[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కె. ఎన్. మనోజ్ కుమార్ గారి ‘సినీవాలి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆశ్వయుజం.
తుఫాను హోరుగాలి విశాఖ నగరాన్ని కుదిపేస్తుంది. పవర్ కట్ అయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. గాజువాకలో ఒక ఇంటి పెంట్ హౌజ్ ఉత్తరం కిటికీ పక్కన టేబుల్ మీదుంచిన సెల్ ఫోన్‌కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. ఫోన్ అన్‌లాక్ చేస్తూ కుర్చీలో కూర్చుంది యుక్త.
“మనిద్దరం రేపు సినిమాకి వెళ్లామా?” మెసేజ్ చదవగానే ఫోన్ డిస్ప్లే లైట్లో యుక్త మొహం మెరిసిపోయింది.
“తప్పకుండా” సమాధానమిచ్చి విశ్వ డిస్ప్లే పిక్చర్ చూసింది. లైట్ ఆలివ్ గ్రీన్ ప్లేన్ షర్ట్‌ని బ్లాక్ జీన్స్‌లో టక్ ఇన్ చేసుకుని అందంగా నవ్వుతున్న అతన్నే చూస్తూండిపోయింది. ఆరడుగులకి రెండు ఇంచులు తక్కువ. ప్రైవేట్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్. ఫోన్లో మొహం దాచుకుంటూ సిగ్గుపడిపోయింది.
ఫోన్ లాక్ చేసి తల కుడివైపుకి తిప్పింది. కిటికీలోనుండి వైజాగ్ అంతా చీకటిగా ఉంది. మరో మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది.
“🥰”
యుక్త గుండె జల్లుమంది. కిటికీలో నుండి వర్షపు జల్లు ఫోన్ స్క్రీన్ మీద కొట్టింది. మబ్బేసిన ఆకాశంలో చుక్కల్ని అతికించినట్లు అక్కడక్కడా పడిన నీటి చుక్కలున్న స్క్రీన్‌ని గట్టిగా ముద్దు పెట్టుకుంది. ముద్దుకి స్క్రీన్ నుండి ఆరేడు చుక్కలు రాలిపోయాయి. రాలి.. చుక్కలన్నీ యుక్త పెదవి పైనే పేలిపోయాయి.
ఫోన్ లాక్ చేసి కిటికీ వైపుకి తిరిగింది. గాలి పెట్టే ముద్దులు తన చెక్కిలిపై నీటి చుక్కలై మెరుస్తున్నాయి. తుఫాన్లో కూడా ప్రపంచం చాలా అందంగా, ప్రశాంతంగా కనిపించింది. కాలం రాత్రికి కట్టిన కలల ఊయలలో మెల్లగా నిద్రలోకి జారుకుంది యుక్త.
విశ్వ చిటికెన వేలు యుక్త చేతిని తాకింది. తనువంతా కంపించిపోయింది. థియేటరులో కూర్చున్న సీట్ కూడా అదురుతుంది. డాల్బీ ఎట్మోస్ ఫీచర్ రిప్రెసెంటేషన్ వస్తుంది స్క్రీన్ మీద. తల కొట్టుకుంటూ చీకట్లో ఎవ్వరికీ కనిపించకుండా నవ్వుకుంది యుక్త.
బైక్ ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాడు. యుక్త గుండెల్లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇప్పుడు బైక్ మీద ఒక వైపు కూర్చోవాలా? రెండు వైపులా? విశ్వ భుజం మీద చెయ్యి వెయ్యొచ్చా? ముట్టుకుంటే ఏమనుకుంటాడో?
“నేను ఆటోలో వెళ్లిపోతా విశ్వ. నువ్వెళ్లిపో”
“టైం ఎంతయ్యింది చూడు.. నేనే దింపుతా. రా ఎక్కు” విశ్వ తనపై చూపిస్తున్న కేరింగ్ చాలా నచ్చింది. బైక్ మీద ఒక వైపుకు కూర్చుని, పడిపోకుండా రేర్ సీట్ హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకుంది.
యుక్తకి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. విశ్వ మీద ప్రేమని రోజురోజుకీ పెంచుకుంటుంది.
విశ్వ నుండి కాల్ వస్తే యుక్త అటెండ్ చేసి హలో అంది.
