Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-32

వీడని నీడలు

బుక్ ఎగ్జిబిషన్‌లో ఒక స్టాల్‌లో నిలబడి పుస్తకాలు చూస్తున్న మల్లిక భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. మల్లిక వెనక్కు తిరిగి చూసింది.

“బాగున్నావా?” అంటూ ఆమె పలకరించినా, మల్లిక వెంటనే గుర్తుపట్టలేకపోయింది.

“నేను నీ క్లాస్‌మేట్ సునందను…” అన్నదామె మల్లిక అవస్థను అర్థం చేసుకొని.

అప్పుడు మల్లికకు గుర్తొచ్చింది. కాలేజీ వదిలిన తరువాత మళ్లీ కల్సుకోలేదు. పైగా ఇప్పుడు ఇది వరకటి సునంద కాదు. గెటప్ చాలా మారిపోయింది. మనిషి కొంచెం లావు అయింది. కళ్లజోడు కొత్తగా వచ్చిన ఆభరణం అయింది,

ఇద్దరూ స్టాల్‌లో నుంచి బయటకు వచ్చారు.

“ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? పెళ్లి అయిందా? మీ వారు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంత మంది?” అని మల్లిక వెంట వెంటనే ప్రశ్నలు సంధించింది.

“వడగళ్ల వాన కురిసినట్లు అన్ని ప్రశ్నలు ఒక్కసారే గుప్పిస్తే ఎలా? ముందు దేనికి సమాధానం చెప్పాలో తెలియటం లేదు…” అన్నది సునంద నవ్వుతూ.

సునంద చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి “ఇవన్నీ చదువుదామనే?” అని అడిగింది మల్లిక.

“నాకు వేరే పనేముంది? పుస్తకాలే నా ప్రపంచం…” అన్నది సునంద.

ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చారు.

“ముందు మా ఆఫీసుకు వెళ్దాం. అక్కడో అరగంట ఉండి, మా ఇంటికి వెళ్దాం…” అన్నది సునంద.

మల్లిక మౌనంగా తలూపింది.

కారు ఒక బహుళ అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది. ఇద్దరూ ఆ బిల్డింగ్‌లో ఉన్న ఒక చిన్న కంపెనీ ఆఫీసులోకి వెళ్లారు. సునంద సరాసరి తన గదిలోకి వెళ్లింది, మల్లికతో పాటు.

ఒకరి తరువాత మరొకరిని నలుగురిని పిలిచింది. ఆఫీసు విషయాలు ఏవో మాట్లాడింది. ఆ కాసేపు సునంద డాబు దర్పం, ఠీవి చూస్తూ విస్తుపోయింది మల్లిక, తన స్నేహితురాలు ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందో చూసి, ఇది ఒకప్పటి తన కాలేజీ లోని సునందయేనా అని వింతగా చూస్తోంది.

సాయంత్రం ఆరు గంటలకు ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. మల్లిక ఆమె వెనకనే నడుస్తోంది. కారులో ఇంటికి బయలుదేరారు.

ఆ రోజుల్లో సునంద చాలా పిరికిగా ఉండేది. ప్రతి దానికీ భయపడుతుండేది. నలుగురితో కల్సేది కాదు. బిడియపడుతూ, అల్లంత దూరాన కనిపిస్తూ, భీతహరిణేక్షిణిలా ఉండేది. అలాంటి సునంద ఇంత ధైర్యంగా, ధీమాగా, ఎవడినైనా కాలరు పట్టుకొని దబాయించేంత ధీశాలిగా ఎదిగింది. కొన్నేళ్ల వ్యవధిలో ఒక మనిషిలో, అందులోనూ బెదురు చూపులు చూసే ఆడపిల్లలో ఇంత మార్పు సాధ్యమా – అని ఆలోచిస్తోంది మల్లిక.

కారు జుబిలీ హిల్స్ లోని అధునాతనమైన, అందమైన, ఖరీదైన ఇంటి ముందు ఆగింది. గూర్ఖా గేటు తీశాడు. కారు లోపలికి వెళ్లింది. పని వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు.

