[డా. సి. భవానీదేవి రచించిన ‘చిట్టి నేస్తం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తప్పిపోయిన నా చిట్టి నేస్తం
కనుచూపుమేరలో
ఎంత వెతికినా కనిపించడం లేదు
చిటారుకొమ్మల్లో.. ఇళ్ళచూరుల్లో.. తాటాకు పంచల్లో
చిరుగంటల్లాంటి ఆ గుసగుసలు వినిపించి ఎన్నాళ్ళయిందో!
అరచేయంత చిన్నిపిట్ట కళ్ళల్లో కళ్ళుంచి చూస్తే
ఆకాశమంత ఆత్మవిశ్వాసపు వెలుగు!
సుతిమెత్తని ఆ రెక్కల స్పర్శ
మరపురాని మృదు కుటుంబబంధం
గడ్డివాముల సందుల్లో
గడ్డి పెరిగిన దారుల్లో
మందారచెట్టు కొమ్మల మధ్య
పారిజాతాల పరిమళాల పొదల గూళ్లలో
చిన్నచిన్న ఆహారకణికల కోసం
ఆశల పోగుల్ని అల్లుకుంటుంది.
ఈ వివరాలతో ఆనవాలు పట్టండి
ఎటెగిరిపోయిందో దయచేసి వెదికిపెట్టండి
దయమాలిన నా చిన్నారి పిచ్చుక కనిపిస్తే
నేను దిగులు పడుతున్నానని నిజాయితీగా చెప్పండి
దూరంగా ఎగిరిపోతుంటే భద్రతా సంకేతాలివ్వండి
ఒక్కసారి మన ఇళ్లకు ఆహ్వానించండి
స్వేచ్ఛాకాశంలో నక్షత్రాల్ని ముంగిళ్ళలోకి దింపండి
ఎంత పెద్ద ప్రపంచమైనా
చిన్నారి చిట్టినేస్తం లేకపోతే
చిన్నబోతున్నదని విన్నవించండి