“హలో యుక్త. ఈరోజు సాయంత్రం డిన్నర్‌కి కలుద్దామా?” ఉత్సాహంతో అడిగాడు విశ్వ.
ఈ మధ్య విశ్వ తనకి బాగా దగ్గరవుతున్నాడనిపించింది.
“ఎక్కడ కలుద్దాం?”
“నేను నీకు లొకేషన్ పింగ్ చేస్తా కానీ నేను నిన్ను మొదటిసారి బ్లాక్ కలర్ శారీలో చూసాను. గుర్తుందా?”
“ఆ శారీని భద్రంగా దాచుకున్నా.”
“పర్ఫెక్ట్. డిన్నర్‌కి వచ్చేటప్పుడు ఆ శారీలో వస్తావా?” రిక్వెస్టింగా అడిగాడు విశ్వ.
వార్డ్‌రోబ్‌లో నుండి చీర తీసి భుజం మీద వేసుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది యుక్త.
యుక్త నుండి సమాధానం లేకపోయేసరికి విశ్వ కాస్త కంగారుపడుతూ “హలో.. యుక్త. ఆర్ యు దేర్?” అన్నాడు.
“శారీ దొరికింది. టైం చెప్పు విశ్వ”
విశ్వ ఆనందంతో “సాయంత్రం ఏడింటికి. సాయంత్రం కలుద్దాం. బై” చెప్పి కాల్ కట్ చేశాడు. యుక్త ఆ క్షణం నుండే తయారవ్వడం మొదలుపెట్టింది.
హోటల్ టెర్రస్ లాన్లో ఏర్పాటుచేసిన ఓపెన్ ఎయిర్ సీటింగ్‌లో టూ చైర్ నార్త్ వెస్ట్ కార్నర్ టేబుల్ని రిజర్వ్ చేసి యుక్త కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు విశ్వ.
సాయంకాలపు సముద్ర గాలి అల్లరి. ఆకాశంలో వేలాడే తారా తోరణాలు. ఎక్కడనుండో వినీ వినిపించని సంగీతం. మనసుని మరో లోకంలోకి తీసుకెళ్తుంది ప్రకృతి.
బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని యుక్త మెట్లెక్కి నడుచుకుంటూ వస్తుంటే కాలాన్ని పాజ్ బటన్ నొక్కి ఎవరో ఆపినట్టనిపించింది విశ్వకి. తను రివైండ్ బటన్ నొక్కి పది నెలలు వెనక్కి వెళ్లాడు.
న్యూ పంజాబీ దాబా. పక్కనే ముత్యాలమ్మ కోడి పలావ్ సెంటర్.
విశ్వ ప్రతి శుక్రవారం రాత్రి డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్తూ ముత్యాలమ్మ పలావ్ సెంటర్లో తన కోసం ఒక ఫుల్ కోడి వేపుడు పలావ్ కట్టించుకుంటాడు. దాబా, పలావ్ సెంటర్ రాత్రంతా తెరిచే ఉంచుతారు. బేరాలు మాత్రం ఏ రోజూ తగ్గవు.
“ఎంత?”
“రెండు వేలు”
“ఎంతమందికి? ఎంతసేపు?”
“గంటకి. ఒక్కరికే”
ఇవన్నీ ఇక్కడ మాములే. ప్రతివారం ఇవే మాటలు కొంచెం అటూ ఇటుగా.
“ఇద్దరికీ అయిదు వందలిస్తాం”
“కుదరదండి”
ఆ మాటకి తల పక్కకి తిప్పి చూశాడు విశ్వ.
బ్లాక్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని రెండు మూరల విరజాజులు తల్లో తురుముకుని, పెదాలకి ఎరుపు రంగు పులుముకుని అమాయకమైన కళ్ళతో నిలబడిన యుక్తని మొదటిసారి చూశాడు.
