[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
స్నేహమేరా జీవితం
ఆ బిల్డింగ్‍లో అయిదు అంతస్తులున్నాయి. అందులో అయిదు రకాల ఆఫీసులున్నాయి. ఆఫీసులు వేరు వేరు అయినా ఆ బిల్డింగ్ లోని పని చేసే లేడీస్ అంతా లంచ్ టైంలో కల్సుకుని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. స్నేహితులుగా మారిపోయి ఒకరి ఇంటికి మరొకరిని ఆహ్వానిస్తుంటారు. విందు భోజనాలతో పాటు చిన్న చిన్న కానుకలు ఇచ్చుకుని, ఆట పాటలతో అదొక మరుపురాని సన్నివేశంగా మలుచుకుంటారు.
లంచ్ టైంలో పై అంతస్తులోని ఉద్యోగినులు కింది అంతస్తులోనికి రాగానే ఆ అంతస్తులోని లేడీస్ అంతా లేచి “మా ఫ్రెండ్స్ వచ్చారు. లంచ్‌కి వెళ్లివస్తాం” అని మానేజర్‌తో అంటే, “వాళ్లు ఫ్రెండ్స్ అయితే మేం ఎవరం? శత్రువులమా?” అని సరదాగా అడుగుతాడు. ఫ్రెండ్స్ కాని వాళ్లు అందరూ శత్రువులు కావాలన్న రూలు ఏమీ లేదు. కానీ బంధువులు అనుకుంటున్న వాళ్లు అందరూ శ్రేయోభిలాషులు కాకపోవచ్చు. ఆయిన వాళ్లకు అంతో ఇంతో ఎంతో కొంత ఈర్ష్య అసూయలు ఉంటాయి. కానీ నిజమైన స్నేహితులు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే కాదు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆడుకోవటానికి ముందుకు వస్తారు.
రమణరావు పైసా పైసా కూడబెట్టి, రెండు వందల గజాల స్థలం కొనుక్కున్నాడు. ఇంక ఇల్లు కట్టుకోవటానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇల్లు కట్టుకోవటానికి ఫండ్స్ సేకరించే పనిలో ఉన్నాడు. అతనితో పని చేసే మేరీ అతన్ని ఆట పట్టిస్తూ “ఒక ఇంటివాడివి కాబోతున్నావు” అని అంటుంది. “ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని నన్నుచూసే అని ఉంటారు. నేను ఇల్లు కట్టడం ఒక కలగానే మిగిలిపోతుందేమో” అని నిరుత్సాహ పడిపోతే, “ఏం, పర్వాలేదులే. స్టేంట్ బ్యాంక్ మనదే” అని ధైర్యం చెప్పేది.
అతను స్థలం కాని పదేళ్లు అయింది. ఇప్పుడు అక్కడ స్థలాల రేట్లు పది రెట్లు పెరిగిపోయాయి. సామాన్యులకు అందుబాటులో లేవు.
రమణారావు చెల్లెలి పరిస్థితి బాగానే ఉంది. ఆమె మొగుడు మంచి పాడి గేదె లాంటి ఆఫీసులో పని చేస్తున్నాడు. రోజూ ఎంతో కొంత జేబులో పడితేగాని, అతను ఇల్లు చేరడు. అందుచేత చెల్లెలు ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది.
“నువ్వు ఎలాగూ ఇల్లు కట్టలేవు కాబట్టి ఆ స్థలం మా పేరున రిజస్టర్ చేయి. మేము ఇల్లు కట్టుకుంటాం” ఉన్నది ఆమె మాటల సారాంశం. సాయం చేయకపోగా, ఉన్నది కాజెయ్యాలని చూడటంతో, ఇదెక్కడి చుట్టరికమో, అతనికి అర్థం కావటం లేదు. “ఎట్టి పరిస్థితులక్లినూ ఆ స్థలం మరొకరికి ఇచ్చే ప్రసక్తి లేదు” అని తేల్చి చెప్పినప్పటి నుంచి, చెల్లెలు రాకపోకలు బంద్ చేసింది. ‘ఇదీ ఒకందుకు మంచిదేలే’ అనుకున్నాడు.
మొత్తం మీద కొంత లోన్ మీద డబ్బు సేకరించి ఇల్లు కట్టడం ప్రారంభించాడు. నాలుగు రోజుల పాటు ఊరికి వెళ్తూ, పాతిక వేల రూపాయలు మేస్త్రీకి ఇచ్చి, ఈ లోగా సిమెంటు, ఐరన్ తెప్పించమని డబ్బు ఇచ్చి వెళ్ళాడు.
అతను తిరిగి వచ్చేటప్పటికి మేస్త్రీ ఆ డబ్బుతో పరార్ అయినాడు. ఎంత వెతికినా కనిపించలేదు. అతని ఊరు, వివరాలు కూడా అంతగా తెలియకపోవటంతో పోలీసు రిపోర్ట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. గోరుచుట్టు మీద రోకలిపోటు అన్నట్లుగా తయారయింది.
“ఇంటి వాడివి కావటం ఎంతవరకు వచ్చింది? ముందుగానే చెప్పు. గృహప్రవేశానికి మేము రెడీ కావాలి గదా” అన్నది మేరీ సరదాగా.
“దరిద్రుడు తల కడిగితే, వడగళ్ల వాన కురిసింది అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. అసలే డబ్బుకు ఇబ్బంది పడుతుంటే, పాతిక వేల రూపాయలు తీసుకుని మేస్త్రీ పరారు అయినాడు. ఒక అడుగు ముందుకు వేస్తే మూడు అడుగులు వెనక్కి – అన్న సామెతలా ఉంది” అని నిట్టూర్చాడు.
“ఏం, అధైర్యపడకు. ప్రాబ్లమ్స్ మనుషులకు గాక మానులకు వస్తాయా?” అని ధైర్యం చెప్పింది. “నేను కొంత సాయం చేస్తాను” అన్నది మేరీ. “వద్దులే” అని మృదువుగా తిరస్కరించాడు.
కానీ మర్నాడు మేరీ తన దగ్గర ఉన్న బంగారాన్ని తెచ్చి రమణమూర్తికి ఇచ్చింది. “దీని మీద బ్యాంక్ గోల్డ్ లోన్ తీసుకో” అన్నది.
“ఇదేమిటి? నీ బంగారం నేను కుదువ పెట్టి లోన్ తీసుకోవటం ఏమిటి? ఇదేం బాగాలేదు” అన్నాడు రమణమూర్తి.
“నేను నీ చెల్లెలినే అనుకో. ఆ గోల్డ్ ఇప్పుడు నేను వాడుకోవడం లేదు. నిరర్థకం పడి ఉండటం కన్నా, నీకు ఉపయోగపడితే మేలు కదా” అన్నది మేరీ.
సొంత చెల్లెలుకు, చెల్లెలు కాని చెల్లెలుకు ఉన్న తేడా గమనించి విస్తుపోయాడు రమణమూర్తి.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.