Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎంపికలు, వాటి పరిణామాలపై ఆలోచించజేసే నవల ‘ఛాయిస్’

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా నీల్ ముఖర్జీ రచించిన ‘ఛాయిస్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]

నీల్ ముఖర్జీ తాజా నవల ‘ఛాయిస్’  – ఆధునిక ప్రపంచంలో నిర్ణయాలు తీసుకోవడంలోని సంక్లిష్టతలనీ, పరిణామాలని ఆలోచనలు రేక్తెత్తించేలా అన్వేషిస్తుంది. ఈ పుస్తకంలో మూడు విభిన్నమైన కథనాలు/భాగాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి – ఎంపిక లోని విభిన్న అంశాలను, వ్యక్తులపై, సమాజంపై వాటి ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. పరస్పరం అనుసంధానించబడిన ఈ కథల ద్వారా, నీల్ ముఖర్జీ జాతి, నవ్య ఉదారవాదం, సమకాలీన జీవితంలోని నైతిక సందిగ్ధతలను ప్రస్తావిస్తారు, ‘ఛాయిస్’ ని తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకంగా, ఈ అనుభవాన్ని మేధోపరంగా ఉత్తేజపరిచే పఠనంగా మారుస్తారు.

నవల మొదటి భాగం లండన్‌కు చెందిన ప్రచురణకర్త, కవల పిల్లల తండ్రి అయిన ఆయుష్‌ను పరిచయం చేస్తుంది. అతను సాహిత్యం – వ్యాపారీకరణమవడాన్నీ, తన పరిశ్రమలోని వైవిధ్యాన్ని లోతుగా చూడకుండా, పైపై పరామర్శలతో ఆమోదించడాన్నీ ఇష్టపడడు. ఆయుష్ పాత్ర సంక్లిష్టమైనది, సామాజిక నిబంధనలను సవాలు చేయాలనే కోరిక; తన పిల్లలు వారసత్వంగా పొందే పర్యావరణ భవిష్యత్తు పట్ల అమితమైన ఆందోళన రెండింటి ద్వారా నడపబడుతుంది. తన పిల్లల నిధులను విద్య నుండి వాతావరణ మార్పు కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు మళ్ళించడం వంటి అతని చర్యలు, చివరి పెట్టుబడిదారీ విధానపు కఠినమైన వాస్తవాలతో వ్యక్తిగత విలువలను పునరుద్ధరించటానికి అతను చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ కథనం కళాకారుడి నిబద్ధతకీ మార్కెట్ ఒత్తిళ్లకీ మధ్య ఉద్రిక్తతలను, అలాగే పర్యావరణ అనిశ్చితి యుగంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న నైతిక సంక్షోభాలను స్పష్టంగా చిత్రీకరిస్తుంది.

‘ఛాయిస్’ నవల రెండవ భాగం, ఒక నిగూఢ రచయిత ఎం.ఎన్. ఓపీ రాసిన కథపై పాఠకుల దృష్టిని మళ్ళిస్తుంది, ఇందులో కారు ప్రమాదంలో చిక్కుకున్న మధ్యతరగతి విద్యావేత్త ఎమిలీ కనిపిస్తుంది. ఈ కథనం – గుర్తింపు, వర్గం, ఇంకా, మన ఎంపికల ఊహించని పరిణామాల ఇతివృత్తాలను శోధిస్తుంది. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ సలీం ప్రపంచంలోకి ఎమిలీ చేసిన ప్రయాణం, విభిన్న జీవితాల మేళవింపుకీ, మానవ సంబంధాల అనూహ్య స్వభావానికి – శక్తివంతమైన రూపకంగా పనిచేస్తుంది. నవలలోని ఈ భాగం – వ్యక్తిగత కథనాలు ఒకదానికొకటి ఎలా మిళితమవుతాయో, గాఢమైన పద్ధతుల్లో ఎలా ప్రభావితం చేస్తాయో అనే వాటిని ప్రదర్శిస్తుంది.

