Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-176

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఇల్లాలి పదవీ విరమణ

ప్రిన్సిపాల్ పద్మావతీ దేవి మధ్యాహ్నం లంచ్ ముగించి వచ్చి, సీట్లో కూర్చుంది. మేథమేటిక్స్ లెక్చరర్ మాధవి, ఇంకా ఇద్దరు లెక్చరర్లను వెంటబెట్టుకుని వచ్చింది. “మేడమ్, ఈ నెలలో మీరు రిటైర్ అవుతున్నారు గదా. అందుకని వీడ్కోలు పార్టీ ఇద్దామని అనుకుంటున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాం” అన్నది మాధవి.

వీడ్కోలు.. ఈ కాలేజీతో రుణం తీరిపోయిందన్న భావన రాగానే, పద్మావతీ దేవికి దుఃఖంతో గొంతు పూడుకు పోయింది. ఎలాగో తేరుకుని, నెమ్మదిగా – “వద్దండీ, వీలున్నంత కాలం చేతనైన సేవ చేశాను. ప్రతిఫలంగా ప్రతినెలా జీతం తీసుకున్నాను. ఇంకో రెండు వారాల్లో రిటైర్ అయిపోతున్నాను. ఏ ఆర్భాటమూ లేకుండా చివరి రోజున కూడా నన్ను నిశ్శబ్దంగా రోజూలానే వెళ్లిపోనివ్వండి” అన్నదామె. మిగతావాళ్లు ఏదో చెప్పబోయారు.

“మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెల్సు. కానీ ప్లీజ్.. ఈ విషయంలో నన్ను ఒత్తిడి చేయవద్దు. నా కోసం ఏ పార్టీలు, ఫంక్షన్లూ వద్దు. నేను రాను..” అని స్పష్టంగా చెప్పింది. లెక్చరర్లకు ఆమె సంగతి తెల్సు గనుక, అర్థం చేసుకుని వెళ్లి పోయారు.

చాలా సేపు ఆమె ఒంటరిగా చూస్తూ కూర్చున్నది. కిటికీలో నుంచి చూస్తుంటే కాలేజీ బిల్డింగ్ సగానికి పైగా కనిపిస్తోంది. ఆ భవనం ఇన్ని అంతస్తుల ఎత్తుకు ఎదిగిందన్నా, ఈ కాలేజీ ఇవాళ ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందన్నా దాని వెనుక పద్మావతీ దేవి అలుపెరుగక పడిన నిరంతర శ్రమ, ఆమె పరిపాలనా దక్షిత, అకుంఠిత దీక్ష అపారంగా ఉన్నాయి. ఒకప్పుడు చిన్న స్కూలుగా ప్రారంభమై ఇప్పుడు నెంబర్ వన్ డిగ్రీ కాలేజీగా పేరు సంపాదించుకుంది. ముప్పయి సంవత్సరాల పాటు ఆ స్కూలుతో, కాదు, ఈ కాలేజీతో ఆమెకున్న విడదీయలేని అనుబంధం ఇంకో రెండు వారాల్లో పోతుంది. ఈ రెండు వారాలు కూడా మానసికంగా సిద్ధం కావాలి. అందుకని శలవు పెట్టింది. చివరి రెండు రోజులు వచ్చి కూర్చుని వెళ్తే చాలు.. ఇంక గుడ్ బై.. ఈ దినచర్యకీ, ఈ బిజీ జీవితానికి, ఈ ఉరుకులు పరుగులకూ, ఈ భవ బంధాలకూ రేపటి నుంచి స్వస్తి. పద్మావతి దీర్ఘంగా నిట్టూర్చింది. అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు ముంజేతి మీద రాలి పడినయి.

***

రాత్రి పది గంటల సమయంలో పద్మావతీ దేవి మేడ మీద బాల్కనీ లోకి కుర్చీ లాక్కుని కూర్చింది. పక్కనే ఆమె భర్త ఆనందరావు కూర్చుని, మనపడితో కబుర్లు చెబుతున్నాడు. ఆమె భర్తతో చెప్పింది – “కాలేజీ కాళ్లు సెండాఫ్ ఇస్తామన్నారు. నేనే వద్దన్నాను” అని. “అదేమిటి పద్మా, ఇంతకాలం కల్సి పని చేశారు. పదవీ విరమణ చేస్తున్నప్పుడు అందర్నీ కల్సుకుని గుడ్‌బై చెప్పి రావటం కనీస మర్యాద కదా” అన్నాడు ఆనందరావు.

