[అరుణ పప్పు గారి ‘చిత్ర కావేరి’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ రచయిత్రి శ్రీమతి అరుణ పప్పు ద్వితీయ కథాసంపుటి ‘చిత్ర కావేరి’. ఇందులో 2010 నుంచి 2023 వరకు రాసిన పది కథలున్నాయి ఈ కథలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగువెలుగు, కొత్తకథ వంటి సంకలనాల్లో ప్రచురితమైనవే.
‘చిత్ర కావేరి’ అనే పేరు చదువుతున్నప్పుడల్లా, ‘శుభసంకల్పం’ సినిమాలోని ‘చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి’ అనే పాట మనసులో మెదులుతూనే ఉంది (ఎందుకో చివర్లో చెబుతాను).
~
“మనిషి నాడి తెలిసిన వైద్యులకు మనసు నాడి తెలుసా?” అని ప్రశ్నిస్తాడు డా. ఆదినారాయణ ‘యాంటిక్ ఫినిష్’ కథలో. ఇంటిని కళాత్మకంగా ఉంచుకోవాలనుకునే అభిరుచి ఉన్న సుధ, జీవితాన్ని కూడా ఆ లెక్కలతోనే కొలుస్తుంది. భర్త ఆదినారాయణ అనుభవాలు, అనుభూతులను “ట్రాష్” అంటుంది. మరి ఆమె పోగుచేసేవన్నీ ట్రాష్ కాదా అని అతను అనుకుంటాడు. ఒక సమయం తర్వాత ట్రాష్ అయిపోవాలన్నీ. కాకపోవడం ప్రకృతి విరుద్ధం అనుకుంటాడు. ఊపిరిసలపనివ్వని ఆ జీవనశైలిని వదిలి, అమ్మానాన్నల దగ్గరకి, పల్లెకి వెళ్ళిపోతాడు.
ఏదైనా ప్రమాదం జరిగి కన్న బిడ్దలని పోగొట్టుకున్న వాళ్ళ బాధ తీరేది కాదు. ఆ ప్రమాదంలో తనని కన్నవాళ్ళ పొరపాటు ఉంటే, ఇక ఆ వేదన, ఆవేదనా తీరేది కాదు. మనకన్నా, మన కన్నవాళ్ళే ఎక్కువగా కుమిలిపోతారు. అవమాన భారంతో క్రుంగిపోతారు. సర్దిచెప్పడానికి, సర్దుకుపోడానికి వీలయ్యేంత పరిస్థితి కాదు. ఆ బాధ వారినిలా మెలిపెడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే ఇతివృత్తంతో సాగుతుంది ‘అనంతరం’ కథ. ఓ పెద్దాయాన చిన్నారి మనవరాలిని బడికి తీసుకువెళ్తుంటాడు. ఒకచోట ఆయన చేయి విడిపించుకుని ఆ పాప ముందుకు పరిగెడుతుంది. వేగంగా వస్తున్న సిటీబస్సు పాపని గుద్దేయడంతో చనిపోతుంది. అప్పట్నించి, కూతుర్ని పోగొట్టుకున్న ఆయన కొడుకు, అమ్మానాన్నలతో మాట్లాడడం మానేస్తాడు. భార్య ఎంతో నచ్చచెప్పిన మీద గాయాన్ని మాన్పే దిశగా ఆలోచించడం మొదలుపెడతాడు.
‘చంద్రభాగ’ కథ రూమీ చెప్పిన ఓ అద్భుతమైన వాక్యంతో మొదలవుతుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి మేనత్త నోట విన్న సూర్యనారాయణుడి మేలుకొలుపు పాట – ఈ కథ నిండా పరుచుకుని ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. వివిధ సమయాల్లో సూర్యుడి ఛాయ ఎలా ఉంటుందో అద్భుతంగా చెబుతుందీ పాట. ఎన్ని పువ్వులో ఎన్ని రంగులో! తర్వాత కొన్నాళ్ళు ఆదివారాలు ఉదయం పూట రేడియోలోనూ వినేవాళ్లం! ఓ చక్కటి జ్ఞాపకం! కోణార్క్ ఆలయం నేపథ్యంగా ఇద్దరు ప్రేమికుల కథగా మొదలైన ఈ కథ, మరో గొప్ప ప్రేమిక కథలా ముగుస్తుంది. రచయిత్రి పాఠకులని కోణార్క్ ఆలయం ప్రాంగణంలోనూ సముద్ర తీరంలోనూ తిప్పుతారు.
పునర్నిర్మాణం జరగని జీవితం ఉంటుందా? ఎదగాలనో, ఉన్న స్థితిని మెరుగుపరుచుకోవాలనో, ఒకరికి దగ్గరవ్వాలనో, కొందరికి దూరంగా వెళ్ళాలనో ఏవేవో ఊహించుకుంటాం. జీవితంలో అన్నీ కుదరవు కదా. రాజీ పడాలి, దెబ్బతిన్నప్పుడు, కోలుకోవాలి, మళ్ళీ పుంజుకోవాలి. ‘పునర్నిర్మాణం’ కథలో సుశీలా నాయర్ చెప్పినది, రామినాయుడు అర్థం చేసుకున్నదీ ఇదే!
