[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శింగరాజు శ్రీనివాసరావు గారి ‘చిత్ర కథ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రశాంతమైన వాతావరణంలో పెరటిలో స్టాండుకు అమర్చిన ఈజిల్ మీద కేన్వాస్ పై ఒక యువకుడు ఏదో చిత్రాన్ని గీస్తున్నాడు. ఒక యువతి నిశ్శబ్దంగా వచ్చి అతని వెనకాలే నిలబడి ఆ చిత్రాన్ని చూస్తున్నది.
తన పనిలో నిమగ్నమైన చిత్రకారుడు మధురాంతకం పరిసరాలను గమనించే స్పృహలో లేడు. అతనే కాదు ఏ కళాకారుడు కూడ తన పనిని ఎప్పుడూ ఏకాగ్రతతోనే చేస్తాడు. అలా చేసినప్పుడే ఆ పనిలో పరిపూర్ణత సాధించగలుగుతాడు. లేని పక్షంలో అందులో నుంచి ఉద్భవించే కళకు ప్రజాదరణ లభించదు. ఆనాటి శిల్పులు చెక్కిన శిల్పాలను మనం మన ఉనికినే మరచిపోయి తదేకంగా చూస్తున్నామంటే కారణం ఆనాటి శిల్పుల అంకితభావమే. ఇప్పుడు మధురాంతకం వెనుక నిల్చొని చూస్తున్న వారణాసి పరిస్థితి అలాగే ఉంది. కేన్వాస్ పై ఉన్న చిత్రంలోని వ్యక్తులను చూస్తుంటే సజీవచిత్రంలా అనిపిస్తున్నది. ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించ సాగింది.
‘ఒక యువతి రైలు పట్టాల మీద ఎదురుగా వచ్చే ట్రైనుకు ఎదురు వెళుతోంది. దూరాన్నుంచి ఆమెను చూసిన ఒక యువకుడు ఆమె వైపుకు పరుగెత్తుకుని వస్తున్నాడు.’
నిజానికి చిత్రంలో అతను, ఆమెను చూసినట్లుగానో, లేక పరిగెత్తుతున్నట్లుగానో మాత్రమే గీయడానికి వీలవుతుంది. కానీ ఈ చిత్రంలో మధురాంతకం, యువకుడు బల్లమీద నుంచి లేచి ఆమె వైపు పరిగెత్తుతున్నట్లు చెప్పడానికి అతని ఆకారాన్ని తెరలు తెరలుగా చూపాడు. ఆ చిత్రాన్ని చూస్తుంటే ఒక యానిమేషన్ వ్యూలా అనిపించింది వారణాసికి. మధురాంతకం నరేంద్రను ఇంటిపేరుతో మధురాంతకం అని పిలుస్తుంది వారణాసి విద్యుల్లత. టిట్ ఫర్ టాట్ అన్నట్లు ఆమెను కూడ ఇంటిపేరుతో వారణాసి అని పిలుస్తాడు మధురాంతకం. ఆమె ఎవరో కాదు మధురాంతకానికి స్వయాన మేనమామ కూతురు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. మధురాంతకం మీద మనసుంది. కానీ పెద్దలకే వారిని కలపాలనే మనసు లేదు. దానికి కారణం ఇంజనీరింగు పూర్తి చేసిన మధురాంతకం వారసత్వపు వృత్తిని కాదనుకోలేక రామాలయంలో పూజారిగా మారడం. వృత్తికి, ప్రవృత్తికి సంబంధం లేకపోయినా తన వృత్తితో పాటు తనకు ఇష్టమైన బొమ్మలను గీయడం మాత్రం మానుకోలేదు. మధురాంతకంలోని ఆ టాలెంటును చూసే మనసు పారేసుకుంది వారణాసి. తను గీసిన చిత్రాన్ని పదే పదే చూసుకుంటూ తుది మెరుగులు దిద్దుతున్నాడు మధురాంతకం. ఎవరికైనా ప్రియురాలి గాలి తగిలితే ఆ గాలి ఎదను తాకి ప్రియుడి కనులు ఆమె కోసం వెదుకుతాయని చాలా కథల్లో చదివింది. కానీ వారణాసి వచ్చి అరగంట దాటినా ఏ స్పందన లేదు మధురాంతకంలో. ఇక లాభం లేదనుకుని గొంతులో ‘కిచ్.. కిచ్’ శబ్దం చేసింది వారణాసి. ఆ శబ్దానికి వెనుదిరగకుండానే “వారణాసి.. ఒక్క నిముషం. చిత్రం పూర్తికావచ్చింది. ఒకచోట కొద్దిగా టచప్ ఇచ్చి నీ దగ్గరికి వస్తాను. అలా కుర్చీలో కూర్చో” అన్నాడు తలతిప్పకుండానే.
