Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-163

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

రాముల వారి పండుగ

నకు ఎన్నో పండుగలు ఉన్నయి. ప్రతి పండుగకు ఒక కథ ఉంటుంది. చివరకు పుట్టిన రోజు కూడా పండుగే. అంటే సంతోషంగా ఉండవలసిన రోజు. ఆ ఒక్క రోజే ఎందుకు? ప్రతిరోజూ సంతోషంగానే ఉండవచ్చుగదా. అయితే మరి నేను సంతోషంగా ఉండాలీ అంటే, నా చుట్టు ఉన్నవాళ్లను కూడా ఆనందంగా ఉండనివ్వాలి. అంటే ఏం చెయ్యాలి? ఇతరులు మనకు ఏ పనులు చేస్తే మనము బాధ పడతామో, ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండాలి, అంత బుద్ధిమంతుడైన బాలునిలా ఉంటే, ఈ కలికాలంలో, ఈ రోజుల్లో బ్రతకగలమా – అన్నది అసలైన ప్రశ్న.

ఇవాళ శ్రీరామనవమి. అన్నిచోట్ల సీతారాముల కళ్యాణం చేసి తరించిపోతారు. మనం భగవంతునిగా ఆరాధించే రాముని జీవితం నిండా కష్టాలే. భగవంతుడై యుండి ఆయన అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక మిత్రునిగా, ఎలా మనం ఎలా జీవించాలో తాను ఆచరించి చూపించి ఆదర్శప్రాయుడైనాడు. రామకథ తెలియని వారు ఎవరూ లేరు. రాముడు ఎందువలన దేవుడు అని ప్రశ్నించి, అనుభవించదగిన వయసు అడవి పాలు చేసెను, అందువలన దేవుడు – అన్నాడు ఆరుద్ర,

వాల్మీకి రామాయణం వ్రాస్తూ కొంత కథా భాగానికి ఒక్కొక్క కాండ అంటూ ప్రతి భాగానికి ఒక్కో పేరు పెట్టాడు.

శ్రీరాముడు జననం, విశ్వామిత్రుని వెనువెంట వెళ్ళటం, సీతాకళ్యాణం అన్నదమ్ములందరూ ఒకేసారి వివాహం చేసుకుని అయోధ్యకు రావటం వరకు బాలకాండ. కైక వరాలు కోరటం, సీతారామ లక్షణులు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లటం, అత్రి మహర్షి అనసూయా దేవి ఆశీస్సులు పొందటం అయోధ్యకాండ. అరణ్యంలో సంచరించటం, శూర్పరణ రావటం, రావణుడు సీతను అపహరించటం, శబరిని కలవటాల వరకూ ఉన్న కథ అరణ్యకాండ. వాలిని వధించటం, ఆంజనేయుడిని సీతాన్వేషణకు పంపటం కిష్కింధకాండ. అంజనేయుడు లంకకు వెళ్లటం, సీతను చూడటం, లంకా దహనం వరకూ సుందరాకాండ. రామాయణం అంతటికీ సుందరాకాండ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ ఒక్క కాండను పారాయణం చేస్తే చాలు, కోరికలన్నీ సిద్ధిస్తాయని నమ్ముతారు. సుందరాకాండలో స్వయంగా అంజనేయుడే చెబుతాడు – తమ సైన్యంలో తనకన్నా బలవంతులు చాలామంది ఉన్నారని. మరి రాముడు ఈ పనికి హనుమనే ఎందుకు నియోగించాడు? ప్రతివారు తమ శక్తియుక్తుల గురించి తాము గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తాను అమితమైన బలవంతుడనని రావణునికి అహంకారం – ఆ అహంకారం వల్లనే తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ హనుమ అలా కాదు. అతని శక్తి సామర్థ్యాల గురించి అతనికే తెలియదు. ఎవరైనా గుర్తు చేస్తేగాని తెలియదట. ఇక్కడ విషయం ఏమిటంటే, సీత ఎలా ఉంటుంది హనుమకు తెలియదు. అంతవరకు ఆయన ఆమెను చూడలేదు. ఎలా ఉంటుందో తెలియని మనిషిని వెతికి తెల్సుకోవటం ఎలా?

ఆమె గురించి బాగా తెల్సిన లక్షణుడు పక్కనే ఉన్నాడు గదా? సీతాన్వేషణకు లక్ష్మణుడిని ఎందుకు పంపలేదు? రావణుడు ఒక మాయావి. అనేక మాయాలు చేయగలవాడు. శూర్పణఖ విషయంలోనే లక్ష్మణుడు ఏం చేస్తాడో తెల్సిపోయింది. అలాంటి ఉద్రేకపరుడు దౌత్యం చేయటానికి పనికిరాడు. సుగ్రీవుడు రాజు గనుక దౌత్యం చేయరాదు. రామాయణంలో ఆసలైన నాయకుడు రాముడు. కనుక ప్రతి కాండలోనూ రాముడు కనిపించాలి. కానీ సుందరాకాండలో ఆయన ప్రస్తావనే తప్ప రాముడు స్వయంగా కనిపించడు. ఎన్నడూ ఈ కాండలో అసలైన నాయకుడు హనుమయే. చూసి ఎరుగని స్త్రీని చూసి, ఆమె ఉనికిని కనుగొని రావటం ఒక విచిత్రం గనుక, ఇది సుందరాకాండ అయింది. తన భర్త నిస్సహాయుడుగా అడవులలో సంచరిస్తూ ఉన్నా, ఆయననే ధ్యానిస్తూ, గొప్ప విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ తనతో ఉండమని కోరిన రావణుని తిరస్కరించి స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన సీత ధర్మాన్ని సూచించిన కాండ గనుక సుందరాకాండ అయింది.

“నా భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లి రామునికి సమర్పిస్తాను” అని హనుమ కోరినా, అది రామునికి శోభదాయకం కాదని చెప్పిన సీత చెప్పిన కాండ గనుక సుందరాకాండ అయింది- ఇలా ఎన్నో విశేషాలు ఉన్న సుందరాకాండ రామాయణంలో ప్రముఖమైనదిగా కనిపిస్తుంది.

లంకాదహనం చేసినప్పుడే, హనుమ ఎంతటి బల సంపన్నుడో తెల్సిపోతుంది.

తరువాత యుద్ధకాండ, శ్రీరామ పట్టాభిషేక సర్గ. ప్రతిదానిలోనూ రామకథ మనిషికి ఎన్నో ఆదర్శాలను చూపిస్తుంది.

రాముడు తిరిగి రాబోయే ముందు హనుమను భరతుని వద్దకు పంపిస్తాడు. “అతని ముఖంలో ఏ మాత్రం రాజ్యకాంక్ష కనిపించినా, నువ్వు వచ్చెయ్” అని రాముడు అంటాడు.

“అగ్రజా, మా అమ్మ కైకేయి మాటను ఎలా గౌరవించి, ఈ రాజ్యాన్ని నాకు అప్పగించావో, నేను తిరిగి అలాగే ఇస్తున్నాను. ఇది నాది కాదు, నీది” అంటాడు భరతుడు.

ఇలా అడుగడునా ఎన్నో ఔన్నత్యాలను మూట గట్టుకున్నది గనుకనే రామాయణం పవిత్రమైనది అయింది. రాముడే కాదు రామబంటునని చెప్పుకున్న హనుమ పూజనీయుడే అయినాడు.

Exit mobile version