కళ్లలో బెరుకు, మాటల్లో వణుకు. అనుభవం లేని వృత్తేమో అనుకున్నాడు విశ్వ యుక్తని చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంత అందమైన అమ్మాయి ఈ పనెందుకు చేస్తుంది?ఉత్సుకత కలిగింది. మాట్లాడాలనిపించింది. ఇదే సిటీలో అయితే అందమైన అమ్మాయితో మాట్లాడాలనే ఊహా రాదు, వచ్చినా ధైర్యం సరిపోదు. యుక్తతో మాట్లాడిన అబ్బాయిలిద్దరూ వెళ్లిపోయారు. యుక్త ఒంటరిగా నిలుచుంది. మొదటిసారి ఒక అందమైన అమ్మాయి మనం ఏం మాట్లాడినా కొట్టదు, తిట్టదు అనే ధైర్యంతో రెట్టించిన ఉత్సాహంతో విశ్వ ముందుకి కదిలాడు.
“హాయ్”
“మీరు చాలా అందంగా ఉన్నారు”
“థాంక్స్” చిన్నగా నవ్వి విశ్వని కిందనుండి పై వరకు చూసింది యుక్త.
“మీరు కూడా బావున్నారు”
అమ్మాయి కాంప్లిమెంట్‌కి కడుపు నిండిపోయింది విశ్వకి.
“మీ పేరు?”
“సిరి” అని విశ్వకి మాత్రమే వినబడేట్టు మెల్లగా చెప్పింది యుక్త. “మీరు నిజంగానే..?”
“ఒక రెండు వేలు ఉంటే ఇవ్వండి తర్వాత మీకే తెలుస్తుంది నేను ఎవర్నో”
విశ్వకి యుక్త గురించి తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోతుంది. “అంటే రెండు వేలిస్తే..”
“మీతో పాటు వస్తా లేదా నాతో మీరొస్తానన్నా సరే”
“నీతో అంటే.. చనువు తీసుకుంటున్నా” నవ్వుతూ అన్నాడు విశ్వ.
“నాతో అంటే నా గదికి. చనువంటారా.. ఒక గంటపాటు నేనే మీదాన్ని. నా సర్వస్వం మీదే” యుక్త మాటల్లో మృదుత్వం, మనిషిలోని సరళత విశ్వని ఆకట్టుకున్నాయి. కానీ యుక్తలోని బెరుకే చెబుతుంది తనకి ఇదంతా కొత్తని.
ముత్యాలమ్మ పలావ్ సెంటర్లో రెండు కోడి వేపుడు పలావ్‌లు పార్సెల్ చేయించాడు విశ్వ బైక్ స్టార్ట్ చేశాడు. విశ్వ భుజమ్మీద చేయి వేసి కూర్చుంది యుక్త ఇద్దరిలో ఎలాంటి అలజడి లేదు.
పలావ్ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది యుక్త. ఇద్దరూ ఎదురుబదురు కూర్చుని పలావ్ తింటున్నారు. “నువ్వు ఏమనుకోకపోతే ఇందులో కెలా వచ్చావ్? ఇబ్బందిగా అనిపిస్తే చెప్పకు”
“ఆకలి.. అప్పులు” పలావ్ తింటూ చెప్పింది యుక్త
“కొంచెం వివరంగా చెప్తావా?”
“మీ మూడ్ పాడవుతుంది”
“అలా ఏముండదు. నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు”
యుక్త తినే ప్లేట్ పక్కన పెట్టి కాసేపు విశ్వనే చూస్తూండిపోయింది.
“మొదట నా పేరు సిరి కాదు.. యుక్త. మా ఊరు ధవళేశ్వరం. నాన్న రైతు. అమ్మ నాన్నకి సాయం చేస్తూ ఇంటి పనులు చూసుకుంటుంది. ఒక చెల్లి. నాన్న చేసిన అప్పులు ఎలా అయినా తీర్చాలని డిగ్రీ అవ్వగానే వైజాగ్ వచ్చాను.”
విశ్వ కూడా తినే ప్లేట్ పక్కన పెట్టి శ్రద్ధగా వింటున్నాడు.
“నాకొచ్చిన మార్కులకి, ఇంగ్లీష్‌కి ఉద్యోగం దొరకలేదు. ఇంటినుండి తెచ్చిన డబ్బులు హాస్టల్ కి రెండు నెలలు సరిపోయాయి. మూడో నెల్లో కూడా ఉద్యోగం దొరకలేదు. హాస్టల్ ఖాళీ చెయ్యమన్నారు. జీవితం నడిరోడ్డు మీదకొచ్చి పడింది.”
యుక్త లేచి కిటికీ దగ్గరకెళ్లి బయటకు చూస్తూ చెప్పింది.
