Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాలేజ్ బుల్లోడు

[శ్రీ జి.వి. కళ్యాణ శ్రీనివాస్ రచించిన ‘కాలేజ్ బుల్లోడు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

బేగంపేటలో ఉన్న ‘విక్టోరియా గ్రాండ్ హోటల్’ రూమ్ నంబర్ 108   మద్యం వాసనతో నిండిపోయింది.

సాయంత్రం ఏడున్నర దాటింది. హోటల్ గది మధ్యలో టేబుల్ మీద రాయల్ చాలెంజ్ బాటిల్, గోల్డెన్ డక్ విస్కీ, పక్కన సోడా, కాజూ, సిగరెట్ యాష్ ట్రే అంతా ఒకటిగా గజిబిజి అయిపోయి ఉన్నాయి.

ఆ హోటల్ గోడకు దగ్గరగా టేకు చెక్కతో చేసిన సోఫాలు ఉన్నాయి. వాటి మీద కాటన్‌తో నింపిన పరుపులు, వెల్వెట్ కవర్లు మెరిసిపోతున్నాయి. ఎవరైనా కూర్చుంటే లోపలికి ఒత్తుకుపోతూ పాలనురుగులో తేలిపోతున్నట్టు ఉంటాయి.

ఒకపక్క గోడకు, రోజ్‌వుడ్ ఫ్రేమ్‌తో అందంగా నగిషీలు చెక్కి దర్పంగా ఉన్న ఫ్రేమ్ మధ్యలో అభయహస్తంతో నిలువెత్తు వెంకటేశ్వరస్వామి చిత్రం హుందాగా కనపడుతున్నది. అక్కడే స్టాండ్ మీద శ్రీగంధంతో చేసిన అగరబత్తి వెలిగించి ఉన్నది. దాని పొగ అంతా ఆ గది నిండా నిండి సుగంధాన్ని మద్యం వాసనా కలిపి నింపుతోంది. గోడకు వ్రేలాడుతున్న క్యాలెండరు ఆ రోజు తేదీ నవంబర్ 2, 1970 అని చూపిస్తోంది.

ప్రొడ్యూసర్ అనంత చౌదరి తనకోసం ప్రత్యకంగా ఆ గదిని తయారు చేసుకున్నాడు. సంవత్సరం పొడుగూతా అక్కడే కథల చర్చలు జరుగుతాయి. చౌదరి గారు సోఫాలో వెనక్కి వాలి, ప్యాంటు బటన్ కొద్దిగా లూజ్ చేసి, గ్లాసులో సగం విస్కీ పోసుకున్నారు. మద్రాస్ మౌంట్ రోడ్‌లో, ఆండ్రసన్ టైలర్ దగ్గర కుట్టించిన ఖరీదైన బట్టల్లో అయన మెరిసిపోతున్నారు.

“కుందన్ రావ్.. దొరబాబు గారు అడిగిన సీన్ గురించి విన్నావా?” అన్నారు గ్లాస్ ఊపుతూ.

“ఏది సార్.. కొండ మీద నుంచి తోసే సీనా?”

“అదే మరి! నిన్న రాత్రి మూడుగంటలకు ఫోన్ చేసాడు. ‘నేను విలన్‌ని అలా మాములుగా తోసేస్తే నా అభిమానులు ఏం అనుకుంటారు?’ అంటున్నాడు.”

కుందన్ రావ్ భయంతో కుర్చీ నుంచి సగం లేచాడు.

“ఏంటి సార్, ఆ సీన్ తీయకపోతే క్లైమాక్స్ ఏం అవుతుంది?”

చౌదరి గారు వస్తున్న ఏడుపును ఆపుకుంటూ, రాని నవ్వును తెప్పించుకుంటూ “దొరబాబు గారు చెప్పినట్టు చేస్తేనే.., లేకపోతే మన సినీ జీవితానికి ఈ సినిమానే క్లైమాక్స్ అవుతుంది!” అంటూ గ్లాస్లో మిగిలిన విస్కీ ఒకే గుక్కలో తాగేశారు.

“ఆ చివరి సీన్‌లో భూపాలరావును, కొండమీద నుండి ఒకేసారి నెట్టేయకుండా, భూపాలరావును చచ్చే దాకా కొట్టి, అప్పుడు పైనుండి తోస్తే.. అప్పుడు.. పోలీసులు వచ్చి భూపాలరావును తీసుకుపోవాలి అంటున్నాడు” చెప్పారు అనంత చౌదరి గారు.

“అవునా?” అన్నాడు కుందన్ రావ్.

“అవును నువ్వు అలానే తియ్యాలి. అంతే కాదు, అలా, కాలితో తంతున్నప్పుడు, తానూ వెటకారంగా ఒక పాట కూడా పాడుతూ, స్టెప్స్ వేస్తూ తంతుంటే ‘ఆ సీను, తన ఇమేజ్ పండుతాయి’ అంటున్నాడు” చెప్పటం పూర్తి చేశారు అనంత చౌదరి గారు.

“అవునవును. అయన చెప్పినట్టు తీస్తే ఆ సీను అదిరిపోతుంది, 786 సినిమాల అనుభవం” అన్నాడు కుందన్ రావ్.

