేళిక- 4
నూతన పదసంచిక-91
స్నిగ్ధమధుసూదనం-7
తందనాలు-12
పరిష్కారం
సిరివెన్నెల పాట – నా మాట – 23 – ‘సంతోషం’ విలువను ప్రకటించే పాట
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-47
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®