‘అమ్మ.. సహస్రాక్షుడా.. నా రాకను కనిపెట్టేశావా. కళాకారుడివే కాదు, కాలాంతకుడివి కూడా’ అని మనసులో అనుకుని నవ్వుకుంది వారణాసి.
చిత్రాన్ని పూర్తిచేసి చేతులు తుడుచుకుంటూ వారణాసి వద్దకు వచ్చాడు మధురాంతకం.
“ఏంటి విషయాలు.. ఈ రోజు ఇలా దయచేశావు”
“ఏమీ లేదు.. నిన్నో చూపు చూసి పోదామని”
“అవునా.. అయినా అంత తప్పు నేనేం చేశాను?”
“కేన్వాస్‌పై బొమ్మ మీద పెట్టిన దృష్టి ఈ పిల్లపై పెట్టడం లేదు. ఎందుకో కనుక్కుని ఓ దుమ్ము దులిపి పోదామని”
“బొమ్మపై దృష్టి పెడితే నాలుగు రాళ్ళు వస్తాయి. నీ మీద పెడితే ఏముంది.. మీ నాన్న చేత అక్షింతలు తప్ప”
“అంటే.. నన్ను వదిలేస్తావా అయితే”
“అది అంత సులువా బంగారం. తుమ్మబంకలా, అరాల్డైట్‌లా, అతుక్కుపోయావు కదా. ఏం చేయను. ఎలాగోలా నీతో ఏడడుగులు వేయాల్సిందే. లేకపోతే దెయ్యమై నన్ను పీక్కుతినవూ..”
“వెల్.. బాగా అర్థం చేసుకున్నావు. అది సరే.. ఇంతకూ ఆ బొమ్మ ఏ కథకు? ఆ యువతి రైలుకు ఎదురుగా పరిగెత్తడమేమిటి.. ఆ యువకుడు అలా కూర్చున్నచోటు నుంచి లేచి ఆమె కోసం పరిగెత్తడమేమిటి?”
“కథ ఏమిటో ఇంకా ఎవరికీ తెలియదు. రేపు వెలువడే సంచికలో ‘చిత్రానికి కథ’ కోసం ఎడిటర్ గారు నాకు రెండు వాక్యాలు చెప్పి, దానికి తగిన చిత్రం గీయమన్నారు”
“ఇంతకూ ఏమిటా వాక్యం”
“ఒక యువతి రైలు పట్టాల మీద ఎదురుగా వచ్చే ట్రైనుకు ఎదురు వెళుతోంది. దూరాన్నుంచి ఆమెను చూసిన ఒక యువకుడు ఆమె వైపుకు పరుగెత్తుకుని వస్తున్నాడు”
“అంతేనా.. మరి నువ్వు చిత్రంలో 3డి ఎఫెక్టు వచ్చేలా ఆ యువకుడి కదలికలు వేశావు. అందులో మర్మం ఏమిటి?”
