Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-162

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

కాలం చేస్తున్న గారడీ

గాది మనకు అందరికీ పెద్ద పండుగ. అసలు ముందుగా వచ్చే పండుగ ఇదే. మిగతావన్నీ దీని తరువాతనే వస్తయి.

తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది గనుక, ఈ రాబోయే సంవత్సరంలో ఏయే రాశుల వారికి ఎలాంటి శుభాశుభాలు జరగబోతున్నాయో తెల్సుకోవాలన్న ఆతృత కూడా ఉంటుంది – ఇదుగో మీన రాశిలో ఆరు గ్రహాలు చేరుతున్నాయి గనుక షష్ట గ్రహకూటమి ఏర్పడుతోందనీ, ఇందువల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తుమ్మబంకంలా పట్టుకుని రాజయోగం ఏర్పడి – ఢిల్లీలో ఆయన ఎవరి ఇంట్లోనే ఆయనకు తెలియకుండానే వచ్చినట్లు బస్తాల కొద్దీ డబ్బు వచ్చి పడిపోతుందనీ, రాబోయే పాతికేళ్ల దాకా గజరాజయోగం పడుతుందనీ చెబుతున్నారు జ్యోతిష్కులు. పైగా నేను చెప్పినట్లు జరగకపోతే, జ్యోతిష్యం చెప్పటం మానేసి, పంచాంగం కట్టలు మూల పారేస్తానంటూ శపథాలు చేస్తున్నవారూ ఉన్నారు.

మనకు కనబడలేదుగానీ ఈ నెలలోనే చంద్రగ్రహణం, సూర్య గ్రహణం రెండూ వచ్చాయి గనుక అరిష్టం తప్పదని బల్ల గుద్ది చెబుతున్నారు. అయితే మనకు కనపడలేదు గాబట్టి, మనం భయపడాల్సిన పని లేదా అని కొందరు సంతోషిస్తుంటే, ‘అమ్మమ్మ, అలా వీల్లేద’నీ అంటున్నారు. ఉన్నది ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. ఆ సూర్యుడికీ, చంద్రుడికే గ్రహణం పడితే, ఆ ప్రభావం లేకుండా ఎలా ఉంటుందీ అనీ అంటున్నారు.

మొన్న మయన్మార్ లోను, థాయ్‌ల్యాండ్ లోనూ భూకంపాలు వచ్చాయి. భారీ నష్టం చేకూరింది. చూశారా, షష్టగ్రహ కూటమి ప్రభావం కనిపించిందా లేదా అని భయపెడుతూనే, మరేం భయపడకండి, మా దగ్గర పరిహార మార్గాలున్నాయి. శనిదేవుడికి తైలాభిషేకం, పేదవారికి దానాలు, అమ్మవారిని శాంతింప చేయటానికి హోమాలు, లోకకల్యాణం కోసం స్వామి వారికి కల్యాణాలు చేయించటం ద్వారా ఉపద్రవాల నుంచి ఉపశమనం పొందవచ్చుననీ శలవిస్తున్నారు.

ఎవరెన్ని శాంతులు చేయించినా, చేయించకపోయినా, రానున్నది రాక మానదు, కానున్నది కాకమానదు – అని కొట్టి పారేసేవారూ ఉన్నారు. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కొన్నాళ్లు వెన్నెల, కొన్నాళ్లు చీకటి. అలాగే కష్టాలూ, సుఖాలు వస్తూనే ఉంటాయి. జీవితం అంటేనే ఒక చక్ర భ్రమణం. ఇవాళ మంత్రులుగా ఉండి రాజ భోగాలు అనుభవిస్తున్న వారు, నాలుగేళ్ల తరువాత జైళ్లలో ఖైదీలుగా, బందీలుగా మారవచ్చు. దీనినే వేదాంతులు కర్మఫలితం అని అంటుంటారు.

కాలాన్ని ప్రవాహంతో పోలుస్తుంటారు. కాలం యుగాల పాటు కొనసాగుతుంది. సంవత్సరాలు, నెలలు, రోజులు, గంటలు, సెకన్లు కింద మారుతుంది. కాలం ఎంత సుదీర్ఘమైనదో, అంత స్వల్పమైనది.

కాలాన్ని ప్రవాహంలో పోలుస్తారు గదా అని, అది ఒకేసారి వరదలా వచ్చి ముంచెత్తదు. ఒక్కొక్క సారి ఒక్కొక్క క్షణమే అందుబాటులోకి వస్తుంది. ఆ క్షణం, ఆ గంట, ఆ రోజు గడిచాక మరో క్షణం, మరో గంట, మరో రోజు అందుబాటులోకి వస్తుంది. ఈ చీకటి వెలుగుల తెరల మధ్యనే సృష్టిలోని ప్రతిదీ పుట్టటం, పెరగటం, నశించటం జరిగిపోతుంటుంది. ప్రకృతి మనకు ఎన్నో వరాలను ప్రసాదిస్తుంది. అన్నిటినీ మళ్లీ తనే తీసేసుకుంటుంది. కాలమే కుంభవృష్టి కురిపిస్తుంది. అదే కాలం కరువును సృష్టిస్తుంది. చిన్న విత్తనంలో నుంచి చిన్న మొలక బయటపడుతుంది. పెరుగుతుంది. శాఖాపశాఖలుగా విస్తరిస్తుంది. పూలు, పండ్లూ ఇస్తుంది. నీడనిస్తుంది. ఇల్లు కట్టుకోవటానికి కలపనూ ఇస్తుంది. పెనుగాలిలో, వరద బీభత్సానికి ఆ మహావృక్షం నేలకొరుగుతుంది. కాలగర్భంలో కలిసి పోతుంది. ఇదంతా మన కళ్ళ ముందు కాలం చేస్తున్న గారడీ.

అలా అని కాలాన్ని నమ్మకుండా ఉండగలమా? కాలం అంటే భవిష్యత్తు. రేపటి నుండి విశ్వావసు ఎన్ని మార్పులు తెస్తుందో. భూకంపాన్ని తెచ్చిన కాలం, రేపు బంగారు శాంతి కిరణాలను మన గుమ్మం ముందుకు తీసుకు వస్తుందని ఆశిద్దాం.

Exit mobile version