“ఇన్నాళ్లూ సహకరించినందుకూ, అందరికే ఒక సర్క్యులర్ పంపించి, దాని మీద వాళ్ల అభిప్రాయాలూ, శుభాకాంక్షలు రాయించి, దాన్ని దాచుకుంటాను. ఆది చాలు. సభలో అందరి ముందూ ఉద్వేగాన్ని ఆపుకోలేక, బేలగా కన్నీరు కార్చటం ఎందుకో నాకు నచ్చటం లేదు. ఇన్నాళ్లూ ఎంతో హుందాగా, గంభీరంగా ఉంటూ, నిండుగా నవ్వుతూ పని చేశాను. ఆ హుందాతనాన్నీ, గాంభీర్యాన్ని చెరగనివ్వడం నాకు ఇష్టం లేదు” అన్నది పద్మావతీ దేవి.

ఆయన “చాలా బావుందే” అని కొంచెం వ్యంగ్యంగా అన్నాడు.

కొంచెంసేపు ఆగి ఆమె ఇంకో బాంబు పేల్చింది. “ఇంకోమాట కూడా చెప్పదల్చుకున్నాను. వచ్చే ఒకటో తారీఖు నుంచి, ఈ ఇల్లాలి ఉద్యోగం నుంచీ రిటైర్ కావాలనుకుంటున్నాను” అన్నది.

ఆయన ఆశ్చర్యంగా చూసాడు. “అంటే, కొంచెం అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పు” అన్నాడు.

“మరేం లేదు. సంసార బాధ్యతల నుంచీ తప్పుకుందామనుకుంటున్నాను. ఎక్కడైనా ఒక ఆశ్రమంలో చేరి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటున్నాను” అన్నది.

ఆయన పగలబడి నవ్వాడు.

“నవ్వటం కాదు. నేను నిజంగానే చెబుతున్నాను. ఈ బాధ్యతలన్నీ వదిలించుకుని, సుఖ దుఃఖాలకు అతీతంగా, భావోద్వేగాలు, రాగద్వేషాలు లేకుండా నిర్మలమైన మనసుతో జీవిస్తాను” అన్నదామె.

“చిన్న పార్టీ ఇస్తానంటేనే ఉద్వేగం అదుపు చేసుకోలేక ఏడ్చేస్తానని అంటున్నదానివి, రాగద్వేషాలకు అతీతంగా ఉండగలవా పద్మా?” అన్నాడాయన.

“ప్రయత్నిస్తాను” అన్నదామె.

ఆ రాత్రి అంతా అదే ఆలోచన. గతం అంతా కళ్లముందు కదిలింది. జీవితం ఎక్కడ ప్రారంభం అయింది? ఎంత దూరం ఈ ప్రయాణం సాగింది? పెళ్లి ఆయి ముప్ఫయి అయిదు సంవత్సరాలు అయింది. అప్పట్లో ఇంత లావుగా ఉండేది కాదు. మొహం ఇంత ముదురుగా ఉండేది కాదు. బంగారు రయఛాయ. ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతుందో అన్నట్లు ఉండేది. నవనవలాడే లేత తమల పాకులాంటి నాజూకుతనం – అవన్నీ కాలప్రవాహంలో ఒక్కటొక్కటిగా తుడిచి పెట్టుకు పోయాయి. నలుగురు పిల్లలు, ఇద్దరు కొడుకులు. ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేసి సాగనంపింది. ఎవరి సంసారంలో వీళ్లు తలమునకలుగా ఉన్నారు. అప్పుడప్పుడు కనిపించి పోతుంటారు. కాదు, పారిపోతుంటారు కొంపలు అంటుకు పోతున్నట్లు. ఒడిలో కూర్చుని, గోరుముద్దలు. వెన్నముద్దలు, పిన్నెల్లో ముద్దులూ పెట్టించుకున్న పసికూనలే తన కళ్ల ముందే తోటకూర కాడల్లా ఎదిగారు. పెరిగిన చెరుకు గడల్లా ఉన్నారు. పిల్లల్ని ఎత్తుకున్నారు.