“మర్మం లేదు.. మట్టిగడ్డలు లేదు. ఆ యువకుడు ఆమెను చూసి కూర్చున్న చోటు నుంచి లేచి పరిగెత్తాడని పాఠకులకు తెలిసేలా గీశాను. కథను అల్లేవారికి కొంచెం సులువుగా ఉండేలా”
“నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. సెల్ లో ఒక ఫొటో తీసుకుంటాను”
“వద్దు వారణాసి.. నువ్వు ఫొటో తీసి ఎవరికైనా పంపితే బాగుండదు. పత్రికలో పడకముందే అలా చేయకూడదు. అది నిబంధనలకు విరుద్ధం”
“అయినా నేనెవరికి పంపుతానని నీ అనుమానం”
“నీ ఫ్రెండ్ వందనకు. ఆమె కూడ రచయిత్రి కదా. ముందుగా తెలిస్తే బాగా ప్రిపేర్ అవొచ్చని పంపుతావేమోనని”
“బావా.. మధురాంతకం.. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. నీకు చెడ్డ పేరు తెచ్చే ఏ పనైనా నేను చేస్తానని ఎలా అనుకున్నావు?”
“ఆపు తల్లీ.. నీ పాత సినిమా డైలాగులతో నన్ను చంపకు. ఇంతకూ ఎందుకే నీకా బొమ్మ”
“ఏమో బావ.. నా మనసుకు బాగా నచ్చింది. ఈ రెండు వాక్యాల నుంచి ఎన్ని వందల కథలు ఉద్భవిస్తాయో కదా. ఏమైనా ఈ మధ్యకాలంలో ఇటువంటి ‘చిత్రకథ’ లకు మంచి స్పందన వస్తున్నది. కాస్త పక్కకు జరుగు.. ఒక ఫొటో కొట్టుకుని వచ్చేస్తా. ఈ లోపుగా మనిద్దరికి కాఫీ కలిపి పట్రా. పెళ్ళయాక అలాంటి పనులు చెబితే పాతివ్రత్యానికి భంగం వాటిల్లుతుంది కదా. ఇప్పుడైతే ఏ సమస్యా ఉండదు. లే.. లే.. పోయి చిటికలో వచ్చెయ్” అని మధురాంతకాన్ని దాటుకుని పరిగెత్తింది వారణాసి.
‘చక్కనిదే కాదు.. చిక్కనిది కూడ. దీన్ని కట్టుకునే అదృష్టం నాకు ఉందో.. లేదో’ అని మనసులో అనుకుంటూ కాఫీ పెట్టడానికి లేచాడు మధురాంతకం.
***
శోభనం గది చాలా సంప్రదాయబద్ధంగా అలంకరించబడింది. అక్కడ పానుపు మీద కూర్చుని వారణాసి కోసం ఎదురు చూస్తున్నాడు మధురాంతకం. కాదేమో అనుకున్న కల్యాణం కష్టపడకుండానే జరిగింది. రామశాస్త్రి తనే స్వయంగా వచ్చి విద్యుల్లతను చేసుకోమని అడగడం. మధురాంతకం తల్లి కూడ అందుకు ఒప్పుకోవడం.. ఒక సినిమాలో సీన్‌లా జరిగిపోయింది. ‘గుడిలో గంట కొట్టుకునే వాడికి పిల్లను ఇచ్చే ప్రసక్తే లేదు’ అని ఘంటాపథంగా చెప్పిన రామశాస్త్రి గారు తగ్గిరావడం.. కొరుకుడు పడని విషయంలా అనిపిస్తున్నది మధురాంతకానికి. వారం రోజుల నుంచి అసలు విషయం రాబట్టాలని చూస్తున్నా, ఒంటరిగా దొరకలేదు వారణాసి.