“అవును కుందన్ రావ్. ఇది దొర బాబు గారి 786వ సినిమా. రూపాయి పెడితే 1000 వచ్చే పరిస్థితి. అయన ఏది చెపితే అలా మార్చి పారెయ్” అన్నారు చౌదరి గారు వేళ్ళ మధ్య కొత్తగా వెలిగించిన 555 సిగరెట్ నలుపుతూ.

అయన తన బాధను పైకి కనపడనియ్యకుండా జాగ్రత్త పడుతున్నారు.

పైకైతే అన్నాడు కాని లోపల ‘ఈ దెబ్బతో ఇది కనక పోతే నేను మద్రాస్ బీచ్ దగ్గిర శెనక్కాయలు అమ్ముకోవాలి’ అనుకున్నారు.

కుందన్ రావ్ అనంత చౌదరి ముఖం లోకి చూడకుండా, మరో పెగ్గు నీళ్లు కలపకుండా గబుక్కన గొంతులోకి పోసుకున్నాడు.

“అది సరే ఇంతకూ, ఆ కవికి, రైటర్‍కు చెప్పావా?” అడిగారు అనంత చౌదరి.

“ఎప్పుడో!! ఈపాటికి రావాలి!!” అన్నాడు కుందన్ రావ్.

కాసేపట్లో కవి, రైటర్ వచ్చారు.

కవి వస్తూనే తన ప్రతిభ చూపుతున్నట్టు గుమ్మం దగ్గిరనుండే, “నీ గుండెల్లో గునపం, నీ కంట్లో గుండుసూది, నేనంటే ఏమనుకున్నావ్, సింహాలకు సింహాన్ని, పులుల్లో పులిని” అంటూ పాడుతూ వచ్చాడు.

ఆ పాట వినగానే కుందన్ రావ్‌లో కొత్త ఉత్సాహం ఉరకలు వేసింది.

“రా రా కవి..!! బాగుంది బాగుంది.. ఇదేనా మనం రికార్డు చేసే పాట” అన్నారు అనంత చౌదరి.

“అవును అండి, ఈ పాటతో దొరబాబు గారి మనసు ఉప్పోగుతుంది. ఆయన ఈ పాటకు స్టెప్పులు వేస్తే, ఇక చూసుకోండి.. నేల టికెట్ నుండి, బాల్కనీ వరకూ మంత్రముగ్ధులు అవుతారు, ఊగి పోతారు అంటే నమ్మండి” అన్నాడు.

“ఊగటం వరకూ ఓకే, పోకుండా చూడు” అన్నారు చౌదరి.

“ఈ.. హి.. హి” అంటూ కవి, కుందన్ రావ్ పళ్ళు బయట పెట్టి నవ్వారు.

షూటింగ్‌తో పాటు అన్ని ప్రొడక్షన్ పనులు ఐపోయి మరో రెండు వారాల తరువాత సినిమా ప్రివ్యూ షో కు డేట్ ఫిక్స్ అయింది.

 రిలీజ్ డేట్ మారినందుకు హీరో దొరబాబు గారు కొద్దిగా చిరాకు పడ్డా, తానే కథ మార్చినందుకు ఎక్కువ గొడవ పెట్టుకోకుండా అప్పటికి సరిపుచ్చుకున్నాడు.

ప్రొడ్యూసర్, డైరెక్టర్ బతుకు జీవుడా అని కుదుటపడ్డారు.

***

‘భూపాలరావు సైన్స్ అండ్ ఆర్ట్ కాలేజి’.

ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక కాలేజ్.

కాలేజి గేట్ ముందు ఇంపాలా కార్ ఆగి ఉంది.

ఒక చేతిలో పట్టే సైజులో ఉన్న చిన్న పుస్తకంతో రాము ఆ కారుకు అనుకుని నిలబడి వున్నాడు.

అతని కళ్ళు ఆత్రంగా కాలేజీ గేట్ వంకా, దానికి ఎదురుగా కాలేజీ లోకి దారి తీసే రోడ్ వంకా కదులుతున్నాయి.

ఇంకా ‘వాచ్‌మన్ రంగయ్య’ గేట్ తీయలేదు. పక్షులు ఇంకా గూళ్ళ నుండి నిద్ర లేవలేదు.

ఊరు తెల్లారక ముందే రాము తన ఇంపాలా కార్‌తో అక్కడికి వస్తాడు అని ఆ వీధిలోని ప్రతి కుక్కకు తెలుసు. దూరం నుండి రంగయ్య డొక్కు సైకిల్ సౌండ్ విని రాము కళ్ళు ఆనందంతో మెరిసాయి.

“రంగయ్య వస్తున్నాడు,”

“రంగయ్య వస్తున్నాడు,”

“నేను త్వరగా BA పూర్తి చెయ్యాలి”

చిన్న పిల్లవాడి లాగా పుస్తకాన్ని ఒక పక్క పంటితో చిన్నగా కొరుకుతూ, వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మనసులో కాక బయటకే అనుకున్నాడు రాము.

రంగయ్య సైకిల్ నేరుగా రాము ఇంపాలా కార్ ముందు ఆపాడు.

“ఏమిటి బాబు అప్పుడే వచ్చేశావు?”