“రెండు రోజులు బస్టాండ్‌లో, మూడు రోజులు రైల్వే స్టేషన్ లో పడుకున్నా. తిండి దొరకలేదు. ఆత్మాభిమానం ఖాళీ కడుపుని జోకొట్టేది కానీ ఆకలే పేగుల్ని ఉండచుట్టి మంటపెట్టేది. నీళ్లు- కన్నీళ్లతోనే ఆ అయిదు రోజులు నా సావాసం. ఇంటికి వెళ్లిపోదామనిపింది. పొలం పనుల్లో నాన్నకి సాయబడాలనుకున్నాను.”
యుక్త వెళ్లి చెయ్యి కడుక్కుని వచ్చింది. గదంతా నిశ్శబ్దం.
అమ్మ ఫోన్ చేసింది. నా గొంతులో నీరసం విని తిన్నావా అనడిగింది. ఏడుపొచ్చేసింది. అయినా మన ఇబ్బందేంటో అమ్మకి నోరు తెరిచి చెప్పాలా? కానీ అమ్మకి చెప్పుకోవాలనిపించింది.
“ఇంటికి బ్యాంకు వాళ్లు వచ్చారమ్మా, పొలం తనకా పెట్టి తీసుకున్న డబ్బులకి వాయిదాలు కట్టడం లేదని నోటీస్ ఇచ్చారు. రెండు రోజుల్లో ఇరవై వేలు కట్టకపోతే పొలం జప్తు చేస్తారంటమ్మ” అని ఏడ్వటం మొదలుపెట్టింది అమ్మ.
మా అమ్మని ఊరుకోబెట్టాను కానీ రెండు రోజుల్లో ఇరవై వేలంటే ఎలా? నాకు ఉద్యోగం ఏదైనా దొరికిందా అనడిగింది. అప్పటివరకు జరిగిన విషయాలు ఆ సందర్భంలో చెప్పకూడదనుకున్నాను. అమ్మని కంగారు పడద్దని, రెండు రోజుల్లో డబ్బు ఎలా అయినా సర్దుతానని చెప్పి ఫోన్ పెట్టేశాను.
విశ్వకి విషయం అర్థమవుతుంది కానీ యుక్త ఈ రొంపిలోకి ఎలా దిగిందని ఒక పక్క ఆలోచిస్తూనే యుక్త మాటలు వింటున్నాడు.
“బస్టాండ్‌ల్లో, రైల్వే స్టేషన్లో నేను రోజుకి చాలాసార్లు వినే మాట.. ఎంత?” మళ్లీ మళ్లీ అదే మాట ఎంత? ఎంత? ఎంత?
“ఎంత?” పడుకున్న నా మీద చేయి వేసి ఒకడడిగాడు. అక్కడనుండి లేచి వెళ్లిపోబోతుంటే “అయిదు వేలు” అన్నాడు.
నడవడం ఆపలేదు “పది వేలు” అన్నాడు.
ఆ మాటకి ఆగాను. వాడు నా వెనక్కిచ్చి నన్ను ఆనుకుంటూ చెవిలో “పదివేలు స్పాట్ పేమెంట్” అన్నాడు. ఈసారి మంట గుండెలో మొదలైంది. కళ్లలో నీళ్ళు నిండాయి. చేతిలో ఉన్న బ్యాగ్ కిందకి వదిలి వెనక్కి తిరిగాను. నా మొహమ్మీదకి మొహాన్ని తీసుకొచ్చాడు. కొంచెం వెనక్కి జరిగాను. తల్లిదండ్రులని చంపుకునే బదులు నా ఆత్మాభిమానాన్నే చంపుకుంటూ “ఇరవై వేలు” అన్నాను నేలని చూస్తూ.
“ఇరవై ఆ? నీకు పదే చాలా ఎక్కువ. లేతగా ఉన్నావని పది చెప్పా, అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఇవ్వను.”
“నీ ఇష్టం” బ్యాగ్ చేతిలోకి తీసుకున్నా.
“ఆగు పాపా.. అంత తొందర పడతావెందుకు? సరే పనికి ముందు పది, పనయ్యాక పది” అని వెటకారంగా నవ్వి నా చేతిలో పదివేలు పెట్టాడు.
