[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]
71.
సద్విమర్శ సతము సంభవించినపుడె
యశము నాకసమ్ము నందుకొనును
కమ్మటమ్ము వలన కనకమ్ము ప్రభలొందు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
72.
గంగ నీరు తోడి కడలిలో కలిపినన్
కడలి యుప్పదనము సడల దెపుడు
మూఢమతుల మార్చ మూర్ఖత్వమే యౌను
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
73.
వినుటకిష్టపడక పెద్దల పలుకులు
దూరముంచ వలదు భారమనుచు
బంధములను నిలుపు వారధి వారమ్మ
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
74.
సౌఖ్యమున్నదనుచు సంతసమ్ము వలదు
బద్దకమ్ము బెంచు బాటయదియె
కష్టపడుట మేలు కాయమున్న వరకు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
75.
చిన్న తప్పుకెపుడు శిక్షవేయతగదు
కలత కలుగజేయ ఫలము రాదు
మేలు పల్కులెపుడు మేలొనగూర్చును
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
76.
పెడసరంపు మాట పెంచును వైరమ్ము
పరుల గించపరుచఁ బాడికాదు
పలకరింపు నందె తెలియును నీప్రేమ
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
77.
నిశ్చయమ్ము జేయ నీరసించవలదు
కడగు నీదు దారి కఠినమైన
విజయ మొసగు నీదు వేసట శస్త్రమై
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
78.
కులము పేరు చెప్పి క్రూలదోయవలదు
మానవత్వమున సమానమైన
గుణము మానవునకు ననిశ ముండవలెను
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
79.
తక్కువ కులమంచు తలదంచ వలదమ్మ
తూలనాడ తగదు తోటివార
నంతరమ్ము వలనె యాగడమ్ముపెరుగు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
80.
మంచిపనుల నీవు నెంచిచేయునపుడు
పరుల మెప్పు కొఱకు ప్రాక తగదు
ఆచరించు పనుల నవసరమ్ముల జూడు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
(ఇంకా ఉంది)
శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.