[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
విసిగించే విక్రమార్కులు
ప్రతి మనిషికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు ఎదుటి వారిని బాధించనంత వరకూ ఫర్వాలేదు. అవి శృతి మించినప్పుడే పక్కవాళ్లకు చిరాకు పుట్టిస్తాయి. ఏదైనా ఒకసారి చెబితే, ‘సర్లే’ అని ఊరుకుంటారు. రెండోసారి చెబితే “అబ్బ బోర్ కొట్టేస్తున్నావ్” అని అంటారు. మూడోసారి చెబితే “సుత్తి కొట్టేస్తున్నావ్” అని అంటారు. అలా విసుగు చెందకుండా చెప్పిందే చెబుతుంటే, భరించగలమా? అయినా సరే, వాళ్లు మాత్రం నస పెడుతునే ఉంటారు.
బామ్మగారు రోజూ పూజ చేసుకునే వెండి ఉద్ధరణి కనిపించటం లేదు. నిన్నటి నుంచీ ఆమె దాని గురించే పాట పాడుతున్నది. దాని కోసం ప్రత్యేకంగా ఏ దొంగో వచ్చి ఉండడు. ఇంట్లోనే ఎక్కడో ఉండి ఉంటుంది. కానీ అది దొరికే దాకా బామ్మగారు నరం మీద పుండ్లు సలిపినట్లు సలుపుతునే ఉంటుంది. ఆ ఉద్దరణికి ఓ చరిత్ర ఉంది. దాన్ని ఏకరువు పెడుతుంటుంది. అది ఎప్పుడు కొన్నది, ఎలాంటి పరిస్తితుల్లో కొన్నదీ, ఇన్నేళ్ల నుంచీ ఎంత ప్రాణప్రదంగా చూచుకుంటున్నదీ, స్నానం చేస్తూ పత్తితో వత్తులు చేస్తూ, భక్తితో పూజ చేస్తూ, సూర్యనమస్కారాలు చేస్తూ, ఇంకా పానీయంబుల్ ద్రావుచున్, లలితాసహస్ర నామముల్ చదువుచున్, వెండి ఉద్ధరణి విషయమే టీ.వీ. సీరియల్స్‌ను మించిపోయే ఎపిసోడ్స్‌తో – కనిపించిన వారితోనూ, కనిపించని అశరీరవాణులతోను, చెప్పిన చోట, చెప్పినవారికి చెప్పకుండా చెప్పుకొస్తూనే ఉంది. దేవుడి మందిరం కిందనే పడి ఉన్న ఆ పవిత్రమైన వస్తురాజమును వెతికి ఇచ్చి, ఇంక వాక్ప్రవాహాన్ని ఆపమంటే, “ఈ రోజుల్లో వెండి బంగారం అంటే లక్ష్యం, లేకుండా పోయింది. అందుకే ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏం, తిండికి సరిపోయి, సరిపోకుండా ఏడుస్తున్నారు” అంటూ స్తోత్ర పారాయణం అందుకుంది. ఆమె దేనికైనా పొగపెట్టిందంటే, ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే.
బామ్మగారి నోట్లో నుంచి ఊడిపడింది మనమరాలు. ఒక విషయం పట్టుకొంటే, ఇంక ‘ఫెవికాల్’ అంటుకున్నట్లే. “కోణార్కలో శేఖర్ కమ్ముల సినిమా ఆడుతోంది. వెళ్ళామ్మా” అంటుంది. “అలాగే” అంటే సరిపోదు.
ఆ సినిమా గురించి ఎవరెవరు ఏం చెప్పారో, ఇంటర్వల్ వరకు ఎందుకు బాగుందో, ఆ తరువాత ఎందుకు బాగా లేదో, అసలు అతని సినిమాలన్నీ సామాజిక స్పృహ ఉన్నవే అయినవి ఎందుకు ఉంటున్నాయో బాత్ రూంలోకి వెళ్లినా ఫాలో అయి చెబుతునే ఉంటుంది. ఒక్కసారి విసుక్కుంటే, “అవున్లే, మీకు ఇష్టమైతే చాలు, మీ ఫ్రెండ్స్‌తో ఫోన్‍లో గంటలు గంటలు, గంటలు గంటలు మాట్లాడుతూ తూ తూనే ఉంటారు. నేను మాట్లాడితే మాత్రం కసురుకుంటారు!” అలా అనంత వాహినిలా సాగిపోతూనే ఉంటుంది – అనేక రూపాల్లో, అనేక రాగాల్లో.
