[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]
91.
పెరుగు కొలది ధనము బెంచ కోరును మది
ఎదగ మనును పరుల నధిగమించి
యాశ యుండ వచ్చు నత్యాశ తగదమ్మ!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
92.
తనకు రాదటంచు వనట పడగ రాదు
ఒరుల మెచ్చుకొనగ నెరుసు తగదు
ఓర్వలేనితనమె యోటమి గొనిదెచ్చు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
93.
ఒజ్జ నేర్పు విద్య నొకరీతి నెప్పుడు
విద్య గలిగెనేని విలువ గలుగు
నిరతి యున్న వారె నిగ్గార గలరమ్మ!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
94.
లేశమైన నేమి లేని వారి కొసగ
నలవి కాని తృప్తి కలుగునమ్మ!
పంచి నపుడె కల్గు మించిన మోదమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
95.
పుట్టుచుంటిరమ్మ! వట్టి సన్న్యాసులు
మాయ లోక మందు మరువ వద్దు
ముప్పు దెచ్చి పెట్టు మూఢ విశ్వాసముల్
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
96.
అవసరాల మించి యాడంబరము జూప
దూరమగుదురమ్మ! తోటివారు
కలిమి చేరె ననుచు చెలిమి మరువ రాదు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
97.
మనసు నూరడించి మంచి మార్గము జూపి
యడరు లందు నీదు నండ నుండి
యాదరించు వారె యాత్మ బంధువులమ్మ!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
98.
సత్య మార్గ మందు సంగరమ్మును సేయ
వెన్ను యగుచు నెవడు వెంట రాడు
నాడు గాంధి తాత నడచె నొక్కడె ముందు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
99.
బలియు ధనియునైన బలిచక్రవర్తియు
హరికి దాన మిచ్చి నందె కీర్తి
దాన గుణమె చాలు ధన్యమౌ జన్మమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
100.
అందకున్న వాని నందుకొనంగ నా
తీపి యాశ, బతుకు తీరు మార్చు
నాశ లేని బ్రతుకు నంధకారంబౌను
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
(సమాప్తం)
శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.