Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కళాశాల గోడలపై విచిత్రమైన పురుగు

[డా. సవేర (డా. ఎస్. వి. రమేష్ కుమార్) గారు రచించిన ‘కళాశాల గోడలపై విచిత్రమైన పురుగు’ అనే కవితని అందిస్తున్నాము.]

1.
మన కళాశాల గోడలపై
ఓ విచిత్రమైన పురుగు
పాకుతూ వుంటుంది
దాంతో జాగ్రత్తగా ఉండాలి!

2.
అది ఆ తరగతి గది మూలల్లోగాని
ప్రయోగశాల మెట్ల మీద గానీ
మన కోసం ఎదురుచూస్తూవుంటుంది
దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి!

3.
అది అందంగా ఉంటుంది
ఆకర్షణీయంగా ఉంటుంది
నిన్ను నన్ను వెంబడిస్తుంది
దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి!

4.
అది కన్నులతో మాట్లాడుతుంది
తియ్యటి మాటల్తో కాటేస్తుంది
తర్వాత మన మనసు పిచ్చిదవుతుంది
అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి!

5.
ఆ పురుగుకాటుకు గురైనోళ్ళు
భ్రమల్లో బ్రతుకుతుంటారు
లక్ష్యాల్ని మరిచిపోతుంటారు
అందుకే మనకు మనమే కాపలా ఉండాలి!

6.
ఆ పురుగుకాటు నుంచి తప్పించుకున్నోళ్ళు
విజేతలుగా విజయగర్వంతో నిలబడ్డారు
నవ్వుతూ సగౌరవంగా జీవించారు
అందుకే ఆ పురుగుతో జాగ్రత్తగా ఉండాలి!

(కళాశాల దశలో ప్రేమలో పడి, లక్ష్యాల్ని మధ్యలో వదిలి, ఎటూకాకుండా పోతున్న కొంతమంది విద్యార్థుల్ని చూసి బాధతో..)

Exit mobile version