ఇంతలో ఎవరో తలుపు తీసిన చప్పుడయింది. వాకిలి వంక చూశాడు. పాలగ్లాసుతో దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా, తెల్లని చీరలో ప్రత్యక్షమయింది వారణాసి. ఆలోచనలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. వాకిళ్ళు పడని కళ్ళతో వారణాసిని చూస్తున్నాడు. సహజ సౌందర్యవతియైన వారణాసి శోభనపు అలంకరణలో మరీ మెరిసిపోతున్నది. మందగమనంతో వస్తున్న భార్యను తదేకంగా చూస్తూ తన ఉనికిని తనే మరచిపోయాడు మధురాంతకం.
“హలో.. జూనియర్ రవివర్మ గారు.. చూసింది చాలుగానీ, ముందు ఈ పాలు తీసుకోండి. గ్లాసును మోయలేక పోతున్నా” చలోక్తిగా అంటూ పాలగ్లాసును మధురాంతకం నోటికి ఆనించింది. తెప్పరిల్లి పాలు సగం గ్లాసు తాగి మిగిలినవి తాగమని వారణాసికి ఇచ్చాడు.
“అబ్బ.. ఎంగిలి పాలు.. నాకొద్దు బాబు” అంది వారణాసి.
“బావ ఎంగలికి పట్టింపులేదు తాగు. నువ్వు జామకాయ కొరికి నాకు తినమని ఇచ్చినపుడు నేను తినలేదా.. ఇప్పుడు పాలు ఎంగలి అంటున్నావు” ఉడుక్కున్నాడు మధురాంతకం.
“అది వేరు. పసితనంలో పట్టింపులు ఉండవు” కళ్ళు తిప్పుతూ అన్నది వారణాసి.
“ఆహా.. ఇప్పుడు యౌవ్వనమా.. అదేనా పట్టింపు. సరే తాగొద్దులే నా పాలు నాకిచ్చెయ్” పాలగ్లాసు తీసుకోబోయాడు.
“వట్టి ముద్దపప్పు బావా నువ్వు. బొమ్మలు గీసే తెలివే తప్ప, బొమ్మలాంటి అమ్మాయిని బుట్టలో వేసుకునే తెలివే లేదు. ఏదో మొక్కుబడిగా పాలు సగంతాగి నాకు ఇచ్చావు. ఇంతేనా నామీద నీకున్న ప్రేమ” మూతి ముడుచుకుంది.
“వారణాసి.. హింసపెట్టకే.. ఏం చేయాలో చెప్పు” అన్నాడు మధురాంతకం.
“అన్నీ నేనే చెప్పాలి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ చేత్తో ప్రేమగా తాగించాలి.. బుద్ధావతారం” అంటూ ఆటపట్టిస్తున్న వారణాసిని ఒడుపుగా ఒడిలోకి లాక్కుని బుగ్గమీద చుంబించి గ్లాసులోని పాలు గొంతులో పోశాడు మధురాంతకం. గింజుకుంటున్న నటిస్తూ చుక్క మిగలకుండా మొత్తం పాలు తాగేసింది వారణాసి. మెత్తని భార్య స్పర్శ తనువును తమకంతో నింపుతుంటే మెల్లగా ఆమెను పానుపు మీదకు చేర్చి ఆమె మోమును తదేకంగా చూడసాగాడు మధురాంతకం.
“ఏంటి బావా అలా చూస్తున్నావు. నేనేమైనా కొత్త ముఖాన్నా”
“ఇన్నాళ్ళు నీకు నువ్వు, నాకు నేను. కానీ ఈరోజు నేనే నువ్వు, నువ్వే నేను. ఈ అదృష్టం దక్కింది నాకేనా అనిపిస్తున్నది” అని మత్తు దిగిన వాడిలా లేచి కూర్చుని, “అవును వారణాసి.. నిన్ను నాకు ఇచ్చి పెళ్ళి చేయడానికి ఏ మాత్రం అంగీకరించని శాస్త్రి మావయ్య, తనకై తనే మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడమేమిటి.. తను చేసిన తప్పులేమైనా ఉంటే మన్నించమని అడిగి మరీ నిన్ను మా ఇంటి కోడలిగా పంపడమేమిటి? అంతా మాయలా ఉన్నది. ఇంతకూ నువ్వు మీ నాన్నకు ఏం మంత్రమేశావేమిటి?” వారణాసిని అడిగాడు మధురాంతకం.