“కస్టమర్ నేను కాదు. మొదట నువ్వు స్నానం చేసి కడుపునిండా తిను” అని ఒక గదికి తీసుకెళ్లి చెప్పాడు. తర్వాత కారులో ఏదో హోటల్‌కి తీసుకెళ్లాడు. రూమ్ నంబర్ చెప్పి నన్ను పైకి వెళ్లమన్నాడు.
లిఫ్ట్ ఆపరేటర్ “ఎంత?” అని నన్ను కిందనుండి పైదాకా చూస్తూ వెటకారంగా నవ్వాడు. రూమ్ నంబర్ చెప్పి లిఫ్టులో ఓ మూలకి జరిగాను. నాకు ఇంటికి పారిపోవాలనిపించింది. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు.
గది తలుపు తెరిచే ఉంది. లోపల కొస్తున్న నన్ను ఆశ్చర్యంతో అలా చూస్తూ కుర్చిలోనుండి లేచి నిలబడ్డాడు ఆ మనిషి. వయసు యాభై పైనే ఉంటాయి. దగ్గరకొచ్చి నా భుజంమీద చేయి వేశాడు. జరిగిందంతా అతనికి చెప్పి నన్ను వదిలేసి సాయం చెయ్యమన్నాను. ఆ మాటకి అతను గట్టిగా నవ్వి బలంగా నా చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి నేను స్పృహ కోల్పోయాను. నాకు స్పృహ వచ్చేసరికి తన బలం ముందు నా బలం గెలవలేకపోయింది. మీద పడినప్పుడు మళ్లీ కొట్టాడు. ఆ క్షణమే నా జీవితం పాడైపోయింది. ఆకాశం కూడా కనబడలేనంత అగాథంలోకి జారిపోయాను.
మిగతా పదివేలు అడిగితే ఆ యాభై ఏళ్ల మనిషి నన్ను తీసుకొచ్చిన వ్యక్తికే యాభై వెలిచ్చానని చెప్పాడు. తననింకో రూపాయి అడిగినా చావకొడతానన్నాడు. నన్ను హోటల్‌కి తీసుకొచ్చిన వ్యక్తి అప్పటికే పారిపోయాడు.
యుక్త గుండెలు పగిలేలా ఏడ్చింది.
విశ్వ గుండె బరువెక్కింది. తను లేచి చేయి కడుక్కుని వచ్చి యుక్తకి ఎదురుగా కూర్చున్నాడు. యుక్తని ఓదార్చే మాటలు తన దగ్గర లేవని తెలుసు.
“సిరి.. సారీ..” పేరు గుర్తుకి రాలేదు.
“యుక్త” నీరసంగా చెప్పింది.
“యా… యుక్త. జరిగిందాన్ని ఎలానో మార్చలేం. నేను నిన్ను జడ్జ్ చెయ్యట్లేదు. నీకు ఇదే బావుందనుకుంటే కొనసాగించు. కానీ జీవితం అప్పుడప్పుడు ఇచ్చే అవకాశాల్ని వదులుకోకూడదు. నెలకి ఇరవై వేలు తక్కువ కాకుండా మా బ్యాంకులో నీకో జాబ్ ఇప్పిస్తా. ఇవన్నీ వదిలేస్తావా?”
విశ్వ మాటలు నమ్మకంగా అనిపించాయి.
“జీవితం నీకిస్తున్న రెండో అవకాశం అనుకో. నీకు నేను సపోర్ట్ ఇస్తా. అన్నీ నేర్పిస్తా. ఇదంతా వదిలి వచ్చేస్తావా?”
యుక్త ఆలోచనలో పడింది.
“చూడు, నేనేమీ సంఘ సంస్కర్తని కాను. ఈరోజు మనం అనుకోకుండా కలిశాం. నీ కథ విన్నాక నాకు అనిపించింది నేను చెప్పా. బాగా ఆలోచించుకో”.
“ఆలోచించుకోవడానికేమి లేదండి. గౌరవంగా బ్రతకాలని ఎవరు కోరుకోరు. కానీ నా జీవిత దుర్గంధం మీక్కూడా అంటుకుంటుందేమోనని భయపడుతున్నాను”
“భయాన్ని వదిలి, సమాజ సంకెళ్లు తెంచుకుని బ్రతుకున్నదానివి. ఎక్కువ ఆలోచించకు. నీ జీవితం అందంగా మారుతుంది. మొబైల్ నంబర్ చెప్పు..”