రామూ ఎప్పుడు అలానే వస్తాడని తెలిసినా, రంగయ్య రామును తన అలవాటుగా మళ్ళీ అడిగాడు.

“నీకు చదువంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు బాబు.” మళ్లీ తానే అన్నాడు.

“పూర్తి చేస్తావు బాబు.. నువ్వు తప్పకుండా BA పూర్తి చేస్తావు,” అంటూ పంచె కింద ఉన్న చారల నిక్కరు జేబులోనుండి తాళాల గుత్తి తీసి గేటువైపు నడిచాడు రంగయ్య.

రంగయ్య, తన కళ్ళలో ఉబికి వస్తున్న నీటిని అదిమి పెట్టి ఆపుకుంటున్నాడు.

రాము వెనక నుండి రంగయ్యను చూస్తూ, ఏదో చెప్పాలని తపన పడుతూ చెయ్యి చాపాడు.. మళ్ళీ తనను తాను అదుపు చేసుకున్నాడు.

తాళం తీస్తూ, రంగయ్య వెనక్కి తిరిగి..

“బాబు నీకు ఈ BA చదువు, ఆ ఇంపాలా కారు ఎందుకు ఇష్టమో నాకు తెలుసు. మీ అమ్మ కూలి నాలి చేసుకుని ఇంత పెద్దవాడిని చేసి చదివిస్తున్నది అని, ఆ చదువును, నీ తండ్రి గుర్తుకు, ఆయన ఉన్నప్పుడు కొనుక్కున్న ఆయన ఇంపాలా కారును నువ్వు ఇప్పటికీ వదలలేదు. నాకు అన్ని విషయాలు తెలుసు బాబు. తెలుసు.” అన్నాడు రంగయ్య.

రంగయ్య చూపించిన ఆప్యాయతకు, రాముకు దుఃఖం పెల్లుబుకు వచ్చింది. కాని రాముకు ఎలా చెప్పాలో చెలియటం లేదు.

“రంగయ్యా..!” అన్నాడు రాము, ఆర్ద్రత నిండిన స్వరంతో..

“బాబు, చెప్పు బాబు, నీకు ఏమి కావాలి?” అడిగాడు రంగయ్య.

“ఈ సంవత్సరం ఫీజ్ కట్టకపోతే నన్ను కాలేజి లోంచి పంపిచేస్తారు, అసలే ఈ ఏడాదితో నా చదువు ఐపోతుంది”, అంటూ గుక్క పట్టి బోరున ఏడుస్తూ రంగయ్యకు ముఖం చూపించలేనట్టు తల తిప్పుకున్నాడు.

రంగయ్య ముసిముసిగా నవ్వుతు, “రాము బాబూ, నాకు తెలియని ఖర్చులా నీవి? మీ ఇంట్లో మీ నాన్నగారు ఉన్నపుడు కుక్కలా కాపలా కాసాను. నన్ను అయన ఎంత ప్రేమగా చూసుకున్నారో? ఆ విశ్వాసం ఇప్పటికి ఉంది బాబు..! ఆయన లేకపోయినా అయన నాకు ‘ట్రైనింగ్ ఇచ్చిన విశ్వాసం’ ఇంకా నా దగ్గిర ఉంది బాబు. ఇదిగో నీ కాలేజి ఫీజ్” అంటూ 12 రూపాయలు రాము చొక్కా జేబులో బలవంతంగా పెట్టాడు.

రాముకు మరోసారి చాలా దుఃఖం వచ్చింది.

ఒక్క ఉదుటున ఆప్యాయంగా రంగయ్యను హత్తుకున్నాడు. రంగయ్య కూడా రామును హత్తుకున్నాడు.

వాళ్లిద్దరు ఆ స్థితిలో ఉండగా..

“మీ ఇద్దరి ఆప్యాయతలు మాకు తెలియనివి కావు” వెనక నుండి రామనాధం మాస్టారు మాటలు వినబడ్డాయి.

రామూ, రంగయ్య ఇద్దరూ, రామనాధం మాస్టారుని చూసి సిగ్గుతో ముసి ముసి నవ్వులు నవ్వారు. రామూ, రంగయ్య ఇద్దరూ.. కొన్ని సెకనుల ముందు వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ కాలేజి లోకి కదిలారు.

రామనాధం మాస్టారు గారు వెనుక నుండి వెళుతున్న రామును చూస్తూ “బ్రిలియెంట్” అన్నారు.

అయన కళ్ళలో కూడా సన్నని నీటి పొర తళుక్కున మెరిసింది. ఆయనకు కూడా రాము అంటే అభిమానం.

అలా ఆ ఊళ్ళో, ఆ కాలేజీలో రాము అంటే ఇంకా ముగ్గురు, నలుగురికి అభిమానం ఎక్కువ.

వాళ్లకు రాముని చూసినపుడెల్ల అలా కళ్ళలో నీటి పొరలు వస్తాయి.

***

“అమ్మా నేను వచ్చేశానమ్మా!” రాము పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది జానకమ్మ. వెనక్కి తిరిగి చూసే సరికి, రాము గుమ్మం దగ్గిర నిలబడి వున్నాడు ముసి ముసిగా నవ్వుతూ.