“నేనేమీ చెయ్యలేదు. చేసినదంతా నీ చిత్రమే”
“నా చిత్రమా.. అదేమిటి చిత్రంగా”
“అవును బావా. ఆరోజు నువ్వు కేన్వాసు మీద ఒక యువతి రైలుకు ఎదురుగా పరిగెత్తుతున్న బొమ్మను గీస్తే, నేను దాన్ని ఫొటో తీసుకున్నానా. ఆ బొమ్మ గీసేటప్పుడు ఏ ధ్యాసలో ఉన్నావో తెలియదు కానీ, యువతి బొమ్మను పెద్దది గాను, యువకుడి బొమ్మను, రైలును, కొంచెం చిన్నవిగాను గీశావు. ఆ చిత్రాన్ని చూసినప్పుడు నువ్వు సరిగా గమనించలేదేమో, ఆ యువతి చిత్రాన్ని నా పోలికలతో గీశావు. అది చూసి నా మనసు మురిసింది. అందుకే దాని ఫొటో తీసుకుని, ఇంటికి వెళుతూ దారిలో దాని ప్రింటును తీయించి తీసుకువెళ్ళాను. ఆ యువతిలో నా పోలికలు ఎలా వచ్చాయో అర్థం కాలేదు” అంటూ మధురాంతకం వైపు చూసింది.
“వారణాసి.. చిత్రకారుడు బొమ్మను చేత్తో గీస్తాడని అందరూ అనుకుంటారు. కానీ అతను మనసుతో చిత్రాన్ని గీస్తాడు. మనసులో ఎవరి రూపమైతే కదులుతుంటుందో దాని ప్రతిబింబమే కుంచెలో ప్రాణం పోసుకుంటుంది. నా మనసులో నీ రూపమే ముద్రవేసుకున్నప్పుడు వేరే రూపం కేన్వాసు మీదకు ఎలా వస్తుంది చెప్పు” అలా చెబుతున్నపుడు మధురాంతకం కళ్ళల్లో తనపై కదులుతున్న ఆరాధనను గమనించింది వారణాసి. ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది.
“నేను చాలా అదృష్టవంతురాలిని బావా” అంటూ అతడిని హత్తుకుని అంతలోనే తేరుకుని, “అసలు విషయం అక్కడే ఉంది బావా. ఒకరోజు ఆ ప్రింటును చూస్తూ ఉంటే వందన నుంచి ఫోను వచ్చింది. అది తొందరగా రమ్మనడంతో ఆ ప్రింటును డ్రెస్సింగు టేబుల్ మీద పెట్టి, రెడి అవుదామని వెళ్ళి, ఆ హడావుడిలో దాన్ని అక్కడ పెట్టింది మర్చిపోయి వందన దగ్గరికి వెళ్ళాను. వందనకు పెళ్ళి కుదిరింది కదా.. అది బలవంతం చేయడంతో ఇద్దరం కలిసి షాపింగుకని విజయవాడకు వెళ్ళాము. ఆ విషయం అమ్మకు చెప్పమని వందన వాళ్ళ అమ్మకు చెప్పి కూడ వెళ్ళాను. ఆమె ఆ విషయం మర్చిపోయి తన పనిలో మునిగి పోయింది. నేను రాత్రి పదకొండు గంటలకు ఇల్లు చేరేసరికి మా అమ్మ పెద్ద సీనే సృష్టించింది. ఆమెకున్న టి.