ఇద్దరూ హాలులోకి వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. లోపలి డెకరేషన్ అంతా సినిమా సెట్టింగ్ కన్నా మిన్నాగా ఉన్నది.

“ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు?” అని అడిగింది మల్లిక.

“ఎవరుంటారు? నేనూ ఇద్దరు పని వాళ్లు. వంట మనిషి రెండు పూటలా వచ్చి వంట చేసి వెళ్లిపోతుంది…” అన్నది సునంద.

“పెళ్లి చేసుకోలేదా?” అని అడిగింది మల్లిక.

“చేసుకోలేదు…”

“ఏం?”

“ఒకప్పుడు నన్ను చేసుకోవటానికి ఎవరూ ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవర్ని చేసుకోవటానికీ నేను ఇష్టపడటం లేదు…”

“అదే, ఎందుకని అలాగా?…”

సునంద వెంటనే సమాధానం చెప్పలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయింది.

మళ్లీ మల్లికే అన్నది “నేను చూసిన ఆనాటి సునంద వేరు. ఇవాళ చూస్తున్న సునంద వేరు. ఒకమనిషి జీవితంలో ఇంత వ్యత్యాసం… ఇంత వేరియేషన్… సాధ్యమేనా అనిపిస్తోంది…”

“సాధ్యమే. నేనే నిదర్శనం… భయపడినంత కాలం… అందరూ భయపెడుతూనే ఉంటారు. పిల్లిని కూడా గదిలో ఒక మూలకి తరిమి కొడతుంటే, ఎదురు తిరుగుతుంది. ఒకసారి ఆ మెండి ధైర్యం వచ్చాక, ఇంక నీకు ఎదురుండదు. భయము ఉండదు. బీదరికమూ ఉండదు… నాలో ఇంత మార్పు రావటానికి కారణం ఒకరకంగా ఆనాటి నువ్వూ, నీ మిత్ర బృందం… ”

“నేనా?” ఆశ్చర్యంగా అడిగింది మల్లిక.

“నువ్వూ అంటే, కాలేజీలో ఆనాటి మీ గ్రూపు అంతా… మీరెవరన్నా కనిపిస్తే, ఈనాటి నా పరిస్థితిని మీకు చూపించాలనే ఇన్నాళ్ల నుంచీ ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నువ్వు చిక్కావు…” అని నవ్వింది సునంద.

ఇంతలో ఇద్దరికీ కాఫీలు, టిఫెన్లూ వచ్చాయి. వాటి ఆరగింపు అయ్యాక సునంద గట్టిగా గాలి పీల్చి వదిలింది. ఏదో ఆలోచిస్తూ గతంలోకి వెళ్లిపోయింది. నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది.

 “నేను చిన్నప్పుడు ఎవరితోనూ కల్సేదాన్ని కాదు. మీ అందరికీ అల్లంత దూరాన ఉంటుండేదాన్ని, దానికి కారణం నా పేదరికమే. బీదరికం జీవితానికి ఒక రాచకురుపు లాంటిది. మనకు తెలియకుండానే మన మనసును తొలిచేస్తూ ఉంటుంది. కృంగదీస్తూ ఉంటుంది. అందరిలాగా నిండుగా, హాయిగా నవ్వనివ్వదు. అందరితో కలవనివ్వదు.”

“కాలేజీలో చదువుకునే స్తోమత లేకపోయినా, చదువు మీద ఉన్న వ్యామోహం కొద్దీ, డిగ్రీలు లేకపోతే భవిష్యత్తు లేదన్న ఆభిప్రాయం కొద్దీ కాలేజీలో చేరాను. ఫీజులు కట్టేందుకు, పుస్తకాలు కొనేందుకు డబ్బు ఉండేదికాదు. ఆ రోజులు అలాంటివి. మీ అందరి పరిస్థితి వేరు.”