“హమ్మా!” మళ్ళీ అన్నాడు, ఈసారి మరింత అనునయంగా.

“బాబు వచ్చావా?” జానకమ్మ పరుగున వెళ్లి రాము గుండెలమీద తల తలపెట్టి ఆనందంగా నవ్వుతోంది.

ఆమెకు కన్నీళ్లు ఆగటం లేదు. రెండు బుగ్గలు ధారాపాతంగా వస్తున్న కన్నీటితో తడిసిపోయాయి. ఎంతగా తడిసాయి అంటే రాము చొక్కా కూడా తడిసింది.

రాము ఇది గ్రహించి.. తల్లి గడ్డం పట్టుకుని ఆప్యాయంగా “ఏమిటి అమ్మా ఇది.. మళ్ళీ ఏడుస్తున్నావు?” అన్నాడు.

జానకమ్మ నవ్వింది. ఈ సారి ఆమెకు కన్నీళ్లు రాలేదు.

“లేదు నాయనా, ఇవి ఏడుపు వల్ల వచ్చిన కన్నీళ్లు కాదు. ఆనందంతో వచ్చిన కన్నీళ్లు” అంది.

రాము మళ్లీ అన్నాడు.. “హమ్మా! ఎందుకు ఈ సంతోషం?”

“ఇందాక రంగనాధం మాస్టారు గారు కనపడ్డారు. ఆయనకు నీ కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారుట, నువ్వు అన్నింటిలోను ఫస్ట్ వస్తున్నావు అని, తండ్రికి తగ్గ కొడుకు అని, వాళ్ళ నాన్న ఉంటే ఇదంతా చూసి సంతోషించేవారు అని , ఇంకా వగైరా, వగైరా చాలా చెప్పారు. నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు జానకమ్మ అంటుంటే.. నా మనసు ఎంతో ఉప్పోగింది అనుకో, అదిగో అదే ఈ కన్నీటికి కారణం” జానకమ్మ తాను విన్నది, అనుకున్నది అంతా చెప్పింది.

అంతలోనే ఆమె కళ్ళు భయంతో పెద్దవి అయ్యాయి.. పెదవులు చిగురుటాకులా వణికాయి.

“రంగనాధం మాస్టారు గారు మరో మాట కూడా చెప్పారు బాబు” అన్నది జానకమ్మ..

“హేమిటమ్మా అది?” అడిగాడు రాము..

“భూ..పా..ల.. రా..వు.”.. వత్తి వత్తి పలికింది పేరు.

“ఆ భూపాలరావుతో మాత్రం జాగ్రత్త అని మరీ.. మరీ చెప్పారు బాబు. అందులో, నువ్వు అయన కాలేజీ లోనే చదువుతున్నావు. నువ్వు మరింత జాగ్రత్త గా ఉండాలి సుమా అని కూడా చెప్పారు.”

ఏదో చిత్రమైన శబ్దం వస్తే జానకమ్మ రాము వంక చూసింది. రాము కోపంగా పళ్ళు నూరుతున్నాడు. అది పళ్ళు నూరగా వస్తున్న శబ్దం అని తెల్సి మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది జానకమ్మ.

“బాబు నువ్వు ఆ భూపాలరావు జోలికి వెళ్ళకు. మీ నాన్న ఆస్తి అంత దోచుకుని ఆ కాలేజీ కట్టాడు, మేడలు మిద్దెలు కట్టాడు. నువ్వు ఈ వూళ్ళో ఉన్న ఆ కాలేజీ లోనే చదువుతున్నావు. జాగర్త” హెచ్చరించింది!!

“హమ్మా! నీకు తెలుసు నేను పట్నం వెళ్లకుండా మన ఊళ్ళో వున్నా ఈ కాలేజీలో ఎందుకు చదువుతున్నానో? నీకు తెలుసు నేను నీకు ఇచ్చిన నా మాట. నీకు తెలుసు మన ఆస్తి కాజేసిన కారణంగా నాన్నగారు గుండె పోటుతో మరణించారని. దెబ్బకు దెబ్బ, తప్పుకు తప్పు..” అంటూ, రాము ఎడమ చెయ్యి పిడికిలి బిగించి గాల్లోకి లేపి పళ్లతో పిడికిలిని కొరుకుతూ.. “లెక్క కట్టి మన ఆస్తిని తిరిగి వెనక్కి భూపాలరావు నుండి తీసుకుంటాను” అని వస్తున్న దుఃఖాన్ని, కోపాన్ని ఆపుకుంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు.

జానకమ్మ రెండు చేతులు గాల్లో ఊపుతూ, “నాకు తెలుసు బాబు, నా బంగారు కొండ ఒకసారి అన్న మాట తప్పడు, తండ్రిని మించిన తనయుడు” అని అంది.

మళ్ళీ ఆమెకు కన్నీళ్లు రావటం మొదలు అయ్యింది. రాము జానకమ్మని గుండెకు హత్తుకున్నాడు.

“అమ్మా!” అన్నాడు తల పైకెత్తి కళ్ళు మూసుకుని.. తన్మయత్వంగా.

“నువ్వు ఎప్పుడూ అంతే అమ్మా, ప్రేమ అంతా అన్నకేనా.. నాకేమి లేదా?” అన్నది, వెనక నుండి సుశీల. సుశీల రాముకు ఒక్కగానొక్క చెల్లెలు. చాలా చలాకీగా ఉంటుంది. తాను ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం.

