[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
అతిథి దేవోభవ
అతిథి అంటే తిథి వార నక్షత్రములు చూడకుండా వచ్చేవాడు అని నిఘంటువు చెబుతుంది. అంటే, పూర్వం ఏ ఊరు గానీ, ఏదైనా ముఖ్యమైన పని మీద గానీ, ఎవరింటికి అయినా వెళ్లవలసి వస్తే, మంచి రోజు, తిథి నక్షత్రాలు చూసుకొని వెళ్ళేవారు. అలా చూడకుండా వచ్చేవాడు అ-తిథి.
ఒకప్పటి స్థితిగతులు వేరు. కొంతకాలం కిందట ప్రతి ఊరికీ రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. కాలినడకన వెళ్ళవల్సిందే. పొద్దున్నే లేచి నడక ప్రారంభిస్తే, మిట్టమధ్యాహ్నం వేళకు ఏదా ఒక ఊరు చేరుకునేవారు. ఆ ఊళ్లో ఉదారంగా ఇంత భోజనల పెట్టే వాళ్ల ఇల్లు వెతుక్కుని వెళ్లి, తమ పరిస్థితి వివరిస్తే, అంత దూరం నుంచి వచ్చి భోజనం వేళకు తమ గుమ్మం ముందు నిలబడిన వ్యక్తిని ఆహ్వానించి, ఉన్నంతలో కడుపార భోజనం చేయించి పంపేవారు. ఆ అతిథి కృతజ్ఞత తెలుపుకుంటే గృహస్థుకు తృప్తిగా ఉండేది.
అందుచేత వేళకు వచ్చిన వాడిని దేవుడితో పోల్చి, తల్లిదండ్రుల తరువాత స్థానం ఇచ్చి అతిథి దేవోభవ అన్నారు.
వాకిట్లోకి వచ్చిన అతిధికి అన్నం పెట్టకుండా ఔపోసన పడితే, ఆ ఔపోసన సురాపానంతో సమానమని, అతిథికి పెట్టకుండా తిన్న అన్నం గోమాంసంతో సమానమనీ మనుస్మృతి చెబుతోంది.
కాలమాన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆరు గంటల దాకా హైదరాబాదులో ఉన్నవాడు ఒక గంటలో విమానంలో చెన్నై వెళ్లి రాత్రికి ఇంట్లో భోజనం చేసేంత దాకా వేగం పెరిగింది – దానితో పాటే ఆలోచనలూ, అభిప్రాయాలూ మారాయి. ప్రతి చిన్న ఊరిలోనూ చిన్నదో పెద్దదో ఒక హోటలు ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టి భోజనం చేయగల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
శ్రీకాకుళం, అదిలాబాదు లాంటి మారుమూల ప్రదేశాలలో ఉండేవారి ఇంటికి బంధువులను రమ్మని పిల్చినా ‘అలాగే వస్తాం లే’ అని అంటారే గానీ పనిగట్టుకుని అంత దూరం ఎవరూ వెళ్లరు. కానీ హైదరాబాదు, విజయవాడ, తిరుపతి లాంటి సిటీల్లో ఉంటే పిలవకుండానే వచ్చి పడిపోతుంటారు. కొన్ని కుటుంబాల్లో ఆయన తరఫున అరడజను మంది అన్నాచెల్లెళ్లు, ఆమె తరఫున అరడజను మంది అక్కాచెల్లెళ్లూ, ఉంటే వారి కొడుకులూ, కోడళ్లూ, వారి వారూ, వారి వారి వారూ వచ్చేపోయే వాళ్లలో ఇల్లు విజయవాడ బస్ స్టాండ్‌లా ఉంటుంది. ఆఫీసు పనుల మీదనో, కోర్టు వ్యవహారాలనో, ఆస్పత్రులలో చికిత్సలకనో వచ్చి తిష్ట వేస్తుంటారు. వచ్చాక ‘ఆ ఆఫీసులో నీకు తెల్సిన వాళ్లు ఉన్నారా? ఏ ఆస్పత్రిలో మంచి డాక్టర్లు ఉన్నారు?’ అని అడిగే అక్కడికి తీసుకెళ్లమంటారు. హద్దూ పద్దూ లేకుండా పెరిగిపోతున్న ఖర్చుల దృష్ట్యా, సిటీలో ఉన్నవాళ్లే ‘రేపు మీ ఇంటికి రావాలనుకుంటున్నాం’ అని ఫోన్ చేస్తే, ‘అమ్మా, రేపు ఇంట్లో ఉండటం లేదు’ అని ముందు కాళ్లకు బంధం వేస్తున్నారు.
