Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-58

దుఃఖానికి హేతువు

ప్రసూనకు అది బాగా నచ్చిన ప్రదేశం. అందుచేత ప్రతి ఏటా వేసవి సెలవుల్లో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకొని వెళ్తుంటుంది. పుణ్యక్షేత్రం కూడా అయినందు వల్ల అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

కొండ అంచున నిలబడి అందమైన సూర్యోదయాలనూ, సూర్యాస్తమయాలనూ చూస్తుంటుంది. ఆ కాసేపు మనసు సేద తీరి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

ఆ వేళ గార్డెన్‌లో కూర్చుంది. గతం ఆమె కళ్ల ముందు కదలాడింది.

అయిదు సంవత్సరాల కిందట భర్త శ్యాంప్రసాద్‌తో కల్సి వచ్చినప్పుడూ ఇక్కడే కూర్చుంది. అప్పుడూ ఇలాగే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆయన ఏదో చెబుతున్నాడు. ఆమె వినటం లేదు. తన మాట వినిపించుకోనందుకు ప్రసాద్‌కు కోపం వచ్చింది.

“నా మీద గౌరవం లేదు. నేను ఏం చెప్పినా వినవు. నేనంటే లక్ష్యం లేదు. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు?” అని విసుక్కున్నాడు.

అంతకు ముందే ఆమెని విసుక్కున్నాడు. కసురుకున్నాడు. ఆమె మనసు గాయపడింది. కోపంతో మూతి ముడుచుకుంది.

అతనిది అదో చిత్రమైన మనస్తత్వం. నోటికి ఎంత మాట వస్తే అంత మాటా అనేస్తాడు. అంతలోనే ఏం జరగనట్లు మామూలుగా మాట్లాడతాడు. తనూ అంత తొందరగానే అన్నీ మర్చిపోయి ఏమీ జరగనట్లు చిరునవ్వులు చిందించాలని అంటాడు. అది ఎలా కుదురుతుంది? ప్రతి మనిషికీ ఒక మనసు ఉంటుంది గదా. అది గాయపడితే కోలుకోవటం సాధ్యమేనా?

కొంతమంది సంతోషానికి సేతువులుగా ఉంటారు. మరి కొందరు దుఃఖానికి హేతువుగా మాత్రమే ఉంటారు. వివాహం పేరుతో స్త్రీ జీవితం పురుషుడితో విడదీయలేనంతగా ముడిపడిపోతుంది. అయితే అతను ఆమెను ఆనంద రసమాధురి కురిసే చోటుకు నడిపిస్తాడా, లేక అడుగడుగునా దుఃఖార్తిని మాత్రమే మిగులిస్తాడా అన్నది అతని మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎలాంటి వాడు దొరుకుతాడో తెలియదు.

ప్రసూన బ్రతికినంతకాలం అందాల లోకాల్లో, ఆనందాల అంచుల్లో బ్రతకాలని కోరుకుంటోంది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆమె నిర్ణయం అదే. ఎన్ని సమస్యలు ఎదురైనా జీవితాన్ని ప్రేమంచటం మానలేదు. ఆ ప్రేమ ముందు మిగిలినవన్నీ దిగుదుడుపే అయిపోయనయి.

భర్తతో ఘర్షణలు పడీ, పడీ విసిగిపోయింది. ప్రతి మనిషికీ ఒక స్థాయి వరకే ఓర్పు, సహనం ఉంటుంది. ఆ ఓర్పు, సహనం చనిపోయే దాకా ఆమె భర్త ఆమెను తరుముకుంటూ వెళ్లాడు. మనోవేదన తట్టుకోలేక పోయింది. నిత్యం గొడవలూ, కొట్లాటలూ తారాస్థాయికి చేరాయి.

భర్త మీద పోలీసు కంప్లయింట్ ఇచ్చింది. విడాకుల కోసం కోర్టుకు వెళ్లింది.

విడాకులు తీసుకున్న తరువాత ఏమీ జరగనట్లు, ఎంతో మాములుగా మాట్లాడాడు.

“రేపటి నుంచీ ఎక్కడ ఉంటావు?”