జానకమ్మ, రాము ఇద్దరూ సుశీల బంగమూతిని చూసి మురిసిపోయారు.

రాము తన రెండు అరచేతులతో, సుశీల ముఖాన్ని పొదవి పట్టుకుని, “సుశీ.. అదేమిటమ్మా.. ఈ అన్న బతుకుతున్నదే నీ కోసం, నువ్వు నా బంగారు తల్లివి అమ్మా” అన్నాడు.

“అన్నా!”

అలా పిలుస్తున్నప్పుడు సుశీలకు కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి.

మళ్ళీ అంది “అన్నా!” అని. ఈసారి కొద్దిగా తక్కువగా కన్నీళ్లు వచ్చాయి.

“ఇక చాలు మీ అన్నా చెల్లి ఆప్యాయతలు. నడవండి భోజనం చల్లారిపోతుంది” అని అంటూ కళ్ళు ఒత్తుకుంటూ జనకమ్మ వంటింటి వైపు నడిచింది.

రాము చెల్లిని పొదవి పట్టుకుంటూ, వంట ఇంటి వైపు నడిచాడు.

***

రాణి పార్క్‌లో అటు ఇటు తిరుగుతోంది రాణి. మధ్య మధ్య తన వాచీ వంక చూసుకుంటున్నది. ‘ఈ మగ మహారాజు ఎప్పుడూ లేటే’, మనసులో అనుకునే మాటను పైకే అనేసింది.

ఆమెకు తెలియదు, రాము చెట్టు కొమ్మ చాటు నుండి ముఖం కనపడకుండా రెండు, మూడు ఆకులూ అడ్డం పెట్టుకుని రాణినే చూస్తున్నాడని.

రాణి అటు వైపు తిరగగానే గబా గబా వెళ్లి ఆమె రెండు కళ్ళు మూసాడు.

“నేను ఎవరో కనుక్కో?” అన్నాడు.

రాణి ఏమి మాట్లాడకుండా రాము రెండు చేతులు తీసి బుంగ మూతి పెట్టి తల ఒక పక్కకు పెట్టి, “నేను నీతో మాట్లాడాను. ఇప్పుడా రావటం? ఎప్పటినుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా?” అన్నది.

“ఐ.. అం.. సో.. సారీ.. రాణీ, నా ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ పేపర్‌లో చూసుకుని వచ్చే సరికి కొద్దిగా లేట్ అయ్యింది” అన్నాడు రాము.

“రిజల్ట్స్ వచ్చాయా? నీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏమయ్యాయి?” అని కళ్ళు పెద్దవి చేసి, రెప రెప లాడిస్తూ, గెడ్డం మీద చూపుడు వేలు పెట్టి చిత్రంగా అడిగింది.

“ఏమో తెలియదు!” అన్నాడు అటు తిరిగి, చేతులు వెనక్కి పెట్టి మూసి మూసి నవ్వులు నవ్వుతూ రాము.

“నాకు తెలియదు అనుకోకు, నేను కాలేజీ బోర్డులో నీ రిజల్ట్స్ చూసి మనం ఎప్పుడు కలుసుకునే ఈ ప్లేస్‌కు నీకన్నా ముందు వచ్చాను. నువ్వు కాలేజీ ఫస్ట్ వచ్చావు” అన్నది రాణి.

“ఈ విషయం విని అత్తయ్య ఎంత సంతోషిస్తుందో?!!” అన్నది తనే మళ్ళీ.

“ఇంకా అమ్మకు చెప్పలేదు రాణి” అన్నాడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు రాము.

“ఇంకా పై చదువులు చదువుతావా?” అడిగింది రాము భుజాల చుట్టూ చేతులు వేస్తూ.

“లేదు రాణీ.. ఉద్యోగం చెయ్యాలి. చెల్లిని ఒకయ్య చేతిలో పెట్టాలి. ఈ అమ్మాయి గారిని నేను ఎత్తుకు పోవాలి” అన్నాడు రాము, తన ముక్కు, రాణి ముక్కుతో పొడుస్తూ.

కిలకిలా నవ్వింది రాణి.

రామూకు రాణికి తెలియని విషయం.. రెండు కళ్ళు చెట్టు చాటునుండి వాళ్లనే గమనిస్తున్నాయని, రెండు చెవులు వాళ్ళ మాటలనే వింటున్నాయని.

***

“నా చెల్లెల్ని కులాంతర వివాహం చేసుకున్నాడన్న ఒక్క కారణంగా మా బావను ఊళ్ళో చంపకుండా వదిలిపెట్టాను. ఊళ్ళో విప్లవం తీసుకొస్తున్నాడు అని తెలిసి కుటుంబాన్ని బతకనివ్వను అని బెదిరించి వాళ్ళ కున్న ఆస్తి అంతా ఏదో విధంగా రాయించుకున్నాను” భూపాలరావు ఆవేశంగా అటూ ఇటూ నడుస్తూ చెప్పుకు పోతున్నాడు.