కొన్నేళ్ల కిందట రెండు చిన్న గదుల్లో ప్రారంభం అయిన జీవన యానం ఇప్పుడ పైన ఆరు గదులు, కింద ఆరు. గదులూ ఉన్న సౌధంలోకి మారింది. సరే ఇక కార్లూ, పనివాళ్లూ.. ఆయన అవసరాలకు సరిపడా అన్నీ సమకూర్చుకున్నారు.. ఇవాళ తను ఈ ఇంట్లో లేక పోయినా వచ్చే లోటు ఏమీ లేదు. ఇంట్లో ఉన్నప్పటి నుంచి మునసు ఊరుకోదు. తనకు ఉద్వేగం, ఉద్రేకం ఎక్కువ. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా దుఃఖం వచ్చినా – అన్నీ ఎక్కువే. చివరకు బి.పి., షుగర్ కూడా ఎక్కువే.

ఈ చివరి రోజుల్లోనైనా, అన్నిటినీ అదుపులో పెట్టుకోవాలన్న కోరిక. ఇంట్లో ఉన్నంత కాలం, వీళ్ళందరి మధ్యా ఉన్నంత కాలం, ఈ ఇమోషనల్ లైఫ్ నుంచి దూరం కావటం అసాధ్యం. అందుకనే ఈ ప్రిన్సిపాల్ పదవి నుంచీ, ఇల్లాలి హోదా నుంచీ, భార్య, అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ – ఈ బంధాలన్నిటీ తెంచేసుకుని పోవాలని అనుకుంటున్నది.

***

పద్మావతీ దేవి ఒక ఆశ్రమంలో చేరింది. ఒక స్వామిజీ ఉన్నారు. ఆయన నాలుగు వేదాలు, పద్దెనిమిది పురాణలు గురించి చెబుతుంటారు. అనేకానేక విషయాలమీద ఉపన్యాసాలు ఇస్తారు. జననం, మరణం, ధనం, సంపాదన, వంటి ఎన్నో విషయాలు చెబుతుంటే వినసొంపుగా ఉంటాయి. విన్న కాసేపూ, నిజమేగా, ఇదంతా మాయే కదా – అని అనిపిస్తుంటుంది. తెల్లవారు ఝామున లేవాలి. చన్నీళ్ల స్నానం చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి. శరీరానికి స్నానం ఎలాంటిదో, మనసుకు ధ్యానం అలాంటిది. రాధాకృష్ణుల పూజ. కృష్ణుడు ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు. అందరికన్నా రాధను ఎక్కువగా ప్రేమించాడు, మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? స్వామి వారు దాని గురించి ఎంతో వేదాంతపరమైన బోధ చేశారు. రాధ ఆరాధ్యదేవతలకు దేవత. ఉపన్యాసాలు అయ్యాక రెండు పూటలా తేలికపాటి భోజనం. పద్మావతి ఆశ్రమంలో చేరి నెల రోజులు కావస్తోంది. ఆమెకు భర్త, పిల్లలూ, మనవళ్లూ, మనవరాళ్లు గుర్తుకొస్తున్నారు. మళ్లీ అంతలోనే మనసు మళ్ళించుకునేది.

ఒకరోజు పెద్దకొడుకు కారులో వచ్చాడు. ఖద్దరు చీరలోడి పేదరాలి వేషం వేసుకున్న పార్వతీ దేవి ఉన్న తల్లిని చూసి బాధ పడ్డాడు. “నీకు ఇదేం ఖర్మమే? బీరువాల నిండా అన్ని పట్టుచీరలూ, నగలూ, ఎయిర్ కూలర్లూ, వాషింగ్ మిషన్లూ, డిష్ వాషర్లూ ఉంచుకుని. నీకు ఈ పిచ్చి ఏమిటే?” అన్నాడు. ఇటికి వెళ్ళాం రమ్మన్నాడు. కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని చెప్పింది.

తరువాత కొడుకు వచ్చిన పని చెప్పాడు “అమ్మా నన్ను జిల్లాలో ఎక్కడో మారుమూలకి ట్రాన్సఫర్ చేశారు. అక్కడే ఉండలేం. మినిస్టర్ గారి కూతురు నీ ఓల్డ్ స్టూడెంట్ కదా. కొంచెం ఫోన్ చేసి చెప్పవే” అని బ్రతిమాలాడు.

