Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-178

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

తూర్పు పడమర

సందేళ ఏడు కొట్టిన్రు.

కల్లు కాండులోకి జర్ర మంది రాబట్టిన్రు. ఇద్దరు ముగ్గురు గల్పి వస్తున్రు. ఇగ ఆడోళ్లు కూడా వస్తున్రు. గుంపులు గుంపులుగా అలగలగ్ కూసుని కల్లు తాగ షురు జేసిన్రు.

పది ఏళ్ల వయస్సున్న పోరడు కాంపౌండ్ అంతా దిరుగుతా అందరికి, పాకెట్లు, పలాస్టిక్ గళాసులు, పల్లి పాకెట్లు, ఇస్తుండు, అంతా పెద్దగ ముచ్చట్లు చెప్పుకుంటును. ఉత్తినే పెద్దగ నవ్వుతున్రు. అరుస్తున్రు. ఒకళ్లనొకళ్లు ఆటబట్టిస్తున్రు.

అంత లొల్లి లొల్లి అయితుంది.

యాదమ్మ ఒక్కతే నెమ్మదిగా నడుసుకుంట, ఇటు అటు అందర్ని జూసుకుంట కాంపౌండ్ లోనికి ఒచ్చింది. ఒకతాన గోడను అనుకుని కాళ్లు బార్ల బాపుకుని కూసుంది.

ఆమె అందరి వంక జూసింది. అందరూ ఆమె వంకనే జూస్తున్నరు.

అయిదు నిముషాలు అయినంక, సైదులు ఆమె పక్కన జేరాడు.

“ఒక్కదానివే గూకున్నవు. నీకు ఎవల్ లేరా?” అని అడగిండు.

“ఎవల్ ఎందుకు లేరు. మీదన దేవుకున్నడు. పక్కల నువ్వున్నవు. ఇంకెవల్ గావాల?” అని అడిగింది.

“గది అయితే నిజమే గాని, నీకు మగడు లేడా?”

“అప్పటి సంది ఉంటుండె. ఇడిసి పెట్టిండు.”

సైదులు యాదమ్మ వంక జూశాడు. యాభై ఏళ్లు ఉంటాయి. మడిసి కుసింత నల్లగ ఉన్నాగానీ, కండపట్టి మడిసి పొట్టిన, గట్టిగ, గిడిసబారినట్లుంది. ఇగ ముగం అయితే మంచి కళగనే ఉంది.

“ఏంటికి అట్ల జేసిండు. మంచిగ ఉన్నవు. ముగం జూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది. అట్ల ఎట్ల ఇడిసి పెట్టిండు?” అని అడిగిండు సైదులు.

“ఆడు నన్ను ఇడిసి పెట్టకముందే, నేనే ఆడిని ఇడిసిపెట్టిన..” అన్నది యాదమ్మ.

“ఆడు మంచిగ లేకుండెనా?”

“మొదలు మొదలు మంచిగానే ఉన్నడు. నాకు బిడ్డ పుట్టినప్పుడు ఇంకోదాన్ని మరిగిండు..”

“అవ్‌నా? తప్పే. ఇంతకి ఆడు ఏమి చేస్తుండె?”

“బిల్డింగ్ కట్టే మేస్త్రి కాడ తాపీ పని చేసేటోడు. ఇగ నేను బిడ్డను గనే సమయంలో, ఆడితాన ఇటికలు మోసే దాన్ని మరిగిండు, తినుడు, తాగుడు అంత దాని తానే జేస్తుండె..” అని యాదమ్మ ఏడిసింది.

“అరె, ఊకో, టీకో, పరేషాన్ కాకు. ఏమన్న తాగుతవ?”

“తాపిస్తే తాగుత..” అన్నది యాదమ్మ.

సైదులు పిల్లగాడ్ని పిలిసిండు. “రేయ్ పోరగా.. రెండు పాకెట్లు దీస్కరారా..” అని అరిసిండు.

పిల్లగాడు సారాయి, పల్లి పాకెట్లు దెచ్చిఇచ్చిండు.

“తాగు.. నీ మొగుడు లేడని పరేషాన్ గాకు, ఏడవమాక, నీకు నేను లేనా? మొగుడు పోతే ఏమైతది. ఇప్పటి సంది నిన్ను జూసుకుంట. ఇన్నవా? ఇంతకీ యాడుంటవ్?”

“గా సెరువు కట్ట లేదా? గాడనే ఉంట” అంటూ యాదమ్మ కల్లు తాగుడు షురు జేసింది.

ఇక అరగంట అయింది.

మత్తు నషాళానికి అంటింది.