విశ్వ తను పనిచేసే బ్యాంకులోనే క్రెడిట్ కార్డ్ వింగ్‌లో జాబ్ ఇప్పించాడు. ఆఫీస్ వర్క్ నేర్పించాడు. యుక్త పని మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుంది. పనిలో యుక్త నిబద్ధత విశ్వకి నచ్చింది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. యుక్త తన మనసులో విశ్వని ఉన్నతమైన స్థానంలో నిలుపుకుంది. అమితంగా ఆరాధించింది. ఆరాధన ప్రేమగా మారింది. ప్రేమను తనలోనే దాచుకుంది. విశ్వని ప్రేమించే అర్హత తనకి లేదని, ప్రేమని వ్యక్తపరచి అతని సాన్నిహిత్యం కూడా దూరం చేసుకోవడం యుక్తకి ఇష్టం లేదు. కానీ తన గురించి విశ్వ ఏమనుకుంటున్నాడో ఈరోజు తెలుస్తుంది. తనని డిన్నర్‌కి పిలిచాడు.
యుక్త హోటల్ టెర్రస్ పైకి వచ్చి విశ్వని వెతికింది. కార్నర్ టేబుల్ ముందు కూర్చున్న విశ్వ చెయ్యి పైకి లేపి యుక్తని పిలిచాడు.
“యుక్త నాకో జెన్యూన్ డౌట్. చీర వల్ల నీ అందం పెరిగిందా?నీ వల్ల చీరకి అందం వచ్చిందా?” “నువ్వేమనుకుంటాన్నావ్?”చిన్నగా నవ్వుతూ అడిగింది.
“చంద్రుడు ఎప్పుడూ అందంగానే ఉంటాడు కానీ తన అందం రాత్రి వేళే తెలుస్తుంది. పగలు ఎవరూ పట్టించుకోరు. ఈ బ్లాక్ శారీ నీ అందాన్ని రెట్టింపు చేసింది.”
యుక్త మనసు టెర్రస్ మీదనుండి మబ్బుల్లో తేలిపోయింది.ఇద్దరూ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగారు.
“యుక్త నిన్ను ఎప్పటినుండో ఒక విషయం అడగాలనుకుంటున్నా. హోటల్ లో రూమ్ బుక్ చేశా. అక్కడికెళ్లి మాట్లాడుకుందామా?” కొంచెం పర్సనల్ రిక్వెస్టింగ్‌గా అడిగాడు.
లిఫ్ట్ ఆపరేటర్ “ఎంత సార్” అనడిగాడు.
“302”
విశ్వ తనకు ప్రపోస్ చేస్తే వెంటనే ఎలా స్పందించాలో, ఇంట్లో ఏం చెప్పాలో అన్నీ మనసులో ఊహించుకుని సంబరపడిపోతుంది యుక్త.
రూమ్ డోర్ కీ కార్డ్‌తో అన్‌లాక్ చేసి యుక్తని ముందు లోపలకి వెళ్లమన్నాడు విశ్వ. యుక్త వెనకాలే లోపల కొచ్చి తన పక్కనే మంచం మీద కూర్చున్నాడు. యుక్త గుండె వేగం పెరిగిపోతుంది. తన గుండె చప్పుడు విశ్వకి వినబడుతుందా?
విశ్వ టెన్షన్ పడటం తనకి తెలుస్తుంది. తనెప్పుడూ టెన్షన్ పడటం చూడలేదు.
“యుక్త.. నిన్నో విషయం అడగాలి. నా లైఫ్‌కి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం. నువ్వు కాదనవనే నమ్మకంతోనే ఇక్కడ వరకు వచ్చా” యుక్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు విశ్వ.
యుక్త సిగ్గుతో కళ్లు మూసుకుంది. ఆ మూడు మాటలు చెవిలో ఎప్పడు పడతాయో అని రిక్కించి వింటుంది.
