[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘చివరి పరీక్ష’. రచన డా. లక్ష్మీ రాఘవ.]
2095 సంవత్సరం. మానవ మెదడును పూర్తిగా స్కాన్ చేసి, డిజిటల్ కాపీని సృష్టించే సాంకేతికత వచ్చింది. దీన్ని ‘మెదడు బ్యాకప్’ అంటారు. ఆ కాపీని ఒక శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్లో ‘వర్చువల్ రియాలిటీ నగరం’ లో ఉంచుతారు.
ఈ ప్రయోగానికి సహకరించే వారి కోసం వెదుకుతుంటే రామానుజం తారసపడ్డాడు
రామానుజం, రిటైర్డ్ ప్రొఫెసర్, వయసు 7౦ ఏళ్ళు. ఆయనకి తన జ్ఞానం, అనుభవం శాశ్వతంగా ఉండాలని కోరిక. అతను తన మెదడును బ్యాకప్ చేయడానికి అంగీకరించి, ప్రయోగం’ లో తన పేరును రమేష్‌గా మార్చుకుంటాడు.
‘వర్చువల్ రియాలిటీ నగరం’ లో అతను ఎప్పటికీ వయసు పెరగకుండా, తన జ్ఞానాన్ని కొత్త పుస్తకాలు రాస్తూ జీవించవచ్చు అన్న ఆశ. ఆ ప్రయోగం లో అక్కడ మొదటి రోజు..
***
రమేష్ కళ్లు తెరిచాడు. గాలి చల్లగా ఉంది, కానీ దానికి వాసన లేదు. పక్కనే, తానెప్పుడూ అద్దంలో చూసే ప్రతిబింబంలా… మరొక ‘రమేష్’ నిలబడి ఉన్నాడు.
“హలో..?” అని అన్నాడు అతనితో.
“హలో.. నేను రమేష్” అని సమాధానం వచ్చింది. స్వరం, యాస, కంటిచూపు.. అన్నీ తనవే.
ఆ క్షణం వారి మధ్య ఒక మెరుపు మెదిలింది.
ఇది యాదృచ్ఛికం కాదు.
తనతో పాటు అదే వర్చువల్ నగరంలో మరో రమేష్ ఉన్నాడని తెలుస్తుంది.. పైగా తాను అనుకున్నట్లుగానే మాట్లాడే, ఆలోచించే ప్రతిరూపం. ఎలా? సందేహం మనసులో రాగానే – టెక్ లాబ్ సిస్టమ్ వాయిస్..
“స్వాగతం. ప్రోటోకాల్ లోపం వల్ల రెండు కాపీలు సృష్టించబడ్డాయి. వర్చువల్ మెమొరీలో రెండు ఒకేసారి ఉండలేవు. ఒకరిని మాత్రమే నిలుపుకోవాలి. తేల్చడానికి ‘చివరి పరీక్ష’ నిర్వహించబడుతుంది. గెలిచినది…జీవిస్తుంది. ఓడినది…డిలీట్ అవుతుంది.” అని వినిపించింది.
అంటే.. టెక్నీషియన్లు పొరపాటున రెండు కాపీలు సృష్టించారు. ఇద్దరు ఉంటే ఏది ‘అసలు’, ఏది ‘కాపీ’
అన్న సందేహం వస్తూనే ఉంటుంది. అందుకే ఎవరు అసలైనవారు అనేది తేల్చడానికి ‘చివరి పరీక్ష’ పెడతారు. పరీక్షలో ఓడిపోయిన వాడి డేటా చెరిపివేయబడుతుంది అన్న నిర్ణయం తెలపబడింది.
***
పరీక్ష కోసం ఇద్దరు రమేష్‌లు పక్క పక్కనే కూర్చున్నారు. వారికి ప్రశ్నాపత్రం వినిపించింది.
అసలైనవాడికి ఒక తడబాటు..
‘నేను శరీరంతో ఉన్నప్పుడు పరీక్ష అంటే కష్టపడి రాసేవాడిని.. కానీ ఇక్కడి టైమ్ భావన వేరేలా ఉంది’ అన్న ఆందోళన..
కాపీ రమేష్ మాత్రం ధైర్యంతో రాయడం మొదలుపెట్టాడు.
పరీక్ష ముగిసింది. ఇద్దరూ వారి ఆలోచన ప్రకారము పరీక్ష రాశారు.
టెక్ లాబ్ జడ్జ్ రెండు సమాధానాలూ చదివింది.
మొదటి రమేష్ మానవుని సమాధానంలో ‘అనుభవాలు, పరిమితులు, మరణం అందించే అర్థం’ గురించిన వివరణ అయితే; రెండో రమేష్ వ్యాసంలో ‘మానవుని శాశ్వతత, స్మృతి రూపంలో జీవించే అద్భుతం’ గురించి విపులంగా ఉంది.
జడ్జ్ రెండో దాన్ని ఎంచుకుంది.
వెంటనే సిస్టమ్ వాయిస్: “విజేత గుర్తింపు కోడ్ -2B” అని ప్రకటించింది.
తనను తాను అలా నమ్ముకున్న అసలైన రమేష్ రూపం.. ఆ క్షణంలోనే తేలికపాటి తెల్లని పొగలా కరిగిపోవటం మొదలైంది .
మిగిలింది కాపీ రమేష్. ‘అసలు’ ఇలా మిగిలింది ఎవరు? అన్నది ఎవరికీ తెలిసే అవకాశమే లేదు
సిస్టమ్ నిశ్శబ్దంగా ఉంది.