‘ధైర్యం’ కథ నేటి కాలానికి అత్యవసరమైన కథ. ఆడపిల్లలపైన కుటుంబం, సమాజం చేసే దౌర్జన్యాన్ని ఎదుర్కునేందుకు అత్యంత అవసరమైన ఆయుధమీ ధైర్యం. ఇద్దరు యువతులను, వారి జీవన నేపథ్యాలను పోలుస్తూ సాగుతుందీ కథ.
‘దయచేసి రెప్ప వెయ్యండి’ చక్కని కథ. బ్రతుకు తెరువు కోసం పల్లె నుంచి నగరానికి వచ్చి ఓ అపార్టుమెంటులో వాచ్‌మన్‌గా పనిచేసే సూరి – గడియారంతో పోటీపడ్తూ – ఆ బిల్డింగ్‌లోని జనాలు చెప్పే పనులన్నీ చేయాల్సి వస్తుంది. నిద్ర పోడానికి కూడా వీలు చిక్కదు. ఉదయం 5 గంటల నుండి మర్నాడు ఉదయం నాలుగు గంటల వరకూ వచ్చి పోయే వాళ్ళ కోసం గేటు తియ్యాలి, లిఫ్ట్ తలుపులు పడకపోతే, వెళ్ళి వాటిని మూయాలి. విసిగిపోయిన సూరి ఎవరికీ చెప్పా పెట్టకుండా తమ ఊరెళ్ళే బస్ ఎక్కేస్తాడు. బస్‌లో తనివితీరా నిద్రపోతాడు. “కూటికోసం, కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి” అనే శ్రీశ్రీ ‘బాటసారి’ కవితలోని పంక్తులు స్ఫుర్తిస్తాయి ఈ కథ చదువుతూంటే.
ఎవరెవరినో చూసి, వాళ్ళ వాళ్ళ అనుభవాల దృష్ట్యా, పెళ్ళి వద్దనుకున్న మనవరాలి మనసు మార్చుతుంది అమ్మమ్మ ‘పూరకం’ కథలో. జీవితానుభవం నిండిన అమ్మమ్మ మాటలు నేటి తరానికి ఆచరణీయాలు. మనవరాలి సమస్యని ప్రాక్టికల్ పద్ధతిలో తీరుస్తుంది అమ్మమ్మ. గజిబిజిగా ఉన్న లెక్కల సూత్రమేదో విడిపోయినట్టు తేటగా నవ్వుతుంది మనవరాలు చివర్లో. పూరకం అంటే తెలుసుగా, That which fills or completes అని అర్థం.. మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేసేది వివాహమేనని అమ్మమ్మ మనవరాలికి చెప్పిన కథకి మహబాగా నప్పిన శీర్షిక!
బాల్యంలో అబ్యూస్‌కి గురయిన అమ్మాయిల కథలు వినిపించినంతగా, అబ్బాయిల కథలు ఎందుకో వినబడవు. పసిపాపల్ని లైంగికంగా వేధించేవాళ్ళల్లో దగ్గరి బంధువులున్నట్టే, మగపిల్లల్ని వేధించేవాళ్ళలోనూ వాళ్ళే ఉంటారు. ‘Story of one Mx’ కథ ఇదే చెబుతుంది. లైంగిక వేధింపులను ఎదుర్కున్న అబ్బాయి, గే అన్న ముద్రపడి, మానసికంగా క్రుంగిపోతాడు. చివరికి ఓ నేస్తం సాయంతో కోలుకుని, పిల్లలలో బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ కల్పించే బాధ్యతలు తీసుకుంటాడు.
ఇష్టపడిన స్నేహితుడు శరత్, పెళ్ళి ప్రస్తావన తెస్తే సంశయిస్తుంది నీల. భయపడుతుంది. మనసైనవాడు, మంచివాడు శరత్ అడుగుతున్నా కూడా తనలో ఎందుకీ సంకోచం అని ఆలోచిస్తుంది. ఆమెను పూరీ తీసుకెళ్ళి జగన్నాథుడి గుడిలో దేవదాసిగా ఉన్న శశిమణీదేవిని పరిచయం చేస్తాడు శరత్. ఆమె తన మాటలతో నీలలో పేర్కొనిపోయిన భయాలను తొలగిస్తుంది. చక్కని ఇతివృత్తానికి అద్భుతంగా అమరిన ఈ కథ పేరు ‘నాకు చెప్పరె వలపు నలుపో తెలుపో’.
