[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
జీవితమే ఒక ఆట
మన ఆలోచనలే మన జీవితాలను నడిపించే రథ సారథులుగా మారుతయి. ఒక చిన్న విత్తనం భూమిలో పడి, అది చిన్న మొక్కగా మొలకెత్తి, మహా వృక్షంగా ఎదిగినట్లుగానే, ఆలోచనలే, మన చేత తదనుసారంగా అనేక పనులు చేయించి, మంచివానిగానో, చెడ్డవాడిగానో లోకం ముందు నిలబెడతాయి.
“యుద్ధం ఎలా వస్తుంది?” అని ఒక చిన్న పిల్లవాడు తండ్రిని అడిగాడు. “ఒక దేశాధినేత మనసులో మొదలు ఒక చిన్న ఆలోచన తల ఎత్తుతుంది. అది ద్వేషంగా మారుతుంది. కక్షగా రూపు చెందుతుంది. ఈ కక్షలే అనేక విధ్వంసకరమైన పనులకు ప్రేరేపించి, మిత్రులను శతృవులుగా మార్చి భయంకరమైన యుద్ధాన్ని సృష్టిస్తుంది” అని ఆ తండ్రి చెప్పాడు.
ప్రతివాడికి ఒక మనసు ఉంటుంది. అది అనేక ఆలోచనలు పుట్టే పుట్ట లాంటిది. అవి మంచివి కావచ్చు. చెడ్డవి కావచ్చు. వేటివైపు అతను మొగ్గు చూపుతాడు అన్నదే ప్రధానమైన అంశం.
అమెరికాలో వర్జీనియా లోని కొండలు కొనలు ఉన్న చిన్న పల్లెటూరిలో ఒకే గది ఉన్న ఒక చిన్న ఇంట్లో ఒక పెద్ద కుటుంబం నివసిస్తూ ఉండేది.
ఆ కుటుంబంలో ఒక కుర్రవాడు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉండగా ఆ అబ్బాయి తల్లి చనిపోయింది. తండ్రి మరో వివాహం చేసుకుని, ఆ భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. కుటుంబంలోని వాళ్లను రెండవ భార్యకు పరిచయం చేస్తున్నప్పుడు, ఈ చిన్న కుర్రాడు కోపంతో ఒక మూల నక్కి నిలబడ్డాడు. తండ్రి ఆమెతో అన్నాడు – “వీడు చాలా ఉడుకుమోతు వెధవ. రేపు నీ మీద రాళ్లు విసిరినా ఆశ్చర్యం లేదు” అని. కానీ ఆమె ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి గడ్డం ఎత్తి పట్టుకుని “లేదండీ, ఈ అబ్బాయి నా కుమారుడే. నన్ను అమితంగా ప్రేమిస్తాడు” అని ప్రేమగా చెప్పింది.
మర్నాటి నుంచి, ఆ సవతి తల్లి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆ కుర్రాడి కోపం పోగొట్టింది. అతనికి ఒక టైపు రైటర్ తెచ్చి ఇచ్చింది. దాని మీద టైపు చేయటం నేర్పింది.
“నీవు నీ మనసులో ఏమనుకుంటూ ఉంటావో, అదే టైపు చెయ్యి” అని చెప్పింది.
ఎన్నో విషయాలను పరిశోధించటం ఎలాగో నేర్పింది. పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటో తెలియజేసింది. “మనిషి తన మానసిక ప్రవర్తనపైన అదుపు కలిగి ఉంటే అద్భుతాలు సాధించగలడు” అని చెప్పింది. అక్కడ నుంచీ అతని ఆలోచనలను సక్రమమైన మార్గం వైపు మళ్లించింది.
తరువాత జీవితంలో ఆ కుర్రాడు ఎన్నో ఘనకార్యాలను సాధించాడు. ఎన్నో పుస్తకాలు వ్రాసి ఎంతో మంది దేశాధ్యక్షులను, వ్యాపారవేత్తలను మహా సామ్రాజ్యాలను సృష్టించుకున్న వాళ్లను తన పుస్తకాల ద్వారా ఆలోచనల్లో పడేశాడు. అతనే నెపోలియన్ హిల్. అతను వ్రాసిన ‘థింక్ అండ్ గ్రో రిచ్’ అనే పుస్తకం, ఇన్నేళ్ల తరువాత కూడా ఇప్పుడూ అమ్ముడు పోతూనే ఉంది.
మంచివారితోనే, గొప్పవారితోనూ స్నేహం చేయాలి. ఒక్కక్కరి జీవితం ఒక్కక్క తెరిచిన పుస్తకం, మంచి సలహాలు సంప్రదింపులూ ఎప్పుడూ అవసరమే. జీవితం లోని ప్రతిరోజ ఎదురయ్యే అనుభవాల నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.
కాలం మారుతూనే ఉంటుంది. పరిస్థితులు మారుతుంటయి. అవసరాలు మారుతాయి. ఆలోచనలు మారుతాయి.
ఎంత సంపాదించావు, ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు అన్నది కాదు ముఖ్యం. ఎంత గౌరవంగా, ఎంత పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నావు అన్నది కూడా మనిషి విలువను తెలియజేస్తుంది.
ఒకడు ప్రతి చిన్నదానికీ అబద్ధాలు చెబుతాడు. తలలు మారుస్తాడు. మోసం చేస్తుంటాడు. ఛాన్స్ దొరికితే దొంగతనాలు చేస్తుంటాడు. అలాంటివాడి మాటకు విలువ ఉండదు. అతను చెప్పేది ఎవరూ నమ్మరు. ప్రతి మనిషికీ ఏదో ఒక సమయంలోన ఇతరుల సహాయ సహకారాలు అవసరం. అబద్దాలకోరుకు స్నేహితులు, హితులు ఎవరూ మిగలరు. మనిషికి గౌరవం అనేది శ్వాస లాంటిది. శ్వాస ఆడినంత కాలం దాని గురించి ఎవరూ పట్టించుకోరు. శ్వాస ఆడని క్షణంలో దాని విలువ ఏమిటో తెలుస్తుంది. అలాగే గౌరవంగా ఉన్నంత కాలం దాని విలువ తెలియదు. గౌరవాన్ని పోగొట్టుకున్న తరువాత దాని విలువ ఏమిటో తెలుస్తుంది.
ఒక ఆట ఆడేటప్పుడు ఆట గెలవటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. నిజానికి ఆ ఆట ఆడేవాడు గెలుస్తానా, లేదా అన్న సందిగ్ధంలోనే ఉంటాడు, ఆటను చూసేవాడు మాత్రమే దాన్ని చూసి నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. అలాగే వ్యాపారం చేసే వాడికి, ధ్యాస అంతా ఎలా లాభాలు సంపాదించాలా అన్నదాని మీదే ఉంటుంది. వ్యాపార ప్రకటనల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటాడు. అలాగే దేశాల మధ్య కూడా కనిపించని పోటీ ఉంటుంది.
అయితే వీళ్లు ఎవరూ నిజమైన ఆనందాన్ని ప్రశాంతతను పొందరు. పోటీలో ఎప్పుడు ఓడిపోతామా అన్న భయమే జీవితమంతా వెంటాడుతూ ఉంటుంది.
తనంతటి వాడు ఒకడున్నాడని తెలిస్తే, కంటికి నిద్ర రాదు, తిండి సహించదు అని శ్రీనాథుడు చెప్పనే చెప్పాడు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.