“నీకు తెలుసు కదా, నేను ఫారిన్ వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ అవకాశం ఇప్పుడిచ్చింది. రేపు లిస్ట్ హెడ్ ఆఫీసుకి పంపిస్తారు. లిస్ట్‌లో నా పేరుండాలంటే మన మేనేజర్ షరతు పెట్టాడు..” కాసేపు మౌనం తర్వాత
“నీతో ఒక రాత్రి గడపాలని అడిగాడు. కుదరదని గట్టిగా చెప్తే లిస్ట్‌లో నా పేరుండదన్నాడు. పది రోజుల నుండి నిద్ర కూడా పట్టట్లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఈ రాత్రికే లిస్ట్ ఫైనలైజ్ చేస్తారు. అందుకే ఇప్పుడు అడుగుతున్నా మేనేజర్‌తో నువ్వు ఈ ఒక్క రాత్రి గ..”
విశ్వ పూర్తిచేసేలోపే యుక్త కళ్లు తెరిచింది. కళ్ల నిండా నీళ్లు. విశ్వ చేతుల్లోనుండి తన చేతులు వెనక్కి లాక్కుంది. తల తిరిగి, వాంతి అయ్యేలా అనిపించింది యుక్తకి. పక్కనే ఉన్న మంచినీళ్లు తాగి లేచి నిలబడింది.
విశ్వ యుక్త కళ్లలోకి చూడలేక తల దించుకున్నాడు. యుక్త కోపం కట్టలు తెంచుకుంది. హ్యాండ్ బ్యాగ్ లోనుండి ఫోన్ బయటికి తీసి కాంటాక్ట్ లిస్ట్‌లో విశ్వ పేరుని తీసేసి ‘బ్రోకర్’ అని బోల్డ్ లెటర్స్‌లో టైప్ చేసి బోల్డ్‌గా ఫోన్‌ని బ్రోకర్ మొహం మీద పెట్టి, రూమ్ లోనుండి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగింది. “జీవితంలో అసలు ఎవరినైనా ప్రేమించావా?” అని అడగాలనుకుంది కానీ విశ్వను చూసి “జీవితంలో ఎప్పుడైనా మోసపోయావా?” అనడిగి విశ్వ సమాధానం కూడా వినకుండా నడుచుకుంటూ లిఫ్ట్ లోకెళ్లింది.
“ఎంత?”నీరసంగా అడిగాడు 45 ఏళ్ల లిఫ్ట్ ఆపరేటర్. యుక్త కళ్లు ఎర్రబడ్డాయి.
“ఎంత మేడమ్?” బటన్ ప్రెస్ చెయ్యడానికి వేలును సిద్దంగా ఉంచి మళ్లీ అడిగాడు లిఫ్ట్ ఆపరేటర్. యుక్త వెనక్కి తిరిగి మెట్ల మీదనుండి నేలకి దిగింది. నేలలోకి కూరుకుపోవాలనించింది.
యుక్త మెదడు మొద్దుబారింది. దుఃఖాన్ని ఆపుకుంటూ పరుగులాంటి నడకతో ఆవేశంగా హోటల్‌నుండి బయటకు వెళ్తున్నపుడు తన చీర కుచ్చిళ్ళు కుదురు తప్పాయి, పవిట కొంగు పక్కకి చెదిరింది.
జీవితం హరివిల్లుకి కట్టిన ఊయల నుండి జారి చీకట్లో రోడ్డు పక్క ఫుట్‌పాత్ మీదకు పడిపోయినట్టనిపించింది. అక్కడే యుక్త తల పట్టుక్కూర్చుంది.
ప్రపంచమంతా మోసపూరితంగా తొలిచేసింది. అమ్మ గుర్తొచ్చి తన ఒడిలో వాలిపోవాలనిపించింది. ఫుట్‌పాత్ మీద తన ఎడమవైపుకు నెమ్మదిగా జారబడింది. అమ్మని చూడాలనిపిస్తుంది. ఒంటరినయిపోయానన్న బాధ. ఇప్పుడు విశాఖ నగరం భయంకరంగా కనిపించింది.
యుక్త మొహం మీద బైక్ హెడ్ లైట్ పడింది. మొహం చిట్లించింది. లైట్ మొహం మీదనుండి అరిపాదాల వరకు జారింది. యుక్త లేచి కూర్చుని చీర సర్దుకుంది. హెడ్ లాంప్ వెలుగులో బైక్ మీదున్న వ్యక్తి మొహం కనిపించట్లేదు.