***
పక్కింటి సువర్చల కూడా ఇదే టైపు. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలని అంటుంది. ఆమె దృష్టిలో పట్టుదల అంటే పొగ పెట్టటం. “శ్రావణ శుక్రవారం వస్తోంది, పదివేలు పెట్టి పట్టుచీర కొనిపెట్టండి” అని అడిగింది. “ఈ నెలలో అత్తగారి మెడికల్ బిల్లు లక్ష రూపాయలు దాటింది. దసరాకి కొత్తచీర కొనవచ్చులే” అని ఆమె భర్త అన్నాడు. ఇక అక్కడ నుంచీ చీదేస్తునే ఉంది. “దసరా అంట, దసరా నాటికి చచ్చేదెవరో బ్రతికేదెవడో, ఇప్పుడు గతిలేదు గానీ, ఈ నెల రోజుల్లోనే ఏ ఫార్మ్‌హౌస్ నుంచి అయినా, కట్టలు కట్టలు, నోట్ల కట్టల అట్టపెట్టెలు ఏమన్నా దొరుకుతాయా? అయ్యో రామ, ఈ తోలు ముఖాలకు అంత అదృష్టం కూడానా? సగం జీవితం నిరర్థకంగా నిట్టూర్పులతోనే గడిచిపోయింది. అయినా నేనేమన్నా మైసూర్ మహారాజు పాలెస్ కావాలన్నానా? ఏడు వారాల నగలు దిగెయ్యమన్నానా? ఆఫ్టరాల్ ఒక ముష్టి పట్టు చీర, అడిగా. ఈ పక్కింటి మీనాక్షమ్మను చూడండి. బీరువా తెరిస్తే చాలు, కింద పడిపోయేలున్ని చీరలున్నయి. కూరలు కొనటానికి వెళ్లేటప్పుడు కాస్ట్‌లీ చీరలు కడుతుంది. ఇంతకీ రాసి పెట్టి ఉండాలి. నోచిన వారి నోములు అవి. నోచని వారికి దక్కునా? అయినా నా ఖర్మ. నోరు తెరిచి అడిగాను చూడూ, నా ఎడం కాలి చెప్పుతో నేనే కొట్టుకోవాలి..” ఇలా గోదావరి వరదలాగా సాగిపోయే కన్నీటి ప్రవాహానికి తట్టుకోలేక, ‘కొంగు తడిసిన వాడికి చలిగానీ, నిండా మునిగిన వాడికి చలి ఏమిటి?’ అని తనలో తనే పిచ్చివాడిలా గొణుక్కుంటూ, క్రెడిట్ కార్డు మీద ఆమె ఆడిగిన చీర కొని ఇస్తే, ఆమె ముహం నిండు చందురుని మించు అందంతో కళకళలాడిపోతుంది. భర్తను లొంగ దీసే ఆర్ట్ ఆమె సొంతం అయినట్టు ఫీలయిపోతుంది.
***
చలపతిరావు గల్లీ లీడరు. ఆ కాలనీకి ప్రెసిడెంట్ కావాలని ఆయన ఆశ. కానీ కాలనీ మెంబర్లు ఎవరూ ఆయనను దగ్గరకు రానివ్వరు – కారణం ఆయన ప్రతివాళ్లను తిట్టి పోస్తుంటాడు. పెద్ద పెద్ద నాయకులను కూడా వాడు ద్రోహి, వీడు దొంగ, వాడు పోరంబోకు వెధవ – అని బాహాటంగానే తిట్టిపోస్టుంటాడు. వీధి దీపం వెలగకపోతే, మొదలు పెడతాడు – “ఇంతమంది ఎమ్మెల్లేలు, మంత్రులు ఉన్నారు, ఏం గాడిదలు కాస్తున్నారండీ? వీధి దీపాలు వెలిగాయో లేదా చూడక్కర్లా? మేం పన్నులు కడుతున్నామండీ, వుయ్ ఆర్ పేయింగ్ టాక్సెస్ అండీ. ఒక పన్నా? ఒక లోకమా? ఆదాయం మీద పన్ను. ఇల్లు కొంటే పన్ను, అమ్మితే పన్ను, చొక్కా కొంటే పన్ను, చివరకు హోటల్లో ఒక ప్లేట్ ఇడ్లీ తింటే పన్ను.. పిండి వసూలు చేస్తున్నారండీ. కానీ వీధి దీపం గురించి పట్టించుకోరండి..” ఇలా సాగిపోతుంది ఆయన ధోరణి. ఏనాటికైనా ఒక మంత్రి అయినా అయిపోవాలన్న ఆశతోనే ఆయన అందర్నీ తిడుతుంటాడు. ఏమో కాలమే నిర్ణయించాలి మరి.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.