ఇంట్లో పనివాళ్లంతా.. భయంతో చేతులు కట్టుకుని, తలలు ఒంచుకుని ఒక పక్క గుంపుగా నిలబడి ఉన్నారు.

“తరువాత మనసు పెద్దది చేసుకుని.. ఏదో బతుకుతారు కదా అని వదిలేశాను. ఈ రాము గాడు నేను కట్టిన నా కాలేజీలో వాడి తల్లి, నా చెల్లి చదివిస్తుంటే పోనీలే అనీ వదిలేసాను. ఇప్పడు వచ్చి నా కూతురు రాణి మీదే కన్ను పడితే, వాడికి పుట్టగతులు ఉండనిస్తానా? నా చెల్లి జానకమ్మ, ఆ ఊరు పేరు లేని మా బావను పెళ్లి చేసుకున్నపుడే వాళ్ళతో నా బంధుత్వం తెగతెంపులు ఐపోయింది. ఇక ఇపుడు వచ్చి నా కూతురు ద్వారా తిరిగి బంధుత్వం కలుపుకుంటా అంటే సహించేది లేదు” అన్నాడు భూపాలరావు.

తనకు చెట్టు చాటు నుండి అంతా చూసిన, విన్న విషయాలను చెప్పిన తన అనుచరుడు జగ్గు దాదా చాలా వినయంగా తల ఊపుతున్నాడు. మధ్య మధ్య, భూపాలరావుతో సమానంగా ఆవేశపడుతున్నాడు. ఎంతగా ఆవేశపడుతున్నాడంటే, అతను ఆవేశం చూసినవాళ్లు ఎవరైనా రాణి అసలు భూపాలరావు కూతురో, జగ్గు కూతురో అర్థం కానంతగా. జగ్గుకు స్వామి భక్తి ఎక్కువ.

“ఇక ఇలా వదిలేస్తే రేపు నా జీవితాన్ని ఈ రాము గాడు కంట్రోల్ చేస్తాడు. అది జరగనివ్వను. ఇక నా ఆస్తికు తానే హక్కుదారునని కూడా అంటాడు. వెంటనే వెళ్లి ఆ జానకమ్మని, వాడి చెల్లి సుశీలను, పాలపిట్ట కొండ మీద గెస్ట్ హౌస్‌లో కట్టేయండి. ఆ రాముగాడు వచ్చేక ఏమి చేయాలో నేను చెపుతాను” అన్నాడు భూపాలరావు.

“అలాగే అయ్యా!” అన్నాడు వినయంగా జగ్గు దాదా.

జగ్గు దాదా ఇక అప్పటి నుండి ఆ పనిలో పడ్డాడు.

భూపాలరావుకు, జగ్గుకు మాత్రం ఒక విషయం తెలియదు.

వాళ్ళ చర్యలను రెండు కళ్ళు ఇందాక నుండి కిటికీ పక్క నుండి గమనిస్తున్నాయని, రెండు చెవులు వాళ్ళ మాటలు వింటున్నాయని.

***

“ఒక కాల్ చేసుకోవాలి” అన్నది రాణి పబ్లిక్ బూత్ దగ్గిర. ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క టెలిఫోన్ బూత్ అది.

“చేసుకోండి అమ్మా” అన్నాడు టెలిఫోన్ బూత్ అతను. భూపాలరావు కూతురు తన బూత్ నుండి ఫోన్ చెయ్యటం ఏమిటా? అని అనుకుంటూ.

రాణి నెంబర్ డైల్ చేసింది.

“రామూ! మా నాన్నకు మన విషయం తెలిసి పోయింది. అత్తయ్యను, సుశీలను పాలపిట్ట కొండ మీద వున్న గెస్ట్ హౌస్‌లో బంధించటానికి పన్నాగం పన్నుతున్నాడు మా నాన్న. అత్తయ్యకు, సుశీలకు జాగ్రత్త అని చెప్పు. అసలు బయటకు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పు” అంది రాణి గుక్క తిప్పుకోకుండా.

“అమ్మా, సుశీలా గుడికి అని చెప్పి ఇందాక అనగా వెళ్లారు. ఇంకా ఇంటికి రాలేదు. అదే నేను కంగారు పడుతున్నాను. అంటే!? మీ నాన్న భూపాలరావు అమ్మని, సుశీలను ఎత్తుకుపోయి ఉండవచ్చు. నువ్వు అక్కడే ఉండు. నేను వస్తున్నా!” అంటూ ఫోన్ క్రిడెల్ మీద పెట్టి కార్ స్టార్ట్ చేసాడు రాము.

తాను వెళ్లేసరికి, ఇంటికి కొద్ది దూరం లోనే వున్న టెలిఫోన్ బూత్ దగ్గిర రాణి వెయిట్ చేస్తూ ఉంది. రాము రాగానే రాణి కార్‍లో కూర్చుంది. రాము పాలపిట్ట కొండ వైపు కార్‌ను వేగంగా పోనిచ్చాడు.

రాణి కార్ ఎక్కటం, అంతకు ముందు ఫోన్‌లో మాట్లాడిన విషయాలు అన్ని రెండు కళ్ళు గమనిస్తున్నాయి, చెవులు వింటున్నాయి.