సిస్టమ్ పొగలో కలిసిపోతూన్న రమేష్‌కి ఒక కొత్త లోకానికి తలుపులు తెరిచినట్లనిపించింది…
***
ముఖానికి వెచ్చని ఊపిరి తగిలితే ఉలిక్కిపడ్డాడు పక్కనే నిద్రపోతున్నమనవడి అంకిత్ తల తన దగ్గరగా ఉంది. ఆశ్చర్యంగా అంకిత్ మీద చేయి వేశాడు. ఆ స్పర్శతో శరీరం ఉలిక్కి పడింది..
అంటే..
‘ఇంత సేపూ చూసిందంతా కలా???’ ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాడు. అది వర్చువల్ సిటీ కాదు..
నిజమైన గది! గదిలో గోడలు పతకాలు, సర్టిఫికేట్లతో నిండిపోయి ఉన్నాయి.
పాఠశాలలో, కాలేజీలో, తర్వాత సర్వీస్ పరీక్షల్లో కూడా అంతా అగ్రస్థానమే. ఆది నుండి చివరి వరకూ టాపర్! చిన్నప్పటి నుంచే ప్రతీ పరీక్షలో మొదటి స్థానం!
‘ఈ జీవితమే ఒక ఎగ్జామ్‌లా ఉంది’ ఇది అతని ఫేవరెట్ మాట గుర్తు చేసుకుంటూ కొన్ని చోట్ల కనిపించిన తన ఫోటోను చూస్తూ తనేనా?? రమేష్ కాకుండా రామానుజం కనిపించాడు..
మెల్లిగా చిన్నప్పుడు అక్షరాలు, అంకెలు, యవ్వనంలో ఉద్యోగం, సంపాదన, రిటైర్మెంట్ అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే.. అసలేమయింది??
కలలోనైనా తను పరీక్ష రాయటం ఫెయిల్ అవటం ఎలా జరిగి౦ది?
రామానుజం చేయి పక్కనే ఉన్న అంకిత్ మీద పడింది అప్రయత్నంగా..
“ఏమి తాతయ్యా?..” అన్నాడు అంకిత్ నిద్రలోనే..
ఆ మాటకు చట్టున గుర్తు వచ్చింది సాయంకాలం అంకిత్‌తో జరిగిన సంభాషణ..
సాంకేతికత ఎంతగా పెరిగిందో.. ఏ.ఐ. అన్నది ఎలా పనిచేస్తుందో చెబుతూ “కొద్దిరోజుల్లో ప్రపంచాన్నే మారుస్తుంది.. చివరకు మనిషి మెదడును కూడా డూప్లికేట్ చేయగలదు.” అన్న అంకిత్ మాటలు గుర్తుకువచ్చాయి.
మనిషిని సృష్టించడం ఎప్పటికీ జరగదని అది భగవంతుడికే సాధ్యమని వాదించాడు తను..
అంకిత్ వదలలేదు తనకున్న పరిజ్ఞానమంతా చెబుతూ తాతయ్య తల తింటున్నాడు..
ఇదంతా గమనిస్తున్న శేఖర్ “వాడితో పెట్టుకోకండి నాన్నా. వాడు చెప్పిందే జరుగుతుంది అని ఎదుటివారు ఒప్పుకునే దాకా వదలడు..” అన్నాడు నవ్వుతూ.
“తన అమెరికా తెలివ౦తా తాతయ్య మీద రుద్దుతున్నాడు. మనం ఇక్కడ ఉన్న పది రోజులూ తప్పదు” అంది వాసవి అంకిత్‌ని ప్రేమగా చూస్తూ..
అమెరికా నుండీ వచ్చిన కొడుకు కుటుంబంతో ఎంత సంతోషంగా ఉన్నా టెక్నాలజీ సంగతులు చక్కగా చెప్పే మనవడు అంకిత్ అంటే మరీ ఇష్టం తాత రామానుజానికి. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని మనవడితో మాట్లాడుతూనే ఉంటాడు. నేర్చుకోవడం మీదే అతని ఆసక్తి ఎప్పుడూ.
వాడి మాటలతో తన బుర్ర టెక్నాలజీ మారిపోతూ కల ఎందుకు వచ్చిందో అర్థం అయి, నవ్వుకుంటూ పక్కనే పడుకుని అంకిత్ చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు రామానుజం.
మరుసటి రోజు రామానుజం అంకిత్‌తో తన మానసిక ప్రయాణం గురించి తన డైరీలో ఇలా రాసాడు:
“జీవన పయనంలో పరీక్షల రకాలు మారుతాయి.. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ పరీక్షల సిలబస్ మారి పోతుంది. మార్కులు తగ్గిపోతాయి.. అప్పుడు పాస్ అవ్వాలంటే పుస్తకాల జ్ఞానం సరిపోదు.. మనసు పరీక్షను జయించాలి.. మనసు పాస్ అయినప్పుడు, జీవితమే మెరిట్ సర్టిఫికెట్ ఇస్తుంది.”
కొన్ని రోజులు గడిచాయి.
అంకిత్ మాటల్లో మనసు ఎంతగానో టెక్నాలజీ లోక౦ లోకి లాగినా తన లోని సగటు మానవుడి మెదడు మారటం లేదని గ్రహించాడు. చిన్నపిల్లల టెక్నాలజీ ఆలోచనాలకన్నా అనుబంధం, ఆప్యాయతలు ఎంతో గొప్పవని చెప్పే ‘అనుబంధాల టెక్నాలజీ’ అన్న శీర్షిక తో కొత్త పుస్తకం రాస్తున్నాడు రామానుజం.
అతనికి దృష్టి లో బహుశా ‘చివరి పరీక్ష’ అనేది బతికున్నంతవరకూ ఎప్పటికీ ఆగిపోని ఒక ప్రయాణం కావచ్చు.