“ఏట్లో ఉంటాను. నీకెందుకు? నీతో కల్సి ఉండే ఈ అధ్యాయం ముగిసింది. రేపటి నుంచీ నీకూ, నాకూ ఎటువంటి అనుబంధమూ, సంబంధమూ లేదు. నీ కోపతాపాలు, ఛీత్కారాలు, ఛీదరింపులు లేని చోట ఉంటాను. నేను ఒక్కదానికీ బ్రతకటానికి తగినంత డబ్బు సంపాదించుకోగలను. నాకు పెద్దగా ఆశలు లేవు. ఆశయాలూ లేవు. జీవిత లక్ష్యం ఒక్కటే. బ్రతికిన నాలుగు రోజులు సుఖంగా, ప్రశాంతంగా, నా గౌరవానికి భంగం లేకుండా ఉంటాను. అక్కడ నన్ను తిట్టే వాళ్లు ఉండరు. తాగేసి వచ్చి చేతికి వచ్చిన దానిని మీదకు విసిరేసే వాళ్లు ఉండరు.. అది చాలు..” అన్నది ప్రసూన.

అలా దూరమయినాక, ఆ ఎడం రోజు రోజుకీ పెరుగుతూనే వచ్చింది. అయినా వాళ్లు బంధువులూ అందరూ ఆమెనే తప్పు పట్టారు. అందు చేత వాళ్లను ఎవరికీ దగ్గరకు రానివ్వలేదు.

ఈ ఒంటరి జీవితానికే అలవాటు పడింది.

కాస్తంత మానసిక ప్రశాంతత కోసమే, ఏడాది కోసారి వేసవి శలవుల్లో ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్తుంది.

బాగా చీకటి పడినందు వలన, ప్రసూన గార్డెన్ నుంచి బయల్దేరింది. రోడ్డు మీద నడుస్తోంది. వీధి దీపాలు లేవు. చీకటిగా ఉంది. వెనక నుంచి ఎవరో వెన్నంటి వస్తున్నట్లు అనిపించి నడక వేగం పెంచింది. వెనక వస్తున్న వాడూ వేగం పెంచాడు.

తొందరగా నడుస్తూ, చీకట్లో ముందున్నది ఏదో చూసుకోలేదు. గట్టిగా కాలికి ఏదో తగిలింది. ముందుకు పడిపోయింది. భూమాతకు సాష్టాంగ నమస్కారం చేసింది. లేచి దుమ్ము దులుపుకుంది. కాలికి గట్టి దెబ్బ తగిలింది. గాయం అయింది. నెత్తురు కారుతోంది.

వెనక వస్తున్న వ్యక్తి ఆమెను పట్టుకొని లేవదీశాడు. కాలికి బలమైన దెబ్బ తగిలినందు వలన నడవలేకపోతోంది.

“నా భుజం మీద చెయ్యి వేసి పట్టుకుని నెమ్మదిగా నడువు. దగ్గరలో ఆటో ఏదీ కనిపంచడం లేదు..” అన్నాడు.

ఆ గొంతు గుర్తు పట్టింది.

ఆయన ఇప్పుడు.. ఇక్కడ.. అనువుగాని చోట.. వేళగాని వేళ.. ఇలా ఎలా ప్రత్యక్షమయ్యాడు?

ప్రసూనకు ఇష్టం లేకపోయినా, తప్పలేదు.. ఆ రోడ్డు మీద, చీకట్లో కాలికి తగిలిన బలమైన దెబ్బతో, అతని ఆసరాతో గాని, నిలబడలేకపోతోంది. నడవలేకపోతోంది.

రూం దాకా తీసుకొచ్చాడు. ఆమెను బెడ్ మీదకు చేర్చాడు.

“డాక్టర్‌ను తీసుకొస్తాను” అన్నాడు ప్రసాద్.

“అక్కర్లేదు.. మీకు శ్రమ ఇచ్చాను.. థాంక్స్.. ఇంక వెళ్లండి” అన్నది ప్రసూన నిష్కర్షగా.

ప్రసాద్ వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం ఎనిమిదిగంటలకు వచ్చి తలుపు తట్టాడు. అప్పటికి ఆమెకు బాగా జ్వరం వచ్చింది.