“ఆగర్భ శ్రీమంతుల ఇంట పుట్టారు. కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకోగల తల్లిదండ్రులున్నారు. మీరంతా నిశ్చింతగా నవ్వుకుంటూ, ఆరవిరిసిన పూల మాలికల లాగా పరిమళభరితంగా తిరుగుతుండేవారు. నేను కన్నీరు వర్షించే మేఘమాలికలా ఉండేదాన్ని…”

“లేని వాళ్లను చూస్తే, ఉన్న వాళ్లకు ఎప్పుడూ లోకువే. అందరిదే ఒకే క్లాసు అయినా, ఎవరి క్లాసు వాళ్లదే. మీ అందరూ భోగభాగ్యాల మీద నడుస్తుంటే, నేను డొంక దారుల్లో, ముళ్ల మార్గాన నడుస్తుండేదాన్ని. మీకు కార్లు, డ్రెస్సులూ, హోదాలూ, హోటళ్లూ సినిమాలు, జల్సాలు, ట్యూషన్లూ, ఉండేవి. ఇన్ని ఉన్నాయి గనుక, పరీక్షలో కాపీ కొట్టే ధైర్యం ఉండేది. మీరు పరీక్షల్లో రాసిన దాన్ని చూసి కాకుండా, మీ తల్లిదండ్రుల పదవుల వల్ల మీకు మార్కులూ, గ్రేడ్స్ వచ్చేవి. డబ్బున్న వాడు దేన్ని అయినా కొనగలడు. ఇవేవీ లేనందు వల్ల నేను పరీక్షలో అత్తెసరు మార్కులే తెచ్చుకునే దాన్ని. ప్రతి పరీక్షలో ‘లాస్ట్ నుంచి నువ్వే ఫస్టు’ అని మీరు ఫక్కున నవ్వితే, గుండె బద్దలయిపోయేది.”

“మీరంతా గ్రూపులుగా తిరుగుతూ కాంటిన్‌కో, హోటల్‌కో, వెళ్లేవాళ్లు. అందరి దగ్గరా వద్దటే డబ్బు – అన్నట్లుగా ఉండేది. ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవాళ్లు. మీతో కల్సిపోలేకపోయేదాన్ని. దారిద్ర్యపు రేఖకు నేను ఎవగువా కాదు, దిగువనా కాదు, ఆ రేఖ తిన్నగా ఎప్పుడూ నా నుదుటి మీదే ఉండేది. అందుచేత మీ అందరికీ దూరంగా ఏ చెట్టు కిందనో నా టిఫెన్ బాక్స్ విప్పుకొని, తిని, మంచి నీళ్లు తాగేదాన్ని. అవి దొరికినందుకే సంతోషించాల్సిన పరిస్థితి కదా నాది. కానీ మీకు నా పరిస్థితి వింతగానూ, వినోదంగానూ ఉండేవి. ఒక రోజు బలవంతంగా నా టిఫెన్ బాక్స్ లాక్కొని తీసి చూశారు. అందులోని అటుకులను చూసి, పగలబడి నవ్వారు. ‘కుచేలుడు, శ్రీకృష్టుడి కోసం తెచ్చిన స్పెషల్ డిష్ ఇదేనే’ అని విరగబడి నవ్వారు. నూట ఒకటోసారి నా గుండె పగిలింది. కళ్ల వెంట కృష్ణా, గోదావరీ నదుల వరదనీరు పొంగిపొర్లింది.”

“మీ అందరికీ ఖరీదైన చీరలూ, డ్రెస్సులూ ఉండేవి. వేసిన డ్రెస్ వేసేవాళ్లు కాదు. నా చీరల గురించి, నా డ్రెస్సుల గురించి కామెంట్స్ చేసి, అమితమైన ఆనందాన్ని పొందేవారు. ఎంత దూరంలో ఉన్నా సునందను గుర్తు పట్టొచ్చు, అదే నీలం రంగు చీర… అని ఒకరంటే, ఎన్నేళ్ల తరువాత అయినా గుర్తుపట్టోచ్చు అని మరొకరు అంటే… ఆ రాత్రి ఆత్మహత్య చేసుకోవాలన్నంత దుఃఖం వచ్చింది. జాతీయ పతాకంలోని రంగులూ, సునంద చీర రంగులూ ఎప్పటికీ మారవు అన్న మీ మాటలు విని గొంగళి పురుగులాగా నాలోకి నేనే కుంచించుకు పోయాను.”