పుస్తకానికి శీర్షికగా నిలిచిన కథ ‘చిత్ర కావేరి’. కాలేజీ స్నేహితులైన కావేరీ, సోమయాజులు చాలా ఏళ్ళకి అనుకోకుండా మళ్ళీ కలుస్తారు. ఇద్దరి వివాహాలు విఫలమై ఒంటరిగా జీవిస్తుంటారు. ఇద్దరి మధ్య ఒకప్పటి స్నేహం చిగురించి, నమ్మకం కలిగి, దగ్గరవుతారు. ఆమె లోని శూన్యాన్ని అర్థం చేసుకోలేక, అతను మాట తూల్తాడు, అనకూడని మాటలంటాడు. అంతే, వారిద్దరి మధ్య ఉన్నది ‘అయిపోతుంది’. ఓ బంధం బలపడే సమయంలోనే చెదిరిపోతుంది.
~
చివర్లో చెబుతాన్నన్న సంగతి – (ఇది కాస్త నా వ్యక్తిగతం, పుస్తక సమీక్షలో ఇలా రాయచ్చో లేదో కూడా తెలియదు).
ఇరవై ఏళ్ళ క్రితం విజయనగరంలో పని చేస్తున్నప్పుడు రెండు వారాలకో, మూడు వారాలకో ఒకసారి ఆఫీసు జీపులో, ఏవో మెటీరియల్స్ కొనడం కోసం విజయనగరం నుంచి తగరపువలస మీదుగా భీమిలీ రోడ్డు తీసుకుని అక్కడ్నించి, బీచ్ రోడ్డు మీదుగా విశాఖ వెళ్ళేవాళ్ళం! ప్రాజెక్టు మేనేజర్‌కి ముందుగానే చెప్పి ఉంచేవాళ్ళం వైజాగ్ ట్రిప్ వెళ్తే, రావడం ఆలస్యమవుతుందని! బీమ్లీ దగ్గర గాని, లేదా తిమ్మాపురం (ఇక్కడ విజ్ఞాన్ స్కూల్ ఉండేది, మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి అక్కడ చదివేవాడు) దగ్గర గాని బీచ్‌లో ఆగి కాసేపు సముద్రాన్ని ఆస్వాదిస్తూ కూర్చునేవాళ్ళం! సముద్రాన్ని చూస్తుంటే క్రిందా పైనా అంతా నీలం పులుముకుందా అనిపించేది. ‘నీలంపురాశి’ అని అనిపించేది!
అంతకుముందు, ఆంధ్రా యూనివర్శిటీ నుంచి డిస్టన్స్ ఎడ్యుకేషన్‌లో ఎం.ఎ. సోషియాలజీ చేస్తున్నప్పుడు, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి కాంటాక్ట్ క్లాసులకి హాజరైనప్పుడు, క్లాసులైపోగానే, సముద్రం దగ్గర వాలిపోయేవాడిని! తరువాత మా మావయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్‌లో కొన్నేళ్ళు పనిచేసినప్పుడు రామకృష్ణ బీచ్‌కి దగ్గరలో అద్దెకి ఉండేవాడు. ఇంకేముంది వైజాగ్ వెళ్ళినప్పుడల్లా మావయ్య వాళ్ళ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న బీచ్ లోకి జారుకోడం, గంటలు గంటలు గడిపేయడం!
అలాగే కేరళలోనూ, కర్నాటక, గోవాలలోనూ సముద్రాలను చూస్తూ మైమరిచిపోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి!
ఈ పుస్తకంలో ఉన్న పది కథల్లో కనీసం సగం కథల్లోనైనా సముద్రం ఉంది. సముద్రం ఉంటే, దాంతో పాటు అలలు, ఇసుక, పడవలు, వలలు, చేపలు, మనుషులు, మాటలు, భాష, యాస,.. ఒక సమూహమూ, ఒక సమాజం వెంటవస్తుంది! అందుకే సముద్రాన్ని తలచుకున్నప్పుడల్లా నాకెందుకో సోషియాలజీతో పాటుగా, ‘శుభసంకల్పం’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా గుర్తొస్తే, అప్రయత్నంగా ఆ పాటా గుర్తొస్తుంది. అదన్న మాట కథ!
ఈ పుస్తకంలో ఓ కథలో రచయిత్రి చెప్తారు, “సముద్రం ముందు నిల్చున్నప్పుడు విశాల విశ్వంలో మనమూ ఒక భాగమన్న ఎరుక కలుగుతుంది. శాశ్వతమైనవి ఏవో, కానివేవో మనకిలాంటి సందర్భాల్లో బోధపడుతుంది..” అని! కడలి మనకి నేర్పే పాఠం గొప్పది! జీవన ప్రాధాన్యతలను సరిచూసుకోమనే లోతైన కథలివి.
***
రచన: అరుణ పప్పు
పేజీలు: 96
వెల: అమూల్యం
ప్రతులకు:
ఈ కథాసంపుటిని రచయిత్రి బ్లాగు లోంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లింక్:
https://arunapappu.wordpress.com/wp-content/uploads/2025/04/chitra-kaveri-online-1.pdf
~
అరుణ పప్పు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-aruna-pappu/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.