“నువ్వు నిజమైన మొగోడివి. మొగుడివి. మొగుడు అన్నంక ఎట్లుండాల? పెళ్లాన్ని సుకపెట్టాల.. సుక పెట్టలేనడు ఏం మొగుడు?” అని వాగుతోంది.

“అవ్, ఇయ్యాల సంది నీకు మంచి రోజులు ఒచ్చినయ్ అనుకో.. నాకు తగిలినవ్.. అంటే ఇంక నీకుదినాం తాపిస్త. సొరగం జూపిస్త..”

“ఇంకా కావాల నాకు!”

“రేయ్ ఛోటే, లా రే..”

పది గంటల దాకా తాగుతునే ఉంది. వాగుతునే ఉంది. పక్కకు ఒరిగి పడిపోయేదాకా తాగుతునే ఉంది. సైదులు దాన్ని లేపి భుజం మీద దాని చేతులు వేసుకోని, నడుం పట్టుకుని బయటకు దీస్కపోయిండు.

***

న్యూపార్క్ మాల్ మేసీస్ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన ధనుష్క పార్మింగ్ లాట్‌లో నున్న తన కారు దగ్గరకు వెళ్లబోతూ ఎదురుగా నున్న జాక్స్ బార్ అండ్ రెస్టారెంట్ వైపు చూశాడు. నాలుగు అడుగులు అటువేసి తమాయించుకుని ఆగాడు.

‘ఫరే డ్రింక్.. టు గో.. ఆర్.. నాట్ టు గో ఈజ్ ద క్వశ్చన్.’

బార్ లోకి దూరటయా లేక దూరముగా పోవుటయా… అనునది ప్రశ్న!

“మనసు అలల చంచలమైనట్టిది. అనుక్షణమూ ప్రలోభపెట్టుచునే యుండును. స్థితప్రజ్ఞుడవు కమ్ము..” అని ఎవరో చెప్పినట్లు అనిపించినది.

స్థితప్రజ్ఞుడగుటకే నిశ్చయించుకుని తన కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. కారు రోడ్డు ఎక్కింది. మలుపు తిరిగింది. రెడ్ లైట్ పడగానే బ్రేక్ పడింది.

ఎంత స్థిరనిశ్చయుడై ఉండాలని అనుకున్నా, మనసు అటే.. లాగేత్తంది.. లాగేత్తంది.

కారు కొంచెం ముందుకు వెళ్ళింది.

“ధనుష్కా, బారు బీరు మంటున్న ఈ బారు లన్నియు సృష్టించిన వాడను నేనే.. బీరు చేయువాడను నేనే.. పోయు వాడను నేనే.. త్రాగు వాడను నేనే… నీవు నిమిత్త మాత్రుడవు” అని ఎవరో ఎదురుగా నిలిచి ప్రబోధించినట్లు అయింది.

కారు అసంకల్పితంగానే బ్రూసమ్ బార్ దగ్గర ఆగింది. ధనుష్క లోపలికి అడుగుపెట్టాడు. వీకెండ్ గనుక జనంతో నిండిపోయి ఉంది. ఎక్కడా టేబుల్ ఖాళీ లేదు. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరు సిగరెట్లు ఊదేస్తున్నారు. కొందరు ఉత్తినే భల్లున గాజుగ్లాసు పగిలినట్లు నవ్వుతున్నారు. కొందరు సీరియస్‌గా డిస్కషన్‌లో ఉన్నారు. మరికొందరు గోడ మీది టీ.వీ. లోని ఫుట్ బాల్ గేమ్ చూస్తున్నారు. అంతా సంతలా గోల గోలగా ఉంది. ఎవడి లోకం వాడిదే.

బార్ టెండర్ చుట్టూ అర్ధచంద్రాకారంలో నున్న ఎత్తయిన గట్టు చుట్టూతా ఉన్న ఎత్తయిన కుర్చీల్లో కొందరు కూర్చుని ఉన్నారు. గట్టుకు అవతల నున్న సర్వర్స్ వీళ్లకు కావల్సిన ఘన, ద్రవ పదార్థాలను ఘనంగా అందిస్తున్నారు చకచకా.

ఒక అమెరికన్ లేడీ పక్కనే ఉన్న కుర్చీ ఖాళీగా ఉంది. ‘ఓహో! అన్నీ మంచి శకునములే’ అనుకుంటూ ధనుష్క వెళ్లి, ఆమె పక్కన ఖాళీగా ఉన్న ఎత్తయిన కుర్చీలో కూర్చుని, ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు ఫీల్ అయినాడు.

పక్కన కూర్చున్న లేడికి యాభై ఏళ్లు ఉండొచ్చు. ఆమె అతని వంక చూసి నవ్వింది. అతను ఆమె ఒక వైపు చూసి నవ్వాడు. ఆమె చెయ్యి అందించింది. అతను ఆమె చేతలలో చెయ్యి కలిపాడు.