“నా చంక కింద డ్రెస్ చిన్నగా చిరిగింది. మీరంతా చుట్టూ చేరి చిరుగులో వేలు పెట్టి పెద్దది చేశారు. పగలబడి నవ్వారు. నా శరీరాన్ని కత్తితో నిలువునా చీరినట్లు, నెత్తురే కన్నీరు అయింది. అది చాలదన్నట్లు మర్నాడు, సూది దారం తెచ్చి, ఒక చిన్న మీటింగు పెట్టి, నాకు బహుకరించారు…”

“తెల్లవార్లూ ఏడుస్తూనే ఉన్నాను… తెల్లారి లేచి కళ్లు తుడుచుకున్నాను… నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. అవును… మా అమ్మ పనిమనిషి. మా నాన్న కూలి పనికి వెళ్తాడు. వాళ్లు రోజంతా కష్టడి సంపాదించుకోని ఆ కష్టార్జితంతో బతుకుతున్నారు… దేశాన్ని దోచుకొని, వాడి నోరు కొట్టి, వీడ్ని చంపి, వాఢ్ని చంపి, చెయ్యరాని అడ్డమైన, నీతి మాలిన, సిగ్గు లేని పననులన్నీ చేసి సంపాదించిన దౌర్భాగ్యపు, పాపిష్టి డబ్బుతో తెగతిని, ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న మీరు సిగ్గు పడాలి… థూ… ఏం బతుకులే మీవి?… అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను… ఇందాక చెప్పాను గదా… పిల్లి ఎదురు తిరిగిందని… ”

“ఇంక నా జీవితంలో దుఃఖం, బాధ, ఏడుపు అనే మాటలకు చోటు లేదు. నాకు న్యాయం, ధర్మం అనిపించిన మార్గంలో నడుస్తాను. ఎవరేమనుకున్నా… డోంట్ కేర్…”

“చదువు పూర్తి అయ్యాక, ఒక ప్రైవేటు కంపెనీలో స్టెనోగా చేరాను. ఆ కంపెనీ యజమాని చందూలాల్. ఎనభై సంవత్సరాల వయస్సులోనూ ఒంటి చేత్తో వ్యాపారం చేస్తూ, ఆ కంపెనీ నడుపుతున్నాడు. పాతికేళ్ల కిందట, ఆయన భార్య, కూతురూ ఒక కారు యాక్సిడెంటులో చనిపోయారు. మానసికంగా కృంగిపోయాడు. బంధువులను ఎవరినీ చేరనివ్వలేదు. ఒంటరిగా ఉండేవాడు. చేసేది వ్యాపారం అయినా, నీతి నీజాయితీకి కట్టుబడి బ్రతికేవాడు. ఆ నిజాయితీయే నాకు ఆయన పట్ల అపరిమితమైన అభిమానాన్ని ఏర్పరిచింది. నేను క్రమంగా వ్యాపార లావాదేవీలు తెల్సుకునే కొద్దీ, చాలా విషయాలు నా నిర్ణయాలకే వదిలేసేవాడు.”

