Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-168

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

నడమంత్రపు సిరి

మూడు రకాల గొప్పవాళ్ళు ఉంటారని షేక్‌స్పియర్ చెప్పాడు. కొంతమంది పుట్టటమే గొప్పవాళ్ళుగా పుడుతారు. కొంతమంది తమ తెలివితేటలతో కష్టపడి పైకొచ్చి గొప్పవాళ్ళు అవుతారు. మూడోరకం వాళ్లు నడమంత్రపు సిరి పట్టినందువల్ల సడెన్‌గా గొప్పవాళ్ళు అవుతారు. ఏ రకమైన గొప్పదనమూ లేకపోయినా, తాము గొప్పవాళ్ళం అయిపోయానున్న భ్రమలో బ్రతుకుతుంటారు.

శాంత వాళ్ళకు సొంత ఊరిలో పొలాలున్నాయి. రెండు మూడు ఇళ్లు ఉన్నాయి. వాళ్ళ మామగారు వ్యాపారం చేస్తాడు. బాగానే సంపాదిస్తాడు. శాంతకు సిటీలో రెండు ఇళ్లు ఉన్నాయి. వేలల్లో అద్దెలు వస్తయి. కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగ పెట్టకుండా రోజులు గడపగలదు. అయినా ఆమె రవ్వంత అయినా గర్వమెరుగదు. ఏ మాత్రం కొంచెం పరిచయం ఉన్నవాళ్లతో అయినా సరే, ఎలాంటి భేషజాలూ లేకుండా నవ్వుతూ మాట్లాడుతుంది. ఆమె మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ఆమె భర్త రాఘవేంద్రరావు గవర్నమెంటులో మంచి పొజిషన్‍లో ఉన్నాడు. ఎక్కడికి వెళ్లాలన్నా గవర్నమెంటు వెహికల్ రెడీగా ఉంటుంది. ఏ కారణం చేతనయినా వెహికల్ రాకపొతే, నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కుతాడు. “మీరు బస్‍లో వస్తున్నారేంటి?” అని ఎవరైనా అడిగితే, “ఏం, టిక్కెట్టు తీసుకున్నా గదా? ఎందుకు రాకూడదు?” అంటూ చాలా సౌమ్యంగా అడుగుతాడు. ఇక ఎవరైనా వచ్చి “మీ వల్ల నాకీ సాయం కావాలి” అని అడిగితే, లేదు, కాదు అనకుండా మిగిలిన పనులన్నీ పక్కనపెట్టి, వాళ్ల పని చేసి పెడతాడు. “నేను ఈ కుర్చీలో కూర్చున్నది నలుగురికి సాయపడటానికే గదా” అని అంటాడు. డాబు, డాంబికం లేకుండా ఎవరింటికి పిల్చినా వెళ్తాడు. మహావృక్షంలాగా కనిపిస్తూ ఎంతోమందిని ఆదుకుంటాడు. ఇతనికి ఈ సాయం చేసినట్లు ఎవరికీ చెప్పడు. పువ్వుకు పరిమాళం ఎలా స్వభావ సిద్ధంగా అమరుతుందో ఆయునకు మంచితనం అంత సహజంగానూ అబ్బింది.

అదే ఆఫీసులో పని చేసే కాంతారావుకి ప్రమోషన్ వచ్చింది. ఇరవై ఏళ్లు గుమాస్తాగా పనిచేసి ఈ మధ్యనే ఆఫీసర్ అయినాడు. ఈ ప్రమోషన్ వచ్చినప్పటి నుంచీ అతని పోజులు చెప్పనలవి కాదు. అతను పది గంటలకు ఆఫీసుకు బయల్దేరుతాడు. ఉదయం తొమ్మిది గంటలకే డ్రైవర్‌ను ఆఫీసు కారుతో వచ్చి ఇంటి ముందు నిలబడమంటాడు. అంటే అతనికి ఆఫీసర్‍గా ప్రమోషన్ వచ్చినట్లు ఆ వీధిలోని వాళ్లందరికీ తెలియాలి అన్నమాట. ఇది వరకు రోజూ లుంగీ పైకి కట్టుకుని చీటికి మాటికీ బయట తిరుగుతుండేవాడు. కనపడిన వాళ్లందరినీ నిలేసి, పోసుకోలు కబుర్లు అన్నీ చెప్పేవాడు. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావటం మానేశాడు. ఇరుగు పొరుగు వాళ్లు ఎవరైనా పలకరించినా, వినీ విననట్లు తల ఆడించేవాడు. నిన్న మొన్నటి దాకా కాస్త పరిచయం ఉన్న ప్రతివాడినీ అడిగి అయిదూ పదీ అప్పు తీసుకునేవాడు, ఇప్పుడు లంచాలు మరిగాడు. చెయ్యి వాటం ఎక్కువ అయింది.

అంతో ఇంతో సమర్పించుకుంటేనే గానీ ఫైలు మీద సంతకం చేయటం లేదు.

లంచాలు తీసుకుంటున్న విషయం ఎవరికైనా తెలుస్తుందేమో అన్న భయంతోనే అతని భార్యాపిల్లలు కూడా ఎవరినీ కలవటం లేదు. ఎవరి తోనూ మాటామంతీ ఏమి లేదు. తమ చుట్టూ ఒక కనిపించని గోడ కట్టుకుని అందులోనే ఉండిపోవటం అలవాటు చేసుకున్నారు. కాంతారావు ఉన్నట్టు ఉండి పెద్ద ఇల్లు కట్టాడు. ఇల్లు అంటే ఇల్లు కాదు. ఇంద్రభవనం లాంటి ఇల్లు. అందులోకి మకాం మార్చారు. చూస్తుండగానే అతని ఆస్తులు పెరిగి పోయాయి. రెండు కార్లు కొన్నాడు. ఊరిబయట రెండు తోటలు కొన్నాడు. అయినా తన దగ్గరకు వచ్చిన వాళ్లను పీడించటం మానలేదు. కడుపు మండినవాడు ఎవడో ఏసిబికి పట్టించాడు. ఉద్యోగం పోయింది. జైలు శిక్షపడింది. అయినా ఏం ఫర్వాలేదు. రెండు తరాల వరకూ కూర్చుని తిన్న తరగనంత డబ్బు, ఆస్తులూ సంపాదించాడు.

“ఇంత డబ్బు ఎక్కడిది?” అని అడిగితే, సిరి దా వచ్చిన వచ్చును – అంటాడు. నడమంత్రపు సిరి, నరం మీద పుండు – పట్టరానంత వీల్లేనివి అంటారు మరి.

Exit mobile version