“ఎంత?” మాట వినపడింది.
యుక్త గుండె మండిపోయింది. చర్రుమని పైకి లేచి రాయి తీసుకుని బైక్ మీదకు విసిరింది. బైక్ కదిలింది.
“ఆగరా వెధవ.. పారిపోకురరేయ్ ఆగు” రాళ్లు విసురుతూ బైక్ వెనకాల పరిగెత్తింది. పరిగెత్తి పరిగెత్తి అలిసి ఆగిన యుక్త రొప్పుతూనే పవిట కొంగు పూర్తిగా కిందకి జార్చి, జారిన కుచ్చిళ్ళని బొడ్ల్లోకి దోపి “ఇదిగో దా” అని రెండు చేతులు గాల్లోకి చాచి అరిచింది.
“దమ్ముంటే రారా.. పిచ్చి కుక్క” రోడ్డు మీదున్న రాళ్లు వేరి బైక్ పై పారిపోతున్న వ్యక్తి మీదకు విసిరి కొడుతూ పిచ్చి పట్టినట్టు తిట్టింది.
“ఎంతని అడిగి పిరికోడ్లా పారిపోతావేంట్రా. మగాడివైతే రారా పిరికి సన్నాసి.. థూ వెధవల్లారా మీ మగతనమంతా చీకట్లో మంచాల మీద పడున్న పెళ్లాల పైనే కదరా.. చేతకాని సన్నాసుల్లారా..” దుఖం పెల్లుబికింది. వేదన రోదనయింది. చెక్కిళ్ళపై కాటుక చారలు. వొళ్ళంతా నిస్సత్తువ. చుట్టూ ఎటు చూసినా చీకటే..
యుక్త ఏడుపాపి ఆకాశంకేసి కోపంతో చూసింది. పిడికిలిలో రాయి బిగుసుకుంది. వెయ్యేనుగుల బలం కూడగట్టుకుని గట్టిగా అరుస్తూ రాయిని ఆకాశంలోకి విసిరింది. మెల్లగా ఆ అరుపు, రాయి రెండూ చీకట్లో కలిసిపోయాయి. యుక్త ఏడుస్తూ రోడ్డు మీద కూలబడిపోయింది.
యుక్త రోదనకి అక్కడే ఉన్న ఒక వీధి కుక్క మూలుగుతూ దగ్గరకొచ్చింది. యుక్త కాళ్ల వాసని చూసి తోక ఊపి తన కాళ్ల దగ్గరే ముడుచుకుని కూర్చుంది. ఏ ఊరకుక్క, పిచ్చి కుక్క యుక్త జోలికి రాకుండా రాత్రంతా ఆ వీధి కుక్క తన పక్కనే కూర్చుని కాపలా కాసింది.
జీవితంలో ఇంకేం మిగల్లేదు, ముగిసిపోయింది అనుకున్న ప్రతిసారీ పెను చీకట్లో చిన్న వెలుగు రేఖలా ఇంకో అవకాశం ఇస్తూనే ఉంటుంది జీవితం. యుక్తకి కూడా మరో అవకాశం దొరుకుతుంది. అందులో తప్పక పోరాడి గెలుస్తుంది.
మనం కూడా జీవితంలో వచ్చే అమావాస్యల్ని దాటి పున్నమి చూడాలంటే కొండంత ఓర్పుతో, ధైర్యంతో జీవితానికి అవకాశాలు ఇస్తూనే ఉండాలి. అప్పుడే బతుకులు పండుతాయి. అలా పోరాడి గెలిచి పండిన నిండు జీవితాలే తర్వాతి తరానికి స్ఫూర్తిదాయకాలవుతాయి. ఆ తార చంద్రార్కమూ పృథివి హృదిని నిలిచి వెలుగుతాయి.
You must be logged in to post a comment.
జ్ఞాపకాల పందిరి-143
మరుగునపడ్డ మాణిక్యాలు – 23: ద గ్రీన్ మైల్
సమన్వయ – పుస్తక పరిచయం
బహుముఖ ప్రజ్ఞాశాలి బుచ్చిబాబు
నమ్మకం చెడింది
మా మధ్య ప్రదేశ్ పర్యటన-5
You Can Sleep 😴
విజేత
లాక్- అన్‌లాక్
వలపు తుఫాన్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®