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే, వాళ్ల పనులకే వాళ్లకు తీరిక లేకుండా ఉండి ఈ అతిథి అభ్యాగతులను వీలైనంత దూరంగా ఉంచుతున్నారు. తప్పని గ్రహాలు కొన్ని ఉంటాయి. ఎక్కడి పరిస్థితులను బట్టి అక్కడ సర్దుకు పోవాలన్న సూక్ష్మం తెలియని వారు కొందరుంటారు. స్నానాలకు వేన్నీళ్లు కావాలంటారు. చక్కెర లేని కాఫీ కావాలంటారు, రాత్రిళ్లు టిఫిన్లే గానీ భోజనాలు చేయం – అని అంటుంటారు. మనిషికొక రకమైన వంట చేయటానికి ఇది హోటలు కాదని తెల్సుకోవాలి.
ముందు సమాచారం ఇవ్వకుండా ఎవరింటికైనా వెళ్తే, ఇల్లు తాళం వేసి ఉండొచ్చు. ఒక వేళ ఇంట్లో ఉన్నా, వాళ్లు ఎలాంటి మూడ్స్ ఉంటారో తెలియదు. ఒకాయన అనుకోకుండా ఒక చోటుకు వెళ్లి, ఆ ప్రాంతంలోనే ఉన్న దగ్గర బంధువుల ఇంట్లోకి వెళ్తే, ఆ సమయాన భార్యాభర్తలు దీనికో గొడవ పడుతున్నారు. పెద్దగా కేకలు తిరుపులూ వినిపిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా గుమ్మంలో ఎదురైన వ్యక్తిని చూసి వాళ్లు మామూలు మూడ్ లోకి వచ్చి ఆహ్వానించటానికి ఇబ్బంది పడవల్సి వస్తుంది. లేదా వాళ్లు మరెక్కడికో బయల్దేరటానికి రెడీ అవుతున్న సమయంలో ఈ అనుకోని అతిథిని చూసి ఇబ్బంది పడవచ్చు, మనమేం గోడల మీద బొమ్మలం కాదు గదా, ఎల్లవేళలా ముఖానికి చిరునవ్వులు తగిలించుకుని కూర్చోవటానికి. అయినా సరే, ఈ ఆగంతకుని రాకతో తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో ‘ఎలా వచ్చారు?’ అని అడిగి వెంటనే ‘ఎలా వెళ్తారు? అదుగో, ఆటో రెడీగా గుమ్మం ముందే ఉంది’ అని సాగనంపుతారు.
అందుకనే ఈ రోజుల్లో దగ్గర బంధువులు అయినా సరే, చివరికి వియ్యాల వారు అయినా సరే, ముందు ఏ హోటల్లోనో దిగి, ఫోన్ చేసి వాళ్లనే హోటల్లో భోజనానికి ఆహ్వానించి, కాసేపు కులాసాగా కాలక్షేపం చేసి, వెళ్తున్నారు. ‘సొంత ఇంటి మనుషులై ఉండి, ఊళ్లోకి వచ్చి, ఇంటికి రాకుండానే వెళ్తారా?’ అని బలవంతంగా ఇంటికి తీసుకుకెళ్లాల్సి రావటం ఈనాటి అతథి దేవోభవగా మారింది మరి.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.