[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
ఆనందరావు నిజంగానే ఆనందంగానే ఉంటున్నాడు. అందుకు కారణం లక్ష్మీదేవి లాంటి అతని భార్య శ్రీదేవి. అతని నోరు తెరిచి అడగక ముందే అన్నీ అమర్చిపెడుతుంది.
శ్రీదేవిది అనకాపల్లి. అక్కడి వాతావరణం వేరు. వాళ్ళకు బెల్లం వ్యాపారం ఉంది. దాని మీద అపారమైన సంపాదన ఉంది. ఆ ఊళ్ళో మూడు ఇళ్లు ఉన్నాయి. పది ఎకరాల పొలం ఉంది. డబ్బుకు లోటు లేదు. అందుచేత వాళ్ల ఇంట్లో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. శ్రీదేవి పదో క్లాస్ పాస్ అవుదామని పదిసార్లు ప్రయత్నించింది, గజనీ మహమ్మద్ కజిన్ సిస్టర్ లాగా. కానీ ఎందుకో గానీ శ్రీదేవికి ఇంగ్లీషు పరాయి భాష గనుక నచ్చలేదు. లెక్కల్ని లెక్కలేనన్నిసార్లు బట్టీపట్టినా, ఒంటబట్టలేదు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ బుర్రకు ఎక్కలేదు. రామారావు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు, నాగేశ్వరరావు సావిత్రి ఎన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు, కృష్ణ విజయ నిర్మల ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, శోభన్‌బాబు జయలలితల లవ్ ఎఫైర్, రేలంగి, గిరిజకు ఎప్పుడు ఇల్లు కొనిచ్చాడు, జగ్గయ్య ఎందుకు సైడ్ హీరోగా మిగిలి పోయాడు వంటి సినిమావాళ్లకు సంబంధించిన అనేకానేకమైన విషయాలను, నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తుంది.
శ్రీదేవి సన్నగా సమంగా కుదిమట్టంగా, అచ్చుబోసిన అనకాపల్లి బెల్లం గడ్డంలా, చూడ చక్కగా ఉంటుంది. చామన చాయలో ఉంటుంది. వంట విషయానికొస్తే, నలుడూ, భీముడూ ఇద్దరూ కల్సి జాయింట్‌గా పోటీకొచ్చినా, శ్రీదేవి చేతికింద బలాదూర్. బంధుమిత్రుల్ని అభిమానించటం, అతిథులను ఆదరించటం వంటి విషయాల్లో క్రీదేవికి అసలు సిసలైన భారత నారీరత్నానికి ఉండవల్సన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నయి. ఇంక భర్త విషయం వేరే చెపాల్సిన పని లేదు. కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎచ్చీ ఇన్ని సద్గుణాలకూ వన్నె తెచ్చే అమాయకత్వం కూడా ఉంది. అది శ్రీదేవి తప్పు కాదు. పుట్టి పెరిగిన జాతావరణం అలాంటిది. తెల్లనివన్నీ పాలు, నల్లని వన్నె నీళ్లు అని నమ్మేస్తుంది.
పెళ్లి అయ్యాక డైరెక్ట్‌గా హైదరాబాదు వచ్చేసింది. ఇక్కడ అన్నీ వింతగా కనిపిస్తున్నాయి. శోభన్ బాబు లాంటి ఆనందరావు పొద్దున్నే కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నప్పుడే, ఎదురింటి ఆమె వంగి వంగి ఇంటి ముందు మీ ముగ్గులేస్తూ మధ్యమధ్యలో లేచి నిలబడి కిటికీ వైపు ఎందుకు చూస్తుందో శ్రీదేవికి తెలియదు. ఒక రోజు సాయంత్రం ఎదురింటామె, గుమ్మంలో నిలబడ్డ శ్రీదేవిని మాటల్లోని దింపి, “మీ ఆయనకు జీతం ఎంత?” అని అడిగింది. శ్రీదేవి కంగారు పడిపోయింది. “నెల రోజుల కిందట పాలు పోసే పార్వతి ఇలాగే అడిగితే లక్ష రూపాయలు అని చెప్పా. అంతే. ఆయనకు దిష్టి తగిలి నాలుగు రోజులు గొంతునొప్పి వచ్చి అస్సలు డ్రింక్ చెయ్యలేక పోయారు” అని చెప్పింది శ్రీదేవి.
“నీకు చీరలు, నగలూ ఎన్ని ఉన్నయి?” అని అడిగితే, “సంపాదన అంతా తగలేసి చీరలూ, నగలూ దిగేసుకునే బదులు, ఆ డబ్బు పొదుపు చేసి బెల్లం యాపారంలో పెడితే, ఆ పెట్టుబడే ఏటా పిల్లల్ని పెట్టుద్ది” అంటుంది శ్రీదేవి.
