చిగురాకులలో దాగిన చిలకమ్మా…. చిన్నమాట చెప్పి పోవమ్మా..!
నీకింత అందమైన రూపం ఎలా వచ్చేనమ్మా…..?
నేను తిన్న తీయని జామపండు వల్లన.!
ముచ్చటైన నీ ముక్కుకు ఎరుపు రంగు ఎందుకమ్మా?
నన్ను చేరదీసిన చిట్టిచేతుల చలువ వల్లన.!
మాటలెన్నో నేర్చావు బదులు పలుకుతుంటావు ఎందువలనా?
చెట్టు కొమ్మలపై స్చేచ్ఛగా విహరించినందువల్లన.!
రామరామ అంటావు రామభజన చేస్తావు ఎలాగమ్మా?
రాముని వనవాస సమయాన ఆశ్రమములో సీతమ్మ వద్ద నేర్చుకున్నాను.!
ప్రేమతో చేరవస్తావు ప్రియమైన మాటలు చెబుతావు నీకెవరు సాటి?
మంచివారైన నిస్వార్థపరుల సావాసం వలన తెలుసుకున్నాను.
అందాలతో నీకెవరు లేరు పోటీ రాలేరు నీ పలుకులకు సాటి?
నా జాతి ధర్మం నేను నిర్వర్తించాను నాగొప్పతనం కాదు.
గోరింకతో చెలిమి చేస్తావు ఇదేమి విడ్డురం?
పక్షిజాతి అంతా ఒక్కటే మీమనుషులకే భేదభావం!
మంచికి బాట వేశావు నిన్నుచూసి నేర్చుకోవాలి అందరూ…..
ప్రకృతే మనకు నేర్పుతుంది పాఠాలు…..
నేర్చుకుంటే జరుగుతుంది మేలు. లేకుంటే నష్టపోయేది మనమే!
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.