పుస్తకం చివరి భాగం పాఠకులను పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుకు తీసుకెళుతుంది, అక్కడ ఒక పేద కుటుంబానికి ఆవు బహుమతిగా దొరుకుతుంది. ఈ కథనం మునుపటి కథలకు పూర్తి విరుద్ధంగా ఉండి, తీవ్రమైన పేదరికంలో నివసిస్తున్న వారు ఎదుర్కొనే కఠినమైన వాస్తవాలను ప్రస్ఫుటం చేస్తుంది. కానుకగా అందిన ఆవు వల్ల ప్రయోజనం కలగకపోగా, అదనపు భారాలకు దారితీస్తుంది, వనరులు తక్కువగా ఉన్న సందర్భాలలో ఎంపికల సంక్లిష్టతను నొక్కి చెబుతుంది. నవలలోని ఈ భాగం పాఠకులపై తీవ్ర ప్రభావం చూపుతుంది, అయితే కొంతమంది పాఠకులు దీనిని మొదటి రెండు భాగాల కంటే తక్కువ ఆకర్షణీయంగా భావించవచ్చు.

నీల్ ముఖర్జీ

‘ఛాయిస్’ నవల అంతటా, నీల్ ముఖర్జీ – నైతిక, రాజకీయ సందిగ్ధతలతో నిండిన ప్రపంచంలో నిర్ణయం తీసుకోవడంలోని చిక్కులను ఎదుర్కోవడానికి పాఠకులను సవాలు చేసే కథనాలను నైపుణ్యంగా అల్లారు. ఈ నవల మేధోపరంగా ఆకట్టుకుంటుంది, భావోద్వేగపరంగా చదువరులను కదిలిస్తుంది, పాఠకులను వారి స్వంత కర్తృత్వం పట్ల, వారి ఎంపికల పరిణామాల పట్ల ఆలోచించేలా చేస్తుంది. నవల ఆశయం కొన్నిసార్లు, దానిని నడిపిన విధానాన్ని కమ్మేస్తుందని కొంతమంది విమర్శకులు భావించినప్పటికీ, ‘ఛాయిస్’ నవల పూర్తి ప్రభావం త్రోసిపుచ్చలేనిది. ఇది మన కాలంలోని అత్యంత ముఖ్యమైన సమస్యల గురించి ఆలోచనను రేకెత్తించే, చర్చను ప్రేరేపించే నవల.

చివరిగా, నీల్ ముఖర్జీ రాసిన ‘ఛాయిస్’ – సమకాలీన సమాజంలో నిర్ణయ-ప్రక్రియ బహుముఖ స్వభావాన్ని అన్వేషించే, గాఢంగా ఆలోచింపజేసే నవల. పరస్పరం అనుసంధానించబడిన మూడు కథనాల ద్వారా, ఈ నవల జాతి, నవ్య ఉదారవాదం, పర్యావరణ సంక్షోభంకు చెందిన ఇతివృత్తాలను పరిశోధిస్తుంది, మన ఎంపికలు మన వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తాయో సూక్ష్మంగా ప్రదర్శిస్తుంది. నవల అందరు పాఠకులకీ సమానంగా నచ్చకపోవచ్చు. సామాజిక నిబంధనలను సవాలు చేసే; ఆత్మపరిశీలనను ప్రోత్సహించే కాల్పనిక సాహిత్యంపై ఆసక్తి ఉన్నవారికి – దీని మేధోపరమైన లోతు; భావోద్వేగ ప్రతిఫలనం – ఈ నవలని తప్పక చదవాల్సిన పుస్తకంగా చేస్తాయి.

***

Book Title: Choice
Author: Neel Mukherjee
Published By: Penguin Hamish Hamilton
No. of pages: 320
Price:  ₹ 699.00
Link to buy:
https://www.amazon.in/Choice-Neel-Mukherjee/dp/0143468367/

Exit mobile version