[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
బాడ్ ఫర్ ఈచ్ అదర్
ఒక్కో జంటను చూస్తే ఎంతో ముచ్చటగా కన్నుల పండుగగా ఉంటారు. ఈడూ జోడుగా ఉండటమే గాక అన్యోన్యంగానూ ఉంటారు. అలాంటి వాళ్ళను చూసినప్పుడు ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని అప్రయత్నంగానే అనేస్తుంటారు. కానీ ఇలాంటి జంటలు అరుదుగా నూటికో, కోటికో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. ఏ మాత్రం సఖ్యత లేకపోగా ఉప్పు, నిప్పులాగా ఉండేవాళ్లే మనకు ఎటు చూసినా కనిపిస్తుంటారు. వాళ్ల ఆలోచనలూ, అభిరుచులూ, అభిప్రాయాలూ మాటలూ అన్నీ ఉత్తర దక్షిణ దృవాల్లా ఉంటాయి. ఇంత పరస్పర విరుద్ధంగా ఉండే వీళ్లు కల్సి ఉండటమూ వింతగానే ఉంటుంది.
ఒక ఉన్నతాధికారికి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నయి. ఎప్పుడూ యమ బిజీగా ఉంటాడు. నిద్రలో ఉన్న కాసేపు తప్ప, మిగిలిన సమయంలో ఎప్పుడూ ఎవరి తోనో మాట్లాడుతునే ఉంటాడు. యువతరంలో లోపిస్తున్న క్రమశిక్షణ గురించి, దిగజారిపోతున్న నీతినియమాల గురించి వలువలు జారిపోతున్న విలువల గురించి చాలా బాధ పడిపోతుంటాడు. ఆయన భార్య పూర్తిగా ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఆయన ఆలోచనలకూ, మాటలను పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వదు. భర్తది అంతా ఒట్టి చాదస్తంగా కొట్టి పారేస్తుంది. సమాజంలో ఆయనకు ఎంత గౌరవం ఉన్నప్పటికీ, భార్య మాత్రం అతన్ని తీసి పారేస్తుంది.
ఒకసారి ఒక ముఖ్యమైన నాయకుడిని ఆయన రాత్రి భోజనానికి పిలిచాడు. ఆ సంగతి చెప్పగానే ఆమె విసుక్కుంది. “బయట ఎక్కడన్నా ఏడవండి. నాకు ఎనిమిది గంటల కన్నా తినేసి, పడుకోవటం అలవాటు” అన్నది. కానీ ఆయన ఎంత తొందర పెట్టినా అతిథి వచ్చేటప్పటికి తొమ్మిది గంటలు అయింది. అప్పటికే ఆమె తినేసి బెడ్ రూంలో పడుకుంది. భర్త బలవంతం మీద వచ్చి వంటింట్లో కూర్చుంది. వాళ్లు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గంటసేపు భోజనం చేశారు. ఆమె అయిదు నిముషాలకు ఒకసారి ఆవలించి చిటికెలు వేస్తోంది. కునికిపాట్లు పడుతోంది.
“మీకు ఒంట్లో బాగోలేదా?” అని అడిగాడు అతిథి.
“నాకేం? బ్రహ్మండంగా ఉన్నాను. మీరు మింగటం ముగిస్తే, లైట్లు ఆర్పి పడుకుంటా” అన్నదామె.
ఆమె అలా అన్న తరువాత ఆ అతిథికి ముద్ద మింగుడు పడలేదు. ఇంతకీ ఇంటాయన ఆ అతిథితో ఏ విషయం మాట్లాడాలనుకున్నాడో, ఇంకా ఆ టాపిక్‍కి రానే లేదు. ఆమె లైట్లు ఆర్పేసి పైకి వెళ్లిపోయింది.