రాము, రాణి పాలపిట్ట కొండకు వస్తున్న సమాచారం భూపాలరావుకు అందించాడు బూత్‌లో పని చేస్తున్న ఆ వ్యక్తి.

***

భూపాలరావు సామ్రాజ్యం విశాలమైనది.

“వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. రా .. రా.. రాము, రా.. నీ కోసమే నేను ఇందాకటి నుండి వెయిట్ చేస్తున్నా. మీ నాన్న మా కుటుంబ పరువును, మర్యాదను పాడు చేస్తే, ఆ పాపానికి, మా నాన్న, మీ తాత గుండె ఆగి చచ్చాడు. నా చెల్లిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న పాపానికి, ఆస్తీ పాస్తీ లేకుండా చేస్తే ఆ దెబ్బకు గుండె రోగం వచ్చి మీ నాన్న చచ్చాడు. మీ అమ్మ కూలి నాలి చేసుకుని బతుకుతున్నా, మీ బతుకు మీరు బతుకుతున్నారు కదా అని వదిలి పెడితే, నా కూతురు కావలసి వచ్చిందా నీ బతుకుకు. అసలు నువ్వెంత? నీ బతుకెంత?.. ఇప్పుడు చూడు, నీ కళ్ళముందే నీ తల్లి, చెల్లి కుక్క చావు చస్తారు” అన్నాడు భూపాలరావు.

“భూ.. పా.. ల.. రా.. వ్..” కోపంగా అన్నాడు రాము.

“నా తండ్రిని చంపినా, నా తల్లికి అన్నవని, ఇంతకాలం నిన్ను సహించాను. ఇప్పుడు నా తల్లిని, చెల్లిని మట్టుపెట్టాలి అని చూస్తున్న నీ ఆటలు ఇక సాగనివ్వను” అన్నాడు రాము.

“ఛీ! నీ బీద బతుకుకి పౌరుషం ఒకటి..” అని రాముతో అని, “వాళ్ళిద్దరిని ఆ బాంబులతో పేల్చేయండి రా!” అనుచరులతో అన్నాడు భూపాలరావు.

రాము దవడ ఎముక బిగుసుకుంది. పిడికిళ్లు బిగించి – “భూ.. పా.. ల.. రా.. వ్.. నా తల్లికి అన్నవి అన్న ఒక్క కారణంగా నిన్ను ఇంత కాలం వదిలి పెట్టాను, ఇక నీ చావు నా చేతిలో మూడింది” అని ఒక్క అంగలో.. గాల్లో గిరికీలు కొడుతూ భూపాలరావు వద్ద దభేల్ అని పడ్డాడు రాము.

“అన్నా..” అంటూ వెర్రి కేక పెట్టింది సుశీల. “బాబూ” అంటూ అక్రోశించింది జానకమ్మ.

“ఇంకా చూస్తారు ఏమిటి పేల్చేయ్యండి” అన్నాడు భూపాలరావు.

జగ్గు డైనమేట్స్ పేల్చటం మొదలు పెట్టాడు. ఢాం!, .. ఢాం!, .. ఢాం!, .. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలుతున్నాయి.

రాము ఆ పేలుతున్న బాంబులను తప్పించుకుంటూ జానకమ్మ దగ్గరకు ఎలాగో అలాగ వచ్చాడు.

జగ్గు రామును వెనక్కు లాగుతున్నాడు. ఇద్దరు కింద పడి తెగ కొట్టుకుంటూ వున్నారు. ఒక్క దెబ్బకు జగ్గును ఎత్తి ఆ పేలుతున్న బాంబు మీద పడేసాడు రాము.

అది పేలింది. జగ్గు కూడా పేలిపోయాడు.

జానకమ్మ “బాబూ, .. బాబూ..” అని రెండు మూడు సార్లు అన్నది.

రాము జానకమ్మ కట్లు విప్పాడు. రాణి అక్కడకు చేరుకుని జానకమ్మని పక్కకు తీసుకుపోయింది.

ఈలోగా రాము సుశీల కట్లు విప్పబోయాడు. వెనక నుండి భూపాలరావు రాము తల మీద కొట్టాడు.

“హ.. బ్బా.. ఆ..” అంటూ రాము తలపట్టుకుని కింద కుప్ప కూలిపోయాడు.

భూపాలరావు అక్కడే ఉన్న సుశీల చెంప మీద ఈడ్చి కొట్టాడు. ఆ దెబ్బకు సుశీల అలానే నిలబడి మూర్ఛ పోయినట్టు నీలుక్కు పోయింది.

భూపాలరావు అక్కడే ఆగిన ఒక జీప్ లోకి ఎక్కి ‘నిలబడి నీలుక్కు పోయిన’ సుశీలను జీప్‌తో గుద్దేసే ప్రయత్నం చేస్తున్నాడు.

అంతలో రాముకు తల విదిలించి లేచి నిలబడ్డాడు. జీప్‌కు ఎదురుగా వెళ్లి రెండు చేతులతో జీప్‌ను ఆపాడు. పళ్ళు గిట్ట కరచి ఒక్క ఊపుతో జీప్‌ను వెనక్కి నెట్టాడు.

జీప్ దొర్లు కుంటూ కొండ మీద నుండి పక్కకు పడిపోయింది. భూపాలరావు పక్కకు దూకేశాడు.