కుడి భుజమదిరే.. కుడికన్ను అదిరే..

“అయామ్ రోసిలిన్” అన్నది నవ్వుతూనే.

“అయామ్ ధనుష్క..” అన్నాడు నవ్వు తెచ్చుకుని.

ఎక్కడుంటావని అడిగింది. ఏం చేస్తుంటావని అడిగింది.

“ఫ్రీమాంట్‌లో ఉంటాను. ఐ.టి.” అని చెప్పాడు.

“ఆర్ యు సింగిల్ ఆర్ మేరీడ్?” అని అడిగింది.

“సింగిల్” అన్నాడు వైవాహికములందు బొంక వచ్చునని ఎక్కడో ఎప్పుడో చదివిన గుర్తు .

“అయామ్ ఆల్సో సింగిల్.. టుడే ఈజ్ మై బర్త్‌డే.. అండ్ దెరీజ్ నో వన్ ఫుర్ మి టు సే హేపీ బర్త్‌డే..” అని అన్నది రోసిలిన్ దిగులు పడిపోతూ.

“ఓ, ఈజిట్? హాపీ బర్త్‌డే టు యు” అన్నాడు ధనుష్క.

“థాంక్స్” అన్నది రోసిలిన్.

“అయ్ వాంట్ ఏ ఫ్రెండ్ లైక్ యు.. ఏ క్లోజ్ ఫ్రెండ్.. టు ఓపెన్ మై హార్ట్.. ఓపెన్ ఎవ్వెరిథింగ్ ఇన్ మై లైఫ్..”

పుట్టిన రోజు అని మరోసారి గుర్తు చేసింది.

“ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉండి ఏం లాభం? నా పుట్టిన రోజు నాడు నాకు ఒక డ్రింక్ ఇప్పించేవాడు లేడు.. లైఫ్ హాస్ బికం మిజరబుల్..” అని బాధపడింది.

ధనుష్క బేరర్‌ని పిల్చాడు. ఏం కావాలో చెప్పమన్నాడు. ఆమె స్కాచ్ ఆర్డర్ చేసింది. మంచింగ్ కోసం ఏవో ఐటమ్స్ చెప్పింది.

అవన్నీ వచ్చేలోగా రోసిలిన్ నవ్వుతూ అతని వైపు తిరిగింది. “థాంక్ యూ.. దాన్‌కుక్కా” అన్నది.

“దాన్‍కుక్కా కాదు, ధనుష్క, ధనుష్క” అని గుర్తు చేశాడు.

చెప్పినవన్నీ వచ్చినయి. మూడు సార్లు డ్రింక్స్ తెప్పించుకుంది.

“నాకు జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు” అన్నది. “అయామ్ సింగిల్.. యు ఆర్ సింగిల్.. నాట్ మేరీడ్? ఓఖె?” అని అడిగింది.

“ఓఖే” అన్నాడు.

“యు ఆర్ వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్” అంటూ అతని తొడ మీద చెయ్యి వేసింది.

విస్క్ వస్తూనే ఉంది. గ్లాసులు ఖాళీ అవుతునే ఉన్నయి.

ఇంతలో రోసిలిన్‌కు అవతలివైపు కుర్చీ ఖాళీ అయింది. ఎవరో గడ్డపు ఆయన ఏ దేశస్థుడో తెలియదు. వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.

రోసిలిన్ అటువైపు తిరిగింది. అతని వేషం గమ్మత్తుగా ఉంది ఆమెకు.

“ప్రమ్ విచ్ కంట్రీ యు ఆర్ ఫ్రమ్?” అని అడిగింది.

“నో ఐడియా..” అన్నాడు అతను.

“వాటీజ్ యువర్ రెలిజియన్?”

“నో ఐడియా..”

“వాటీజ్ యువర్ నేమ్?”

“నో ఐడియా..” అన్నాడు.

వాడితో లాభం లేదని రోసిలిన్ ఇయి తిరిగేటప్పటికీ, ధనుష్క బిల్లు చెల్లించి, కార్డ్ తీసుకుని  పరుగు పరుగున వెళ్లిపోతున్నాడు.

“ఏయ్ కుక్కా..” అని పిలిచింది రోసిలిన్.

అతను వినిపించుకోకుండా పరుగు పరుగున బయటపడి కారెక్కాడు.

“ఏమండీ! ఎక్కడున్నారు?” అని అడిగింది అతని భార్య యశోద.

“వస్తున్నా… ట్రాఫిక్ జామ్… ఎక్కడో యాక్సిడెంట్… బంపర్ టు బంపర్.. ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా.. వస్తున్నా..” అన్నాడు ధనుష్క.

Exit mobile version