వి సీరియల్ తెలివితేటలన్నీ ఉపయోగించి నేను టేబులు మీద మర్చిపోయిన బొమ్మను మా నాన్నకు చూపించి, నా పెళ్ళి నీతో జరగకపోతే ఆ బొమ్మలో అమ్మాయిలా రైలు కిందపడి చచ్చిపోతానని కథ అల్లేసింది. అమ్మ కళ్ళకు నా రూపంతో ఉన్న అమ్మాయి తప్ప ఇంకేమీ కనిపించలేదు. నా సెల్‌కు ఫోను చేసిందట. నేను సెల్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. దానితో ఆమె అనుమానం మరీ ఎక్కువయింది. మీ ఇంటికి ఫోను చేసిందట.. అత్తయ్య ఫోను తీసి నువ్వు వేరే ఊరికి పెళ్ళి చేయించడానికి వెళ్ళావని, నాలుగు రోజులు రావని చెప్పిందట. తెగ టెన్షను పడిపోయి నాన్న రాగానే పెద్ధగా ఏడ్చేసిందట. అత్తయ్యకు అబద్ధం చెప్పి వెళ్ళావని, మనకు పెళ్ళి చేయరని తలచి, ఇద్దరమూ కలిసి రైలు కిందపడి చచ్చిపోదామనుకున్నామని, ప్రేమికుల మధ్య ఇలాంటి పరిస్థితే రాత్రి వచ్చిన ‘ఇది కథ కాదు’ ఎపిసోడ్ లో చూశానని, అందులో ప్రేమించుకున్న ఇద్దరూ ఇలాగే రైలు కిందపడి చనిపోయారని గోల గోల చేసి నాన్నకు పిచ్చెక్కేలా చేసింది. తరువాత నేను వచ్చాక నన్ను నీ గురించి అడిగారు. ఆ బొమ్మ నువ్వే గీశావని, నీతో పెళ్ళి కాకపోతే నేనూ అలాగే చేస్తానేమో అని బిల్డప్ ఇచ్చి వాళ్ళను భయపెట్టాను. ఆ దెబ్బతో అమ్మ గట్టిగా పట్టుబట్టి నాన్నను ఒప్పించింది. అప్పుడు ఇక చేసేదిలేక నాన్న మీ ఇంటికి వచ్చాడు. అలా జరిగింది బావా ఆ రోజు. ఇక తరువాత జరిగిందంతా నీకు తెలిసినదే. ఏమైనా బావా.. మీ ఎడిటరుకు మనం కృతజ్ఞతలు చెప్పాలి” అని అసలు విషయమంతా చెప్పింది వారణాసి.
“అమ్మో.. అసలు విషయమేమి లేకుండా ఇంత విషయం జరిగిందా. ఇప్పుడు మనం థాంక్స్ చెప్పాల్సింది మన సంపాదకుల వారికి కాదు, టి.వి. ఛానల్ వారికి. అందులో వచ్చే నాటికలు చూడబట్టే కదా మీ అమ్మ ఇంత చిత్ర, విచిత్రమైన కథ అల్లగలిగింది. హాట్సాఫ్ టు టెలివిజన్ ఛానల్స్” అంటూ వారణాసి తలపట్టి ఊపాడు.
“కానీ మొదటి పాత్ర మాత్రం సంపాదకుల వారిదే. ఆయన ఆ కాన్సెప్ట్ ఇవ్వబట్టే కదా.. నువ్వు బొమ్మ గీసింది. అది చూడబట్టే కదా.. మా అమ్మ ఆ చిత్రానికి విచిత్రమైన కథ అల్లగలిగింది” అన్నది వారణాసి.
“ఓకె.. ఎలాగైతేనేం మనిద్దరం ఒక్కటయ్యాము. మరొక్కసారి టెలివిజన్ వారికి, సంపాదకుల వారికి ధన్యవాదములు తెలియజేస్తూ…” అంటూ దిగ్గున లేచి లైటాఫ్ చేశాడు మధురాంతకం.
“బావా.. ప్లీజ్.. లైట్ వెయ్యి” అని ఏదో చెప్పబోతున్న వారణాసి మాటలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఏం జరగబోతుందో తెలిసి చీకటి కూడ సిగ్గుపడి తలవంచుకుంది.