ఒకసారి మరొక దేశాధినేత మన దేశానికి వచ్చాడు. ముఖ్యమైన కొద్దిమంది మాత్రం భార్యాసమేతంగా విమానాశ్రయానికి రావాలని ఆదేశాలు జారీ అయినయి. ఆయన భార్య ‘నేను రాను పొమ్మన్నా’ అతి కష్టం మీద ఆమెను ఒప్పించి విమానాశ్రయానికి తీసుకువెళ్లి, భార్యతో సహా ఆహ్వానం పలికే నాయకుల క్యూలో నిలబడ్డాడు.. తీరా ఆ దేశాధినేత వచ్చేటప్పుటికి ఆమె అక్కడి నుంచి జారుకుని వెళ్లి కారులో కూర్చుంది. విదేశీ నాయకుడికి పరిచయం చేసే వ్యక్తి “హి ఈజ్ మిస్టర్ దక్షిత్, షి ఈజ్ మిసెస్ దీక్షిత్” అని పక్కన ఉన్న మరొకరి భార్యను, ఈయన భార్యగా పరిచయం చేశారు. ఆ పరాయివాడి పెళ్ళాం అగ్గి మీద గుగ్గిలం అయింది. అదంతా మరో ప్రహసనం. భర్త తెలివితేటల్ని, వినయాన్నీ, చాకచక్యాన్నీ, ఈమె నిర్లక్ష్యాన్ని, విసుగును చూసినప్పుడు వారిద్దరూ ‘బాడ్ ఫర్ ఈచ్ అదర్’ అని అనకుండా ఉండలేరు.
***
రమాదేవి స్కూలు టీచర్. ఆమెకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఉన్నంతలో ఇంటిని శుభ్రంగా, నీట్‌గా అందంగా ఉంచేందుకు ఆమె రోజంతా కష్టపడుతూ ఉంటుంది. తెల్లవారక ముందే నిద్రలేచి ఇంటి పనులన్నీ ముగించుకుని వంట చేసుకుని, స్కూలుకు వెళ్లి, ఇంటికి వచ్చి ఒక గంట పిల్లలకు ట్యూషన్లు చెబుతుంది. గడియారంలోని ముల్లుతో పరుగులు తీస్తుంటుంది.
అయితే భర్తతో ఆమెకు కొన్ని సమస్యలు ఎదురువుతున్నాయి. నేరకపోయి ఒక ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకుంది. ఆయన అలవాట్లు వేరు. తొమ్మిదింటికి తీరికగా లేచి ఒళ్లు విరుచుకుంటాడు. మొహం కూడా కడగకుండానే కాఫీ తాగుతాడు. పదింటికి మొహం కడుగుతాడు. పన్నెండింటికి స్నానం చేస్తాడు. కాసేపు రచనా వ్యాసంగం అంటాడు. బీరువాలోని పుస్తకాలన్నీ తీసి సోఫాలో పరిచేస్తాడు. ఎటు చూసినా కాగితాలు, కలాలు. పరధ్యానంగా ఉంటాడు. పిలిచిన పది నిముషాల తరువాత గానీ పలకడు. ఇంటి నిండా సిగరెట్టు పీకలు. గడ్డం పెంచుతాడు. జుట్టుకు తైల సంస్కారం ఉండదు. ఇవన్నీ మేధావుల లక్షణాలని అంటాడు. ఈ తలకు మాసిన బద్ధకస్తుడిని చూస్తే రమాదేవికి పరమ చిరాకు. రాత్రి రెండు గంటలదాకా, నింగిలోని చుక్కల వంక చూస్తుంటాడు. ఏవో రాస్తూ కాగితాలన్నీ ఖరాబు చేస్తుంటారు. చిన్నప్పటి ప్రియురాలి మీద ప్రణయ కావ్యం రాశాడు. రమాదేవికి మండిపోయి, ఆ కాగితాలు తగలబెట్టేసింది. రాత్రి రాసిన కాగితాల కోసం పగలంతా వెతుకుతుంటాడు.
భర్త అలవాట్లు, పద్ధతులు, వేపు భాషలు నచ్చని ‘బాడ్ ఫర్ ఈచ్ అదర్’ బ్యాచ్ వాళ్లు మనకి చాలా మంది కనిపిస్తుంటారు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.