అర్థం చేసుకుంటే
అందరం సేఫ్…
అలసత్వం చూపిస్తే
అంతా గల్లంతే…!
అతిగా చెబితే….
భయపెడుతున్నారంటారు,
అంతంత మాత్రం చెబితే,
ముందుచూపు
లేదంటారు…
ప్రభుత్వం,
ప్రకటనలు చేస్తే,
వేళాకోళంగా
తీసుకుంటారు.
మిడి.. మిడి.. జ్ఞానం
వేదాంతులు చేప్పే,
వదంతులకు మాత్రం,
వినయంగా…
విలువనిస్తారు!
ప్రస్తుతానికి-
మందులు మాకులులేని
కరోనా వైరస్ అంటువ్యాధిని,
అరికట్టడానికి
ఉన్నది ఒకటే మార్గం!
మనిషికీ మనిషికీ
భౌతిక దూరం ఆవశ్యం,
పిల్లలు వృద్ధులు
ఇంటికి అంకితం కావడం,
ఆరోగ్యకరం…!
సామాజిక బాధ్యతలకు
ప్రాధాన్యతనిచ్చి,
తీసుకోవాల్సిన జాగ్రత్తలను,
పటిష్టంగా పాటించగలగడమే,
మన ముందున్న కర్తవ్యం!
చిన్న.. చిన్న.. అసౌకర్యాలకు,
మంచి మనసుతో
సహకరించడం మన విధి!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.