కడుపున పుట్టినవాడు. పెద్ద కొడుకు. వాడి కష్టం తన కష్టం కాదూ? శ్రీదేవికి ఫోన్ చేసి చెప్పింది. “ఈ చిన్న సాయం చేసి పెట్టు. నీ మేలు మర్చిపోలేను” అన్నది పద్మావతీదేవి. “అయ్యో, మీరు అడగటం, నేను కాదనటమా? ఎక్కడ పోస్ట్ చేయించమంటారో చెప్పండి. రేపే చేయిస్తాను” అన్నది శ్రీదేవి.

వారం రోజుల తరువాత రెండో కూతురు వచ్చింది. దానికి ఇద్దరు పిల్లలు. యూటెరస్ ఆపరేషన్ ఏదో చేయించుకోవాలిట. రెండు రోజులు వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకోమని అడిగింది. ‘అయ్యో, పిల్లకు అంత అవసరం వస్తే వెళ్లక ఎలా?’ అంటూ వెళ్లి వారం రోజులు చిన్న కూతుకు ఇంట్లో ఉండి వచ్చింది.

నాలుగు రోజులపాటు మళ్లీ రాధాకృష్ణుల మీద మనసు నిలపకముందే, రెండో కొడుకు వచ్చాడు. వాడు లవ్ మేరేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరికీ సరిపడటంలేదు. విడిపోవాలనుకుంటున్నారు. వాడు తన బాధంతా చెప్పుకున్నాడు. పద్మావతీదేవి ఉండబట్ట లేకపోయింది. కొడుకు జీవితం అస్తవ్యస్తం అయిపోయిందని ఆగలేకపోయింది.

వియ్యపురాలి ఇంటికి వెళ్లింది. “విడిపోతే ఇద్దరి జీవితాలూ పాడవుతయి. మనం కలుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది.. తొందరపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయినదేదో అయిపోయింది. ఇప్పుడు మనం కలుగు చేసుకోవాలి” అంటూ వియ్యపురాలకి, కోడలికి నచ్చచెప్పి, వాళ్ళను మళ్లీ కుదుటపరిచి, ఆశ్రమానికి వచ్చింది.

స్వామీజీ ఆ రోజు చెప్పాడు – కృష్ణుడు తల్చుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడే. కానీ ఆయనే కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రేరేపించాడు. ఇది రాధకు ఇష్టం లేదు. ఎన్ని అక్షౌహిణిల సైన్యం నాశనమవుతుంది? ఎంతమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు? ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి? అని రాధ బాధపడుతూ కృష్ణుడిని అడిగింది. అప్పుడు కృష్ణుడు – “రాజు అనేవాడు ధర్మబద్ధంగా రాజ్యం చేయాలి. ప్రజలకు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. నిండు కొలువులో ఒక స్త్రీకి వస్త్రాపహరణం చేయబోయిన వాడు, మోసంతో జూదం గెలిచినవాడు, ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తారు? అటువంటి పాలకుని సారథ్యంలో ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడుపుతారు? అని రాధకు నచ్చజెప్పి యుద్ధానికి బయలుదేరుతాడు” అని స్వామీజీ చెప్పిన విషయం విన్నాకా, నిజమే కదా అనిపించింది.

మర్నాడు పెద్దకూతురు కారు పంపించింది. డ్రైవర్ చెప్పాడు “అయ్యగారికి, గుండెనొప్పి వచ్చిందండి. రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. అందరూ అక్కడే ఉన్నారు. మిమ్మల్ని తీసుకు రమ్మన్నారు” అని.

ఆదరాబాదరగా ఆమె బయల్దేరి ఆసుపత్రికి వెళ్ళింది. చావు బ్రతుకుల మధ్య స్పృహ లేకుండా ఉన్న భర్తను చూడగానే వెక్కి వెక్కి ఏడ్చింది.

కృష్ణుడిని తలచుకుని మనసులనే మొక్కకుంది. ‘నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు’ అన్న అయన మాటలు గుర్తుకు వచ్చాయి.

తెల్లవార్లు ఆయన పక్కనే కూర్చుంది. మర్నాడు ఆయన కళ్లు తెరిచి చూశాడు. ఆయన చేతిని తన చేతిలోనికి తీసుకుని కళ్లకు అద్దుకుంది.

Exit mobile version