ఇక ఆనందరావు విషయానికొస్తే అతను జల్సా అయిన మనిషి, షోకులూ, సరదాలకు బాగా అలవాటు పడిన మనిషి. ఇస్త్రీ బట్టలు నలగనివ్వడు. జుట్టు చెదరనివ్వడు. పెదవులపైన చిరునవ్వులు రువ్వుతూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచీ అమ్మాయిలతో పరిచయాలు ఎక్కువ, పక్కచూపుల మీద మక్కువ, పక్కింటామె గురించిన ఆలోచనలే వానాకాలంలో దోమలు ముసిరినట్లు ముసురుతుంటాయి.
పక్కింటి పతంజలి భార్య పుష్పలత బంగారంతో చేసిన పోత పోసిన ప్రతిమలా ఉంటుంది. ఆమె మీద నుంచి చూపు మరల్చుకోవటం పరమ నిష్ఠాగరిష్టులైన పీఠాధిపతులకు సాధ్యం కాదు. ఆమె నడిచి వచ్చిన నేల పావనం అవుతుంది. ఆమె పలికిన పలుకులు కలకండ పలుకులే, కిలకిల నవ్వినచో పక్షుల కిలకిలారావములన్నీ విన్నట్లే ఉంటుంది. పుష్పలత అపర సరస్వతి. పుష్పలత పేరు పక్కన డిగ్రీల పేర్లు అన్నీ ఒకదాని తరువాత మరొకటి రైలుపెట్టెల్లా అతుక్కుని ఉంటాయి. సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తుంది. ఆమెను కలవాలంటే మూడు రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. గేటు దగ్గరనుంచి అర డజను మంది అనుమతి ఇవ్వాలి.
ఆఫీసులో పని వల్ల, అసెంబ్లీ సెషన్స్ వల్ల, హై లెవెల్ మీటింగ్‌ల వల్ల రోజూ ఇంటికి రావటం ఆలస్యం అవుతుంటుంది.
పుష్పలత అంటే ఆఫీసులో అందరికీ హడల్. ఆఫీసులో ఎలాంటి చిక్కు సమస్య వచ్చినా ఆమే ట్రబుల్ షూటర్. పై వాళ్లు ప్రతిదే ఆమెను అడిగి, ఆమె చెప్పినట్లే చేస్తారు. ఇక కింద వాళ్ల సంగతి చెప్పక్కర్లేదు. ఆమెకు జలుబు చేస్తే కింద వాళ్లంతా చీది, గోడలను చేతులతో రాస్తుంటారు.
ఇంటికి వచ్చాక కూడా ఆమె అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటుంది.
“ఏంటి పుష్పా ఇది?” అని అంటాడు పతంజలి.
“రేపు రివ్యూ కమిటీ మీటింగ్ ఉందండీ” అంటుంది పుష్పలత.
“అర్ధరాత్రి పన్నెండు అయింది. ఇప్పుడు మన మీటింగ్ సంగతి ఏంటి?” అని అడుగుతాడు పతంజలి.
ఆమె నిండు జాబిల్లిలా నవ్వుతుంది.
“నేను తల్చుకుంటే గవర్నమెంటును ఒక ఊపు ఊపగలను” అంటుంది పుష్పలత.
“నేను తల్చుకుంటే నిన్ను ఇప్పుడే ఒక ఊపు ఊపగలను” అంటాడు పతంజలి.
ఆమె నిస్సహాయంగా “ఏం చెయ్యను మరి” అని భర్త భుజం మీద వాలిపోతుంది.
ఆనందరావు పక్కింటి పుష్పలతతో తన భార్య శ్రీదేవిని పోల్చిచూసుకుంటాడు.
పుష్పలతకు అందానికి అందం, చదువుకు చదువు, హోదాకు హోదా, పరపతికి పరపతి, డబ్బుకు డబ్బు – ఇంతకన్నా మనిషికి కావల్సిందేమిటి? – అనుకుంటాడు ఆనందరావు.
పతంజలి ఆరుగంటలకల్లా ఇంటికి వచ్చి బాల్కనీ లోన కూర్చుని పక్కింటి అనందరావు భార్య శ్రీదేవిని చూస్తుంటాడు. ఇంటిని అంటిపెట్టుకుని ఉండే తలుపు చెక్కలా, భార్య ఇంటికే పరిమితమై, ఆ ఇంట్లోనే తిరుగుతూ, ఎంచక్క వంట చేసి పెడుతూ, భర్త రాగానే కౌగిలిలో కరిగిపోతూ ఉండే శ్రీదేవిని చూస్తూ – మనిషికి ఇంతకన్నా కావల్సిందేమిటి – అనుకుంటాడు పతంజలి.
బెల్లం తియ్యగానే ఉంటుంది. కానీ పంచదార – పంచదార రుచి వేరు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.
You must be logged in to post a comment.
శివతాండవలక్ష్మి
మినీ మూన్
స్వయం భక్షణ
మట్టే మనిషోయ్
ఒక జననం.. ఒక మరణం..!
కైంకర్యము-5
ఫొటో కి కాప్షన్-32
జ్ఞాపకాల పందిరి-79
జీవన రమణీయం-110
కొరియానం – A Journey Through Korean Cinema-58
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®