[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
దిగులు మేఘాలు
ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకుని, చిటపటమంటూ చినుకులు రాలి, చిరుజల్లుగా మారి, పెద్దవాన అయి, కుంభవృష్టిగా కురుస్తున్నప్పుడు ప్రకృతి యావత్తూ అచేతనం అవుతుంది. తడిసి ముద్దయి పోయిన కరెంటు తీగలు నిస్తేజం అవుతుంటయి. టీ.వీ.లు అంతరాయం కలిగినందుకు అలిగి ఆగిపోతుంటయి.
చీకటి ఆవరించిన ఆ గదిలోనుంచి బయటకు వచ్చి, వరండాలో కుర్చీలో కూర్చుని జ్ఞాపకాల గతంలోకి జారిపోతుంటారు అందరూ. చేతనావస్థ సమస్తమూ స్తంభించిపోయిన ఆ సమయంలో ఒక్కసారిగా మారిపోయిన పరిసరాలను పరిశీలించటం ఓ అరుదైన అందమైన అనుభూతి.
గేటు దగ్గరున్న నందివర్ధనం చెట్టు నగ్నంగా స్నానం చేస్తుంది. వీధి చివర ఎవరో బిచ్చగత్తె ఎన్నాళ్లు అయిందో స్నానం చేసి, ధారగా పడుతున్న ఆకాశ గంగలో నిలబడి, షవర్ బాత్ చేస్తున్నది, చిన్న పిల్లలు రెండు చేతులూ చాచి, సంతోషంతో గుండ్రంగా తిరుగుతూ, రాక రాక వచ్చిన వానను చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు కాలువలుగా ప్రవహిస్తున్నవాన నీటిలో కాగితం పడవలు వదిలి, అవి కొట్టుకు పోతుంటే, సంబరపడిపోయిన సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. కానీ ఇంటాయన సెల్‌ఫోన్‌లో తడిసి ముద్దయిన వై-ఫైలో తన స్కూటర్ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నదని చెప్పినప్పుడు, వాలు కన్నుల నీరు వరదలై పారుతుంది.
వానదేవుడికి తర తమ బేధాలు తెలియవు. నిమ్నోన్నతాలనూ పట్టించుకోడు. కోకాపేటలో ఇరవై అంతస్తుల మై హోమ్ మీద, బాబూఖాన్ ఎస్టేట్ మీద, తిరుపతి కొండల మీద, కన్నాట్ ప్లేస్ లోనూ, మెరీనా బీచ్ లోనూ, శ్రీశైలం అడవిలోనూ, న్యూయార్క్ స్క్వేర్ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఉరుములు, మెరుపులతో వర్షం పడొచ్చు. ఎవడి నెత్తిన అయినా అకస్మాత్తుగా పిడుగు పడొచ్చు. మొన్న చైనాలో నూట అరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు మనుషులు గాలిలోకి ఎగిరారు. భవనాల పైకప్పులు వాటంతటా అవే విహారానికి వెళ్లాయి.
మేఘాలు కన్నీరు మున్నీరు అయితేనేగాని, భూమి తల్లి ఒళ్లు పులకించదు. నేల తల్లి పచ్చి బాలింతగా మారితేనేగాని, పచ్చి గడ్డి అయినా మొలకెత్తదు. సృష్టి వైచిత్రమూ అదే గదా. ఒకరు కన్నీటి వర్షం కురిపిస్తేనే గాని, మరొకరి హృదయంలో హర్షం నిండుతుంది.
ఒక ఏడాది వర్షం కురవక పోతే ఎంత బీభత్సం అయిపోతుందీ లోకం? అంతటా దుర్భిక్షమే. చెరువులూ, పొలాలు, పైరు నాటిన రైతుల గుండెలూ, ఎండి బీటలు వారుతాయి. నాలుక తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకక, బిందెడు నీళ్ల కోసం, వాటర్ టాంక్ గేర్లు పట్టుకోవటం కోసం, జుట్లు పట్టుకొని పానీపట్టు యుద్ధాలు చేసే పడతులు ఎందరో.
వర్షాల కోసం అభిషేకాలు, యజ్ఞయాగాదుల దగ్గర నుంచి ఊరూరా కప్పల పెళ్లిళ్లు దాకా ఎంత యాతన? ఢిల్లీలోనూ, అమెరికాలోనూ ఎన్ని ప్రణాళికలు, ఎన్ని ప్రయత్నాలు? కృత్రిమ మేఘాలు సృష్టించడం కోసం మేధావుల మేధోమథనం? రాజకీయ నాయకుల వ్యంగ్యాస్త్రాలు, కరెంటు కోతలు. జీతాల కోతలు – ఎండల తీవ్రతకు ఎంతోమంది, శివ సాన్నిధ్యం పొందుతుంటారు.
పంటలు పండకపోతే, నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్ళేదెలా అని రోదన. అప్పులు చేసి, విత్తనాలు తెచ్చి, నాట్లు వేస్తే, అవి ఎండిపోతే, అప్పులు తీర్చేదెలా? ఆపసోపాలు. రుణాల మాఫీలు. ఎండరో పేదవారి బ్రతుకులే మాఫీలు.
ఇంత జరిగాక, –
ఎప్పటికో, అక్కడెక్కడో సముద్రంలో వాయుగుండం, ఇక్కడ మన గుమ్మంలో కృష్ణా గోదావరీ నదులు పరుగులు. వందల సంవత్సరాల చరిత్ర గల మహానగరాల్లో రహదార్లు.. అన్నీ నదులు పారే ఏరులుగా మారుతాయి.
“హైదరాబాద్‌కు సముద్రాన్ని తీసుకు వచ్చాం. రేపు ఓడ రేవులూ వస్తయి చూడండి” అంటూ ప్రతిపక్షాల వారి ఆక్షేపణలు. ఎక్కడ ‘మాన్‌హోల్సు’ ఉన్నాయో తెలియక అకస్మాత్తుగా గుంతల్లో పడి మాయమై పోయే మనుషులూ, డ్రైవర్ లేకుండానే, సాగిపోతున్న వాహనాలూ – కుళాయి నుంచి ఎర్రని మట్టి నీళ్లూ, సెల్లారు పోర్టన్లు అన్నీ చిన్నపాటి చెరువులూ, గుడిసెల్లో నివశించే వారి ఇళ్లల్లోకి, కన్నీళ్లలోనికి మోకాల లోతు నీళ్లు. పొయ్యి రాజెయ్యలేని పరిస్థితి. పల్లపు ప్రాంతాల వారిని పాఠశాలలోకి పంపుతారు. వానకు తడిసి, ఎండకు ఎండి, గుడి లోనో, బడి లోనో బితుకు బితుకుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పులిహోర పొట్లాల కోసం ఆబగా ఎదురు చూపులు. తిరిగి వచ్చేసరికి కూలిపోయిన గోడలు, ఇళ్లు, కొట్టుకుపోయిన గుడిసెలు, కొట్టుకు పోయిన పశువులూ –
బస్సులూ, రైళ్లు, విమానాలు – ఎక్కడిఎక్కడ ఆగిపోతాయి. జన జీవనమే స్తంభించి పోతుంది.
వరద బీభత్సం అంతా ఇంతా అని చెప్పటానికి వీల్లేదు.
వాన రాకపోతే ఒక బాధ.
వాన వస్తే ఒక బాధ.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.