అక్కడి నంచీ ప్రసాద్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డాక్టర్‌ని తీసుకొచ్చాడు. కాలికి కట్టు కట్టించాడు. ఇంజెక్షన్ ఇప్పించాడు. బ్రెడ్, కాఫీ తెచ్చి ఇచ్చాడు.

“నేను వెనక వెంబడిస్తుంటే, నువ్వు వేగంగా నడిచినందువలన నీ కాలికి దెబ్బ తగిలింది. అందుచేత నీకు దెబ్బ తగలటానికి నేనే కారణం. నయమయ్యే దాకా సాయం చేయాల్సిన డ్యూటీ నాకు ఉంది” అన్నాడు ప్రసాద్.

ప్రసూన గొప్ప విరాగిని లాగా అదోలా నవ్వింది.

“మీ వల్ల ఇదొక్కటే కాదు. ఇంతకు ముందే ఎన్నో దెబ్బలు తిన్నాను. ఒకసారి తాగొచ్చి నా తలను గోడకేసి కొట్టావు. ఇంకోసారి చేతిలోని గ్లాసు నా ముహం మీదకు విసిరేశావు. మూడు కుట్లు వేయాల్సి వచ్చింది. ఇక మనసుకు తగిలిన దెబ్బలు ఎన్నో? లెక్క లేదు. హృదయం బద్దలైపోయింది. అదొక నరకం..” అన్నది ప్రసూన.

“అవన్నీ నిజమే. నిన్ను చాలా బాధలు పెట్టాను. రాక్షసుడిలా ప్రవర్తించాను. అప్పట్లో నువ్వు అన్నీ భరించావు. అడిగీ అడగక ముందే నువ్వు అన్నీ అమర్చి పెడుతుంటే నీ విలువ తెలియ లేదు. నువ్వు దూరమైనప్పటి నుంచీ నీ ప్రాముఖ్యం ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చింది. నిన్ను దూరం చేసుకున్నాక నా జివితం మండుటెండలో ఎడారి దారిలా మారింది. కన్ను మూసినా, కన్ను తెరిచినా నువ్వే గొర్తొస్తున్నావు. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను” అన్నాడు ప్రసాద్.

“మనం విడిపోయాం. చెరోదారి అయింది. అయిన అనుభవాలు చాలు. మళ్లీ పెళ్లి చేసుకో. ఈ దేశంలో బలిపశువులుగా మారేందుకు సిద్ధపడే ఆడవాళ్లకు కొదవ లేదు. కొట్టినా, తిట్టినా, కత్తి పెట్టి ముక్కలు ముక్కలుగా నరికినా చెరగని, తరగని చిరునవ్వుతో సదా మీకు సేవలు చేసి, నీ పాదలు కడిగిన నీళ్లను తీర్ధంలా పుచ్చుకునే ఉత్తమ సాధ్వీమణిని చేసుకో.. నాకు కన్నీటి వాన వెలిసిపోయింది. ఇప్పుడు తెరిపిగా ఉంది. హాయిగా నిశ్చింతగా గాలి పీల్చుకుంటున్నాను. నా రోజులు ఇలా గడిచిపోతే చాలు..” అన్నది ప్రసూన.

“నా తప్పులు నేను తెల్సుకున్నాను. నేను ఇది వరకటి మనిషిని కాను. తాగటం మానేశాను. జరిగినదంతా ఒక పీడకలగా మర్చిపోదాం..” అన్నాడు ప్రసాద్.

ఆమె మౌనం వహించింది.

వారం రోజులు పాటు ప్రసాద్ సేవలు చేశాక ఆమెకు జ్వరం తగ్గింది.

ఇద్దరూ దేవుడి దగ్గరకు వెళ్లారు.

“ఈ బంధాన్ని ఇకనైనా శాశ్వతంగా ఉండిపోనీ..” అని ప్రసాద్ భగవంతుడ్ని ప్రార్థించాడు.

“సంతోషానికి సేతువు, దుఃఖానికి హేతువు మన మనసే” అన్నది ప్రసూన బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్న తరువాత.

Exit mobile version