రాము భూపాలరావు మీద పడి పిడి గుద్దులు గుద్దాడు. భూపాలరావు రొప్పుతున్నాడు. ఒక్కసారిగా జేబులోనుండి పిస్తోలు తీసాడు. గురి పెట్టి రాముని కాల్చాడు.

రాముకు ఆ పిస్తోలు గుండు తగల లేదు. తల తిప్పి చూసాడు. జానకమ్మ కుడి భుజానికి తగిలింది. జానకమ్మ రాము వంక చూస్తూ రామును ఆశీర్వదిస్తున్నట్టు చెయ్యి ఎత్తింది.

రాముకు మళ్ళీ దవడ ఎముక బిగుసుకుంది. ఇలా రెండు మూడు సార్లు పైగా దవడ ఎముక బిగుసుకుంది.

ఎగిరి రెండు కాళ్లతో భూపాలరావును లాగిపెట్టి తంతే గాలిలో గిరికీలు కొడుతూ భూపాలరావు కొండ మీద నుండి పడిపోయాడు.

అంతెత్తు మీద నుండి పడిపోయినా భూపాలరావుకు పెద్దగా గాయాలు కాలేదు, కొద్దిగా ముక్కు పగిలింది అంతే.

అప్పుడు ఒక్కసారిగా భూపాలరావు ముందుకు దూకాడు రాము.

చిత్రంగా గాల్లో చేతులు ఊపుతూ.. నడుము మీది చేతులు పెట్టుకుని.. భూపాలరావుకు నడుము కింద కాలితో, మోకాలుతో తంతూ, పాడటం మొదలు పెట్టాడు.

“నీ గుండెల్లో గునపం, నీ కంట్లో గుండుసూది నేనే

నేనంటే ఏమనుకున్నావ్,

సింహాలకు సింహాన్ని,

పులుల్లో పులిని”

రాము పాడుతున్నంత సేపు, కాలితో తంతున్నంత సేపు, రాణి పగలపడి నవ్వుతోంది. చెల్లెలు సుశీల తిక్క కుదిరింది అన్నట్టు సైగలు చేస్తోంది.

అంత బాధలోనూ, జానకమ్మ నవ్వుతూ తన ఆనందాన్ని తెలియజేస్తోంది.

అప్పుడే అక్కడకు వచ్చిన పోలీస్ జీప్‌లో నుండి పోలీసులు బిలబిలమని దిగారు.

ఇన్‌స్పెక్టర్ భూపాలరావు చేతులకు బేడీలు వేస్తూ, “యు అర్ అండర్ అరెస్ట్” అన్నాడు.

జానకమ్మ రాము ఒళ్ళో తలపెట్టుకుని ఉంది.

“నీకు ఏమీ కాదమ్మా” అన్నాడు రాము.

సుశీల వెక్కి వెక్కి ఏడుస్తున్నది. రాణి కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నది.

జానకమ్మ రాము చెయ్యి తన చేతిలోకి తీసుకున్నది. మరో చెయ్యి రాణి వంక చూపుతూ దగ్గరకు రా అన్నట్టు సైగ చేసింది. రాణి జానకమ్మ దగ్గరకు వచ్చింది..

రాము చెయ్యి రాణి చేతిలో పెట్టి “ఇక నుండి రామును నువ్వే చూసుకోవాలి. తండ్రి లేని బిడ్డ, రేపు నేను కూడా లేకపోతే నువ్వే వాడికి ఒక మంచి భార్య గా అన్ని చూసుకోవాలి” అన్నది.

“అమ్మా!” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రాము. సుశీల కూడా మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తున్నది.

రాణి, జానకమ్మ కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.

రాము, రాణి గుళ్లో దండలు మార్చుకున్నారు.

జానకమ్మ వీల్ చైర్‌లో కూర్చుని రామూని, రాణిని ఆశీర్వదిస్తున్నది.

సుశీల “వదినా..” అంటూ రాణిని కౌగిలించుకున్నది. చెవిలో ఏదో చెప్పింది. రాణి బుగ్గలు ఎర్రబడ్డాయి.

ఫ్యామిలీ అంత ఫ్రేమ్‌లో ఉండగా తెర మీద ‘శుభం’ పడింది.

***

హీరో దొరబాబు గారి కోసం ప్రివ్యూ షో వేశారు.

“వచ్చే నెల మొదటి వారం రిలీజ్ కు ప్లాన్ చేసుకుందాం” అన్నారు చౌదరి గారు.

భయం భయంగా దొరబాబు గారి వంక చూశారు అంతా.

“వెరీ గుడ్ బ్రదర్. ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుంది” అన్నారు హీరో దొరబాబు గారు చిద్విలాసంగా.

“మనం కలిసి మరో సినిమా చేద్దాం, ఆ సినిమాకూ నువ్వే డైరెక్టర్‌వి” దొర బాబు గారు మళ్ళీ అన్నారు, కుందన్ రావ్ భుజం నొక్కుతూ.

“సూపర్ హిట్” అన్నారు ప్రొడ్యూసర్ అనంత చౌదరి గారు, డైరెక్టర్ కుందన్ రావ్ భుజం మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా.

(సమాప్తం)

Exit mobile version