Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-166

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

మౌనమే నీ భాష

ప్రమీల భర్త రాజశేఖర్ ఎందుకో అలిగాడు. ఆమెతో మాట్లాడటం మానేశాడు. భర్త పాటించే మౌన వ్రతం వల్ల ఆమెకు పిచ్చెక్కి పోతోంది. “గాస్ అయిపోయింది. సిలెండర్ కోసం ఫోన్ చేయండి” అని నిన్న అనగా చెప్పింది. ఫోన్ చేశాడో, లేదా తెలియదు. ఉలుకూ లేదు, పలుకూ లేదు. “రేపు ఫ్రెండ్స్ వస్తున్నారు. సాయంత్రం కూరలు ఎక్కువ తీసుకు రండి”. మౌనం. విన్నాడో లేదో తెలియదు. “ఫ్రిజ్ పని చేయటం లేదు”. సమాధానం లేదు. “ఏసి కూలింగ్ లేదు. సర్వీసింగ్ వాడికి ఫోన్ చేయండి”. నో రిప్లయ్. ఎంతసేపు ఈ మౌనం. టి.వీ. కూడా పెట్టడు. పెట్టినా ఆపేస్తాడు. ఇప్పుడే ఇంట్లో నుంచి పీనుగ వెళ్లినట్లు భయంకరమైన నిశ్శబ్దం. “పక్కన నేను ఒక మనిషిని ఉన్నాను. నోరు పడిపోయేలా వాగుతున్నాను. సమాధానం రాదు. ఒకవేళ ఏదైనా వినికిడి సమస్య వస్తే చెప్పండి. డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్తాను” అని అన్నది. అదీ వినపడినట్లు లేదు. మూగవాడితో మాట్లాడినట్లు చప్పట్లు చరిచి, చేతితో సంజ్ఞలు చేసి చెప్పింది. అయినా నో రిప్లయ్.

సడెన్‍గా భర్త మాట పడిపోవటానికి గల కారణం ఏమై ఉంటుందా అని ఊహించసాగింది. పెళ్లి అయి ఏడాది అయింది. ఈ ఏడాది ఎలా గడిచిందో ఆమెకే తెలియదు. అప్యాయతను తిని, అన్యోన్యతను తాగి చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. రోజులన్నీ అదో విధమైన థ్రిల్‍తో, అంతులేని ఉద్వేగంతో పరుగులు తీశాయి. నిద్రలేస్తూనే ఆమె ముహం చూడాలని అనేవాడు. “నీవు నిండుగ నవ్వినపుడే నాకు నిజముగ తెల్లవారును” అని పాటలు పాడేవాడు. ఆమె కూడా “ఎందుకోయీ స్వామీ నందనవనాలు” అంటూ ఖానీ రాగాలు తీసేది. “భలే మంచి రోజు” అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళేవాడు. “ఏదో ఏదో గిలిగింత, ఎన్నడెరుగని పులకింత” అంటూ ఆమె వంటింట్లోకి వెళ్లేది. ప్రతిరోజూ పండగలాగా, బ్రతుకంతా పండు వెన్నెలలాగా గడిపెయ్యాలనుకునేవారు. “నీ నడుము పైన చెయ్యివేసి నడువనీ, నన్ను నడువనీ” అనేవాడు. “కన్నులు నీవే కావాలి. కలనై నేనే రావాలి” అని ఆమె అనేది. ఇద్దరు పడక గదిలోకి పని ఉన్నట్లు వెళ్లేవాళ్లు,

ఇంతలో ఎక్కడి నుంచో అత్తగారి డైలాగులు వినపడేవి.

“మా కాలంలో మేమూ కాపురం చేశాంగానీ, ఇలాంటివి ఎరుగం” అనేది. కొడుకు ఇంట్లో ఉన్నంత సేపు అత్తగారు ఆడ పోలీసులాగా కాపలా కాస్తూనే ఉండేది.

కాలంలో కొన్ని మార్పులు వచ్చాయి.

ప్రమీలకు ఉద్యోగం వచ్చింది. రొటీన్ అంతా మారిపోయింది. ఎనిమిదిన్నరకల్లా ఆమె ఇంట్లో నుంచి బయటపడేది. తెల్లవారుఝామునే లేచి నిత్యకృత్యాల మునిగి పోయేది. ఆమె హండ్ బ్యాగ్‌ను చంకకు తగిలించుకునే సమయానికి అతను కాఫీ తాగుతుండేవాడు. చిరునవ్వుతో చెయ్యి ఊపి వెళ్లిపోయేది.