“ఒకసారి ఆయనకు జబ్బు చేసిందని తెల్సి, వాళ్ల ఇంటికి వెళ్లాను. హాస్పటల్‌లో చేర్పించి, చికిత్సలు చేయించాను. ‘నిన్ను చూస్తుంటే, చనిపోయిన నా కుతురే తిరిగి వచ్చిందన్న ఆనందంగా ఉంది, బేబీ’ అనేవాడు. ‘మీరు మా కంపెనీ యజమాని. మాకు అన్నం పెడుతున్న తండ్రిలాంటి వారు. ఈ మాత్రం సాయం చేయటం గొప్ప ఏమీ కాదు. అది నా బాధ్యత’ అనేదాన్ని…”

“జబ్బు తగ్గిన తరువాత కూడా చాలా సార్లు ఆయన ఇంటికి వెళ్లాను. కొన్ని రోజులు ఆయన దగ్గరే ఉండిపోయేదాన్ని. ‘నువ్వు నాకు ఆఫీసులోనే కాదు, ఇంట్లోనూ సేవలు చేస్తున్నావు. నీ ముందు పండు ముసలి వాడినో, పది నెలల పసికందులో తెలియటం లేదు’ అని అన్నాడు. ఒక వారం రోజులు బాంబే తీసుకెళ్లి, అక్కడి వ్యాపారస్తులను పరిచయం చేశాడు.”

“క్రమంగా కంపెనీలో చాటు మాటున చెవులు కొరుక్కొవటం నా దాకా వచ్చింది. ఇది ముసలాడిని వలలో వేసుకుందన్న – విమర్శలూ వినిపించాయి. లోకులు కాకులు. తండ్రీ కూతుళ్లకీ, అన్నదమ్ములకీ అక్రమ సంబంధాలు అంటగట్టగల కుచించుకు పోయిన మనస్తత్వాలు గల మనుషల మధ్య బ్రతకాల్సి ఉంటుందని నాకు అర్థమైపోయింది.”

“చందూలాల్‌కి కాన్సర్ అని తేలింది. అప్పటి నుంచీ ఆయన నాకు అన్ని అప్పగింతలూ చేయటం మొదలు పెట్టాడు. ‘నా తరువాత కంపెనీ మూత పడుతుందేమో నన్న దిగులు ఉండేది. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. దేవుడే నిన్న నా దగ్గరకు పంపాడు’ అని కన్నీళ్లతో వీడ్కోలు తీసుకున్నాడు – కడసారిగా.”

“చిన్నప్పటి నుంచీ కాకిగోల భరిస్తూనే వచ్చాను. ఇప్పుడూ అదే గోల. క్రమంగా పాతవాళ్లను సాగనంపి, నాకు నచ్చిన వాళ్లను కంపెనిలో చేర్చుకున్నాను. ఫర్వాలేదు. జీవితం సాగిపోతోంది… తెరచాప లేని నావ లాగా…” అని ఆపింది సునంద.

“ఒక్కక్కరి జీవితం ఒక్కోరకంగా సాగిపోతుంటుంది. ఇప్పటికే బాగా స్థిరపడ్డావు. ఇప్పుటికైనా పెళ్లి చేసుకోవచ్చుగదా…” అని అడిగింది మల్లిక.

“చేసుకోవచ్చు. చేసుకున్నా వాడు గతాన్ని తవ్వుతాడు. వాడు ఎవడో నన్ను ఉంచుకున్నాడన్న అనుమానంతో సాధింపులు మొదలు పెడతాడు. వేధింపులతో విసిగిపోయాను. ఇంకా వాటిని భరించే ఓపిక నాకు లేదు…” అన్నది సునంద.

ఇంక వెళ్తానని లేచింది మల్లిక.

“ఇప్పుడే వస్తా నిన్ను ఇంటి దగ్గర దింపుతా…” అంటూ లోపలికి వెళ్లింది సునంద.

అందంగా ఎదురుగా నున్న నిలువెత్తి చందూలాల్ ఫోటో పాదాల దగ్గర హృదయం ఆకారం నున్న ఒక చిన్న పెట్టె బంగారు రంగులో మెరిపోతోంది.

అందులో ఏముందోనని మల్లిక ఆ పెట్టే తెరిచి చూసింది. ఆ పెట్టెలో ఒక దారపు ఉండ, సూది ఉన్నాయి. వాటిని మల్లిక తేలికగానే గుర్తు పట్టింది.

Exit mobile version