రాత్రి అతను పదింటికి ఇంటికి వచ్చేటప్పటికి ఆమె సోఫాలోనే కూర్చుని కునికిపాట్లు పడుతుండేది. సెలవురోజుల్లో అయినా సంతోషంగా ఉందామా అంటే, అత్తగారు వెనక నుంచి ‘వాయిస్ ఓవర్’ డైలాగ్లు వినిపించేది. గడియారం ముళ్ల తోటి పరుగులు తీయటమే జీవితం అయిపోయింది. సంసారంలో సారమే లేకుండా పోయింది. “ఏమిటలా ఉన్నావు?” అని అడిగాడు ఒక రోజు. “మీరు నాకు ఎంత చేరువో, అంత దూరము” అన్నది విచారంగా. “అదేం లేదు. నువ్వు రెండు చేతులూ చాచితే, నేను నీ కౌగిలిలోనే ఉంటాను” అన్నాడు ఆమె చుట్టూ చేతులు వేస్తూ. ఆమె నిట్టూర్చింది. “భార్యాభర్తలు అన్నాక, ఇద్దరు కాదు. ఒకరే” అన్నాడు. “నిజమే గానీ ఆ ఒకరు ఎవరు? మీరా? నేనా?” అని అడిగింది.

“నేను చెప్పేది మీకు కష్టంగా ఉండొచ్చు. నా కష్టం కూడా గమనించండి. ఆఫీసుకు వెళ్లాలంటే, ఉదయం రెండు గంటలూ, ఇంటికి రావాలంటే సాయంత్రం రెండు గంటలూ సమయం పడుతోంది. అందుకని ఆఫీసుకు దగ్గరా ఇల్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అవుదాం” అన్నది.

ఒకసారి కాదు, రోజూ అంటూనే ఉన్నది.

చివరకు రాజు రాజశేఖర్ భార్య చెప్పినట్లే చేశాడు. ఆమె ఆఫీసుకు దగ్గర్లోనే ఇల్లు చూసుకున్నారు. మకాం మార్చారు. రోజూ కొంతసేపు అయినా ఒంటరిగా ఉండగలుగుతున్నారు. ‘మా కాలంలో..’ అంటూ అశరీర వాణి పలుకులు ఏమీ ఇప్పుడు వినపడటం లేదు. కానీ అతను ఎందుకో ఇదివరకటి అంత సంతోషంగా ఉండటం లేదు. రాను రాను తన చుట్టూ ఒక గిరి గీసుకుని ఆ గిరిలోనే ఉండి పోతున్నాడు. తనలోకి తను కుచించుకు పోతున్నాడు. మౌనంగా ఉండిపోతున్నాడు.

భర్తలోని మార్పుని ఆమె గమనించింది. అతనికి తల్లి మీద ఎన లేని ప్రేమ. గౌరవం. అమ్మ ఏం చేసినా అమ్మ అమ్మే. అన్నీ కరెక్టే.

చివరకు ఆమె ఒక రోజు అన్నది. “ఆలుమగల మధ్య కోపతాపాలు రావటం సహజమే గానీ, ఈ భయంకరమైన నిశ్శబ్దాన్ని నేను భరించలేక పోతున్నాను. మళ్లీ మనం అమ్మగారి దగ్గరకే వెళ్దాం” అన్నది కన్నీరు తుడుచుకుంటూ.

రెండు నెలల తరువాత మళ్లీ ఇదివరకటి ఇంటికే వచ్చారు. నెమ్మదిగా, నిండునదిలా నడుస్తున్న కోడలిని చూసి అత్తగారు నవ్వుతూ అడిగింది “ఏమన్నా విశేషమా?” అని.

కోడలు మౌనం వహించింది, సిగ్గు పడుతూ.

“పిచ్చి పిల్లా, నాకు ఒక మనమరాలిని ఇవ్వకుండా ఎక్కడికి పోతావే చిన్నదానా?” అని పాట పాడింది, కోడలిని కౌగిలించుకుని.

Exit mobile version